మూడవ సామాన్య ఆదివారము - YEAR C

మూడవ సామాన్య ఆదివారము - YEAR C
నెహెమ్యా 8:2-4, 5-6, 8-10; 1 కొరింథి 12: 12-31; లూకా 1:1-4, 4: 14-21



దేవుని శక్తిగల వాక్కు

దేవుని ప్రేమ అపారమైనది, అనంతమైనది. దేవుని ప్రేమ సృష్టియందు, రక్షణయందు విశదపరచడమైనది. ఆ ప్రేమకు, ప్రతీ ఒక్కరు వ్యక్తిగతముగా స్పందించాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. తన పోలికలో సృజించిన మనలను ఆయనతో ఉండటానికి ఆహ్వానిస్తున్నాడు. పాపము వలన, ఆయన సన్నిధినుండి దూరమైన మనలను పశ్చాత్తాపం, మారుమనసు పొంది తిరిగి ఆయన సన్నిధిలోనికి రావలయునని తండ్రి దేవుడు ఆశిస్తున్నాడు. మారుమనస్సు అనగా, మన జీవితాలను మార్చుకోవడం, పాత జీవితమును విడనాడటం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, ముఖ్యముగా మన జీవిత మార్గాన్ని మార్చుకోవడం. పరిపూర్ణమైన మార్పును దేవుడు మనలనుండి ఆశిస్తున్నాడు. నేటి పఠనముల ద్వారా దేవుని వాక్కు శక్తిగలది అని, అది మనలో మారుమనస్సు, పశ్చాత్తాపం కలిగించ గలదు అని అర్ధమగుచున్నది.

మొదటి పఠనములో విన్నట్లుగా, ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో, ధర్మశాస్త్రము లేదా దేవుని వాక్యము ముఖ్యమైన పాత్రను పోషించినది. ధర్మశాస్త్రమును విని, పశ్చాత్తాప పడి, దేవుని సన్నిధిలోనికి వచ్చియున్నారు. పడిపోయిన వారి జీవితాలను, సంఘాన్ని పునర్నిర్మించుకున్నారు. నిర్లక్ష్యము చేసిన దేవాలయాన్ని నిర్మించుకొన్నారు. దేవుని చట్టము యొక్క ప్రాముఖ్యతను, దానిని విధేయించాలని గుర్తించారు. దేవుని చట్టమును విని చేతులు పైకెత్తి 'ఆమెన్ ఆమెన్' అని వారి సమ్మతమును తెలియ జేశారు. నేలపై సాగిల పడి వారి విధేయతను వ్యక్తపరచారు.

ఇశ్రాయేలు ప్రజలు, వారి అవిధేయత వలన, గర్వము వలన, తమ నాశనమును తామే బాబిలోనియా బానిసత్వపు రూపములో కొని తెచ్చుకున్నారు. 70 సంవత్సరాల ప్రవాసం తరువాత, ఇశ్రాయేలు ప్రజలు తమ స్వంత దేశమునకు, దేవుడు తమకు యిచ్చిన దేశమునకు తిరిగి వచ్చారు. ప్రాకారములను కట్టుకున్నారు. క్రమముగా అన్నీ సమకూరుతున్నాయి. అన్నీ సక్రమముగా జరుగుతున్నా, ఏదో లోటు, ఏదో వెలితి వారికి కొట్టొచ్చినట్లు కనిపించింది. బానిసత్వములో ఏదో కోల్పోయామని వారు తెలుసుకొన్నారు. క్రమముగా తమ తప్పు తెలియ వచ్చింది. ఏమి కోల్పోయామో తెలియ వచ్చింది. తమను పేరు పెట్టి పిలిచిన, మలచిన, ఆ దేవున్ని, ఆయన సహవాసమును, సన్నిధిని మరిచామని తెలుసుకున్నారు. ఆవేదనతో ఆయన చెంతకు వచ్చారు. ఆయన ధర్మశాస్త్రమును, వాక్కును వినవలెనన్న కోరిక వారిలో బలముగా మొదలయ్యింది. అందుకే, ఏడవ నెల మొదటి దినము సమావేశమునకు (బూరల పండుగ) వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా తమకు ఇచ్చిన ధర్మశాస్త్రమును, వాక్కును వినవలెనన్న కోరికను ఎజ్రాకు తెలియపరచగా, ఎజ్రా వారికి చదివి (హీబ్రూ బాషలో) వినిపించాడు. ఆ పిమ్మట లేవీయులు, ఆ ధర్మశాస్త్రమును, దేవుని వాక్కును, దాని భావమును వివరించారు. దాని భావమును తెలుసుకొని, ఇన్ని రోజులు తామేమి కోల్పోయామో తెలుసుకొని దు:ఖించారు. ఆవేదనతో నున్నవారికి ఒక ఆదరువుగా, చీకటిలో నున్నవారికి వెలుగుగా వారికి ధర్మశాస్త్రపు మాటలు తోచాయి.

