20 వ సామాన్య ఆదివారము, YEAR C
యిర్మియా 38:4-6, 8-10; హెబ్రీ 12:1-4; లూకా 12:49-53
ఈ రోజు మనము సామాన్య కాలంలోని 20వ ఆదివారమును జరుపుకుంటున్నాము.
ఈ ఆదివారం పఠనాలలో మన హృదయాలను ఆలోచింపజేసే కొన్ని ముఖ్యమైన సందేశాలు ఉన్నాయి.
యేసుప్రభువు నేటి సువార్తలో ఒక శక్తివంతమైన ప్రకటన చేశారు. “నేను
భూమిమీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసినది” (లూకా 12:49) అని క్రీస్తు అంటున్నారు. ఈ ‘నిప్పు’ అంటే కేవలం
భౌతికమైన అగ్ని కాదు. లూకా సువార్త 3వ అధ్యాయంలో, బప్తిస్త యోహాను మాటలను ఇది
గుర్తుకు చేస్తుంది, “నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని, నాకంటె
అధికుడు ఒకడు రానున్నాడు. ఆయన మీకు పవిత్రాత్మతోను, అగ్నితోను జ్ఞానస్నానము
చేయించును” (లూక 3:16). యేసు ఇక్కడ చెప్పిన అగ్ని, రాబోయే తీర్పు వల్ల కలిగే వేదనను సూచిస్తుంది.
పాత నిబంధనలో, ‘అగ్ని’ దేవుని శక్తికి,
సన్నిధికి చిహ్నం. మోషే మండుతున్న పొదనుండి దేవుని స్వరం విన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలు వాగ్ధత్త భూమికి ప్రయాణం చేయు సమయములో రాత్రిపూట అగ్నిస్తంభము వారికి
మార్గదర్శిగా నిలిచింది. నూతన నిబంధనలో, పెంతకోస్తు రోజున
పవిత్రాత్మ అగ్నినాలుకల రూపములో శిష్యులపైకి దిగివచ్చింది. ఈ అగ్ని వారి హృదయాలను పూర్తిగా మార్చి, వారికి కొత్త
శక్తిని ఇచ్చింది.
ఈ అగ్నితో యేసు మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాడా? లేదు, యేసు తెచ్చే అగ్ని భిన్నమైనది. అది మన
ఆత్మలను దుష్టత్వం నుండి శుద్ధి చేసి, మనల్ని రక్షించే
పరిశుద్ధాత్మ అగ్ని. ఈ ‘అగ్ని’ గురించి అలెగ్జాండ్రియాకు చెందిన పునీత సిరిల్ గారు, “క్రీస్తు తెచ్చే అగ్ని మనుష్యుల రక్షణకు మరియు ప్రయోజనాలకు
ఉద్దేశించబడింది... ఇక్కడ అగ్ని అంటే, సువార్త యొక్క
రక్షణాత్మక సందేశం మరియు దాని ఆజ్ఞల శక్తి” అని చాలా చక్కగా చెప్పారు.
యేసు చెప్పిన ఈ ‘అగ్నిని’, మనం మూడు ముఖ్యమైన అంశాలుగా అర్థం
చేసుకోవచ్చు:
1. పరిశుద్ధాత్మ అగ్ని: క్రీస్తు చెప్పిన ఈ అగ్ని, పరిశుద్ధాత్మ శక్తికి ప్రతీక.
