రెండవ సామాన్య ఆదివారము YEAR C
యెషయ గ్రంధము 62:1-5, 1 కొరిం 12:4-11, యోహాను 2:1-11
యేసు ప్రభువుకు గొప్ప సాక్ష్యం చెప్పిన వ్యక్తిగా, పునీత బప్తిస్మ యోహానును గడచిన ఆదివారము, అనగా క్రీస్తు బప్తిస్మ పండుగ సందర్భమున మనం ఆయన జీవితమును ధ్యానించి యున్నాము. ఈ ఆదివారం, మరియొక వ్యక్తి గూర్చి ధ్యానించుకొందాం. ఆ వ్యక్తియే, యేసు తల్లి మరియమ్మ. ఆమెకూడా క్రీస్తుకు ఈ లోకములో గొప్ప సాక్ష్యముగా నిలిచింది. ఆ సాక్ష్యానికి ఓ ఉదాహరణ ఈనాటి సువిషేశములో మనం విన్న కానాపల్లె విందులోని అద్భుతం.
మరియమ్మ, యేసు, ఆయన శిష్యులు కానాపల్లెలోని వివాహమునకు వెళ్ళారు. ఇంటి యజమాని అతిధులందరిని సాదరముగా ఆహ్వానించి అన్ని సత్కార్యాలు చేసాడు. కాని, అనుకోకుండా, అతిధులు ఎక్కువగా రావడం వలన, యజమానికి ఒక కష్టం వచ్చింది. అది ఆయన ప్రతిష్టకు సంబంధించినది. వారు విందు కొరకు సిద్ధము చేసుకొన్న ద్రాక్షారసము అయిపోయినది. అతిధులందరు ఇంకా ద్రాక్షారసము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. విందు సమయములో ఏదైనా కొంచెం తగ్గితే, ఎందరు ఎన్ని మాటలు అనుకొంటారో మనకు బాగా తెలుసు! ఇలాంటి సందర్భమే కానాపల్లెలోని ఆ కుటుంబానికి ఎదురయింది. అలాంటి సమయములో, ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని తలంచిన మొట్ట మొదటి వ్యక్తి మరియమ్మ. తన కుమారుడిపై విశ్వాసముతో వెళ్లి ఆయనకు చెప్పినది. తన ఘడియ రానప్పటికిని, యేసు తల్లి మాట విని, కష్ట సమయములోనున్న ఆ కుటుంబానికి సహాయం చేయాలన్న తలంపుతో, ఆయన ఆ అద్బుతమును చేసియున్నారు.
ఆ యజమానివలె, మనంకూడా మన జీవితములో జరిగే ప్రతీ సంఘటనకు ప్రభువును ఆహ్వానించుదాం. అప్పుడే మన జీవితాలలోకూడా ఆయన అద్భుత శక్తిని, మహిమను చూడటానికి ఆస్కారముంటుంది. ఆయన మాటను గౌరవించి, దాని ప్రకారం జీవిస్తే, ఆయన మన కష్టాలను తీరుస్తాడు. ప్రభువును స్వీకరించి, ప్రభువులో జీవించే వారిని ఆయన చేయి విడువడు. మరియమ్మ తన కుమారునిలో చూపిన విశ్వాసాన్ని మనం కూడా చూపిస్తే, ప్రభువు తప్పక మనతో నడుస్తాడు. ఆ కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడాడో, మనలను కూడా కాపాడతాడు. కనుక, ప్రభువును విశ్వసించి ఆయనను మనలోనికి ఆహ్వానిస్తే మన జీవితములో కూడా అద్భుతాలు జరుగుతాయి.
