14వ సామాన్య ఆదివారము, YEAR C
యెషయ 66:10-14; గలతీ 6:14-18; లూకా 10:1-12, 17-20
మన జీవితంలో శాంతి, సమాధానం అమూల్యమైన
బహుమతులు. క్రీస్తుయే నిజమైన శాంతి ప్రదాత. ఈనాటి సందేశం ఈ లోకంలో శాంతి యొక్క ఆవశ్యకతను,
ప్రాముఖ్యతను ధ్యానిస్తుంది. క్రీస్తుయే మన శాంతికి మూలం అని కూడా
ఇది గుర్తుచేస్తుంది. మనలో ప్రతి ఒక్కరికీ ఉన్న సహజ కోరిక శాంతి, సమాధానాలతో జీవించాలని. లోకం విభిన్న రంగాలలో
అభివృద్ధి పథంలో ఉండగా, సాధారణంగా, మానవాళి
మరింత శాంతి, సామరస్యంతో జీవిస్తుందని ఆశిస్తాం. కానీ,
దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. ఎందుకంటే, నిజమైన
శాంతి దేవుని నుండే వస్తుంది. కాబట్టి, దానిని మనం గౌరవించాలి, పోషించుకోవాలి, మరియు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.
మొదటి పఠనములో, దేవుడు తన అపారమైన దయతో మనకు శాంతిని
వాగ్దానం చేయుచున్నారు: “నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును, [శాంతిని] నది వలె
పారింతును” (యెషయ 66:12). ప్రవక్త యెరూషలేమును బిడ్డలను ఓదార్చి, పోషించే తల్లితో
పోల్చుతున్నాడు. అనగా, విశ్వాసముగా ఉండేవారికి దేవుని, శాంతి, ఆనందం, సమృద్ధి
లభిస్తాయి. ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని
గుర్తుచేస్తుంది: దేవుడు ప్రసాదించే ఆశీర్వాదాలలో మనం
ఆనందించాలి, ఆయన సంరక్షణపై పూర్తి నమ్మకముంచాలి. ఒక
తల్లి తన బిడ్డను ఎలా అపురూపంగా పోషిస్తుందో, అదేవిధంగా
దేవుడు తన ప్రజలకు, కష్ట సమయాల్లో కూడా, ఓదార్పును,
నిరీక్షణను అందిస్తారు.
కనుక, ఆయనను విశ్వసించి,
ఆయనలోనే నిజమైన శాంతిని కనుగొనమని మనకు
పిలుపునిస్తుంది.
దేవుడు ఒసగు ఈ దివ్య శాంతి మన హృదయాల్లోకి ప్రవహించి, మన జీవితాలను నడిపించడానికి మనం అనుమతించినప్పుడు,
మన జీవితాలు సంపూర్ణమవుతాయి. అంతేకాదు, మన
సమాజాలు, యావత్ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుతాయి.
అందుకే దేవుడు మనల్ని శాంతికి దూతలుగా, సాధనాలుగా, ప్రతినిధులుగా ఉండమని పిలుస్తున్నారు. ఈ శాంతి మన నుండి మొదలై, మన ద్వారా ఇతరులకు కూడా ప్రవహించాలి.
దురదృష్టవశాత్తు, నేడు మనలో చాలామందిమి, శాంతి
అనేది కేవలం భౌతిక సంపదతో ముడిపడి ఉంటుందని భావిస్తున్నాం. ఎంత సంపద, డబ్బు,
అధికారం, పలుకుబడి ఉందనే దానిపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నాం. “శాంతి అనేది
విజయవంతమైన జీవితం నుండి పొందుకొనే ఆశీర్వాదకరమైన ఆనందం. సజీవ దేవుని సమక్షంలో
లభించే జీవిత సంపూర్ణత్వం. మానవుల పరస్పర ప్రేమలో వ్యక్తమయ్యే జీవిత సంపూర్ణత్వం”
(జుర్గెన్ మోల్ట్‌మన్). కనుక, నిజమైన శాంతి, శాంతికి ప్రధాత అయిన యేసుక్రీస్తు
నుండి మాత్రమే ప్రవహించగలదు.
