15వ సామాన్య ఆదివారము, Year C

15వ సామాన్య ఆదివారము, Year C
ద్వితీయ 30:10-14; కొలోస్సీ 1:15-20; లూకా 10:25-37



ప్రియ సహోదరీ సహోదరులారా! నేటి ఆదివార పఠనాల సందేశం: నిత్యజీవమును పొందుటకు మనం ఏమి చేయాలి? మొదటిగా దేవున్ని ప్రేమించాలి; రెండవదిగా, దేవున్ని మన పొరుగు వారిలో చూస్తూ, మనం మంచి పొరుగు వారిగా జీవించడం ద్వారా మనం నిత్యజీవితాన్ని పొందుకుంటాము. దేవున్ని ప్రేమించడం (In Himself): మన హృదయపూర్వక భక్తి, ఆరాధన, మరియు దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా వ్యక్తమవుతుంది. దేవుని పట్ల మనకున్న ప్రేమ కేవలం ఒక భావన కాకుండా, మన జీవితాన్ని ప్రభావితం చేసే లోతైన నిబద్ధత. మన పొరుగువారిలో దేవున్ని ప్రేమించడం (Living in our neighbors, by becoming good neighbors): మరింత ఆచరణాత్మకమైన అంశం. యేసు చెప్పిన మంచి సమరీయుని ఉపమానం దీనికి చక్కటి ఉదాహరణ. మన చుట్టూ ఉన్నవారి పట్ల, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారి పట్ల మనం చూపించే కరుణ, దయ, సేవ ద్వారా దేవుని ప్రేమను ఆచరణలో పెడతాము. మన పొరుగువానిని మన వలె ప్రేమించడం అంటే, వారి బాధలను పంచుకోవడం, వారికి సహాయం చేయడం, మరియు వారిని గౌరవించడం. కనుక, నిత్యజీవం అనేది కేవలం వ్యక్తిగత భక్తి ద్వారానే కాకుండా, మన తోటి మానవుల పట్ల చూపించే నిస్వార్థ ప్రేమ మరియు సేవ ద్వారా కూడా వస్తుంది. దేవున్ని ప్రేమించడం మరియు మన పొరుగువారిని ప్రేమించడం వేర్వేరు అంశాలు కావు, అవి ఒకదానికొకటి లోతుగా ముడిపడి ఉన్నాయి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్తిగా ఉంటుంది.

నేటి మొదటి పఠనం (ద్వితీయ 30:10-14) కూడా మనం నిత్యజీవితం పొందుకోవాలంటే, ఏమి చేయాలో తెలియజేస్తుంది. ప్రభువుకు విధేయులై, ఆజ్ఞలనెల్ల పాటించాలని తెలియజేయు చున్నది. దేవుని వాక్యానికి కట్టుబడి జీవించాలని తెలియజేయు చున్నది. దేవుడు సజీవులని, ఎల్లప్పుడు మనకు దగ్గరగా ఉన్నారని తెలియజేయు చున్నది. “మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైన, ఎంత గొప్పజాతి జనులకైన వారి దేవుడు మన దేవునివలె చేరువలోనున్నాడా?” (ద్వితీయ 4:7). కనుక, దేవుని వాక్కును విధేయించాలి ఎందుకన, అది మన జీవితాలకు మూలం, ఆధారం. తన వాక్కుతోనే, దేవుడు తననుతాను మనకు బహిర్గత మొనర్చుకున్నారు. దేవుడు తన ఆజ్ఞలను కేవలం పరిశుద్ధ లేఖనాలలో వ్రాయడం మాత్రమే గాక, వాటిని మన హృదయాలలో లిఖించారు. “ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు పాటింపుడు” (ద్వితీయ 30:14). దీని అర్థం ఏమిటంటే, దేవుని చిత్తం మనకు కేవలం బాహ్యమైన ఆజ్ఞలుగా మాత్రమే కాకుండా, మన అంతరంగంలో, మన మనస్సాక్షి ద్వారా కూడా మార్గనిర్దేశం చేస్తుంది. ఈ అంతర్గత జ్ఞానం, బాహ్యమైన ఆజ్ఞలతో కలిసి, మనం వాటిని పాటించడానికి, తద్వారా దేవునితో నిత్యజీవాన్ని పొందడానికి సహాయపడుతుంది.

