క్రీస్తు మోక్షారోహణ పండుగ
అ.కా. 11:1-11; ఎఫెసీ. 1:17-23, 4:1-13; మార్కు. 16:15-20
క్రీస్తు
నికొదేముతో మాట్లాడుతూ, "పరలోకమునుండి దిగివచ్చిన మనుష్యకుమారుడు తప్ప ఎవడూ
పరలోకానికి ఎక్కిపోలేడు" అని చెప్పారు (యోహాను. 3:13). ఈ వాక్యం ఎంతో లోతైన
అర్ధాన్ని ఇస్తూ ఉన్నది. ఈ వాక్యంలో పరలోకమునుండి దిగిరావడం అంటే క్రీస్తు
"మనుష్యావతారం", పరలోకానికి ఎక్కిపోవడమంటే క్రీస్తు
"మోక్షారోహణం."
క్రీస్తు
"మోక్షారోహణం" ప్రధానంగా అతని మహిమను వెల్లడిస్తుంది. క్రీస్తుని
విశ్వసించే ప్రతి ఒక్కరుకూడా ఈ మహిమలో పాలుపంచుకుంటారు. "మోక్షారోహణాన్ని"
గురించి కొన్ని విషయాలను లోతుగా పరీశీలిద్దాం
1. మోక్షారోహణ సంకేతాలు
అపోస్తులుల
కార్యములు 1:9-14 వచనములు, క్రీస్తు
"మోక్షారోహణాన్ని" వర్ణిస్తున్నాయి. ఈ వచనాలలో ప్రస్తావించబడ్డ
"నలువది నాళ్ళు" , "మేఘం", "దేవదూతలు"
అనే మాటల భావం పరిశీలించుద్దాం. క్రీస్తు భగవానుడు మరణానికి పిమ్మట 40 రోజులదాకా
శిష్యులకు దర్శనమిస్తూ వచ్చారు (అ.కా. 1:3). అతడు ఈ లోకంలో సేవకు పూనుకోకముందు
నలువది నాళ్ళు ఎడారిలో సంసిద్ధమయ్యారు. అలాగే పరలోకంలో తండ్రి ఎదుట సేవకు
పూనుకోకముందు మరలా నలువది నాళ్ళు సిద్ధమయ్యారు. ఈ నలభై కచ్చితంగా 40 రోజులను కాదు
సుదీర్ఘ కాలాన్ని సూచిస్తుంది. "40" యూదులకు పరిపూర్ణమైన సంఖ్య.
ప్రభువు
ఒలీవ కొండమీద నుండి మోక్షారోహణం చేశారు. పూర్వం ఈ కొండ మీదనుండి ప్రభువు తేజస్సు
యెరుషలేమును వీడిపోతుండగా యెహెజ్కేలు ప్రవక్త చూశారు (యెహెజ్కె. 11:23) ఇప్పుడు
మళ్ళా కొండ మీదనుండే తండ్రి తేజస్సు ఐన క్రీస్తుకూడ యెరుషలేమును వీడివెళ్లిపోయారు..
మోక్షానికి
ఎక్కిపోతున్న క్రీస్తుని ఒక మేఘం కప్పివేసింది (అ.కా. 1:9) బైబులులో మేఘం దైవసాన్నిధ్యానికి
గుర్తు. ఇదే మేఘం క్రీస్తు జ్ఞానస్నాన సమయంలో, దివ్యరూపధారణ సమయంలోను
కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఇద్దరు
దేవదూతలుకూడా శిష్యులకు కనిపించారు. వీళ్ళు క్రీస్తు సమాధిచెంత పుణ్య స్త్రీలకు
సైతం దర్శనమిచ్చారు. బైబులులో దేవదూతలుకూడా దైవసాక్షాత్కారానికి గుర్తుగా ఉంటారు.
క్రీస్తు
పునరుత్థానము, మోక్షారోహణము వేరువేరు కార్యాలు కావు. ఇవి రెండూ ఒకే
సంఘటనం. క్రీస్తు ఉత్థానం కాగానే తండ్రి సన్నిధికికూడా చేరుకున్నారు. ఐనా, అతడు
ఇంకా నలువదినాళ్ళు శిష్యులతో మెలగుతూ వాళ్లకు దర్శనమిస్తూ వచ్చారు. ఆ దర్శనాల్లో
చివరిదాన్ని ఇక్కడ లూకా "మోక్షారోహణముగా" వర్ణించారు. ఆ మీదట ప్రభువు
మళ్ళా భౌతికంగా పలుమార్లు శిష్యులకు కనిపించారు..
క్రీస్తు
తండ్రి వలన పరలోకానికి చేర్చబడ్డారు (అ.కా. 1:1) ఇది అతడు పొందిన మహిమ. పూర్వం
అతడు విధేయుడై మోక్షంనుండి ఈ భూమ్మీదకు దిగివచ్చారు. ఆ విధేయతకు,
వినయానికి బహుమానంగా తండ్రి ఇప్పుడు క్రీస్తుని
మోక్షానికి కొనిపోయారు.
