పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ వారి జీవిత చరిత్ర
(మూలము: పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్: పోవరెల్లో)
1. బాల్యము, యవ్వనము
జోవాన్న పీకా పురిటినొప్పులతో ప్రసవ వేదన పడుచున్నది. ఆమె భర్త పీటర్ బెర్నడోనె, అస్సీసి పట్టణంలోని ప్రముఖ బట్టల వ్యాపారులలో ఒకరు. ఆ సమయంలో వ్యాపార నిమిత్తమై ఫ్రాన్స్ దేశమునకు వెళ్లి యున్నాడు. అస్సీసి మార్గముగా వెళుతున్న ఒక యాత్రికుడు పీకా తో ఇలా అన్నాడు, “అమ్మా, దగ్గరలో ఉన్న పశువుల పాకలోనికి వెళ్ళినట్లయితే ఎలాంటి నొప్పులు లేకుండా మగబిడ్డను ప్రసవించెదవు.”
దేదీప్యమైన గది, పాలరాయితో నేల, బంగారు రేకు పూత పూసిన సీలింగ్, ఇలాంటి విలాసవంతమైన భవంతిని వీడి, పీకా ఆ పశువుల పాక లోనికి వెళ్ళినది. సుతిమెత్తని పట్టువస్త్రాలతో గాక ఎండు గడ్డితో ఆమె పరిచారకురాండ్రు, ప్రసవించుటకు పడకను పశువుల పాకలో సిద్ధము చేసియున్నారు. బెత్లెహేములోని పశువుల పాకలో కన్య మరియ వలనే 26 సెప్టెంబరు 1182 వ సం,,న పీకా అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది.
“అందరికీ హాయ్! అంతయు సిద్ధముగా ఉన్నది. బిడ్డకు జ్ఞానస్నానం ఇచ్చుటకు సాన్ రుఫీనొ కేతెద్రల్ కు వెళ్లెదము. అత్తా! ఏమి పేరు పెట్టాలని అనుకుంటున్నావు” అని పీకా మేనకోడలు బెయాట్రిస్ అడిగింది.
కొద్దిసేపు మౌనం తర్వాత పీకా ఇలా సమాధానం చెప్పింది, “జాన్ అని నామకరణం చేయబడును. బాప్తిస్త యోహాను గారి వలె, యేసు ప్రభువును ఆయన సువార్తను ఈ లోకానికి ప్రకటించుటకు పిలువబడునని నా అంతరాత్మ దృఢముగా చెప్పుచున్నది.”
తండ్రి పీటర్ బెర్నడోనె వ్యాపార నిమిత్తమై వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుని చూచి చాలా సంతోషించాడు. కాని తన కుమారుని పేరు అతనికి నచ్చలేదు. ఫ్రాన్సిస్ అని పేరు పెడితే చాలా మంచిదని అన్నాడు. ఎందుకన, ఫ్రాన్స్ దేశం తనని సంపన్నునిగా, కీర్తిమంతునిగా చేసింది (ఫ్రాన్సిస్ అనగా ఫ్రాన్స్ దేశస్తుడు అని అర్థం). ఫ్రాన్సు దేశం తన మాతృదేశం అగుటచేత, ఫ్రాన్సిస్ అని పేరు పెట్టుటకు పీకా అంగీకరించింది.
ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడయ్యాడు. తన తండ్రి బట్టల దుకాణంలో పనిచేయుటకు ఇష్టపడ్డాడు. వారు అమ్మెడి పట్టువస్త్రాలు ఎంతో అందమైనవి, నాణ్యత కలవి. వారి దుకాణములో వస్త్రాలను అమ్మడంలో ఫ్రాన్సిస్ ఎంతగానో గర్వపడే వాడు. అంతేగాక అక్కడికి వచ్చే గృహిణులు, యువతులతో పరిహాసాలాడెడి వాడు. పట్టు వస్త్రాలపై అతిశయోక్తులు విసురుతూ వారిని ఎంతగానో ఆకర్షించేవాడు.
తన తండ్రి వ్యాపారము విరాజిల్లుటకు తను ఓ ప్రధాన కారణమని ఫ్రాన్సిస్ కు తెలుసు. ఆ పట్టణములో ఉన్న యువతులంతా, బట్టలు కొనడానికి గాక, ఫ్రాన్సిస్ అందాన్ని, మాటల సరళిని, చక్కని సంభాషణ చతురతను చూచుటకు వచ్చెడివారు. యువతులే గాక గృహిణులు కూడా ఫ్రాన్సిస్ ను అభినందించేవారు. తనే స్వయముగా అత్యంత సుందరమైన బట్టలు కొనమని అందరిని ఆలరించేవాడు.
వ్యాపారము లో దిట్ట అయిన పీటర్ బెర్నడోనె తన కుమారుని వ్యాపార సరళిని చూసి ఎంతగానో గర్వపడే వాడు. తరచుగా ఫ్రాన్సిస్, తలుపు దగ్గర నిలబడి, మీసాలు మెలేస్తూ, వచ్చే ప్రతి అమ్మాయి చెవిలో గుసగుసలాడే వాడు.
ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడవుతున్న కొలది చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఆకర్షణకు కారణమైన ప్రతి ప్రదర్శనకు ఆహ్వానం పలికే వాడు. పగలంతా దుకాణంలో వ్యాపారం చేస్తూ, సాయంత్రానికి సంపాదించిన డబ్బుతో సరదాలు చేసేవాడు. కొద్దిపాటి శ్రమ కలిగితే చాలు, సంగీత సరళితో కాలం గడిపేవాడు. కొద్దిమంది గాయకులతో స్నేహం పెంచుకున్నాడు. యవ్వన కాలమంతా పట్టణములో జరిగే వినోద కార్యక్రమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో జరిగే విందులు వినోద కార్యక్రమాల్లో, పొద్దు పోయే వరకు గడిపేవాడు. ఆస్సీసి పట్టణములో ఫ్రాన్సిస్ ప్రముఖ గాయకుడిగా, కళారంగ అభిలాషిగా గుర్తింపు పొందాడు.
పీటర్ బెర్నడోనె మంచి మనిషి, మంచి తండ్రి. కాని, చాలా గర్విష్టి. ఎందుకన, ఆనాటి సంస్కృతి, సాంప్రదాయాలు ఆయనను అలా మార్చివేశాయి. ఆయన జీవిత విలువలు ‘డబ్బు’ అనే పదముతో పోల్చవచ్చు. సుఖం, సంతోషం, హోదా, అధికారం, పేరు ప్రతిష్టలు, డబ్బుతో కొనగలిగే ప్రతీది ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనవే!
తండ్రిగారి ఆశయాల ప్రభావం తెలియకుండానే ఫ్రాన్సిస్ పై పడింది. మంచి వ్యాపారవేత్తగా సుసంపన్నుడిగా పెరగాలని, యుద్ధములో పోరాట పటిమలు చూపి కీర్తి ప్రతిపత్తులు సాధించాలని, జీవితాంతం ధైర్యసాహసాలతో, శక్తిసామర్థ్యాలతో ఉత్తమ యోధునిగా, వీరుడు, ధీరుడుగా కొనసాగాలని, క్షమింపక తిరిగి దెబ్బ వేయాలని, కేవలము ధనవంతులు మాత్రమే జీవితంలో గెలవగలరని, జీవితాన్ని కలిగియుందురని ఫ్రాన్సిస్ మనసులో బలంగా పడిపోయింది.
సాహసాలు చేయడంలో ప్రీతిని, అనుకున్నది సాధించాలనే మొండి పట్టుదలను, వాస్తవంలో జీవించడం, తండ్రి నుండి ఫ్రాన్సిస్ వారసత్వంగా పుణికి పుచ్చుకున్నాడు.
అలాగే, తల్లి నుంచి మంచి అలవాట్లయిన మృదువైన మనస్తత్వం, ప్రేమానురాగాలు, సంగీతం, సాహిత్యం మొదలగు గుణాలను అలవర్చుకున్నాడు. ఆమె ఎప్పుడూ తన కుమారుడు విశ్వాసముతో, మంచితనముతో పెరగాలని ఆశించింది. ఆమె సద్గుణ మంతురాలు కనుక పేదవారిలో యేసుని చూడాలని, వారు ఎప్పుడు వచ్చినా వట్టి చేతులతో తిరిగి పంపకూడదని నచ్చచెబుతూ ఉండేది. “పేదలగు మీరు ధన్యులు... వినమ్రులు ధన్యులు... శాంతి స్థాపకులు ధన్యులు. మంచిగా జీవించు. నీకు దేవుని ఆశీర్వాదములు కలవు. పేదవారి పట్ల, బడుగువారి పట్ల, పీడితుల పట్ల, దయగా ఉండు. నిన్ను గాయ పరచిన వారిని క్షమించు” అని తల్లి యొక్క మృదువైన స్వరము ఫ్రాన్సిస్ లో ప్రతిధ్వనించేది.
తల్లిదండ్రుల విభిన్న అభిప్రాయాల మధ్య ఫ్రాన్సిస్ కుస్తీ పడే వాడు. యువకుడైన ఫ్రాన్సిస్ వారిరువురి ఆలోచనలతో రాజీ పడటానికి ప్రయత్నం చేసేవాడు. అంతయు సక్రమంగానే సాగుతున్నట్లుగా కనిపించింది. కాని, క్రమక్రమముగా తనలోని అంతరాత్మ ప్రబోధనాను సారముగా నూతన ప్రపంచం వైపు దృష్టిని సారించాడు. అప్పుడు దేవుడు-సాతాను, ఆత్మ-శరీరం, మంచి-చెడు, వెలుగు-చీకటి, ఎన్నటికీ రాజీపడవని, అవి ఎప్పుడూ కూడా విరుద్ధమైనవని తెలుసుకున్నాడు.
అదే సమయంలో, తన కుమారుడు ఫ్రాన్సిస్ యొక్క విలాసవంతమైన జీవితాన్ని, ఆర్థిక దుబారా ఖర్చులను చూసి తండ్రి పీటర్ బెర్నడోనె మిక్కిలిగా బాధపడేవాడు. తల్లి పీకా మాత్రం తన కుమారుని గురించి చాలా నిస్సందేహముగా, గొప్ప నమ్మకముతో ఉండేది. ఒకసారి పీటర్ బెర్నడోనె ఫ్రాన్సిస్ పై పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి, కోపగించుకున్నప్పుడు తల్లియే కాపాడింది. ఆమె తన భర్తతో, “ఫ్రాన్సిస్ ఎన్నటికీ చెడ్డవాడిగా మారడు. అతను ప్రభువును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఈ లోక సంబంధమైన జీవితాన్ని ఎక్కువకాలం కొనసాగించలేడు. తన పేరుకు తగ్గట్లుగా, యోహాను గారి వలె క్రీస్తుకు నిజమైన శిష్యుడిగా మారతాడు” అని తేల్చేసి చెప్పింది.
No comments:
Post a Comment