రెండవ పఠనంలో కూడా (కొలోస్సీ 1:15-20), దేవుడు మన దరిలోనే ఉన్నారని, తన కుమారుడైన యేసు క్రీస్తుద్వారా, మనలో వసిస్తున్నారని, పౌలు గుర్తుకు చేయుచున్నాడు. కనుక, దేవున్ని ప్రేమించడ మనగా, ఆయన వాక్కును ప్రేమించడం! ఆ వాక్కు యేసు క్రీస్తు ప్రభువే! దేవుడు తన వాక్కుతో ప్రతీరోజు మనతో మాట్లాడుచున్నారు. “క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము” (1 కొలొస్సీ 1:15) అయినట్లే, మన పొరుగువారు మన మధ్య నివసిస్తున్న క్రీస్తు ప్రత్యక్ష రూపము అని మనం గ్రహించాలి. మన చుట్టూ ఉన్న వారిలో, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారిలో మనం క్రీస్తును చూడగలగాలి. మనం మన పొరుగువారికి సేవ చేసినప్పుడు, మనం క్రీస్తుకే సేవ చేస్తున్నామని అర్థం. మనం వారిని ప్రేమించినప్పుడు, మనం క్రీస్తునే ప్రేమిస్తున్నాం అని అర్ధం. కనుక, ప్రతి వ్యక్తిలోనూ దైవికమైన రూపం ఉందని గుర్తించి మనం వారిని మరింత కరుణతో, గౌరవంతో చూడగలగాలి. ‘పరలోకపు మంచి సమరీయుడు’ అయిన యేసుక్రీస్తు కడరాత్రి భోజన సమయములో, “నేను మిమ్ములను ప్రేమించినట్లే, మీరు ఒకరినొకరు ప్రేమించుడి” అని ఆజ్ఞను ఇచ్చారు. అనగా, ప్రతీ వ్యక్తిలో అదృష్యుడైన దేవుడు వసిస్తాడని అర్ధమగుచున్నది.

నేటి సువార్తలో యేసు యెరూషలేమునకు తన ప్రయాణాన్ని కొనసాగించుచుండగా, మార్గమధ్యలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసును పరీక్షింప ప్రయత్నించాడు. ‘బోధకుడా నిత్యజీవము పొందుటకు నేను ఏమి చేయవలయును?(లూకా 10:25) అని ప్రశ్నించాడు. మత్తయి (22:34-40), మార్కు (12:28-34) సువార్తల ప్రకారం, ‘ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది?’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న ప్రాధమికమైన, మతపరమైన ప్రశ్న!

ప్రభువు వెంటనే ఆ ధర్మశాస్త్ర బోధకునికి సమాధానమివ్వక, వానిని మొదటిగా పరిశుద్ధ లేఖనాల వైపు మళ్ళించాడు. అందుకే ప్రభువు, “ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి యున్నది? అది నీకెట్లు అర్ధమగుచున్నది?” (లూకా 10:26) అని ధర్మశాస్త్ర బోధకుడిని తిరుగు ప్రశ్నవేసారు. అందుకు ఆ ధర్మశాస్త్ర బోధకుడు, ద్వితీయ 6:5ను ప్రస్తావిస్తూ “దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమింపుము” అని అలాగే లేవీ 19:18 ప్రస్తావిస్తూ, “నిన్ను నీవు ప్రేమించు కొనునట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము”  (లూకా. 10:27) అని పలికాడు. ద్వితీయ 6:5, యూదులకు అతి ప్రాముఖ్యమైన ప్రార్ధన. యేసు కాలములో, దీనిని రోజుకు రెండుసార్లు ప్రార్ధించేవారు. కాబట్టి పరిశుద్ధ లేఖనాల ప్రకారం, నిత్యజీవము పొందుటకు దైవప్రేమ-సోదరప్రేమ కలిగి జీవించుట అవసరమని స్పష్టం చేయబడింది. అప్పుడు యేసు అతనితో, “నీవు సరిగా సమాధాన మిచ్చితివి. అటులనే చేయుము. నీవు జీవింతువు” (లూకా 10:28) అని చెప్పారు.

