పవిత్ర శుక్రవారము - 19 ఏప్రిల్‌ 2019

పవిత్ర శుక్రవారము - 19 ఏప్రిల్‌ 2019
యెషయ 52:13-53:12, హెబ్రీ. 4:14-16, 5: 7-9, యోహాను 18:1-19:42

సకల వరములకు  ఊటయగు ఓ దేవా! మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తము ద్వారా పాస్కా పవిత్ర క్రియలను స్థాపించెను. మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్య రక్షణతో పవిత్ర పరచుడు.

ఈ రోజు పవిత్ర శుక్ర వారము. ఈ రోజుని ''గుడ్‌ ఫ్రైడే'' అని అంటున్నాము. యేసు ప్రభువు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు మంచి రోజు, పవిత్రమైన రోజు అంటున్నాము? ఎందుకనగా, క్రీస్తు మరణం మనకు విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆయనను విశ్వసించు వారందరికి జీవమును, అనుగ్రహమును, రక్షణను, విముక్తిని సంపాదించి పెట్టింది. తన మరణము ద్వారా, మనలను పాపదాస్యమునుండి విముక్తి గావించాడు, ''నిష్కళంకమైన గొర్రెపిల్లవంటి అమూల్యమైన క్రీస్తు బలిద్వారా మీరు విముక్తి కావింపబడితిరి'' (1 పేతు. 1:19).

పవిత్ర గురువారమున, క్రీస్తు శిష్యులతో కలసి, 'పైగది' లో ప్రవేశించి, దేవుని గొప్పవరమైన దివ్యసత్ప్రసాద భోజనమును స్వీకరించియున్నాము. క్రీస్తు ప్రభువుని నిజమైన శరీరరక్తములు, ఆత్మ దైవత్వమును మనం పొందియున్నాము. ఈనాడు పవిత్ర శుక్రవారమున, మన శ్రీసభకు తల్లియైన మరియమ్మతో కలసి క్రీస్తు సిలువచెంత నిలుస్తున్నాము. పవిత్ర శుక్రవారమున, గొప్ప నమ్మకముతో, ఆశతో, క్రీస్తు సమాధిపై కప్పబడిన రాయి దొరలు సమయముకొరకై వేచిచూస్తున్నాము. ఆ క్షణమున, క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దేదీప్యమవుతాయి. ఆక్షణమున పరలోకములో పునీతులతో, మన తోటి సహోదరి, సహోదరులతో కలసి, ఎలుగెత్తి స్తుతించెదం, ''లెమ్ము, ప్రకాశింపుము. నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగుచున్నది'' (యెషయ 60:1).

ఈ రోజు క్రీస్తు సిలువ చెంత నిలచియున్నాము. మరియ తల్లివలె, నిర్మల హృదయాలతో సిలువ చెంతకు వచ్చియున్నట్లయితే, దైవప్రేమ పరమ రహస్యాలలోనికి ప్రవేశిస్తాము. సిలువను గాంచుదాం. సిలువలో వ్రేలాడుచున్న క్రీస్తును గాంచుదాం.

ప్రేమగల మన ప్రభువు మనకోసం తన ఇష్ట పూర్తిగా ఈ సిలువ మరణాన్ని పొందాడు. తన సిలువ వేదన, మరణము ద్వారా మనలను రక్షించియున్నాడు. ఆయన మన మరణమునుండి రక్షించాడు.

ఈరోజు మనం పాస్కా పరమ రహస్యాన్ని ప్రత్యేక విధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు సిలువ మరణం ఒక బలి. అది మన పాపాలను పరిహరించే బలి. యావత్‌ ప్రపంచానికి విమోచనాన్ని, విముక్తిని కలిగించినటువంటి బలి. ఈ బలిలో గురువు క్రీస్తే, బలి వస్తువు కూడా క్రీస్తే. కలువరిగిరిపై అర్పించిన బలి, తండ్రి దేవుని చిత్తానుసారముగా జరిగియున్నది. అందుకే, క్రీస్తును మహిమపరచి మహోన్నత స్థితికి హెచ్చించాడు. మనము కూడా తండ్రికి పూర్తిగా విధేయులై బాధామయ సేవకుడగు క్రీస్తు ప్రభువుతో కలసిపోవాలి. మన దు:ఖాలు, కష్టాలు, శోధనలు, వేదనలన్నింటిని క్రీస్తు బలితో ఒకటిగా చేసి తండ్రి దేవునికి సమర్పించాలి. అప్పుడే సిలువ మార్గములో ప్రభుని అనుసరించే వారందరికి విమోచనం కలుగుతుంది.

