31వ సామాన్య ఆదివారము, Year C
సొ.జ్ఞాన. 11:22-12:1; 2 తెస్స.
1:11-2:2; లూకా. 19:1-10.
సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య. అన్యాయము ఆర్జితం ఎక్కువ కనుక, అతడు ధనికుడు. అతను యూదుడే. అయితే, యూదసమాజం సుంకరులను దేశద్రోహులుగా, ‘పాపులు’గా ముద్రవేసింది (19:7). ఎందుకన, వారు ధనాపేక్షతో రోమాసామ్రాజ్యానికి పన్నులను వసూలు చేసేవారు. అవసరమైన దానికంటే ఎక్వాకువగా బలవంతముగా వసూలు చేసేవారు. అందుకే, యూదులు సుంకరులను సమాజమునుండి వెలివేయబడినవారిగా భావించేవారు. జక్కయ్య ప్రముఖ సుంకరి కాబట్టి, అతనిని ఘోరపాపిగా భావించేవారు. పరిసయ్యులు అలాంటి వారిని వ్యభిచారులతో కలిపి లెక్కించేవారు.
అయితే జక్కయ్య, యేసు బోధనలు, అద్భుతాల గురించి విన్నాడు. సుంకరులను, పాపాత్ములను పరివర్తనకు పిలచుచున్నాడని విన్నాడు. యేసు యెరూషలేమునకు వెళుతూ యెరికో పట్టణమునకు వచ్చుచున్న విషయం గురించి కూడా విన్నాడు. ఆసక్తి వలన, ఎలాగైనా యేసును చూడాలనుకున్నాడు. బహుశా, కలవాలని అనుకోని యుండకపోవచ్చు. అయితే, యేసు వచ్చినప్పుడు, అచట జనసమూహము ఎక్కువగా ఉండుటచేత, ఆయనను చూడలేకపోయాడు. జక్కయ్య పొట్టివాడు (19:3). యేసును చూచుటకు, జక్కయ్య ముందుకు పరుగు తీసి, ఒక మేడి చెట్టును ఎక్కాడు (19:4). యేసే ముందుగా జక్కయ్యను చూచి, “జక్కయ్యా! త్వరగా దిగి రమ్ము. ఈరోజు నేను నీ యింటిలో నుండ తలంచితిని” (19:5) అని చెప్పారు. యేసు అతనికి ఎలాంటి బోధన చేయలేదు. జక్కయ్య హృదయాన్ని చవిచూచారు. అనేకమంది సణుగుకొన్నను (19:7) జక్కయ్య యింటికి వెళ్ళారు.
ఈవిధముగా, అంత గొప్ప జనసమూహములోకూడా, యేసే ముందుగా జక్కయ్యను చూచారు, కనుగొన్నారు, ఆహ్వానించారు. ఇది దైవకరుణకు తార్కాణం. ప్రభువు దయగల చూపు మనలను చేరుకుంటుంది. ఆ చూపు, మనలో పరివర్తనను రగిలిస్తుంది.
జక్కయ్య విశ్వాస-రక్షణ ప్రయాణం ఇలా సాగింది:
- జక్కయ్య యేసును గురించి (బోధనలు, అద్భుతాలు) విన్నాడు.
- అతనిలో యేసుపై విశ్వాసం కలిగింది (“వినుట వలన విశ్వాసం కలుగును”).
- ఆ విశ్వాసం, యేసును చూడాలన్న [దైవాన్వేషణ] కోరికను పెంచినది; చూచుటలో అడ్డంకులు వచ్చినను, అధిగమించాడు.
- యేసే ముందుగా జక్కయ్యను గుర్తించారు; అతని యింటిలో నుండ తలంచారు; యేసు అతనిపై దయను చూపారు.
- జక్కయ్య ఆనందముతో యేసుకు స్వాగతం పలికాడు (19:3-4)
- యేసు చూపు, పిలుపు, సాన్నిధ్యం జక్కయ్యలో పశ్చాత్తాపాన్ని, మారుమనస్సును కలిగించినది;
- చేసిన పాపాన్ని సరిదిద్దుకున్నాడు (19:8)
- [ఆరోజే] రక్షణ పొందాడు: సమాజములో తిరిగి ఆనందాన్ని, గౌరవాన్ని పొందాడు.
