సిలువ విలువ: పశ్చాత్తాపం - పాపక్షమాపణం (పవిత్ర శుక్రవార ధ్యానాంశం)

సిలువ విలువ: పశ్చాత్తాపం - పాపక్షమాపణం
(పవిత్ర శుక్రవార ధ్యానాంశం)

మత్తయి 5:4 - "గుండె పగిలితే పరమానందం" అంటోంది ఈ అష్ట సూత్రం. ప్రపంచములో మనుషులు పడుతున్న నానా బాధలకు, రోదనలకు, వేదనలకు, తట్టుకోలేక గుండె పగిలేలా కన్నీరు మున్నీరులా ఏడ్చే వాళ్లకు అసలు శిసలు ఓదార్పు లభిస్తుంది.

అలాగే తన పాపాల కోసం  పశ్చాత్తాపం చెంది వలవలా ఏడిస్తే దేవుని ఓదార్పు లభిస్తుంది.
మనిషి మారాలంటే పశ్చాత్తాపం పడాలి. పాపాలు కళ్ళలో కదిలాడాలి. అప్పుడు పాపం అంటే ఏమిటో, దాని దారుణం ఏమిటో కళ్ళకు కడుతుంది.

సిలువను చూసినప్పుడు మనకు తెలియకుండానే మన నోటి వెంట, "నా పాపం అందమైన ఓ నిండు జీవితాన్ని యిలా సిలువ పాలు చేసి బుగ్గి చేసింది గావును" అనే మాటలు వినిపిస్తాయి. సిలువ వల్ల గొప్ప ప్రయోజనం ఏమిటంటే పాపం ఎంత ఘోరమైందో మన కళ్ళు తెరిపిస్తుంది. కాగా సిలువ మన పాలిటి  పశ్చాత్తాపం... పరివర్తనకు మూలం.

మత్తయి 6:10, రోమీ. 8:32 - మనిషంటే దేవునికి ఎంత ప్రేమో, సిలువ చెబుతుంది. "దేవుడే ప్రేమ" అని సిలువ నిరూపిస్తుంది. సిలువను చూసిన వారెవరూ దేవుని ప్రేమను సందేహించరు. కాగా, సిలువ మనుషుల పట్ల దేవుని కున్న ప్రేమకు చక్కని నిదర్శనం ... ప్రదర్శనం.

మత్తయి 7:15-20 - క్రైస్తవ జీవనములోనుంచి సిలువను తీసివేసి బోధిస్తే అంతకన్నా పరమ దరిద్ర ప్రభోదం లేదు. ప్రభువు సిలువ, ఆయన తీర్పు - ఈ రెండూ క్రైస్తవ జీవనములో ... ప్రభోదనములో తప్పని సరిగా ఉండి తీరాలి. అది లేకపోతే క్రైస్తవ జీవనం ఆముదపు లొట్ట అవుతుంది. నాటకం బూటకం అవుతుంది. కాగా సిలువ మన ఊపిరి.

మత్తయి 10:34-39 - తనను అనుసరించే వారికి ప్రభువు సిలువను బహుకరించాడు. ప్రభువు కోసం క్రైస్తవుడు వ్యక్తిగత ఆశయాలను ... సుఖమైన జీవనాన్ని ... పాడి గేదెలాంటి ఉద్యోగాన్ని ... జీవితం గూర్చి కన్న తీపి కలలు ... అన్నింటిని త్యాగం చేయాలని సిలువ చెబుతుంది. తను నచ్చింది చేయటం క్రైస్తవం కాదు. ప్రభువుకు ఇష్టమైనది చేయటం అసలు క్రైస్తవం. క్రైస్తవ జీవనములో ఏదో సిలువ ఉంటూనే ఉంటుంది. క్రైస్తవం అంటేనే సిలువ. మనం నమ్మిన ప్రభువు "సిలువ దేవుడు" కాగా సిలువే మన రాచబాట.

మత్తయి 14: 28-33 - క్రీస్తు ఉన్నచోట అన్నీ అలజడులు ...తుఫానులు సద్దుమణిగి ప్రశాంతత ఏర్పడుతుంది. "మీ గుండె ఆందోళనకు ... అల్లకల్లోలానికి గురైతే సిలువను నీ గుండెలో పెట్టు" అని అన్నాడు భక్త ఫ్రాన్సిస్ దె సెల్స్ గారు. కాగా క్రీస్తు సిలువ మన కల్లోల జీవితానికి ప్రశాంతత ఇచ్చే దివ్య సాధనం.

మత్తయి 16: 24-26 - తనను అనుసరించే వారు సిలువను ఎత్తుకొని తన వంట రావాలని అన్నారు ప్రభువు. అనగా క్రైస్తవుడు ఆత్మదానము, ఆత్మ త్యాగము, చేయాల్సి ఉంటుంది. బలిదానము ఎంత బరువైనా, ఎంత బాధాకరమైనా, తన అనుయాయులు భుజాలకు ఎత్తుకోవాలని ప్రభువు ఆదేశం. క్రైస్తవ జీవనం అంటేనే బలిదానముతో కూడుకున్న సేవ అని అర్ధం. ప్రభువు కోసం క్రైస్తవుడు తన సమయాన్ని, విశ్రాంతిని, విలాసాలను వదులు కోవాలి. అలా సాటి మనిషికి ఆత్మ త్యాగముతో సేవలందిస్తూ దేవుని పూజించాలి. కాగా క్రైస్తవ జీవనం బలిపూజ లాంటిది.

మత్తయి 19: 27-30 - క్రీస్తు ప్రారంభించిన రక్షణ పోరాటములో పాల్గొన్న వారు ఆయన విజయములో కూడా పాల్గొంటారు. విజయం చేజిక్కిన తరువాత పోరాటములో పాల్గొన్న సైనికుని మర్చిపోవటం జరుగుతుంది. కాని క్రీస్తు విషయములో పోరాటములో పాల్గొన్న వ్యక్తి విజయములో కూడా పాల్గొంటాడు. సిలువను మోసిన ప్రతివారు మహిమ మకుటం ధరిస్తారు.

లూకా 9: 23-27 - సాటి మనిషికి సాయం అందించటానికి దేనికైనా సిద్ధం అవ్వాలి. ప్రభువును నమ్మిన బంటువలె వ్యవహరించాలి. ఆరు నూరైనా ప్రభువునకు హత్తుకొని ఉండి విశ్వాస పాత్రముగా సేవలందించాలి. కాగా సిలువ అంటే నమ్మక పాత్రత.
(బ్రదర్. గుణ సూర్య, నూజివీడు).

పవిత్ర శుక్రవార ఇతర ధ్యానాంశములు:




No comments:

Post a Comment