రెండవ పఠనంలో, అపొస్తలుడైన పౌలు ఒక
శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నాడు: “ఈ సూత్రమును పాటించు వారికి సమాధానము,
కనికరము తోడగును గాక!” (గలతీ 6:16). ఈ మాటల లోతైన అర్థం ఏమిటంటే, మనం దేవుని చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ, ఆయనతో
సామరస్యంగా నడచినప్పుడు మాత్రమే మన హృదయాలలో, కుటుంబాలలో,
సమాజాలలో, చివరికి ప్రపంచమంతటా నిజమైన శాంతి
వెల్లివిరుస్తుంది. పౌలు వలె, క్రీస్తు యొక్క ముద్రలను (అనగా,
ఆయన పట్ల విశ్వాసం, ఆయన బోధనలకు విధేయత) ధరించిన ప్రతి
ఒక్కరికీ ఈ శాంతి లభిస్తుంది. కాబట్టి, మన ఆనందం
యేసుక్రీస్తులో సంపూర్ణం కావాలంటే, శాంతికి మన జీవితంలో
పెద్దపీట వేయాలి.
సువిషేశములో, “మీరు ఏ యింట ప్రవేశించిన ఆ యింటికి
సమాధానము కలుగునుగాక! శాంతి కాముడు అచ్చట ఉన్న యెడల మీ శాంతి అతనికి కలుగును.
లేనిచో అది తిరిగి మీకే చేరును” (లూకా 10:5-6). కనుక,
శాంతి లోకానికి మనం తప్పక అందివ్వాల్సిన బహుమతి. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత
అవసరమైనది. ఈవిధముగా, క్రీస్తు తన శాంతికి సాధనాలుగా ఉండమని మనలను
ఆహ్వానిస్తున్నారు. మనం మన ప్రపంచానికి తీసుకురావాల్సినది మన ప్రభువైన
యేసుక్రీస్తు శాంతి సదేశము. అందరం శాంతి, సమాధానాలతో జీవించాలని
ఆశిస్తాం. పూజలు కూడా ఈ ఉద్దేశ్యం కొరకు పెట్టిస్తాం. శాంతి, సమాధానం యొక్క అవసరత ఎంతగా ఉందో, అది మన జీవితములో
ఎంత ప్రాముఖ్యమో, మనకు తెలుసు!
ఉత్థాన క్రీస్తు తన శిష్యులతో మొదటిగా పలికిన మాటలు, “మీకు శాంతి
కలుగునుగాక” అని (యో 20:19). ఈ మాటలకు ఎంతో లోతైన అర్ధం ఉంది: శిష్యులలో నున్న
భయాన్ని తొలగించడం; వారిపట్ల యేసు క్షమాపణ, సమాధానంను తెలియజేయడం; తన సందేశాన్ని
లోకానికి తీసుకెళ్ళడానికి వారిని సిద్ధంచేయడం; నిజమైన శాశ్వత శాంతిని క్రీస్తు
ఒసగునని ఈ మాటలు తెలియ జేస్తున్నాయి.
బైబులులో హీబ్రూ భాషలో శాంతిని ‘షలోం’ [shalom] అని పిలుస్తాం. అయితే, బైబిల్‌లో 'శాంతి' అనే పదానికి కేవలం యుద్ధం లేకపోవడం అనే అర్థం
మాత్రమే కాదు, అంతకు మించి లోతైన, సమగ్రమైన
అర్థం ఉంది.
'షలోం' అంటే,
- సంపూర్ణత్వం (Wholeness): షలోం అంటే ఒక వ్యక్తి లేదా పరిస్థితి అన్ని విధాలా
సంపూర్ణంగా, లోపాలు లేకుండా ఉండటం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండటాన్ని ఇది
సూచిస్తుంది;
-
క్షేమం (Well-being): ఇది కేవలం అనారోగ్యం లేకపోవడం కాదు, అన్ని పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి క్షేమంగా, సురక్షితంగా
ఉండటం. ఆర్థికంగా, సామాజికంగా కూడా క్షేమంగా ఉండటాన్ని ఇది
తెలియజేస్తుంది;
- సమగ్రత
(Integrity): వ్యక్తిగతంగా, నైతికంగా ఉన్నత విలువలతో జీవించడం.
