పాస్కా
మూడవ ఆదివారము, Year B
పఠనాలు:
అ.కా. 3:13-15, 17-19, 1 యోహాను 2:1-5, లూకా 24:35-48
ఉత్థాన
క్రీస్తుకు సాక్షులమవుదాం!
రెండు వారాల క్రితం, యేసు క్రీస్తు ఉత్థాన మహోత్సవమును కొనియాడాము. గడచిన వారము మన పాపములను మన్నించుట ద్వారా క్రీస్తు కరుణ ఎంత గొప్పదోయని ధ్యానించాము. నేడు పాస్కా మూడవ ఆదివారమున మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అనే మన బాధ్యతను గురించి గుర్తుకు చేసుకుంటున్నాము. నేటి మూడు పఠనాల సారాంశం క్రీస్తుకు సాక్షులుగా జీవించడం. ఉత్థాన ప్రభువు శిష్యులకు అనేకసార్లు కనిపించి, వారిలోనున్న భయాన్ని, అనుమానాలను తొలగించి వారితో, అన్నింటికిని మీరే సాక్షులు అని పలికాడు. అలాగే, పేతురుగారు, దేవాలయ ద్వారమున కుంటి వానికి స్వస్థత కలుగజేసిన తరువాత, దేవాలయములో పేతురు ప్రసంగం చేసారు. ఆ ప్రసంగములో ఉత్థాన క్రీస్తుకు పేతురు సాక్షం ఇస్తున్నాడు: "దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము" (అ.కా. 3:15).
మనము పొందిన యేసు క్రీస్తు ఉత్థాన అనుభవమును ఇతరులతో పంచుకోవాలి. ఇతరులకు సాక్షులుగా జీవించాలి. యేసు క్రీస్తు ఉత్థానము గురించి, నీ వ్యక్తిగత అనుభవం ఏమిటి? తపస్సు కాలము నుండి నీ ఆధ్యాత్మిక జీవితములో నీవు చూస్తున్న మార్పులు ఏమిటి? ఎమ్మావు మార్గములో శిష్యులు యేసును దర్శించిన విధముగా నీవు ఉత్థాన క్రీస్తును కలుసుకున్నావా, దర్శించావా? యేసు తన శిష్యులతో, “క్రీస్తు కష్టములు అనుభవించుననియు, మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాపక్షమాపణము ప్రకటింప బడుననియు వ్రాయబడియున్నది వీనికి అన్నింటికిని మీరే సాక్షులు” (లూకా 24:46-48) అని చెప్పారు. ఇదే విషయాన్ని పునీత పేతురుగారు నేటి మొదటి పఠనములో చెప్పుచున్నారు: “మేము దీనికి సాక్షులము” (అ.కా. 3:15).
సాక్షులముగా, మనం ఈ లోకానికి ఏమి తెలియజేయాలి? దేని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి? ఉత్థాన క్రీస్తుకు సాక్షం ఇవ్వాలి. హృదయపరివర్తన మరియు పాపక్షమాపణ గురించి సాక్ష్యం ఇవ్వాలి. పేతురు వలె, “మీరు హృదయ పరివర్తన చెంది, దేవునివైపు మరలిన యెడల, ఆయన మీ పాపములను తుడిచి వేయును” (అ.కా. 3:19) మనమూ సాక్ష్యం ఇవ్వాలి. ఉత్థాన క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు, పాపములనుండి హృదయ పరివర్తన చెందాలని కోరాలి. మన పాపాల క్షమాపణ కొరకే క్రీస్తు మరణించాడు. హృదయపరివర్తన చెందనిచో, క్రీస్తును నేను మరల మరల సిలువ వేసిన వాడనవుతాను.
రెండవ పఠనములో విన్నట్లుగా, క్రీస్తు
వెలుగులో నడవటం లేదా జీవించటం, ఆజ్ఞలను పాటించడం, ఆయనకు
సాక్ష్యమిచ్చుటలో ఉత్తమమైనది. “దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను
గ్రహించితి మనుట నిశ్చయము” (1 యోహాను 2:3). “దేవుని వాక్కునకు ఎవడు
విధేయుడగునో,
అట్టి వానియందు దేవుని యెడల అతని ప్రేమ నిజముగ
పరిపూర్ణమైనది”
(1 యోహాను 2:5).
మనం పాపములో ఉండగా, మనం
క్రీస్తుకు సాక్ష్యము ఇవ్వలేము! ఒక గ్రుడ్డివాడు, ఇంకో గ్రుడ్డివాడిని
నడిపించలేడు. కనుక మనము ముందుగా హృదయపరివర్తన చెందాలి. నేటి మన గొప్ప సమస్య ఇదే!
