దేవుని ప్రేమ సందేశం
సామాన్య రెండవ వారం - శుక్రవారం
పఠనాలు: 1 సమూ 24:2-20; మార్కు 3:13-19
ధ్యానం: శిష్యుల ఎంపిక - ప్రేషిత కార్యం
నేటి సువార్తలో ప్రభువు పన్నెండు మంది శిష్యులను ఎంపిక చేసుకున్నారు. శిష్యుల ఎంపికలో ప్రభువు మూడు కార్యాలను చేస్తున్నారు.
మొదటిగా, పర్వతము పైకి ఎక్కి వెళ్లారు. ఆయన తరచుగా ప్రార్థన చేసుకొనుటకు పర్వతముపైకి వెళ్ళేవారు. శిష్యుల ఎంపికలో తండ్రి దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ప్రార్థన చేశారు. శిష్యుల ఎంపిక ప్రభువు జీవితములో చాలా ముఖ్యమైన ఘట్టం. భవిష్యత్తులోని శ్రీసభ, క్రీస్తు సంఘము వీరిపైనే ఆధారపడి యున్నది. మన జీవితములో ముఖ్యమైన నిర్ణయాలు చేసేప్పుడు, ప్రార్థనలో దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా?
రెండవదిగా, ఆయన పన్నిద్ధరు శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. ఆయన వారిని తనతో ఉండటానికి, సువార్త ప్రకటన కొరకు పంపుటకు నియమించెను. అలాగే దయ్యములను వెళ్లగొట్టుటకు వారికి అధికారము ఇచ్చెను. తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించటానికి శిష్యుల తోడ్పాటు ప్రభువునకు అవసరమై యున్నది. నేడు మనము కూడా ప్రభువునకు అవసరమే. ఆయన కొరకు జీవించడానికి సిద్ధముగా ఉన్నామా? ఆయనతో ఉండటం అనగా, ఆయనకు శిష్యులుగా జీవించడం అని అర్థం. శిష్యులు గురువు పాదాల చెంత కూర్చుని నేర్చుకోవాలి. ఎల్లకాలం గురువుతో నివసించాలి. గురువు జీవిత విధానాన్ని శిష్యులు పుణికి పుచ్చు కోవాలి. ప్రభువు శిష్యులుగా క్రీస్తు సాన్నిధ్యాన్ని ఇతరులకు ప్రకటించుట కొరకు వారిని పంపుటకు నియమించెను.
మూడవదిగా, పన్నిద్ధరిని పేరు పెట్టి పిలిచారు. వారి జీవితాలకు ఒక నూతన గుర్తింపును ఇచ్చారు. వారు కలిసి దేవుని రాజ్యము కొరకు పనిచేయ వలసి యున్నది.
ప్రభువు శిష్యులుగా మనం ఎలా జీవిస్తున్నాం?
No comments:
Post a Comment