పెంతుకోస్తు పండుగ రోజున శిష్యులపైకి అగ్ని జ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ దిగివచ్చిన
విషయం మనందరికీ తెలుసు (అపో.కా. 2:3). ఆ అగ్ని వారిలో కొత్త
శక్తిని నింపింది. వారిలోని భయాన్ని తీసివేసి వారిని ధైర్యవంతులుగా మార్చి,
క్రీస్తు సువార్తను ధైర్యముగా ప్రకటించడానికి వారిని సిద్ధం
చేసింది. ఈ అగ్ని మనలో ఉన్న భయాన్ని, అనుమానాలను తొలగించి,
దేవుని కార్యం చేయడానికి కావలసిన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని
ఇస్తుంది. ఈ అగ్ని మనల్ని సామాన్య వ్యక్తుల నుండి దైవసాక్షులుగా మారుస్తుంది.`
2. శుద్ధీకరణ అగ్ని: లోహాలను అగ్నితో శుద్ధి చేసినట్లు, ఈ అగ్ని మనలోని పాపాలను, చెడు అలవాట్లను, స్వార్థాన్ని, కోపాన్ని కాల్చివేస్తుంది. మన
హృదయాలను పవిత్రం చేస్తుంది. మనలో ఉన్న స్వార్థం, ద్వేషం, అసూయ, కోపం వంటివి
దేవుని దృష్టిలో కల్మషాలు. క్రీస్తు ఈ అగ్ని ద్వారా ఈ కల్మషాలను దహించివేసి,
మనల్ని ఆయన ప్రేమకు, సేవకు యోగ్యులుగా
చేస్తారు. ఈ ప్రక్రియ కష్టంగా అనిపించినా, దాని వల్ల మన ఆత్మ
పవిత్రమై, దేవుని ప్రేమకు యోగ్యంగా మారుతుంది.
3. దేవుని ప్రేమ మరియు ఉత్సాహం యొక్క అగ్ని: ఈ అగ్ని దేవుని పట్ల మనకున్న ప్రేమను, ఆయన రాజ్య స్థాపన పట్ల మనకున్న ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఈ అగ్ని మనలో
జ్వలించినప్పుడు, మనం క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచుతాము. ఈ
ప్రేమ మన మాటలలో, చేతలలో వ్యక్తమవుతుంది. ఈ అగ్ని, మన
హృదయాలను కదిలించి, మనలను దేవుని వైపుకు మారుస్తుంది. నేడు
మనం యేసు శిష్యులముగా దైవప్రేమ యొక్క అగ్నిని ప్రతీచోట వ్యాప్తిచేయాలి.
క్లుప్తముగా చెప్పాలంటే, క్రీస్తు చెప్పిన ‘అగ్ని’
కేవలం భౌతికమైన వినాశనం కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి,
పవిత్రీకరణ మరియు దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఉత్సాహానికి ప్రతీక. ఈ అగ్నిని మనం మన హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు, మన జీవితాలు ఒక కొత్త మార్గంలో పయనిస్తాయి.
“నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలయును” (లూకా 12:50). ఈ వాక్యం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. యేసు త్యాగంలో ఉన్న లోతైన
అర్థాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. ఇక్కడ యేసు తాను పొందబోయే శ్రమలను మరియు మరణాన్ని,
“శ్రమల జ్ఞానస్నానంతో” పోలుస్తున్నారు. సాధారణంగా, మనం
జ్ఞానస్నానం గురించి ఆలోచించినప్పుడు, అది నీటిలో మునిగి,
మళ్ళీ బయటకు రావడాన్ని సూచిస్తుంది. అనగా, పాపాల నుండి పవిత్రమై,
క్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది. అయితే,
ఇక్కడ యేసు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇచ్చట జ్ఞానస్నానం
యేసు శ్రమలలో, మరణములో మునుగుటను సూచిస్తుంది. దీనిద్వారానే
మనం విముక్తిని పొందుతాము. అయితే యేసు ప్రభువు, మరణము అను
జ్ఞానస్నాన తొట్టిలో మునిగి ఉత్థానముతో నూతన జీవితములోనికి ఆవిర్భవించుటను
తెలియజేయు చున్నది. ఈవిధముగా, ఈ వాక్యం, జ్ఞానస్నానం యొక్క రెండు ముఖ్య అంశాలను
తెలియజేస్తుంది:
1. శ్రమలలో మునిగిపోవడం: యేసు తన రాకకు ముందుగానే, తాను పడబోయే
శ్రమల గురించి, సిలువపై తన మరణం గురించి
ఎరిగియున్నాడు. ఆయన తాను అనుభవించబోయే వేదన, అవమానం, మరియు మరణమనే “జ్ఞానస్నానం”లో మునిగిపోతానని చెప్తున్నారు. ఇది కేవలం ఒక
బాధాకరమైన అనుభవం కాదు, మానవాళిని రక్షించడానికి దేవుడు
సిద్ధం చేసిన ఒక అనివార్యమైన ప్రణాళికలో భాగం. ఆయన సిలువపై పడిన బాధలన్నీ మన
పాపాలను శుభ్రం చేయడానికి ఒక నూతనమైన, పవిత్రమైన ప్రక్రియ.