బోధించేవారు ఎక్కువే కాని పాటించేవారు తక్కువ! ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కాని నిజ
ఆరాధన చేసేవారు తక్కువ!
నేడు క్రీస్తుకు సాక్ష్యమివ్వు.
సాక్ష్యమివ్వడం అనగా కేవలం క్రీస్తు గురించి మాట్లాడటం కాదు. దేవుని పట్ల నీ
విధేయతా జీవితం ద్వారా నీవు సాక్ష్యమివ్వ గలగాలి. దేవుని వాక్కును జీవించడం ద్వారా
సాక్ష్యమివ్వ గలగాలి. ఎమ్మావు మార్గములో ఇద్దరు శిష్యులు యేసు గురించి తర్కించు
కొనుచుండగనే ఉత్థాన క్రీస్తు వారికి కనిపించారు, వారివెంట
నడిచారు, వారితో రొట్టెను భుజించారు... అలాగే, మన సాక్ష్యములో స్వయముగా యేసు
ప్రభువే మనకు తోడు ఉంటారు. మనం ఏమి మాట్లాడాలో తెలియ జేస్తారు. మనకు ధైర్యము నిస్తారు.
కనుక, మనము దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అందరు మనలను వదిలివేశారు
అనుకున్నప్పుడు,
అక్కడ ప్రభువు మనతో ఉంటారు. సువార్తను ఇతరులతో ప్రకటించు
ప్రతీ సందర్భములో యేసు భగవానుడు మనతో ఉంటారు. ఇది నా వ్యక్తిగత అనుభవం! “ఎక్కడ
ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను” (మత్తయి
18:20).
తరతరాలుగా ఈ సాక్ష్యము వలననే మనం విశ్వాసాన్ని పొందాము. కనుక మన సాక్ష్యము ద్వారా భావితరాలవారిలో విశ్వాసాన్ని నింపగలగాలి. మన సాక్ష్యం ఎంత ప్రామాణికమైనదైతే, అంత ఎక్కువగా ప్రభావితం చేయగలదు. కనుక నేడు బోధకులకన్న, సాక్షులు ఎంతో అవసరం! మంచి మాటలు ఎంతో ముఖ్యం, కాని, వాటిని జీవించ గలగాలి. నేటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో మంచి మంచి వాక్యాలను, సూక్తులను పొందుతున్నాము. వాటిని లైక్ చేసి, షేర్ చేస్తే మన బాధ్యత తీరిపోయిందని భావిస్తూ ఉంటాము. వాటిని జీవించాలనే ఆలోచనే మనకు రాదు.“మీకు శాంతి కలుగునుగాక!” (లూకా 24:36) అని ఉత్థాన ప్రభువు శిష్యులతో పలికారు. ఉత్థాన క్రీస్తు ఒసగిన శాంతిని సకల జాతి జనులకు తీసుకొని రావాలి (సాక్షం ఇవ్వాలి). ‘శాంతి’ అనగా నాణ్యమైన జీవితం... నిజమైన శాంతి ఉత్థాన క్రీస్తే!
(Additional Notes)
పాత నిబంధనములో “సాక్ష్యము”ను
వివిధ సందర్భాలలో చూస్తాము. మొదటిది, వ్యక్తిగత సాక్ష్యము; ఒక వ్యక్తికిగాని, ఒక
సంఘటనకు గాని సాక్షం ఇవ్వడం. రెండవది, ఒక వ్యక్తి తాను గమనించిన దానిని
సత్యమైనదిగా, నమ్మదగినదిగా సాక్ష్యము ఇవ్వడం. దీనికి చక్కటి ఉదాహరణ రూతు 4:9-11. బోవసు
నగరమున ఉన్న పెద్దలందరిని సమావేశ పరచి తాను చేయబోయే కార్యమునకు సాక్షులను
చేయుచున్నాడు. మూడవదిగా, సాక్షులు తీర్పు విధించుటలో కూడా పాత్రను పోషింతురని
ద్వితీయో 17:7లో చూస్తున్నాము: “దోషిని శిక్షించునపుడు సాక్షులే మొదట రాళ్ళు
రువ్వవలయును.” అలాగే, నిర్దోషులుగా, నీతిమంతులుగా జీవించుటకు దేవుడు ధర్మశాస్త్రమును
సాక్ష్యముగా ఇచ్చెను.
No comments:
Post a Comment