కానాపల్లె పెళ్ళిలోని అద్భుతం "సమృద్ధికి" చిహ్నముగా ఉన్నది. ఈ అద్బుతములో యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చిన తరువాత, అందరూ దానిని రుచి చూసి, సమృద్ధిగా తాగారు. ఆతరువాత, వారికి ఎలాంటి కొరతయు లేదు. ఇది పండుగకు, సంతోషానికి చిహ్నం. దేవుడు సమృద్ధిగా ప్రసాదిస్తారు అన్న విషయాన్ని అక్కడ ఉన్న రాతి బానలు, వాటినిండా, అంచుల వరకు ఉన్న నీరు సూచిస్తూ ఉన్నాయి. ప్రవక్తలందరూ కూడా, ఇలాంటి సమృద్ధికరమైన, సంపూర్ణమైన సంతోషమును లోకరక్షకుడైన క్రీస్తుద్వారా మాత్రమే వస్తుందని ప్రవచించారు. ఆయనలో జీవించే వారికి ఇవన్ని ఆయన ప్రసాదిస్తారు.
ఆ అద్భుతం క్రీస్తు ప్రభు కడరా భోజన సమయాన్ని గుర్తుకు చేస్తుంది. కడరా భోజన సమయములో రాబోయే పరలోక రాజ్య నిత్య విందును దృష్టిలో ఉంచుకొని, ద్రాక్షారసాన్ని తన రక్తముగా మారుస్తూ ఉన్నాడు. "ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము" (మార్కు 14:25) అని కడరా భోజన సమయమున తన శిష్యులతో చెప్పి యున్నారు. ప్రభు పలికిన ఈ వాక్కు నూతన ఒడంబడికకు గుర్తుగా ఉన్నది. "శ్రేష్టమైన ద్రాక్షారసము" ఈ నూతన ఒడంబడికను తెలియ జేస్తుంది. శ్రేష్టమైన ద్రాక్షారసము క్రీస్తు మనకు ఒసగిన రక్షణమునకు చిహ్నముగా ఉంది.
క్రీస్తు కానా పల్లెలో చేసిన అద్భుతం, మనం ప్రతీ రోజు అర్పించే పూజా బలికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నది. ప్రధమముగా, యేసు ప్రభువు కానాపల్లెలో అద్భుతం చేసినప్పుడు, వ్యక్తిగతముగా ఆయన వారి మధ్య ఉన్నారు. ఈనాడు మనం అర్పించే ఈ పూజా బలిలో ప్రభువే స్వయముగా, పరిశుద్ధాత్మ రూపములో మన మధ్య, మన సంఘములో, మన విశ్వాసాన్ని బట్టి ఉన్నారు. యేసు కానా పల్లెలో తన వాక్కుద్వారా నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ఈనాడు మనం అర్పించే ఈ బలిలో గురువు క్రీస్తు వాక్యాలను ఉచ్ఛరించుట వలన, అప్ప, ద్రాక్షరసాలు, క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. యేసు వాక్యం గొప్పది, శక్తి గలది. కనుక యేసు వాక్యాన్ని చదివి, ధ్యానించడం నేర్చుకోవాలి.
చివరిగా, మరియ తల్లి పాత్రను ఈ అద్భుతములో మరచిపోకూడదు. ఈ అద్భుతముద్వారా, యేసుని తల్లి మరియ, తన కుమారుని గుర్తించమని కోరినది. "ఆయన చెప్పినది చేయుడు" అని శిష్యులతో చెప్పి తన కుమారునికి సాక్ష్యముగా నిలచినది. ఆ కుటుంబ కష్టమునుండి రక్షించగల వ్యక్తి యేసు ఒక్కడే అని ఆమె విశ్వసించినది. యేసులో ఉన్న దైవశక్తిని ఆమె గుర్తించినది. ఆ దైవశక్తిని బట్టి, యేసు ఈ అద్భుతాన్ని చేసారు. దేవుని మహిమను ప్రదర్శించారు. ఈ అద్భుతముద్వారా మరియ సంపూర్ణ విశ్వాసానికి ఆదర్శముగా నిలుస్తుంది. ఆమె ఆదర్శాన్ని అనుసరించి, క్రీస్తును వెంబడిద్దాం. ఆయన రక్షణ కార్యములో పాలుపంచుకొందాం.
No comments:
Post a Comment