అయితే, ఆ ధర్మశాస్త్ర బోధకుడు తననుతాను సమర్ధించుకొనుటకై, ‘నా పొరుగువాడు ఎవడు?’ (లూకా 10:29) అని యేసును ప్రశ్నించాడు. ధర్మశాస్త్ర బోధకుడికి, ‘పొరుగువాడు’ అంటే కేవలం మరొక ధర్మశాస్త్ర బోధకుడు లేదా పరిసయ్యుడు మాత్రమే! అతని దృష్టిలో సమరీయుడు గానీ, అన్యుడు గానీ (యూదులు కానివారు) ఎప్పటికీ పొరుగువాడు కాలేడు. అందుకే, ధర్మశాస్త్ర బోధకుడు ‘పొరుగువాడు’ అనే పదంపై మరింత స్పష్టతను కోరాడు. ఈ సందర్భంలోనే, యేసు అతనికి మంచి సమరీయుని ఉపమానాన్ని చెప్పారు.

యేసు కాలపు సమాజములో, యూదులు-అన్యులు, స్త్రీలు-పురుషులు, పవిత్రులు-అపవిత్రులు అని వ్యత్యాసాలు ఉండేవి. ఈ సందర్భముగా అతను అడిగిన ప్రశ్న ప్రభువును ఇరకాటములో పెట్టె ప్రశ్నయే! కాని యేసు చక్కటి మంచి సమరీయుని ఉపమానముతో (లూకా 10:30-37) సమాధానము ఇచ్చారు. మంచి సమరీయుని ఉపమానం ప్రేమ, కరుణ, మరియు మన పొరుగువారికి సేవ చేయడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ‘పొరుగువాడు’ అంటే సహాయం అవసరమైన ఏ వ్యక్తి అయినా అని స్పష్టమవుతుంది. అయితే, మనం ప్రశ్నించాల్సింది, “నా పొరుగు వాడు ఎవడు?” అని మాత్రమే కాదు; మనం ప్రశ్నించాల్సింది, “నేను ఇతరులకు మంచి పొరుగువానిగా ఉంటున్నానా?”

యెరూషలేమునుండి యెరికో నగరమునకు మధ్య దూరం 27 కి.మీ. రాళ్ళురప్పలతో ఇరుకైన మార్గం కనుక ప్రయాణీకుల నుండి దోచుకొనుటకు వీలుగా ఉండేది. ఉపమానములో ప్రయాణికుడు “ఒకానొకడు” అని చెప్పబడింది. ఎందుకన, ప్రేక్షకులు ఆ వ్యక్తి యూదులతోనైన, అన్యులతోనైన పోల్చుకోగలరు. దాడిచేసిన తరువాత, ఆ వ్యక్తిని కొన ఊపిరితో విడిచి పోయారు. ఒక యాజకుడు ఆ మార్గమున వెళ్ళుచూ, వానిని చూచియు, ఏ సహాయము చేయక తప్పుకొని పోయాడు. ఒక లేవీయుడు అటుగా వెళ్ళుచూ, వానిని చూచి, యాజకుని వలెనె తొలగి పోయెను. లేవీయుడు దేవాలయములో సహాయం చేసేవాడు. అతను బ్రతికున్నాడో, లేదోయని కూడా పట్టించుకొనకుండా అక్కడనుండి వెళ్ళిపోయారు. మూడవ వ్యక్తి... బహుశా యేసు శ్రోతలు ఒక ఇస్రాయేలీయుడు అయుండవచ్చని భావించి యుండవచ్చు. కాని ఆ మూడవ వ్యక్తి ఇస్రాయేలీయులకు అత్యంత శత్రువుగా భావించబడే సమరీయుడు.

యూదులు సమరీయులను అసహ్యించు కొనేవారు. వారితో ఎలాంటి పొత్తు ఉండేది కాదు. క్రీస్తు కాలంలో, యూదులకు సమరీయులు వెలివేయబడిన, చిన్నచూపు చూడబడిన ప్రజలు. వారిని జాతిపరంగా తక్కువవారని, ఆధ్యాత్మికంగా తప్పుత్రోవ పట్టినవారని యూదులు భావించేవారు. ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు వంటి కఠిన హృదయులైన యూద మత నాయకులకు, సమరీయులను తిరస్కరించడం ఒక మతపరమైన విధిగానే ఉండేది. వారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి వారు ఏ మాత్రం ఇష్టపడేవారు కాదు. సమరీయులు ఉత్తర రాజ్యానికి చెందిన యూదుల వారసులే! కాని సమరీయులు అన్యులను వివాహ మాడారు మరియు వారు యెరూషలేములో ఆరాధనలు చేయరు.

