క్రీస్తు పునరుత్థాన మహోత్సవము, 8 April 2012


క్రీస్తు పునరుత్థాన మహోత్సవము, 8 April 2012
అపో.కా. 10:34, 37 -43, కోలో 3:1-4, యోహాను 20:1-9


"మీరు భయపడకుడు. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు.  ఆయన పునరుత్తానుడైనాడు.  ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు" (మార్కు 16:6).

ఈ రోజు మనం ప్రభు ఉత్తాన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. మనం జరుపుకొనే పండుగలన్నింటిలో, క్రీస్తు ఉత్తాన పండుగ ఒక గొప్ప పండుగ. ఈరోజు ప్రత్యేకముగా క్రీస్తు విశ్వాసులందరూ కలసి ఆయన ఉత్తానాన్ని, ఉత్తాన సందేశాన్ని ప్రపంచానికి, సర్వమానవాళికి ప్రకటించుచున్నారు. మృత్యుంజయుడైన క్రీస్తు, తన వెలుగును, శాంతిని, సమాధానాన్ని మరియు నూతన జీవితాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు.

ఈ క్రీస్తు పునరుత్థాన పండుగ రోజు ఆయన దర్శన భాగ్యమునకు నోచుకున్న, మొదట కాలి సమాధిని దర్శించిన ముగ్గురు వ్యక్తులనుగూర్చి తెలుసుకొందాం. ఆ ముగ్గురు - మగ్దల మరియమ్మ, పేతురు, యోహాను. ఈ ముగ్గురిలో ఒకే నిరీక్షణ, ఒకే ఎదురుచూపును చూస్తున్నాము. యెరూషలేములో జరిగిన సంఘటనల తరువాత శిష్యులందరు భయాందోనలతో ఎవరి దారిని వారు చూసుకొన్నారు.  పేతురు, "నేను ఆయనను ఎరుగను" (యోహాను. 18:27) అని మూడుసార్లు బొంకాడు. యోహాను సిలువ వరకు క్రీస్తును వెంబడించినను, ఎంతో భయపడ్డాడు. మగ్దల మరియమ్మ, యేసు ప్రభువును అనుసరించడం నేర్చుకొన్న స్త్రీ. ఈమె ప్రభువును అధికముగా ప్రేమించింది. కలువరి కొండవరకు ఆయనను వెంబడించింది. ఆయన సిలువపై వ్రేలాడే సమయములో ఆయన ప్రక్కనే ఉన్నది. ఆయన చనిపోవడం చూసింది. ఆయనను సమాధిలో ఉంచడం చూసింది. ఒంటరిగా, దు:ఖముతో నిండిన హృదయముతో ఆదివారం తెలతెలవారక ముందే సమాధి దగ్గరకు వెళ్లి యేసు భౌతికశరీరాన్ని దర్శించుకోవాలని అనుకొన్నది. ఆయన భౌతిక దేహాన్ని చూసి విలపించాలని అనుకొన్నది. ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలను పూసి అలంకరించాలని అనుకొన్నది. చివరికి సమాధి దగ్గరకు వెళ్ళిన మొదటి వ్యక్తిగా నిలచింది.


