పునరుత్థాన క్రీస్తుని మన హృదయాలలోనికి ఆహ్వానిద్దాం!

పునరుత్థాన క్రీస్తుని మన హృదయాలలోనికి ఆహ్వానిద్దాం!

ఒకనాడు ఒక చిత్ర కారుడు క్రీస్తు ప్రభువుని 'ఒక యాత్రికుని వలె' బొమ్మ వేయాలని తలంచాడు. 'ప్రభువు తన చేతిలో లాంతరు పట్టుకొని తలుపు తట్టుచున్నట్టుగా' చిత్రీకరించాలని అనుకుంటాడు. ఎంతో కష్టపడి, మంచి ఆలోచన, ప్రణాళిక చేసిన తరువాత, చివరికి ఒకరోజు చిత్రాన్ని గీసాడు. ఆ చిత్రపటాన్ని చూసిన చిత్రకారుని కుమారుడు తన తండ్రిని ఎంతగానో అభినందించాడు. అయితే ఈ సందర్భములో కుమారుడు, తండ్రిని ఒక ప్రశ్న అడిగాడు, "నాన్నా! నీవు ఈ చిత్ర పటాన్ని చాలా మంచిగా చిత్రీకరించావు. కాని తలుపుకు నీవు గొళ్ళెం ఎందుకు పెట్టలేదు?" అప్పుడు తండ్రి, "నేను కావాలనే తలుపుకు గొళ్ళెం పెట్టలేదు. ఎందుకంటే, ఆ గొళ్ళెం లోపలివైపు ఉంది. క్రీస్తు ప్రభువు నీ హృదయపు ద్వారాన్ని మాత్రమే తట్టుతాడు. కాని, నీ ప్రమేయం లేకుండా ఆయన నీ హృదయం లోనికి బలవంతముగా రాడు. నీ హృదయపు ద్వారములను నీవు తెరచి ప్రభువును ఆహ్వానించాలి" అని సమాధానం చెప్పాడు.

అదేవిధముగా, ఉత్థానమైన క్రీస్తు మన హృదయాలలోనికి వేంచేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే మన సహకారం, ప్రమేయం లేకుండా ఉత్థాన క్రీస్తు మన హృదయాలలోనికి, జీవితాలలోనికి ప్రవేశించడు. ఉత్థాన క్రీస్తు అనునిత్యం మన హృదయ తలుపులను తట్టుచుండినను, మనము ఆయనను ఆహ్వానించ లేకపోతే మన జీవితాలలో ఏమీ జరుగదు! ఎందుకన, ప్రభువు ఈ లోకములో జన్మించి, తన సిలువ మరణము ద్వారా మనకు రక్షణ కల్పించుటేగాక, తాను పునరుత్థానుడై మనకు అభయాన్ని ఒసగుచున్నాడు. కనుకనే, మనం లూకా సువార్తా 24:34 లో ఈవిధంగా చదువుచున్నాము: "ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను. సీమోనుకు కన్పించెను."

మనం పునరుత్థానుడైన క్రీస్తుని మన జీవితాలలోనికి, హృదయాలలోనికి ఆహ్వానించాలంటే మనము దేవుని సంపూర్ణ కవచమును ధరించాలి. తద్వారా, మనము సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొంటూ, దేవుడు ప్రసాదించు సర్వాంగ రక్షణ కవచమును ధరిస్తాము. మరి ఇటువంటి తరునములోనే మనలను మనము దృఢపరచుకొంటూ, నిశ్చయముగా ఉంటూ సైతాను మాయాపూరిత జిత్తులను ఎదుర్కొంటూ, పాత జీవితానికి స్వస్తి చెప్పి, నూతన జీవితానికి నాంది పలకాలి. తద్వారా, మనమందరం, పూర్వజీవితపు పాత స్వభావమును మార్చు కోవాలి. ఒకవేళ, ఆ పూర్వ జీవితము, మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమై పోయినట్లయితే, మన మనస్తత్వమును నూతనత్వము గావించుకోవాలి. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింప బడిన క్రొత్త స్వభావమును ధరించాలి (ఎఫెసీ. 4:22-24).

మనం పాస్కా పరమ రహస్యాన్ని ఈ సందర్భములో ఏవిధముగా అర్ధము చేసుకోవాలంటే, అది క్రొత్తది మరియు పాతది, శాస్వతమైనది, మరియు అశాశ్వత మైనది, అవినీతికరమైనది మరియు నీతికరమైనది, భౌతికమైనది మరియు అమరమైనదిగా భావించాలి. పాస్కా పరమ రహస్యము చట్ట ప్రకారం పాతది, కాని దైవవాక్కు ప్రకారం క్రొత్తది. అది నమూనాలో అస్థిరముగా ఉంటుంది, కాని ఆయన కృపలో శాశ్వత మైనది. అది గొర్రెపిల్ల బలిలో అవినీతికరమైనది, కాని పునరుత్థాన క్రీస్తులో నీతికరమైనది. అది క్రీస్తు ప్రభువుని మరణం ద్వారా సంభవించిన భౌతికకరమైనది, ఆయన పునరుత్థానం ద్వారా అమరత్వం చేయబడినది. ఈ ద్వంద్వ సంబంధ పదజాలం మొత్తం కూడా క్రీస్తు ప్రభుని మరణం ముందు ఒక విధముగా చూపించబడితే, ఆయన పునరుత్థానం తరువాత అన్నీ ఆయనతో, ఆయన ద్వారా, ఆయన యందు నూతనం గావించ బడ్డాయి.

ఇన్ని గొప్ప నూతన సంఘటనలు ఉత్థాన క్రీస్తు ప్రభుని జీవితములో జరిగితే, మరి మన జీవితములో ఎందుకు జరుగ కూడదు? మనము మన పాత జీవితాలకు స్వస్తి చెప్పి, ఉత్థాన క్రీస్తు వెలుగులో నూతన జీవితాలకు నాంది పలకలేమా? మనం ఈ సమయములోనే ఒక గొప్ప దృఢమైన తీర్మానం తీసుకుందాం. అదే, పునరుత్థానుడైన క్రీస్తుని మన హృదయాలలోనికి ఆహ్వానించుకోవడం! తద్వారా ఈ లోకములో మనమందరం ఉత్థాన క్రీస్తుకు బలమైన సాక్షులుగా ఉంటూ, మన చుట్టు ప్రక్కల ఉన్న పొరుగు వారికి ఆదర్శముగా నిలుస్తూ, భూదిగంతముల వరకు అపోస్తలులవలె ఉత్తన క్రీస్తును ఈ లోకములో ప్రకటించుదాం. సాక్షులుగా నిలుద్దాం. (డీకన్ బ్రదర్ అల్లం సాగర్ మనోజ్, సాగరమాత పుణ్యక్షేత్రం, నాగార్జున సాగర్)

ఉత్థాన మహోత్సవము - ఇతర ప్రసంగాలు




No comments:

Post a Comment