పాస్కా నాలుగవ ఆదివారము, Year B

 పాస్కా నాలుగవ ఆదివారము Year B
పఠనాలు: అ.కా. 4:8-12, 17-19, 1 యోహాను 3:1-2, యోహాను 10:11-18
యేసు [దేవుడు] మంచి కాపరి

మంచి నాయకత్వం గురించి నేడు ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. ‘మంచి కాపరిగా తన గూర్చి తాను చెబుతూ, మనందరికీ ఓ గొప్ప ఆదర్శమూర్తిగా ఉన్నారు. మంచి కాపరి తన మందను చూచుకొనును. పచ్చిక బయళ్ళలోనికి నడిపించును. తప్పిపోయిన గొర్రెల కొరకు వెదకును. తన గొర్రెల కొరకు ప్రాణములనైనను అర్పించుటకు సిద్ధముగా ఉండును.

మంచి కాపరి అయిన యేసు మందకు చెందినవారమని సంతోష పడాలి. నేటి మన దైవ సేవకుల ద్వారా [మన ఆధ్యాత్మిక నాయకులు] ఆయన మనలను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నేడు దైవ పిలుపు కొరకు ప్రార్ధన చేయు ప్రపంచ దినము కనుక, ఆధ్యాత్మిక నాయకుల కొరకు ప్రార్ధన చేద్దాం. దైవ పిలుపు కొరకు ప్రార్ధన చేద్దాం. నేడు గురువులు మనకు ఎంతో అవసరం. గురువులు లేనిచో దివ్యబలిపూజ లేదు, ప్రేషిత కార్యం లేదు, సంఘము కూడా లేదు. కనుక, నేటి యువత, దైవ పిలుపును అందుకొని గురుత్వ జీవితములోనికి నడిపింప బడాలని ప్రత్యేక విధముగా ప్రార్ధన చేద్దాం. నేడు మన విచారణలలో సరియైన కతోలిక శ్రీసభ బోధనలు లేక, ఎంతోమంది శ్రీసభను వీడి ఇతర సంఘాలలో చేరుతున్నారు. దివ్యసంస్కారాలను స్వీకరించారు కాని ఎంతోమందిలో శ్రీసభ సిద్ధాంతాలపట్ల, బోధనలపట్ల సరియైన అవగాహన లేదు. దీనికి కారణం గురువులు లేకపోవడమే! అపోస్తలుల కార్యములులో, ఫిలిప్పు-ఇతియోపియా ఉద్యోగి  సంఘటనను ఇచ్చట ప్రస్తావించుకోవచ్చు. ఉద్యోగి యెషయా గ్రంథము చదువు చుండగా,  ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్ధమగు చున్నదా?” అని ప్రశ్నించగా, “నాకు ఎవరైన వివరింపని యెడల నేను ఎట్లు అర్ధము చేసికొనగలను?” అని ఆ ఉద్యోగి పలికాడు (అ.కా. 8:26-40).

గురువుల కొరత స్పష్టముగా లోకమంతటా మనకు కనిపించుచున్నది. ఉన్నవారు సాంఘీక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక [బోధనలు] ప్రేషితత్వమునకు చాలా తక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది. ఇది నేడు మనం ఎదుర్కొంటున్న ఓ పెద్ద సవాలు! ఇచ్చట రెండు విషయాలను గుర్తుపెట్టు కుందాం: ఒకటి, నేడు మన ప్రజలకు గురువుల, మఠవాసుల అవసరత, విలువను గూర్చి తెలియజేద్దాం. భౌతికవాద, అహంభావ సంస్కృతిలోనున్న పరిస్థితులలో దీనిని తెలియ జేయడం ఎంతో అవసరం. యువతలో ముఖ్యముగా ఈ మేలుకొల్పు ఎంతో అవసరం. గురుత్వములో ఆనందం, సంతోషం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నా గురుత్వ జీవితమును బట్టి నేను ఈ విషయమును చెప్పగలుగు చున్నాను. నిజమైన సంతోషమును నేను అనుభవించు చున్నాను. కలిగియుండుట లేదా పొందుటలో కన్న, ఇచ్చుటలో నిజమైన ఆనందము ఉన్నది. ఇతరులకు సేవ చేయుటలో, సహాయము చేయుటలో నిజమైన ఆనందము ఉన్నది. రెండవదిగా, యేసు మన మంచి కాపరి అయినప్పుడు, మనం నిజముగా ఆయనకు చెందినవారముగా ఉండాలి. “నేను మంచి కాపరిని. నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలును ఎరుగును” (యోహాను 10:14). మంచి కాపరిగా, ఆయన తన గొర్రెలకు ముందుగా నడచును. గొర్రెలు ఆయన వెంట పోవును, ఎందుకన, అవి ఆయన స్వరమును గుర్తించును” (యోహాను 10:4). మంచి కాపరిని మనం అనుసరించునప్పుడు, మనము మంచి కాపరులము కాగలము. గురుత్వమునకు దైవపిలుపు, సువార్తా [క్రైస్తవ] విలువలు కలిగిన కుటుంబముల నుండి వచ్చును అనునది ఎంతో వాస్తవము!