అలాంటి ఒక సమరీయుడు, గాయపడిన వ్యక్తిని చూడగానే “జాలిపడ్డాడు” (10:33); అతని దగ్గరకు వెళ్ళడం మాత్రమేగాక, గాయాలను శుభ్రముచేసి, కట్టుకట్టి, తన వాహనముపై కూర్చుండబెట్టి, సత్రమునకు తీసుకొనిపోయి, పరామర్శించాడు. అతని ఖర్చులన్నీ తానే చెల్లిస్తానని వాగ్దానం చేసాడు. ఈవిధముగా, అసహ్యించుకొనబడేవాడు, పొరుగువాడు అయ్యాడు. అలాగే, ‘పొరుగువాని ప్రేమ’కు చక్కటి ఉదాహరణగా నిలిచాడు.

మతం, కులం, జాతి, దేశం, వర్ణం, వర్గం, ప్రాంతం, మగ, ఆడ ఇవేమీ కూడా మన పొరుగువారిని నిర్వచించ కూడదని యేసుప్రభువు తెలియజేయు చున్నారు. యూదులు కేవలం తోటి యూదులను మాత్రమే పొరుగువారిగా భావించేవారు. ఒకరిపట్ల కరుణతో ప్రవర్తించే వ్యక్తి పొరుగువాడు. అందరిని కరుణతో చూసేవాడు పొరుగువాడు.

ఉపమాన అనంతరం, “పై ముగ్గురిలో, దొంగల చేతిలో పడినవానికి పొరుగువాడు ఎవ్వడు?” అని యేసు ప్రశ్నించగా, ఆ ధర్మశాస్త్ర బోధకుడు, సమరీయుడు అని చెప్పకుండా ‘కనికరము చూపినవాడే’ అని సమాధాన మిచ్చాడు. అప్పుడు యేసు అతనితో “నీవు వెళ్లి అటులనే చేయుము” అని పలికారు. యేసు యూదులకు ఇచ్చిన గొప్ప సందేశం ఏమిటంటే, సమరీయులను ఇక శత్రువులుగా భావించక, పొరుగు వారిగా భావించాలని స్పష్టం చేసాడు.

మంచి సమరీయుడు అపరిచితున్ని తన సోదరునిగా భావించాడు. తనవలె తన పొరుగు వానిని ప్రేమించాడు. పొరుగు వాడు ఎవడు? ప్రతీ ఒక్కరు మన పోరుగువారే! ‘పొరుగువాడు’ అనగా మనకు దగ్గరలో ఉన్నవాడు అని అర్ధం! ప్రతీ ఒక్కరిని దయతో చూడాలి. ప్రతీ ఒక్కరు మన పోరుగువారే! ‘ప్రతీ వ్యక్తి యేసువే’ అని మదర్ తెరెసా గారు అన్నారు. అనగా ప్రతీ వ్యక్తిలో దేవున్నిచూడగలగాలి. పౌలు గారు నేటి రెండవ పఠనములో అన్నట్లుగా, “క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము”. మనము కలిసే వ్యక్తుల ద్వారా క్రీస్తు మన చెంతకు వస్తారు. వారిలో దేవుని రూపమును తెలియజేస్తారు.

ఒక వ్యాఖ్యానం ప్రకారం, ఉపమానంలోని సమరీయుడు స్వయంగా క్రీస్తును సూచిస్తాడు. పాపము, సాతాను చేత గాయపడి, సగం చనిపోయిన స్థితిలో ఉన్న మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవులు తమ సృష్టిలో పొందిన దైవిక మహిమను, వైభవాన్ని కోల్పోయి, పాపం వల్ల దాదాపు పతనమైన స్థితిని ఇది సూచిస్తుంది. దేవుని కుమారుడైన క్రీస్తు అపారమైన కరుణతో, మానవాళి దీనమైన పరిస్థితిని చూసి ఊరుకోలేకపోయాడు. అంతులేని దయ, ప్రేమతో నిండి, స్వయంగా మానవ శరీరాన్ని ధరించి, తన సృష్టి అయిన మానవుల వద్దకు వచ్చాడు. క్రీస్తు వారి మరణకరమైన గాయాలను కట్టి, వారిని “ఆధ్యాత్మిక సత్రం”గా చెప్పబడే తన పరిశుద్ధ సంఘం (శ్రీసభ) లోకి తీసుకువెళ్లాడు. ఈ సత్రం రక్షణ, ఆధ్యాత్మిక వైద్యం, మరియు పోషణ లభించే సురక్షితమైన స్థలం. కనుక, పాపం నుండి మానవాళిని విమోచించడానికి క్రీస్తు చేసిన అపారమైన ప్రేమ, త్యాగం గురించిన లోతైన సత్యాన్ని కూడా ఈ ఉపమానము వెల్లడిస్తుందని శ్రీసభ మనకు బోధిస్తుంది.