2. మరణం నుండి నూతన జీవితంలోకి ఉద్భవించడం: జ్ఞానస్నానం మునిగి మళ్ళీ లేచి రావడం
ఎలాగైతే సూచిస్తుందో, అలాగే, యేసు మరణమనే జ్ఞానస్నానంలో మునిగి, ఉత్థానంతో నూతన
జీవితంలోకి వస్తారు. ఈ గొప్ప విజయం ద్వారా ఆయన మరణాన్ని
జయించి, మనకు విముక్తిని ప్రసాదించారు. ఆయన పడిన బాధలు, మరణం కేవలం ఒక అంతం కాదు, అది మనకు రక్షణ,
కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక మార్గం.
క్లుప్తంగా చెప్పాలంటే, యేసు ఈ మాటల ద్వారా,
తన త్యాగం ఎంత గొప్పదో, దాని వెనుక దేవుని సంకల్పం ఎంత లోతైనదో తెలియజేశారు. ఆయన పడిన శ్రమలు,
మరణం ఒక పవిత్రమైన కార్యం. అది ఆయనను అనుసరించే
ప్రతి ఒక్కరినీ పాపం నుండి విడిపించి, పునరుత్థానం
ద్వారా కొత్త జీవితంలోకి నడిపిస్తుంది.
“నేను భూమిమీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచు చున్నారా? లేదు. విభజనలు కలిగించుటకే వచ్చితిని” (లూకా 12:51). ఈ మాటలు
వినడానికి కఠినంగా అనిపించవచ్చు. యేసు శాంతిస్థాపకుడు కాదా? అన్న
అనుమానం కలుగుతుంది. యేసు జననమున, దేవదూతలు, “మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి
మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగును గాక” (లూకా 2:14)
అని స్తుతించలేదా! సిమియోను, బాలయేసును హస్తములలోనికి తీసుకొని, “ప్రభూ! ఈ దాసుని
ఇక సమాదానముతో నిష్క్రమింపనిమ్ము” (లూకా 2:29) అని పలకలేదా! యేసు తన శిష్యులతో, “శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను.
లోకము వలె నేను ఇచ్చుట లేదు” (యోహాను 14:27) అని కడరా భోజన
సమయములో చెప్పలేదా! “భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు.
మీకు విశ్రాంతి నొసగెదను” (మత్త 11:28) అని చెప్పలేదా!
భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని యుండగా, యేసు వచ్చి
వారి మధ్య నిలువబడి, “మీకు శాంతి కలుగునుగాక!” (యోహాను 20:19)
అని పలుకలేదా! అవును, యేసు మనకు ఆంతరంగిక
శాంతిని ఇస్తారు. కానీ, ఆయన మార్గాన్ని అనుసరించేవారు లోకంలో
సవాళ్లను, విభజనలను ఎదుర్కోవలసి వస్తుందని
హెచ్చరిస్తున్నారు. అందుకే సిమియోను, “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల
పతనముకను, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి
యున్నాడు” (లూకా 2:34) అని పలికాడు. దేవుని రాజ్యానికి అంతిమ లక్ష్యం శాంతి, కానీ శాంతికి ఒక మూల్యం చెల్లించాల్సి ఉందని అర్ధమగుచున్నది.
ఎక్కడైతే దేవుని వాక్యం వినిపింప బడుతుందో, అక్కడ విభజన జరుగుతుందని యేసు ప్రజలను
హెచ్చరిస్తున్నారు. అన్యాయమైన సమాజానికి, దానికి
వ్యతిరేకంగా ఉన్నవాటన్నింటికీ, సువార్త భిన్నంగా ఉండడం వల్ల విభజనకు కారణమవుతుందనేది
వాస్తవమే కదా!