మోసం, అన్యాయం లేని స్వచ్ఛమైన జీవితాన్ని గడపడం;
సామరస్యం (Harmony): దేవునితో, ఇతరులతో, ప్రకృతితో సామరస్య సంబంధాలను కలిగి ఉండటం. వివాదాలు లేకపోవడమే కాదు,
ప్రేమ, గౌరవంతో కూడిన సంబంధాలు ఉండటం;
- శాంతి, విశ్రాంతి (Peace
and Rest): శారీరక, మానసిక విశ్రాంతిని సూచిస్తుంది. జీవితంలోని అలజడుల నుండి స్వేచ్ఛను పొంది,
ప్రశాంతంగా ఉండటం;
- సంపూర్ణ ఐశ్వర్యం (Total Prosperity): ఇది కేవలం ధనం కాదు, అన్ని
రంగాల్లో అభివృద్ధి, ఎదుగుదల కలిగి ఉండటం. జీవితంలో ఏ కొరత
లేకుండా సంపూర్ణంగా ఉండటం.
- విమోచన, రక్షణ (Deliverance
and Salvation): శత్రువుల నుండి, కష్టాల నుండి దేవుడు ఇచ్చే రక్షణ, విమోచన కూడా
షలోంలో భాగమే.
శాంతి అనగా, యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదు. విజయవంతమైన జీవితము
యొక్క ఆశీర్వాదం; సజీవుడైన దేవుని సన్నిధిలో జీవితము యొక్క
పరిపూర్ణత; మానవుల పరస్పర ప్రేమ యొక్క పరిపూర్ణత; ఇతరులతో కూడి సమాజములో సంపూర్ణ జీవితం; సమాజ
సామరస్యం మరియు సంపూర్ణ శ్రేయస్సు; ‘షలోం’ అనగా దేవుని
పరిపూర్ణమైన అనుగ్రహం. దేవుని చిత్తానికి అనుగుణముగా జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించినపుడు, మన హృదయాలలో,
కుటుంబాలలో, సమాజములో, ప్రపంచములో
శాంతిని చవిచూస్తాము. సువార్త సందేశాన్ని తిరస్కరించిన
వారికి శాంతి, సమాధానం ఉండవు.
అయితే ఆ శాంతి, సమాధానాలను మనం ఎక్కడ
వెదుకుచున్నాము? ఈ లోక సంపదలలోనా? అభివ్రుద్ధిలోనా?
మరెక్కడైనా? నిజమైన శాంతి, సమాధానం దేవునినుండి లభిస్తాయి. శాంతి, సమాధానమునకు
మూలకర్త క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు ఒసగు శాంతి మన హృదయాలలో ప్రవహించేలా,
మన జీవితాలను నడిపించేలా మనం అనుమతించాలి. అప్పుడే మనం సంతృప్తిగా
జీవిస్తాం. అప్పుడే ఈ లోకం అద్భుత ప్రదేశముగా మారుతుంది. అలాంటి శాంతి, సమాధానాలకు మనం దూతలుగా, సాధనాలుగా ఉండాలని ప్రభువు
కోరుచున్నారు. “శాంతి సాధనముగా నన్ను మలచుమయా దేవా!” అని పునీత అస్సీసిపుర
ఫ్రాన్సిస్ వారు ప్రార్ధించారు.
శాంతిస్థాపనకై, ప్రభువు తన శిష్యులను
లోకములోనికి పంపించారు. నేటి సువిషేశములో వింటున్నట్లుగా, “ప్రభువు డెబ్బది
ఇద్దరినీ నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు
వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపారు”. వారిని దైవరాజ్యము సమీపించినదని
ప్రకటించుటకై పంపారు; రక్షణ సందేశమును ప్రకటించుటకై పంపారు. “ఇద్దరిద్దరి చొప్పున”
ఎందుకన, మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఒక సాక్ష్యం నమ్మదగినది కావాలంటే, ఇద్దరు
సాక్ష్యులు అవసరం. అలాగే, “డెబ్బది రెండు” సంఖ్య మానవ జాతులన్నింటిని సూచిస్తుంది.
మనం నేడు ప్రతీ ఒక్కరికి ఈ శాంతి సందేశాన్ని చాటాలి. ప్రతీ యింటికి
శాంతిని, సమాధానమును తీసుకొని వెళ్ళాలి. ఈ
ప్రపంచానికి మనం ఒసగెడి గొప్ప బహుమానం ‘శాంతి’. శాంతితో మనం ప్రపంచాన్ని మార్చగలం; పునరుద్ధరించగలం!