ఆ
మోక్షంలో అతడు తండ్రి కుడిపక్కన కూర్చున్నారు (మార్కు. 16:19). పరిశుద్ధ గ్రంథములో
"కూర్చోవటం" పని పూర్తయిందని తెలియజేస్తుంది. ఇక్కడ క్రీస్తు రక్షణకార్యాన్ని
పూర్తిచేశారని భావం. క్రీస్తు తండ్రి " కుడిపక్కన" కూర్చున్నారు అంటే ఆ
తండ్రి మహిమలో పాలుపొందారని భావం. పూర్వం అతడు వినయంతో బానిసరూపం చేకొన్నారు.
నీచమైన సిలువ మరణం అనుభవించారు. అందుకుగాను ఇప్పుడు కీర్తిని పొందారు. తండ్రితోపాటు
తాను రాజ్యపాలనం చేస్తారు.
2. పరలోక పట్టాభిషేకం
తండ్రిచిత్తాన్ని
విధేయించి, తనకొసగబడిన
కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించుకొని విజయుడై పరలోకానికి విచ్చేసిన ఉత్థాన
క్రీస్తుకు ఆనందగానాలతో, స్తుతిస్తోత్రములతో పరలోక పరివారమంతా ఎదురేగి
స్వాగతం పలికింది. తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని రాకతో ఆనందపరవశుడై
క్రీస్తును ఆహ్వానిస్తూ ప్రేమతో కౌగలించుకుని పరలోక సింహాసనంవైపు నడిపిస్తున్నారు.
ఈ దినాన్ని ఉత్థాన క్రీస్తు పట్టాభిషేక దినమని భావించాలి. దైవదూతలు, సన్మనస్కులు
ఎదురేగుచున్నారు, పునీతులు
ఆహ్వానిస్తున్నారు, వేదసాక్షులు
చుట్టూ గుమికూడుచున్నారు. అంతా ఆనందముతో స్వాగత గీతం పాడుచున్నారు..
తండ్రి
తన ప్రియ కుమారుని మహిమాన్విత సింహాసనంపై కూర్చుండబెట్టి పరలోక,
భూలోకాలకు రాజుగా ఆయనకి పట్టాభిషేకం చేస్తున్నారు..
ఇక్కడ
మన రక్షకుడు పరలోక, భూలోకాలను
రాజుగా పాలిస్తారు. ఆయన ప్రజలంతా తిరుసభలో చేర్చబడి, శత్రువులంతా పాదాక్రాంతమయ్యే వరకు పరిపాలించి చివరకు తన
రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తారు (1 కొరి. 15:24-28)
3. ప్రధముడు, ప్రధమ ఫలం
"క్రీస్తు
మరణించిన తరువాత సజీవుడుగా లేవబడి, మరణించి లేపబడినవారిలో ప్రధమ ఫలంగా ఉన్నారు" అని పౌలు మహర్షి
పలుకుతున్నారు. క్రీస్తునాథుడు తన మరణ, పునరుత్థానాలద్వారా ఒక నూతన ఆధ్యాత్మిక సృష్టిని ఏర్పరిచారు. ఆయన కూడా అందులో
ఒకరు. ఈ నూతన సృష్టిలో క్రీస్తు ప్రధమ ఫలం. అందరికంటే ముందు ఆయన మోక్షానికివెళ్లి
సర్వోన్నత మహిమను పొందారు. మానవాళి రక్షణలో మొదట పరలోకంలో ప్రవేశించిన క్రీస్తు
ప్రధమ ఫలమని చెప్పాలి. మన ప్రతినిధిగా ఆయన యిప్పుడు పరలోకానికి వెళ్లిపోయారు. మనంకూడా
మంచి జీవితాన్ని జీవిస్తూ ఆయనను అనుసరించి పరలోకం చేరగలమని నమ్మకం కలుగుతుంది.
కనుక మన హృదయాన్ని, ఆశలను,
ఆశయాలను, కోరికలను పరలోకం వైపు మరల్చి జీవించాలి.
చివరి పలుకులు
క్రీస్తునాథుడు
"నా తండ్రి గృహంలో అనేక నివాస స్థలాలున్నాయి. నేను వెళ్లి మీకు కూడా ఓ నివాసం
సిద్ధం చేస్తాను. నేను మరల వచ్చి మీ అందర్నీ అక్కడికి తీసుకెళ్తాను అని
చెప్పారు" (యోహాను. 14:2-3). ఆ నివాసస్థలమే మోక్షం. అనగా మోక్షం
చేరుకున్నప్పుడు మన మహిమ సంపూర్ణమౌతుంది. మోక్షానికి చేరుకోవాలంటే మనముకూడా
క్రీస్తు భగవానుడివలె నీతివంతమైన జీవితాన్ని జీవించాలి. దేవుని చిత్తానికి తలవంచాలి.
మంచి జీవితాన్ని జీవించుదాం! పరలోక భాగ్యాన్ని సంపాదించుకుందాం!
అందరికీ
క్రీస్తు "మోక్షారోహణ" పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
జోసెఫ్ అవినాష్ సావియో✍
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ, గుంటూరు
No comments:
Post a Comment