ఈ ముగ్గురుకూడా క్రీస్తును వెదకటం మనం ఈనాటి సువిషేశములో వింటున్నాం. వారు సమాధి దగ్గరకు వెళ్ళారు.  అక్కడ అంతా చీకటిగా ఉంది. సమాధి రాయి తొలగించబడి ఉంది. వారు లోనికి వెళ్లి కాలి సమాధిని గుర్తించారు.  క్రీస్తు బౌతిక దేహము వారికి అక్కడ కనిపించలేదు.  ఒక్క క్షణం వారికి పరిస్థితి అర్ధం కాలేదు.  రకరకాల అనుమానాలు వారి మదిలో మెదిలాయి.  కాలి సమాధికి ఒక అర్ధం లేదు అని అనిపించింది. వారు కాలి సమాధిని చూసి ప్రభువును విశ్వసించలేదు.  కాని వారు ఆ కాలి సమాధిని చూసి నిరాశ చెందలేదు.  వారిలో ఎక్కడో కొంచెం ఆశలు చిగురించాయి.  వారు ఆయనను వెదకడం ప్రారభించారు. "అమ్మా! నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు?" (యోహాను 20:15), "అప్పుడు పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ యిద్దరును పరిగెత్తు చుండిరి.  కాని ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరెను (యోహాను 20:3-4).  ఈ విధముగా, ప్రభువుని వెదకడములో వారు ఆయనను కనుగొన్నారు.  ఆయన దర్శన భాగ్యానికి అర్హులైనారు. కాలి సమాధి వారిని ఒక నూతన జీవితము వైపు నడిపించింది.  వారి జీవితాల్లో ఒక కొత్త ఆశను రేపింది. వారికి మార్గాన్ని చూపించింది. వారిలోని తాపత్రయం, ఆశ, వారి ఆత్మ విశ్వాసం, ఉత్థాన ప్రభు దర్శనానికి తోడ్పడింది.  వారంతా ప్రభు దర్శనానికి అనేకసార్లు నోచుకొని, వారు చూచిన కాలి సమాధి నిజమేనని గ్రహించారు.  ఒక వైపు ప్రభు దర్శనం, మరొక వైపు కాలి సమాధి, ఈ రెండు అంశాలు కూడా వారు విశ్వాసములో వెదకడానికి తోడ్పడినాయి.

మన అనుదిన జీవితములో ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలు, ఊహించని సంఘటనలు మన జీవితాన్ని ఒక కాలి సమాధిని చేస్తాయి.  మన సన్నిహితులుగాని, కుటుంబ సభ్యులుగాని చనిపోయినప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారములో నష్టం వచ్చినప్పుడు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు, మన ప్రేమ ఫలించనప్పుడు, మన జీవితం చీకటిగా కనిపిస్తుంది. జీవితములో ముందుకు పోవడానికి అన్ని దారులు మూసిపోయినట్లుగా అనిపిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం దొరకనప్పుడు మన పరిస్థితి కూడా కాలి సమాధిలా ఉంటుంది. కాలి సమాధిలో జీవం ఉండదు. అంతా చీకటిగా ఉంటుంది. ప్రతీ ఒక్కరి జీవితములో ఇలాంటి సందర్భాలు, పరిస్థితులు తారస పడుతూ ఉంటాయి.  కాని, మనం నిరాశ చెందక, మగ్దల మరియమ్మలా, పేతురు మరియు యోహానులా సమస్య పరిష్కారం కోసం వెదకాలి.  వారు ఏవిధముగా క్రీస్తు కొరకు వెదకి ఆయనను కనుగొన్నారో, అదేవిధముగా, మనం కూడా మన జీవితములో ఎదురు పడే కాలి సమాధిని చూసి భయపడక, క్రీస్తును వెదకాలి.  వారికి కనబడినట్లు మనకు కూడా తప్పక కనపడతాడు.

అయితే, ప్రభు దర్శనం అందరికి ఒకేలా ఉండదు.  ప్రభువు అనేక రూపాలలో, అనేక విధాలుగా మనకు ప్రత్యక్షం కావచ్చు.  వారివారి శక్తిని బట్టి, జీవిత విధానాన్ని బట్టి, ఒక్కొక్కరి విశ్వాస అనుభూతి మారుతూ ఉంటుంది. మనం జీవించే విధానాన్ని బట్టి, మన జీవిత దృక్పధమును బట్టి, ఉత్థాన క్రీస్తు అనుభూతి మారుతూ ఉంటుంది.  ఒకరు పొందిన అనుభూతి, ఆనందం మరొకరు పొందకపోవచ్చు.  కనుక, ప్రభువును మన జీవితములో గుర్తించి, కనుగొన్నప్పుడు, మనం కూడా ఉత్థాన క్రీస్తు ఆనందాన్ని, ప్రేమను, శాంతిని పొందగలుగుతాము.