ద్వేషం, యుద్ధం అను సంస్కృతినుండి శాంతి అను సంస్కృతికి మనం
మారాలి. శాంతి దూతలుగా, శాంతి సాధనాలుగా మారాలని ప్రభువు కోరుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు శాంతికి సంబంధించిన
శుభవార్తను మనం ప్రపంచానికి తీసుకురావాలి.
అయితే, “పంట
విస్తారము కాని పనివారు తక్కువ” (లూకా 10:2). “పనివారు” అనగా
శాంతి స్థాపకులను, దూతలను, శాంతి
సాధనాలను ఎక్కువగా ఒసగమని “యజమాని” అయిన
దేవున్ని మనం ప్రార్ధించాలి. “పంటపొలము” ఈ ప్రపంచము. కోతకు, అనగా ‘తీర్పుకు’ సిద్ధముగా
యున్నది. ప్రజలకు సువార్త ప్రకటింప బడాలి; దైవరాజ్య
మార్గాలను బోధించాలి. దీని నిమిత్తమై ప్రచారకులు, బోధకులు,
గురువులు అవసరం. కనుక దేవున్ని ప్రార్ధించాలి.
“తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను” (లూకా 10:3). “తోడేళ్ళ మధ్య” అనగా సువార్తకు వ్యతిరేక పరిస్థితులు. సాతాను ఎప్పుడుకూడా సువార్త బోధనకు
అడ్డుపడుతూ ఉంటుంది. లోకం శత్రువులతో, ప్రలోభాలతో
నిండియున్నది, కనుక శిష్యులు జాగరూకులై యుండాలి. యేసు
ప్రభువునే ఆయన శత్రువులు సిలువకు నడిపించారు. శిష్యులుకూడా ఇలాంటి ఇబ్బందులను లేక
ఎక్కువ ఇబ్బందులనే ఎదుర్కొంటారు. అందుకే ప్రభువు ముందుగానే శిష్యులకు సూచనలను చేసియున్నారు.
శిష్యులు పరిపూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాలి. శాంతి స్థాపనకై పాటుబడాలి. జాలె,
సంచి అవసరం లేదు; ఎందుకన వారు భిక్షాటనకు
వెళ్ళడం లేదు. వారు దేవుని పొలములో [రాజ్యములో] పనివారు. కాబట్టి వారి జీతానికి
వారు అర్హులు. “పనివాడు కూలికి పాత్రుడు” (లూకా 10:7). పాదరక్షలు కూడా అవసరం లేదు. దేవుని కొరకు అంత పేదవారిగా శిష్యులు
జీవించాలి. ఇది సర్వసంపూర్ణ పరిత్యాగానికి సూచన! ఎవరిని
కుశల ప్రశ్నలు అడగవద్దు! ఇది సువార్త యొక్క అత్యవసరతను సూచిస్తుంది. కొన్నిసార్లు,
అనవసరమైన మాటలద్వారా, చర్చలద్వారా, వాగ్వివాదాలద్వారా, విలువైన సమయాన్ని వృధా చేస్తూ
ఉంటాము. లూకా 1:39లో – దేవుని వాక్య
సందేశాన్ని స్వీకరించిన మరియ, “త్వరితముగా ప్రయాణమై పోయినది.” యోహాను 1:41-42లో – క్రీస్తును కనుగొనిన
అంద్రేయ, వెంటనే అతని సోదరుడగు సీమోనును కనుగొని “మేము మెస్సయ్యను కనుగొంటిమి” అని చెప్పాడు. యోహాను
4:28-29లో – క్రీస్తును గుర్తించిన సమరీయ స్త్రీ “తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజలతో, “ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన క్రీస్తు
ఏమో!” అని చెప్పినది. లూకా 24:33-35లో – ఎమ్మావు మార్గములో క్రీస్తును దర్శించుకొనిన ఇద్దరు శిష్యులు వెంటనే
యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఇతర శిష్యులకు తెలియజేసారు.