మంచి సమరీయుని ఉపమానం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు:
1. నిజమైన ప్రేమ మరియు దయ: ఈ ఉపమానం నిజమైన ప్రేమ కేవలం మాటలలో కాకుండా, చేతలలో ఉంటుందని బోధిస్తుంది. యాజకుడు మరియు లేవీయుడు మతపరమైన వ్యక్తులు అయినప్పటికీ, వారు కరుణ చూపడంలో విఫలమయ్యారు. సమరీయుడు, సమాజం ద్వారా చిన్నచూపు చూడబడినప్పటికీ, నిస్వార్థంగా సహాయం చేశాడు. ఇది మన విశ్వాసం మన చర్యలలో ప్రతిబింబించాలని సూచిస్తుంది. మన ఇంటిలో [కుటుంబ సభ్యుల పట్ల సహనం, దయ, క్షమ కలిగి జీవించాలి], పాఠశాలలో, కార్యాలయంలో [స్నేహితులు, సహోద్యోగుల పట్ల గౌరవం, సహాయం, మరియు మద్దతు ఇవ్వడం], మరియు మన చుట్టుపక్కల సమాజంలో [పొరుగువారికి, అవసరంలో ఉన్న అపరిచితులకు సహాయం చేయడం, వారి బాధలను పంచుకోవడం] ఇతరుల పట్ల ప్రేమను చూపించమని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నాడు.

2. క్రైస్తవ ధర్మానికి సవాలు: ఈ ఉపమానం క్రైస్తవ ధర్మాన్ని పాటించే వారికి ఒక సవాలు. యేసు తన శిష్యులకు కేవలం ఆజ్ఞలను పాటించడం కాకుండా, ప్రేమ మరియు కరుణతో నిండిన హృదయాన్ని కలిగి ఉండాలని బోధిస్తున్నారు. మనం పక్కన పెట్టబడినవారిని, అవసరంలో ఉన్నవారిని, మరియు సమాజం చిన్నచూపు చూసేవారిని ఎలా చూస్తున్నామో ఈ ఉపమానం ప్రశ్నిస్తుంది.
3. అందరూ మన పొరుగువారే: ఈ ఉపమానం మన పొరుగువాడు ఎవరనే దానికి సంబంధించిన మన సంకుచిత ఆలోచనలను పటాపంచలు చేస్తుంది. మన పొరుగువాడు మన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మనకు తెలిసిన వారు మాత్రమే కాదు. అతను లేదా ఆమె, జాతి, మతం, సామాజిక స్థితి లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా, అవసరంలో ఉన్న ఏ వ్యక్తి అయినా మన పొరుగువారే.

మంచి సమరీయుని ఉపమానం నేటి సమాజానికి ఇచ్చే సందేశం:
1. సహాయం అవసరమైన వారిని గుర్తించడం: మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో మంది బాధల్లో ఉన్నారు - పేదరికం, అనారోగ్యం, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, మరియు సామాజిక అన్యాయం వంటివి. అలాంటి వారిని గుర్తించి, వారికి సహాయం చేయాలి.

2. నిస్వార్థ సేవ: స్వార్థం మరియు వ్యక్తిగత లాభం ప్రాధాన్యత వహించే ఈ సమాజంలో, నిస్వార్థ సేవ యొక్క ప్రాముఖ్యతను ఈ ఉపమానం గుర్తుచేస్తుంది. మనం మన సౌలభ్యాన్ని పక్కన పెట్టి, ఇతరుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

3. పక్షపాతం లేకుండా ప్రేమించాలి: జాతి, మతం, రాజకీయాలు లేదా సామాజిక భేదాల ఆధారంగా ప్రజలను విడదీసే ప్రవృత్తి నేటి ప్రపంచంలో ప్రబలంగా ఉంది. మంచి సమరీయుని ఉపమానం ఈ పక్షపాతాలను అధిగమించి, అందరినీ ప్రేమతో మరియు కరుణతో చూడాలని మనల్ని ఆహ్వానిస్తుంది.