అలాగే, తాను ఈ లోకమునుండి వెడలి పోయిన తరువాత శిష్యుల ప్రయాణం కఠినంగా
ఉంటుందని హెచ్చరించారు. యేసు నిమిత్తము అందరు ద్వేషింతురని చెప్పారు. సువార్త
వ్రాయబడే సమయానికి ప్రభువు ప్రవచనాలు నేరవేరుచున్నాయి. కుటుంబాలలో విభజనలు కలిగాయి
ఎందుకన, కొంతమంది క్రీస్తును విశ్వసించి,
జ్ఞానస్నానాన్ని పొందుచున్నారు. తనను అనుసరించాలని అనుకొనేవారు,
అవసరమైతే, తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను ఆస్తిపాస్తులను విడిచి
పెట్టాలని ప్రభువు తెలియజేసారు. సత్యం, ప్రేమ, స్వేచ్చ, న్యాయము అను మార్గములో పయనించాలనుకుంటే,
సవాళ్లు ఎదుర్కోవడం తప్పదు! దీర్ఘకాలములో, సత్యం, ప్రేమ, స్వేచ్చ,
న్యాయములే ఖచ్చితముగా విజయాన్ని సాధిస్తాయి.
ఈవిధముగా, క్రీస్తు చెప్పిన విభేదాలు విశ్వాసపు విభేదాలు. ఈ విభజనలు
విశ్వాసం వల్ల వచ్చేవి. క్రీస్తు సువార్త అనేది ఎల్లప్పుడూ ఒక సవాలు! అది మనల్ని
మన సౌకర్యవంతమైన జీవితం నుండి బయటకు రమ్మని పిలుస్తుంది. క్రీస్తును అనుసరించడం
అంటే, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులకు,
స్నేహితులకు నచ్చని నిర్ణయాలు తీసుకోవడం. క్రీస్తు కోసం
నిలబడినప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకు విభేదాలు
ఏర్పడవచ్చు. హెబ్రీయుల లేఖలో, “మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగు వాడైన,
ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము” (హెబ్రీ 12:2) అని చదువుచున్నాము. విశ్వాస
మార్గంలో పరుగెత్తేటప్పుడు మనకు అనేక అడ్డంకులు, కష్టాలు
ఎదురవుతాయి. అప్పుడు మనం క్రీస్తు వైపు చూడాలి. ఆయన సిలువను భరించారు, అవమానాలను సహించారు. కానీ చివరికి విజయం సాధించారు. మనము కూడా క్రీస్తు
మార్గంలో ఎదురయ్యే విభేదాలను, కష్టాలను ధైర్యంగా
ఎదుర్కోవాలి. క్రీస్తు కోసం నిలబడటం అంటే, కొన్నిసార్లు
తండ్రికి వ్యతిరేకంగా కొడుకు, తల్లికి వ్యతిరేకంగా కూతురు
నిలబడవలసి వస్తుంది. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. కానీ క్రీస్తు మనల్ని
భయపెట్టడానికి ఈ మాటలు చెప్పలేదు. మన విశ్వాసాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి
అని చెప్పడానికి ఆయన ఈ మాటలను ఉపయోగించారు. దేవుని ప్రేమ, దేవుని
రాజ్యం కోసం మనం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
నేడు అనేకచోట్ల హింసాకాండను, యుద్ధవాతావరణాన్ని
చూస్తున్నాము. నేటి సువిశేషం, యుద్ధానికి పిలుపునిస్తుంది.
అయితే ఈ యుద్ధం ఇతరులపై కాదు. ఈ యుద్ధం, పాపము, అవినీతిపై.
మొదటి పఠనములో యిర్మియా ప్రవక్త తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకముగా
పోరాటం చేయుచున్నాడు. సత్యానికి కట్టుబడి యున్నాడు. యిర్మియా ప్రవక్త, దేవుని సత్య
వాక్యాన్ని చెప్పినందుకు ఎంతో బాధను అనుభవించాడు. రాజవంశీయులు మరియు అధికారులు
యిర్మియా చెప్పిన దేవుని సందేశాన్ని ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమును
విడిచి శత్రువులైన కల్దీయులకు లొంగిపోవాలని యిర్మియా ప్రవచించాడు. ఇది సైనికుల మనోధైర్యాన్ని
దెబ్బతీస్తుందని, రాజ్యాన్ని నిర్వీర్యం
చేస్తుందని అధికారులు వాదించారు. ఈ ప్రవచనం శాంతిని కోల్పోయేలా చేసి, ప్రజలను చనిపోయేలా చేస్తుందని వారు రాజుతో చెప్పారు (38:4). అప్పుడు
సిద్కియా రాజు బలహీనంగా, ప్రజల మాటలకు లొంగిపోయాడు. “అతడు మీ
ఆదీనమున ఉన్నాడు. నేను మీకు అడ్డుపడజాలను కదా!” అని అధికారులతో చెప్పాడు. దీనితో
రాజు యిర్మియాను రక్షించడానికి ఏమీ చేయలేదని, అధికారులు తమ
ఇష్టప్రకారం వ్యవహరించడానికి అనుమతించాడని స్పష్టమవుతుంది (38:5). ఆ అధికారులు
యిర్మియాను పట్టుకొని, మల్కీయా కుమారుడైన హమ్మేలెకు బురద
బావిలో పడవేశారు. ఆ బావి రాజభవన ప్రాంగణంలోనే ఉంది. బావిలో నీరు లేకపోయినా,
బురద మాత్రం ఉంది. యిర్మియా ఆ బురదలో కూరుకుపోయాడు. ఇది యిర్మియాకు
జరిగిన అత్యంత ఘోరమైన అన్యాయం మరియు శ్రమ (38:6).