సువార్తను తిరస్కరించే వారు, ఆ ప్రదేశం
అపవిత్రమైనదిగా భావించ బడును. అందుకే, కాళ్ళకు అంటిన
దుమ్మును అచ్చటె దులిపి వేయాలి. సువార్తను తిరస్కరించేవారు దైవరాజ్యములో భాగస్తులు
కాలేరు. ఎందుకన, వారు దేవుని తిరస్కరించుచున్నారు. ఈ శాంతి స్థాపనలో
సామాన్య ప్రజలు కూడా గురువులకు, బోధకులకు తప్పక సహాయముగా
యుండాలి. శిష్యుల పరిచర్య ఎలా ఉండాలంటే, సాతానుపై విజయం
సాధించేలా ఉండాలి (లూకా 10:17). యేసు సువార్త పరిచర్య
మనద్వారా పరిపూర్ణం కావాలి. అయితే మన విజయాల వలన గర్వితులుగా మారకూడదు. “దుష్టాత్మలు
మీకు వశమగుచున్నవని ఆనంద పడక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి
యున్నవని ఆనందింపుడు” (లూకా 10:20) అని ప్రభువు పలుకుచున్నారు.
మన విజయాలకు కారణం దేవుడు అని ఎల్లప్పుడు గుర్తుపెట్టు కోవాలి!
“సాతాను ఆకాశము నుండి మెరుపువలె పడిపోవుట కాంచితిని” (లూకా 10:18) అని ప్రభువు అన్నారు. సాతాను గర్వము వలన
పరలోకమునుండి భూలోకానికి పడిపోయింది. కనుక గర్వితులు కాకూడదని ప్రభువు
హెచ్చరిస్తున్నారు.
గతములోని మిషనరీలు మనకు ఆదర్శము కావాలి. ఎంతో దూరం కాలినడకన వెళ్ళారు.
వారు తమ పనిని మిక్కిలిగా ప్రేమించారు. దానికి కట్టుబడి జీవించారు. ఎలాంటి రిస్కులకు
వెనుకాడలేదు. ప్రజలతో వ్యక్తిగత పరిచయాలను కలిగి యున్నారు. సంఘాలను స్థాపించి, నిర్మించారు. నేటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి:
వ్యక్తిగత పరిచయాలు కనుమరుగై పోవుచున్నాయి. వేగముగా (వేగము, పైన
చెప్పబడిన అత్యవసరత ఒకటి కాదు; వేగముగా పనులు చేయడం అత్యవసరత
కానేరదు) ఎన్నో పనులు, కార్యక్రమాలు చేస్తున్నాం; కాని, సువార్త ప్రచారములో ‘పస’
లేకుండా పోతున్నది. కొన్నిసార్లు అభిరుచి కూడా తగ్గిపోవుచున్నది.
కనుక, నేటి సువిశేషం మనందరికీ ఓ సవాలు! ప్రభువు కేవలం
గురువులను మాత్రమేగాక, జ్ఞానస్నానం పొందిన ప్రతీ
క్రైస్తవులను పంపుచున్నారు. కనుక ఈ సవాలు అందరికీ!
మన జీవితంలో మన స్థితి, హోదా ఏదైనా సరే –
అది తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా, యజమానులుగా, నిపుణులుగా
లేదా విద్యార్థులుగా అయినా – క్రీస్తు రక్షణ సందేశాన్ని
ప్రకటించడానికి మనం పిలువబడి యున్నాము. దేవుని వాక్యాన్ని
బోధించడం కేవలం గురువులకే ప్రత్యేకమని భావించడం సరికాదు. “సువార్తను విని, రక్షింపబడినవారు ఇప్పుడు స్వయంగా సువార్తను ప్రకటించేవారుగా మారాలి” (పౌల్
VI, Evangelii Nuntiandi). మనం పొందిన జ్ఞానస్నానం,
పవిత్రీకరణ ద్వారా, క్రీస్తును అనుకరిస్తూ, మన మాటల ద్వారా, చేతల ద్వారా ఆయనను ప్రకటించడం
ద్వారా క్రీస్తు సువార్త బోధనలో మనం పాలుపంచుకుంటాము.
నేటికీ “పంట విస్తారము, కాని పనివారు తక్కువ”; బహుశా, నిబద్ధత,
అంకితభావం కలిగినవారు తక్కువ. ఆలోచించదగ్గ విషయం! నిబద్ధత, అంకితభావం కలిగినవారిని
పంపమని దేవున్ని ప్రార్ధన చేద్దాం!
No comments:
Post a Comment