ఈవిధముగా, దేవుని వాక్కు ఇశ్రాయేలు ప్రజల జీవితములో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషించింది. వారి గుర్తింపును పెంపొందించింది. వారి కార్యాలకు బాటను వేసింది. సమస్యలలో నున్నప్పుడు వారు జీవించులా చేసింది. నిరీక్షణతో ముందుకు సాగేలా వారికీ తోడ్పడింది. కష్టసమయములో వారిని ఓదార్చింది. ధైర్యాన్ని నింపింది. దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని ప్రేమను ఎప్పటికప్పుడు వారికి గుర్తుకు చేసింది. వాక్కు ద్వారా దేవుడు వారితో చేసుకున్న ఒడంబడిక సుస్థిరం చేయబడింది. వాక్కు ద్వారా దేవుని స్వభావమును వారు తెలుసుకో గలిగారు. అది వారి విశ్వాసానికి మూలమైంది. దేవుని వాక్కు వారు ఎలా జీవించాలో, ఆరాధన చేయాలో, దేవునితో ఎలా సహవాస బంధాన్ని ఏర్పరచుకోవాలో తెలియ పరచింది. ప్రవక్తల ద్వారా పలక బడిన దేవుని వాక్కు ఇశ్రాయేలు ప్రజల క్రియలను నడిపించింది. సరిచేసింది. హెచ్చరించింది. దేవునివైపు మరలి రావాలని ప్రోత్సహించింది. వారు దేవున్ని అవిధేయించినపుడు, పశ్చాత్తాపం, మారుమనస్సు పొందాలని పిలుపునిచ్చింది.

రెండవ పఠనము క్రీస్తు శరీరమున సభ్యులమైన మనమందరము, ఐక్యతతో జీవించాలని తెలియ జేస్తుంది. ప్రతీ ఒక్కరు కూడా, ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, సేవ చేయుటకై పిలువబడి యున్నాము. అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. ఒకరి నొకరు సహాయము చేసుకొంటూ, ఒకే సంఘముగా, ఒకే శరీరముగా జీవించ వలయును. ప్రస్తుతం మనలో ఉన్న పెద్ద సమస్య ... వ్యక్తిగతముగా జీవించాలని కోరుకోవడం. నేను...నా ప్రపంచం అన్న ఆలోచనా తీరుతో జీవిస్తున్నాము. మన పిలుపు అనేక విధాలైన, మనమందరమూ జీవిస్తున్నదీ, ఒకే ఒక శ్రీసభలో, మరియు మనలను నడిపించేదీ ఒకే ఆత్మయే!

సువార్తా పఠనం: లూకా, పౌలుగారి అనుచరుడు, వైద్యుడు. సువార్తను తెయోఫిలూ (దేవుని ప్రేమికుడు, దేవునికి ప్రియమైన వాడు) అను విశ్వాసునికి వ్రాసియున్నాడు. యేసు నజరేతున, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరమునకు వెళ్ళాడు. అచట యెషయా గ్రంధమునుండి, వాక్యమును చదివి, "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరెను" అని పలికాడు. అవును! యెషయా లేఖనమున ఉన్నట్టుగా, ప్రభువు ఆత్మతో నింపబడి పేదలకు సువార్తను బోధించుటకై యేసు అభిషేకించబడెను. చెరలో నున్నవారికి విడుదల, గ్రుడ్డివారికి చూపును కలుగ జేయుటకు, పీడితులకు విమోచనము కలుగ చేయుటకు, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు తండ్రి దేవునిచేత యేసు పంపబడెను.

సినగోగులో ప్రభువు బోధనలను ప్రజలు ఆలకించారు. కాని వారు సంపూర్ణముగా అర్ధము చేసుకొనలేక పోయారు. అర్ధమైనంత వరకు కొంతమంది ఆయనను విశ్వసించారు. ప్రభు వాక్యాన్ని అర్ధం చేసుకుంటే రక్షణ మార్గాన్ని కనుగొంటాము. మనం వాక్యాన్ని పరిపూర్ణముగా అర్ధం చేసుకోవాలంటే, పవిత్రాత్మ శక్తి మనలో ఉండాలి. వాక్కు ఈనాటికి మన మధ్య సజీవముగా నున్నది. విశ్వాసముతో, అర్ధం చేసుకొని, ధ్యానించి, మన దైనందిన జీవితములో ఆ వాక్కును జీవించాలి.

