మూడవ సామాన్య ఆదివారము YEAR C
పఠనములు: నెహెమ్యా
8:2-4, 5-6, 8-10; 1 కొరింథి 12: 12-31; లూకా 1:1-4, 4: 14-21
జీవ వాక్యం - ఆవేదనలోనైన, అవసరములోనైన, ఆపదలోనైన...
రెండు
సందర్భాలు
రెండు
సమావేశాలు
రెండు
ఫలితాలు
కాని,
ఒకే సందేశం.
ఆవేదనతో
వచ్చినా, అలవాటుగా వచ్చినా, ఆ వాక్యం జీవం పోస్తుంది, జీవం పోసి ముందుకు నడిపిస్తుంది.
ఇదే సందేశాన్ని
ఈనాటి మొదటి పఠనము మరియు సువార్త పఠనము మనకు తెలియజేస్తున్నాయి. ఆ సందేశాన్ని సవివరముగా
పరిశీలించి ఆ జీవపు ఊటనుండి మన దైనందిన జీవితానికి జీవ జలమును గ్రహించుదాం!
నెహెమ్యా
గ్రంథమునుండి మనం ఈ రోజు విన్న వాక్యములు ఆనాటి ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడినవి.
ఇశ్రాయేలు అవిధేయత వలన, గర్వము వలన, తన నాశనమును తానే బాబిలోనియా బానిసత్వపు రూపములో
కొని తెచ్చుకొన్నది. 70 సం.ల ఊడిగం తరువాత, ఇశ్రాయేలు ప్రజలు తమ స్వంత దేశమునకు, దేవుడు
తమకు యిచ్చిన దేశమునకు తిరిగి వచ్చారు. ప్రాకారములను కట్టుకొన్నారు. క్రమముగా అన్నీ
సమకూరుతున్నాయి. అన్నీ సక్రమముగా జరుగుతున్నా, ఏదో లోటు, ఏదో వెలితి వారికి కొట్టొచ్చినట్లు
కనిపిస్తున్నది. బానిసత్వములో ఏదో కోల్పోయామని వారు తెలుసుకొన్నారు. క్రమముగా తమ తప్పు
తెలియ వచ్చింది. ఏమి కోల్పోయామో తెలియ వచ్చింది. తమను పేరు పెట్టి పిలిచిన, మలచిన,
ఆ దేవున్ని, ఆయన సహవాసమును, సాంప్రదాయమును, సన్నిధిని మరిచామని తెలుసుకున్నారు. ఆవేదనతో
ఆయన చెంతకు వచ్చారు. ఆయన ధర్మశాస్త్రమును వినవలెనన్న కోరిక బహుబలముగా ఉండెను. అందుకే,
ఏడవ నెల మొదటి దినము సమావేశమునకు (బూరల పండుగ) వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా తమకు
ఇచ్చిన ధర్మశాస్త్రమును వినవలెనన్న కోరికను ఎజ్రాకు తెలియపరచగా, ఎజ్రా వారికి చదివి
(హీబ్రూ బాషలో) వినిపించెను. ఆ పిమ్మట లేవీయులు, ఆ ధర్మశాస్త్రమును, దాని భావమును వివరించిరి.
దాని భావమును తెలుసుకొని, ఇన్ని రోజులు తామేమి కోల్పోయామో తెలుసుకొని దు:ఖించిరి. ఆవేదనతో ఉన్నవారికి ఒక ఆదరువుగా, చీకటిలో ఉన్నవారికి
వెలుగుగా వారికి ధర్మశాస్త్రపు మాటలు తోచాయి.
సువార్త
పఠనములో, అలవాటు చొప్పున, ప్రభువు విశ్రాంతి దినమున ప్రార్ధన మందిరమునకు వెళ్ళెనని మనం చదువుతున్నాం. ఆత్మతో నింపబడినను, గర్వము లేకుండా ప్రార్ధనా మందిరమునకు వెళ్ళాడు.
అందరి మన్ననలు పొందినను, సౌమ్యుడిగా సామాన్యులందరితో కలసి ప్రార్ధించడానికి వచ్చాడు.
తనంటే ఇష్టం లేనివారు ఉన్నా కూడా ఆయన ప్రార్ధించడానికి అక్కడికి వచ్చాడు. అక్కడ జరిగే
దైవారాధన పరిపూర్ణముగా లేకున్నను ఆయన అక్కడి వారందరితో కలసి ప్రార్ధించడానికి వచ్చాడు.
అలా తననుతాను తగ్గించుకొన్నాడు, కాబట్టే, తండ్రి దేవుడు ఆయనను హెచ్చించాడు. ఆత్మను
ఇచ్చి, శక్తిని ఇచ్చి, ప్రభు కృప సం.ను, అందరికి సంతోషమునిచ్చు సమయమును ప్రకటించుటకు
ఆయనను పంపెను. ఆవేదనతో వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు తన వాక్యముద్వారా సంతోషమునిచ్చి తిరిగి
పంపుతున్నారు. అలవాటుగా వచ్చిన యేసు తన శాంతి దూతగా ముందుకు నడిపించారు ఆ తండ్రి దేవుడు.
ఇది ఎప్పుడో
ఒకప్పుడు జరిగిన సంఘటన మాత్రమేనా? మన జీవితములో ఇలా జరుగునా అని ప్రశ్నించుకొంటే,
'అవును' అనే సమాధానం వస్తుంది. ఉదాహరణకు, 1945 వ సం.లో జర్మనీలో అనేక పట్టణాలు నేలమట్టమయ్యాయి.
చాలామంది మరణించారు. యువకులంతా బందీలయ్యారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి
గంపెడు దు:ఖముతో ఉన్నారు. అటువంటి వారిలో ఒకడే యూర్గన్ మోల్ట్ మాన్. తల్లి దండ్రులను,
తోబుట్టువులను, సంపదను కోల్పోయి, బందీగా పట్టుబడి బెల్జియం దేశములోని కారాగారములో ఉన్న
సమయములో, గతమంతా బూడిదలా, భవిష్యత్ అంతా అంధకారంలాగా కనిపించింది. బయట మాత్రమే కాదు,
అంతరంగమునందు కూడా అంతా చీకటిగానే ఉన్నది. ఆ దీనస్థితిలో సైన్యములో పనిచేయుచున్న
ఒక క్రైస్తవ మత భోదకుడిద్వారా, ఒక బైబిల్ గ్రంధమును పొంది, చదవడం ఆరంభించాడు. అలా
చదువుచున్న కొలది, తనలో ఆశ చిగురించింది. ఆ వాక్యమే అతనికి జీవం పోసింది, అతనిద్వారా
అనేక మందికి జీవాన్ని అందించినది.
సోదరా,
సోదరీ!
ఆవేదనతో
ఉన్నా, అలసి పోయినా, దిగులు పడినా, దీన స్థితిలో ఉన్నా,
అందిస్తుంది
ఆ వాక్యం, నీకు జీవం!
అలవాటుగా
ఆ వాక్యాన్ని చదువు, అవసరములో ఉన్నప్పుడు మరీ ప్రత్యేకముగా చదువు.
జీవమును
సమృద్ధిగా పొందు. ఆమెన్.
No comments:
Post a Comment