ఈ రోజు మనం ప్రత్యేక విధముగా ప్రభువు సిలువ మరణాన్ని స్మరిస్తున్నాము. మన కోసం ఆయన ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించాడు. అవమానాలను భరించాడు. సిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందాడు. 

సిలువ మరణం - ఆనాడు, అన్ని శిక్షలలోకెల్ల సిలువ మరణం చాలా క్రూరమైనది, ఘోరమైనది. ఇది బానిసలకు విధించే అతి నీచమైన మరణదండనగా పిలువబడేది. యేసు చాలా అవమానకరమైన, అమానుషమైన, అతి భయంకరమైన, హేయమైన, బానిస మరణాన్ని, నేరస్థుని మరణాన్ని పొందియున్నాడు.

సిలువ - సిలువ క్రీస్తు శ్రమలు, మరణమునకు, ఆయన అర్పించిన బలికి, రక్షణ విజయానికి చిహ్నము. సిలువను చూసినప్పుడెల్ల ఈ పరమ రహస్యమును ధ్యానించాలి. ఈనాడు సిలువను ఆరాధిస్తున్నాము. ప్రతిమలో సిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది. కాని, వాస్తవానికి ఇది అతీతం. ఈనాడు సిలువను ఆరాధించగలగడానికి గల కారణం, అవమానానికి ప్రతీక అయిన సిలువ, క్రీస్తు సిలువపై మరణముతో మహిమకి సాధనముగా, జీవమునకు చిహ్నముగా మారియున్నది.

ఆయన సిలువ మరణాన్ని మనకోసం అంగీకరించాడు, ''తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటె ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు'' (యోహాను 15:13). సిలువ ప్రేమకు గుర్తు. ప్రభువు అందరి కోసం మరణించాడు. సిలువ పరలోక ద్వారము. సిలువ గురుతు ఒక వరం. దీని ద్వారా దేవుని ఆశీస్సులను, అనుగ్రహాలను పొందుచున్నాము.

సిలువ ప్రేమకు చిహ్నం - సిలువ మరణం యేసుకు మనపైగల ప్రేమకు నిదర్శనం. పునీత పౌలు తన లేఖలలో, యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్ల, యేసు/దైవ ప్రేమను గూర్చి చెప్తాడు, ''క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే, దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను'' (ఫిలిప్పీ. 5:2). యేసు మరణము ద్వారా, దేవుని ప్రేమకూడా వ్యక్తమగుచున్నది, ''నీతి మంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశ, సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో! కాని మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మనకొరకై మరణించెను గదా! ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు'' (రోమీ. 5:7-8). ''ఆయన తన స్వంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా?'' (రోమీ. 8:32).

సిలువ ఆరాధన - ఈ రోజు శ్రీసభ కలువరి కొండన క్రీస్తు సిలువ వైపున చూస్తూ ఉన్నది. ప్రతి శ్రీసభ సభ్యుడు, సభ్యురాలు, సిలువ మ్రానుద్వారా క్రీస్తు సంపాదించి పెట్టిన రక్షణ గూర్చి ధ్యానించును. మోకరిల్లి సిలువను ముద్దిడి ఆరాధించడము ద్వారా, సిలువ ద్వారా క్రీస్తు అందించిన రక్షణకుగాను కతజ్ఞులమై ఉంటున్నాము. క్రీస్తును ఆరాధిస్తున్నాము, ''క్రీస్తువా! మిమ్ము ఆరాధించి, మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. ఎందుకన, మీ సిలువచేత, ఈ లోకమును రక్షించితిరే.''

కార్య సాధనలో సిలువ మరణం - యేసు ఎందుకు మరణించ వలసి వచ్చినది? ఏ కారణం మరణానికి దారితీసింది? ఆయన దేవునితో మానవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి వచ్చాడు. లోకమును నీతి న్యాయం, సోదరభావముతో కూడిన జీవితాన్ని స్థాపించడానికి వచ్చాడు. లోకమును రక్షించాలని వచ్చాడు. దేవుని ప్రేమను, కరుణను, శాంతిని బోధించాలని వచ్చాడు. ఈ కార్యసాధనలో ఆయన సిలువమరణాన్ని పొందాల్సి వచ్చినది. 