మనం పేదవారము! దేవుని సంపదయైన వాక్కు లేని పేదవారము, దేవునిపై విశ్వాసము, ప్రేమ లేని పేదవారము. ఒకరిపై ఒకరికి నమ్మకము లేని పేదవారము. దైవాజ్ఞలను, క్రీస్తు బోధనలను పాటించలేని పేదవారము. అదిగో! పవిత్రాత్మతో నింపబడిన ప్రభువు, ప్రతీక్షణం ముఖ్యముగా దివ్యపూజా బలిలో, దివ్యసంస్కారములయందు, తన సువార్తను మనకు బోధిస్తున్నాడు. మనం పాపం, సైతాను అను దుష్టశక్తులకు లోనై వాని చెరలో బంధీలమై యున్నాము. ప్రాపంచిక వ్యసనాలతో, స్వార్ధముతో బంధీలుగా జీవిస్తూ ఉన్నాము. అదిగో! మనలను విడుదల చేసి, విముక్తిని గావించి నిజమైన స్వాతంత్ర్యమును ఒసగుటకు ఆత్మ పూరితుడైన ప్రభువు సిద్ధముగా నున్నారు.

మనం గ్రుడ్డివారము! ఆధ్యాత్మికముగా గ్రుడ్డివారము. ఈ లోకములో నిజమైన జీవితం ఏమిటో తెలుసుకోలేని గ్రుడ్డివారము. నిజమైన వెలుగును చూడలేని గ్రుడ్డివారము. అదిగో! మన ఆధ్యాత్మిక కన్నులను తెరచుటకు ప్రభువు సిద్ధముగా నున్నారు. మనం అనేక శారీరక, ఆధ్యాత్మిక, మానసిక సమస్యలతో సతమతమవుచున్న పీడితులం! మనకు విమోచనను కలిగించుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నారు.

దేవుని వాక్కు పట్ల మన స్పందన ఏమిటి? విన్న వాక్కును జీవిస్తున్నామా? దేవుని వాక్కు మన విశ్వాసానికి పునాది, మూలం, ఆధారం. నేడు దేవుని వాక్కు మన జీవితములో అత్యంత ప్రాముఖ్యమైన పాత్రను కలిగి యున్నది. వాక్కుద్వారా సజీవ దేవున్ని మనం కలుసుకోగలం. వాక్కుద్వారా ఆయన మనతో మాట్లాడును. మనలను నడిపించును. మనలను పునరుద్దరింప చేయును.

దేవుని వాక్కు మనం జీవితాలను, ముఖ్యముగా మన ఆధ్యాత్మిక జీవితాలను నడిపించును. యేసు శిష్యులముగా మనం ఎలా జీవించాలో దేవుని వాక్కు మనకు నేర్పించును. పవిత్ర జీవితానికి బాటను దేవుని వాక్కు చూపించును. దేవుని చిత్తాన్ని తెలుసుకునేలా దేవుని వాక్కు చేయును. మన విశ్వాసాన్ని అనుదిన జీవితములో జీవించేలా ప్రోత్సహిస్తుంది.

దేవుని వాక్కు మన ఆత్మలను పోషించును. ఆధ్యాత్మికముగా జీవించుటకు కావలసిన బలాన్ని, శక్తిని ఒసగును. వాక్కు ద్వారా దేవుని ప్రేమను, దయను తెలుసుకోగలం. వాక్కు మన హృదయాలను పునరుద్ధరించును. యేసు వలే మనం మారుటకు వాక్కు మనకు తోడ్పడును. వాక్కు మనలను ఐఖ్యం చేస్తుంది. మనం ఒక సంఘముగా, కుటుంబముగా జీవించేలా చేస్తుంది.

మరి, ఇంత గొప్ప దేవుని వాక్కును మనం ఎలా మన అనుదిన జీవితాలలో పొందుకోగలం? మొదటిగా, ప్రతీరోజు దేవుని వాక్కును చదువుకోవాలి / ఆలకించాలి. దేవుని వాక్కు మనతో ఏమి మాట్లాడుచున్నదో శ్రద్ధగా ఆలకించాలి. రెండవదిగా, ప్రతీ రోజు దివ్య పూజా బలిలో పాల్గొనాలి. పూజలో దేవుని వాక్యాన్ని ప్రత్యేక విధముగా పొందుకోగలం. మూడవదిగా, బైబులును అధ్యయనం చేయాలి. అప్పుడే దేవుని వాక్కును లోతుగా, క్షున్నముగా తెలుసుకోగలం. నాలుగవదిగా, దేవుని వాక్కుతో ప్రార్ధన చేయాలి.

వాక్కును విశ్వసిద్దాం, దానిని పాటిద్దాం.

No comments:

Post a Comment