అయితే, దేవుడు అతన్ని
విడనాడలేదు. ఎబెద్మెలెకు అనే ఒక కూషు లేదా ఇథియోపియా దేశస్థుడు, నపుంసకుడు అయిన ఒక విదేశీయుడిని పంపి
యిర్మియాను రక్షించారు. అతను సిద్కియా రాజుతో మాట్లాడి యిర్మియాను కాపాడాడు.
రాజుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రమాదకరం అయినప్పటికీ, అతడు
నిజం మాట్లాడి యిర్మియాను కాపాడాడు. ఈవిధముగా, మొదటి పఠనములో, విశ్వాసం, కష్టం మరియు ఊహించని దేవుని సహాయం గురించి చూస్తున్నాము. యిర్మియా దేవుని
మాటను ధైర్యంగా చెప్పాడు, అందుకు కష్టాలను అనుభవించాడు. కానీ
దేవుడు ఆయనను మరచిపోలేదు, ఎబెద్మెలెకు అనే ఒక విదేశీయుడి
ద్వారా ఆయనను రక్షించాడు. ఇది దేవుడు తన సేవకులను ఎప్పుడూ కాపాడతాడని, సరైన సమయంలో సహాయం పంపుతాడని తెలియజేస్తుంది.
అలాగే, సత్యం, న్యాయం కొరకు పోరాటములో
దేవుడు ఎప్పుడు మన తోడుగా ఉంటారు. అందుకే రెండవ పఠనములో “మీరు గుండె ధైర్యమును
కోల్పోవలదు. నీరసపడి పోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందు నంతగా
ఎదిరింపలేదు” (హెబ్రీ 12:3-4) అని చదువుచున్నాము. విశ్వాస
మార్గంలో పరుగెత్తేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులను, కష్టాలను
ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ మాటలు చెబుతున్నాయి. మన దృష్టిని “మన విశ్వాసానికి
కారకుడూ, దానిని పరిపూర్ణం చేసేవాడూ అయిన యేసు” మీద
నిలుపుదాం.
నేటి ప్రసంగము నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రహించి, మన
జీవితాలలలో ఆచరిద్దాం:
మొదటిగా, యేసు చెప్పిన ‘అగ్ని’ కేవలం నాశనానికి సంబంధించినది కాదు, అది మన హృదయాలను శుద్ధి చేసి, మనల్ని మార్చడానికి వచ్చిన పరిశుద్ధాత్మ
శక్తి. దీనిని ఆచరణలో పెట్టడానికి, మనం: ముందుగా ధైర్యంగా ఉండాలి: పెంతుకోస్తు రోజున శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ధైర్యంగా
సువార్తను ప్రకటించారు. అదేవిధంగా, మనలో ఉన్న భయాన్ని, అనుమానాలను తొలగించుకొని, దేవుని కార్యాన్ని
చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన ధైర్యాన్ని,
ఉత్సాహాన్ని కలిగి యుండాలి. తరువాత, సాక్షులుగా జీవించాలి: పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని కేవలం
మామూలు వ్యక్తులుగా కాకుండా, క్రీస్తుకు సాక్షులుగా మారుస్తుంది. మన జీవితం ద్వారా దేవుని
ప్రేమను ఇతరులకు చూపించాలి.