యేసు ఉత్థానమయ్యాడు!  ఇది మనందరికి ఒక శుభవార్త!  కాని ఈ క్రీస్తు ఉత్థానమే మనదరికి కూడా ఒక సందేశం.  అయితే ఈ క్రీస్తు ఉత్థాన ఆశ, నమ్మకం ఎక్కడనుండి వస్తుంది?  ఈ సందేశాన్ని ఎక్కడ వెదకగలం? మన సువిషేశములో విన్నట్లు, ఈ నమ్మకం, ఆశ, యేసును భూస్థాపితం చేసిన సమాధి నుండి వస్తూ ఉంది.  కారణం, ఆ సమాధి అందరిని ఆకర్షించింది. ఈ సమాధి దగ్గరికే మగ్దల మరియమ్మ, పేతురు యోహానులు వెళ్ళింది.  ఈ సమాధే వారిలో ఉత్థాన క్రీస్తు ఆశలు రేపింది.  వారిలో నమ్మకాన్ని పెంచింది. ఆయన ఈనాటికి ఉత్థానమవుతూనే ఉన్నాడు. ప్రభువు ఉత్థానం మనందరి జీవితాలలో నిత్యం జరుగుతూనే ఉంది. ప్రతిసారి మనలో ఉన్న చెడుకు మరణించినప్పుడు క్రీస్తు ఉత్థానమవుతూ ఉన్నాడు. మన స్వార్ధాన్ని వీడి, ఇతరులను ప్రేమించినప్పుడు, దయ, కరుణ, జాలి అను గుణాలు మనలను ముందుకు నడిపించినప్పుడు, క్రీస్తు మనలో ఉత్థానమవుతూ ఉన్నాడు. మనం చేసే ప్రతీ మంచి క్రియ, ఆలోచన ద్వారా యేసు ఈ లోకములో ఇంకా ఉత్థానమవుతూ ఉన్నాడు. కనుక ప్రతీ సంఘటన ద్వారా, ప్రతీ దినం మనకు తన ఉత్థాన మహిమను ప్రదర్శిస్తూ ఉన్నాడు.  ప్రతీ రోజు కూడా ఒక ఉత్థాన రోజుగా జీవించినప్పుడు, ఉత్థాన క్రీస్తు శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత మనలను ముందుకు నడిపిస్తాయి.

చివరిగా, పునరుత్థానం ఒక నూతన జీవితం. ప్రభువుతో ఉన్న అనుభంధములో ఒక నూతనత్వం.  సాటివారితో ఉన్న అనుబంధాలలో ఒక నూతనత్వం. కనుక ఉత్థాన మగుట అనగా క్రీస్తు ప్రభువు విధానములో, ఆయన జీవించినట్లు, అటు దేవునితో, ఇటు పొరుగు వారితో జీవించడం. ఉత్తాన ప్రభువుని విశ్వసించడం అనగా, కాలి సమాధి దగ్గర, జీవిత కష్టాలలో జీవించడం కాదు.  ఆ ఉత్థాన క్రీస్తు శాంతి, సమాధానాలను, సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం. ఒక నూతన ప్రపంచానికి నాంది పలుకుదాం.  క్రీస్తు ఉత్థానం అనుదిన జీవితములో భాగం కావాలి.  జననం, మరణం, ఉత్థానం, నిత్యం మన జీవిత విధానం కావాలి.  ప్రతీ రోజు ఒక ఉత్థాన పండుగ రోజు కావాలి.  ప్రతీ రోజు ఒక నూతన జీవితం కావాలి.  ఆమెన్. హల్లెలూయ! హల్లెలూయ!

No comments:

Post a Comment