కాపరులు నాయకత్వమునకు తార్కాణం. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు నాయకులను సూచిస్తుంది. మోషే తన మామ యిత్రో మందలను మేపడం మాత్రమేగాక (నిర్గమ 3:1), దేవుడు మోషేను పిలచుకొని, ‘కాపరి కఱ్ఱనుఅతనికి ఒసగారు (నిర్గమ 4:2). ఇచ్చట ‘కఱ్ఱ’ మోషే నాయకత్వమునకు, అధికారానికి, దేవుని శక్తికి తార్కాణం. దావీదు కేవలము గొర్రెలు కాచు కాపరి మాత్రమే కాదు.

యిశ్రాయేలీయుల తెగలన్నీ హేబ్రోనున దావీదును రాజుగా చేయవచ్చినప్పుడు, పెద్దలందరు దేవుని వాగ్ధానమును గుర్తుచేసిరి, “నీవు నా ప్రజలకు కాపరివి. నాయకుడవు అయ్యెదవు” (2 సమూ 5:1-3). ప్రవక్తలు కూడా ఇశ్రాయేలు ప్రజల నాయకులు కాపరులన్న విషయాన్ని అనేకసార్లు నొక్కి చెప్పడం జరిగింది. ప్రవక్తలు యావే ప్రభువును కూడా కాపరిగా చెప్పడం జరిగింది: యెషయా 40:10-11, యిర్మియా 23:2-4, యెహెజ్కేలు 34:23.

అయితే, యేసు ఎప్పుడైతే తననుతాను మంచి కాపరిగా చెప్పాడో, దానిలో ప్రత్యేకత ఉంది. రెండు ప్రత్యేకతలను చూడవచ్చు: ఒకటి, “నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలును ఎరుగును: (యోహాను 10:14), యేసు ఇక్కడ గొర్రెల గురించి చెప్పడం లేదు. నీ గురించి, నా గురించి, మన గురించి చెప్పుచున్నాడు. రెండవదిగా, “మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయును” (యోహాను 10:11, 15, 17, 18). యేసు మంచి కాపరిగా మనలో ఒకడై ఉన్నాడు. మన కోసం మరణించాడు.

యేసు క్రీస్తు మంచి కాపరి. మనం మూర్ఖముగా ప్రవర్తించినను, మొండితనముగా ఉన్నను, భయముతో ఉన్నను, ఆయన మనలను చూచును, ప్రేమించును. మన మంచిని కోరును, ఆశించును. వ్యక్తిగతముగా మనలో ఒక్కొక్కరితో ఆయన అనుబంధాన్ని కలిగియుండును. అపాయములో, కష్టములో ఆయన మనతో ఉండును. మనలను ఎన్నటికీ విడనాడడు. తప్పిపోయినప్పుడు మనలను వెతుకుతూ వచ్చును. ఆయన స్వరమును మనం గుర్తిస్తున్నామా? అని ఆత్మపరిశీలను చేసుకుందాం! మన కోసం ప్రాణమిచ్చు మన మంచి కాపరి యేసయ్యను విశ్వసించుదాం. ఆయన మనకు జీవమును, సంతోషమును ఒసగును.

2 comments:

  1. Thank you for the beautiful reflections . God bless your ministry

    ReplyDelete
  2. This story was awesome father, thank you

    ReplyDelete