రెండవదిగా, యేసు
తెచ్చిన అగ్ని లోహాలను శుద్ధి చేసినట్లుగా, మనలోని
పాపాలను, చెడు అలవాట్లను, స్వార్థాన్ని,
ద్వేషాన్ని, అసూయను దహించివేసి మన హృదయాలను పవిత్రం
చేస్తుంది. కనుక, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి: మనలో ఉన్న కల్మషాలను, దేవునికి ఇష్టం లేని వాటిని గుర్తించి,
వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది
కష్టంగా అనిపించినా, ఈ ప్రక్రియ మన ఆత్మను పవిత్రం చేసి,
దేవుని ప్రేమకు యోగ్యంగా మారుస్తుంది.
మూడవదిగా, యేసు ‘శాంతిని కాదు, విభజనను” తెచ్చానని చెప్పడం వెనుక ఉన్న సందేశం,
ఆయన మార్గాన్ని అనుసరించేవారు లోకంలో సవాళ్లను
ఎదుర్కోవాల్సి వస్తుందని అర్ధం. కనుక, ముందుగా మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి: క్రీస్తును అనుసరించడం వల్ల
కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విభేదాలు రావచ్చు.
అయినప్పటికీ, మనం సత్యం,
ప్రేమ, న్యాయం కోసం నిలబడాలి. అలాగే, క్రీస్తు వైపు దృష్టి ఉంచాలి: విశ్వాస మార్గంలో కష్టాలు వచ్చినప్పుడు,
హెబ్రీ 12:2లో చెప్పినట్లుగా,
“మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగువాడైన, ఆ యేసుపై మన
దృష్టిని నిలుపుదము”. ఆయన సిలువను భరించి విజయం సాధించినట్లు, మనం కూడా ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.
నాలుగవదిగా, నేటి సువార్తలో చెప్పబడిన 'యుద్ధం' ఇతరులపై కాదు, అది మనలోని పాపం, అవినీతిపై జరిగే యుద్ధం. కనుక, మనం పాపంతో పోరాడాలి: హెబ్రీ 12:4 ప్రకారం,
“మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము
చిందునంతగా ఎదిరింపలేదు”. ఈ మాటలు మనలోని చెడు అలవాట్లు, పాపపు కోరికలతో పోరాడాలని ప్రోత్సహిస్తాయి. అలాగే, దేవుని
సహాయాన్ని నమ్మాలి: యిర్మియా ప్రవక్త విషయంలో చూసినట్లుగా, సత్యం కోసం నిలబడినప్పుడు కష్టాలు వచ్చినా, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. సరైన సమయంలో ఆయన సహాయాన్ని పంపి
రక్షిస్తాడు.
ముగింపు: యేసు చెప్పిన అగ్నిని మన హృదయాల్లోకి
ఆహ్వానిద్దాం. ఆ అగ్ని మనల్ని పవిత్రం చేసి, దేవుని ప్రేమతో
నింపుతుంది. సత్యం కోసం, క్రీస్తు కోసం నిలబడటానికి సిద్ధంగా
ఉందాం. అప్పుడు మన జీవితాలు ఒక సాక్ష్యంగా మారి, మన చుట్టూ
ఉన్న ప్రపంచానికి శాంతిని, ప్రేమను పంచుతాయి. ఈ యుద్ధం
ఇతరులపై కాదు, మనలోని పాపం, అవినీతిపై.
ఈ పోరాటంలో దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు.
కనుక, ఈరోజు, తల్లి శ్రీసభ మనలను దుష్కార్యాలపై పోరాడమని ప్రోత్సహిస్తుంది. దాని కోసం క్రీస్తు
అడుగుజాడలను అనుసరించాలి, ఎందుకంటే ఆయన మనల్ని శుద్ధి చేయడానికి,
మార్చడానికి, మనల్ని పీడించే ప్రమాదాల నుండి రక్షించడానికి భూమిపైకి ‘అగ్నిని’ తీసుకొచ్చాడు. కనుక మన విశ్వాసానికి కారకుడైన క్రీస్తునందు మన
దృష్టిని ఉంచుదాం. కష్ట సమయాల్లో క్రీస్తు యొక్క పట్టుదల మరియు ధైర్యాన్ని మనం అనుకరించాలి.
No comments:
Post a Comment