- ఆతిధ్యం / విందు: రక్షణకు సూచనగా, జక్కయ్య యొద్దకు యేసు “అతిధిగా” వెళ్ళారు. ఈ ఆతిధ్య విందు, పరలోక విందును తలపిస్తుంది.
నేడు:
“నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది” (19:9). “నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది” (లూకా. 4:21) అన్న యేసు మాటలు మనం గుర్తుకు చేసుకోవాలి. “నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు” (లూకా.23:24). “నేడు” అన్న పదం – ‘రక్షణ’ కేవలం భవిష్యత్తులో జరిగే సంపూర్ణ ప్రక్రియ కాదని; అది ‘ఇప్పుడు’, ‘ఇక్కడే’ ప్రస్తుతం జరుగు దైవకార్యము అని అర్ధమగుచున్నది. ‘రక్షణ’ ‘ఇప్పుడు’, ‘ఇక్కడే’ ప్రారంభమగు దైవకార్యము: ధనికుడు అయినప్పటికిని, సమాజమునుండి, సంఘమునుండి ‘తప్పిపోయిన’ జక్కయ్య యేసుచేత వెదకబడి, రక్షింపబడ్డాడు (19:10). ఇదియే మెస్సయ్య ప్రేషిత కార్యము. “అబ్రహాము కుమారునిగా” (19:9), తాను కోల్పోయిన సఖ్యతను, ఐఖ్యతను, ఆనందాన్ని జక్కయ్య తిరిగి ఆ క్షణములో పొందాడు. అతని జీవితములో ‘రక్షణ’ దైవకార్యం ప్రారంభమైనది; అది అంతిమ కాలమున పరిపూర్తి అవుతుంది (రెండవ పఠనం).
ధనికులు:
ధనికులు దైవరాజ్యములో ప్రవేశించుట కష్టతరము (cf. మత్త. 19:23), కాని జక్కయ్య జీవితం అది సాధ్యమే అని నిరూపించినది. యేసు రక్షణ సార్వత్రికమైనది, అనగా అందరికి. పేదవారు, ధనికులు అందరు రక్షింపబడాలనేదే యేసు రక్షణ ప్రణాళిక.
మేడి చెట్టు ఎక్కడం:
జక్కయ్య స్థాయికి మేడిచెట్టు ఎక్కడం తగిన పని కాదు. కాని, యేసును చూడాలంటే, ఆయన రక్షణను పొందాలంటే, తన పాప జీవితాన్ని, ఇహలోక జీవితాన్ని అతను అధిగమించాలి. తన ‘పొట్టితనాన్ని’ [చెడ్డపేరు, బలహీనతలు] అధిగమించాలి. “మేడిచెట్టు ఎక్కటం” దీనికి తార్కాణం [ఇహలోకమును వీడి పరలోకమువైపుకు చూడటం].
పరివర్తన:
నిజమైన పరివర్తన, దేవునివైపు పరిపూర్ణముగా మరలుట. ‘లోక’ జీవితమునుండి మరలుట; వ్యసన ప్రవర్తననుండి మరలుట [మద్యం, మత్తుపానీయాలు, శారీరక వ్యామోహం];
యేసు మన రక్షకుడు. కనుక, ధనముకన్న రక్షణ ముఖ్యమని, ధనముకన్న గౌరవం ముఖ్యమని గుర్తించుదాం. యేసుతప్ప, లోకసంపదలు సంరక్షణను ఇవ్వలేదు. “నాకు కావలసిన వస్తువులన్ని ఉన్నవి. నాకెట్టి కీడు వాటిల్లదులే అని తలంపకుము” (సొ.జ్ఞాన. 11:24). యేసుతో ఉండాలంటే, ఈలోక వ్యామోహాలను వదులుకోవాలని తెలుసుకుందాం. జక్కయ్యవలె యేసును వెదుకుదాం. ఆయనవలె యేసును మన హృదయాలలోనికి ఆహ్వానించుదాం. ఆధ్యాత్మిక జీవితములో అంకితభావం, సంకల్పం, పట్టుదల ఉండాలి. అప్పుడే, యేసును కలుసుకోగలం! దేవుని దయ ఎల్లప్పుడు మనపై ఉంటుంది, కనుక కష్టసమయములో కూడా ఆశను కోల్పోకూడదు. యేసు పాపాన్ని ఖండించి, పాపిని హక్కున చేర్చుకుంటారు.
No comments:
Post a Comment