క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా? - ''నేను పరలోకము నుండి దిగివచ్చినది, నన్ను పంపినవాని చిత్తమును నెరవేర్చుటకేకాని, నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక, అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతీవాడు నిత్యజీవితమును పొందుటయే నన్ను పంపినవాని చిత్తము'' (యోహాను 6:38-40). పతనమైన మానవున్ని ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం. దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ, సౌభాగ్యమే కాని రక్తపాతము కాదు. క్రీస్తు మానవునికి విముక్తిని, పాపక్షమాపణను, నూతన జీవాన్ని, మరణానంతరం శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చియున్నారు.

అయితే, లోతుగా ధ్యానించినట్లయితే, యేసు పొందిన శ్రమలన్ని, దైవ నిర్ణయమని అర్ధమగుచున్నది. ఆయన గ్రుడ్డిగా శ్రమలను పొందలేదు. దానిలో దైవచిత్తం ఉంది. మనలను రక్షించాలనే ప్రేమభావం ఉంది. యేసు సిలువపై, ''సమాప్తమైనది'' (యోహాను 19:30) అని పలికాడు. దీని అర్ధం, తన శ్రమలు, మరణము ద్వారా పాపాన్ని, పూర్తిగా నిర్మూలించాడు. శ్రమలు, సిలువ, ముళ్ళకిరీటం అన్నీ కూడా ఈ లోకములో ఇమడగలవు, లేనిచో వాటిని ప్రభువు అంగీకరించేవాడు కాదు. మరో మాటలో చెప్పాలంటే, పవిత్ర శుక్రవారము లేనిదే ఈస్టర్‌ ఆదివారము లేదు. మనం ఈ లోకమున మరణించినట్లయితేనే, దైవరాజ్యమున జీవించగలం. ముళ్ళకిరీటం ఉన్నచోటనే, దేవుని మహిమ ఉంది. క్రీస్తుతో మరణించినప్పుడే, ఆయనతో ఉత్థానమవుతాం. ఇదే దేవుని చిత్తం.

క్రీస్తు సిలువపై, ''దాహమగుచున్నది'' (యోహాను 19:28) అని పలికాడు. క్రీస్తు దాహము మన రక్షణము. ఆయన దాహము దైవచిత్త పరిపూర్ణము. ఆయన దాహం మనపై సంపూర్ణ ప్రేమ (యోహాను 4:10-14, 6:54-56). ఈనాడు సిలువ చెంత   ఉన్న మనం, సిలువపై ఉన్న క్రీస్తు మన కోసం ఎంత దాహమును కలిగియున్నాడో గుర్తించుదాం. దివ్యపూజాబలిలో తన శరీర రక్తముల ద్వారా, క్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నారు. మనలను మనం ఆయనకు సంపూర్ణముగా అర్పించుకొందాం.

మన కర్తవ్యం? - క్రీస్తు కడరా భోజన స్మరణ ద్వారా ఆయన మరణమును మనము జ్ఞప్తియందు ఉంచుకొనవలయును (1 కొరి. 11:24-25, 1 పేతు. 3:18). యేసు చేసిన పోరాటాన్ని, ఆయన ప్రసాదించే శక్తితో, ఆయన శిష్యులమైన మనం కొనసాగించాలి. సంఘములోని అవినీతి, అన్యాయాన్ని, పేదరికాన్ని, బానిసత్వాన్ని, వ్యాధి బాధలను నిర్మూలించాలి. శాంతిని, ప్రేమను, నీతి న్యాయాలను, సోదరభావాన్ని స్థాపించాలి. ఇది మన కర్తవ్యం, ధర్మం. ఈ కర్తవ్యంకోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు. మనము కూడా అన్నీ ఓర్పుతో సహించుదాం. ఓకే సంఘముగా ప్రేమతో జీవించుదాం. పరస్పర క్షమాపణ కలిగి జీవించుదాం. అదియే శ్రీసభ.

No comments:

Post a Comment

Pages (150)1234 Next