4. కరుణ మరియు సానుభూతి: ఇతరుల బాధలను చూసి సానుభూతి చెందడం మరియు వారి పట్ల కరుణ చూపడం ఈ ఉపమానం యొక్క ప్రధాన సందేశం. కేవలం చూసి వదిలివేయడం కాకుండా, వారి బాధను పంచుకొని, వారికి ఉపశమనం కలిగించడానికి చర్య తీసుకోవాలి.

5. సామాజిక న్యాయం కోసం కృషి: ఈ ఉపమానం కేవలం వ్యక్తిగత దయ గురించి మాత్రమే కాదు, సామాజిక న్యాయం గురించి కూడా తెలియ జేస్తుంది. దొంగల చేతిలో పడిన వానిని చూసి విస్మరించిన యాజకుడు మరియు లేవీయుడు, అప్పటి సామాజిక మరియు మతపరమైన నిర్మాణంలోని లోపాలను సూచిస్తారు. మనం అన్యాయమైన వ్యవస్థలను సవాలు చేయాలి మరియు అందరికీ సమానత్వం మరియు న్యాయం కోసం కృషి చేయాలి.

ప్రియ సహోదరీ సహోదరులారా! నా పొరుగువారు ఎవరు? అని ప్రశ్నించుకుందాం! సమాధానం మన అంత:రంగమునుండి రావాలి. నా పొరుగువారు ఎవరు? నా మతం వాడేనా? నా కులం వాడేనా? నా జాతివాడేనా? నా వర్గం వాడేనా? నా ప్రాంతం వాడేనా? ఎవరు నా పొరుగువారు? ఆత్మపరిశీలన చేసుకుందాం! సర్వమానవాళి దేవుని సృష్టియేనని, అందరం దేవుని బిడ్డలమేనని, సోదరులమేనని, అందరూ నా పొరుగువారేనని భావిస్తున్నామా?

ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం: “నేను ఇతరులకు మంచి పొరుగువానిగా ఉంటున్నానా?” మనం ఎలా మంచి పొరుగువానిగా మారగలను? ఉదారత, దయ, మరియు కరుణ కలిగిన వ్యక్తులుగా మారినప్పుడు, బాధపడుతున్న ప్రతి ఒక్కరి పట్ల మనం మంచి పొరుగువారిగా మారతాము. ఒక నిజాయితీతో కూడిన చిరునవ్వు, ఒక ఉత్సాహభరితమైన పలకరింపు, ఒక ప్రోత్సాహకరమైన ప్రశంసా వాక్యం, హృదయపూర్వక "ధన్యవాదాలు", బాధలలో ఉన్నవారి ఆత్మలకు అద్భుతాలు చేయగలవు.

ఆత్మపరిశీలన చేసుకుందాం: దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నామా? దైవాజ్ఞలను పాటిస్తున్నామా? మంచి సమరీయునివలె, యేసు మనకు చేరువలోనే ఉన్నారని నమ్ముచున్నామా? ఆయన మన ప్రతీ అవసరములో తోడుగా ఉంటారు. మన పొరుగువారిద్వారా , ప్రభువు మన చేరువలో, మనకు సహాయం చేయడానికి ఉన్నారని విశ్వసిస్తున్నామా? మనం ఇతరులకు మంచి సమరీయులుగా మారుటకు సిద్ధముగా ఉన్నామా? ఎవరైనా ఆపదలో, ప్రమాదములో ఉంటె, సెల్ఫీలు, విడీయోలు తీసి ఆనందపడుచున్నామా లేక వారికి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళుచున్నామా? అవసరతలోనున్న వారికి చేయూత నివ్వడానికి సిద్ధముగా ఉన్నామా?

ప్రతీ ఒక్కరికి మనం మంచి పొరుగువారిగా మారడానికి కావలసిన శక్తిని, దీవెనలను దేవుడు దయచేయాలని ప్రార్ధన చేస్తూ... దేవుడు మిమ్ములను దీవించునుగాక! ఆమెన్!

No comments:

Post a Comment