పవిత్ర శుక్రవారము, Year
C, 29 మార్చి 2013
ఈరోజు
క్రైస్తవులమైన మనమందరమూ క్రీస్తు సిలువ మరణాన్ని స్మరించుకొంటున్నాము. దైవ కుమారుడైన
క్రీస్తు ఘోరమైన సిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. పవిత్ర శుక్రవారమున, క్రీస్తు
మన కొరకు శ్రమలు, బాధలు, అవమానములను, శారీరక వేదనలను మరియు మరణాన్ని పొందియున్నాడు.
ఈనాడు, కల్వరి కొండకు సిలువను మోస్తున్న క్రీస్తును మనం అనుసరిస్తున్నాము. వ్యాకుల
మాతతో మనము కూడా క్రీస్తు సిలువ చెంత నిలిచి, క్రీస్తు సిలువ మరణార్పణలకు సాక్ష్యం
ఇచ్చుచున్నాము. మనదరికోసం యేసు సిలువ మరణాన్ని పొందియున్నాడని తెలిసిన మనము ఏవిధముగా
చలించిపోకుండా ఉండగలము? మన బలహీనతలను, ఆశక్తిని ఆయన భరించాడు. మన శ్రమలను ఆయన శ్రమలుగా
భరించాడు.
ఈనాడు
శ్రీసభ దివ్యపూజాబలిని కొనియాడకుండా, క్రీస్తు సిలువను, ఆయన శ్రమలు, మరణాన్ని ధ్యానిస్తూ
ఉంది. యేసు యెరుషలేమునకు పోవుచు మార్గమధ్యమున పన్నిద్దరు శిష్యులతో ఇట్లనెను:
"ఇదిగో! మనము ఇప్పుడు యెరుషలేమునకు వెళ్ళుచున్నాము. అచట మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు,
ధర్మశాస్త్రబోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణ దండన విధించి, అన్యజనులకు అప్పగింతురు.
వారు ఆయనను అవహేళన చేసి, కొరడాలతో కొట్టి, సిలువ వేయుదురు. కాని, ఆయన మూడవ రోజున లేపబడును"
(మత్తయి 20: 17-19). ఈ పఠనములో, యేసు తన మరణ పునరుత్థానమును గూర్చి మూడవసారి ముందుగానే
తెలియ జేస్తున్నాడు.
క్రీస్తు
శ్రమలద్వారా, దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు క్రీస్తు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో
అర్ధమగుచున్నది. అయితే, క్రీస్తు శ్రమలు యాధృచ్చికముగా జరిగినవి కావు. జరగబోవు విషయములన్నియు
కూడా ప్రభువు ముందుగానే ఎరిగియున్నారు. శ్రమల గూర్చి, ప్రభువు ముందుగానే మూడు సార్లు
తెలియజేసియున్న విషయాన్ని సువార్తలలో చూస్తూఉన్నాము. తన శిష్యులు ఆయన వేదనలను తెలుసుకోవాలని
ఆశించాడు. మెస్సయ్యా శ్రమలను, మరణాన్ని పొందవలసి యున్నదని వారు ఏనాడు ఊహించలేదు. లోక
పాపాల పరిహార్ధమై క్రీస్తు గొర్రెపిల్ల అర్పణ అవసరమని వారికి అర్ధము కాలేదు!
శ్రమలలో
క్రీస్తు తండ్రి దేవునికి విధేయుడైయున్నాడు. ముందుగానే సర్వాన్ని, ముఖ్యముగా తన శ్రమలు,
మరణాన్ని ఎరిగిన క్రీస్తు చివరి వరకు తండ్రి చిత్తానికి విధేయుడై యున్నాడు. క్రీస్తు
విధేయతకు, అర్పణకు, ప్రేమకు విరుద్ధముగా, పరిసయ్యుల, సధ్ధుకయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల,
యూదమత పెద్దల మూర్ఖత్వాన్ని, అధికార దుర్వినియోగాన్ని, కుట్రలను, పన్నాగాలను, పిలాతు
అధికార దాహాన్ని, గురు ద్రోహాన్ని చూస్తున్నాము. విశ్వాసము, నమ్మకము, వాస్తవాలను గ్రహించక పోవడం, హృదయాలను, మనస్సులను
మూసివేయడం, స్వార్ధం, అహంకారం, అధికార దాహంతో ఉన్నప్పుడు ఇలాంటివి చోటు చేసుకొంటాయి.
దైవ ప్రేమ, యేసు ప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన వారందరికోసం శ్రమలను అనుభవించి, సిలువ మరణాన్ని
సంతోషముగా పొందాడు. తనను మట్టుబెట్టాలని చూసిన వారిని ఆయన ప్రేమించాడు.
యూదమత
పెద్దలు యేసును చంపలేక పోయారు. ఎందుకనగా, రోమను సామ్రాజ్యం, ఆ అధికారాన్ని యూదులనుండి
తీసివేసింది. దాని మూలముగా యేసును అన్య జనులకు అప్పగించారు (మ 20:19 లో యేసు చెప్పిన
విధముగా). సీజరుకు వ్యతిరేకముగా తనను తాను రాజుగా చెప్పుకున్నాడని యేసుపై అభియోగాన్ని
మోపారు, అసత్య సాక్ష్యమును వెదికారు. పిలాతు యేసునందు ఎలాంటి తప్పును చూడలేదు. కాని,
యూదుల ఒత్తిడికి లొంగి పోయి, తన చేతగాని తనాన్ని, రోమను గవర్నరుగా తన అధికారా దాహాన్ని
చూపించాడు.
యేసు మరణ
దండన తీర్పుకు గురి అయిన తరువాత ఈ క్రింది సంఘటనలు జరిగాయి: ఆయనను పరిహసించారు. రాష్ట్ర
పాలకుని సైనికులు వస్త్రములను ఒలిచి, ఎఱ్ఱని అంగీని ధరింప జేసిరి. ముండ్ల కిరీటమును
అల్లి ఆయన శిరస్సుపై పెట్టిరి. కుడి చేతిలో రెల్లుకాడి నుంచిరి. ఆయన ముందు మోకరిల్లి.
"యూదుల రాజా! నీకు జయము!" అని అవహేళన చేసిరి. ఆయనపై ఉమిసి, ఆయన చేతిలోని
రెల్లుకాడను తీసుకొని తలపై మోదిరి. ఆ తరువాత ఆయన వస్త్రములను ఆయనకు ధరింప జేసి, సిలువ
వేయుటకై తీసుకొని పోయిరి. సిలువ మార్గమున ఆయనను కొట్టారు, అవహేళన చేసారు, అవమాన పరచారు.
కాని, ప్రభువు వాటన్నింటిని మౌనముగా భరించాడు. మనకోసం తండ్రికి తనను తాను గొర్రెపిల్ల
అర్పణగా అర్పించాడు.
తన వారే
తనను తృణీకరించారు. "ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని తన వారే ఆయనను అంగీకరించలేదు
(యో 1:11). "ఇల్లు కట్టువారైన మీరు పనికి రాదని త్రోసివేసిన రాయి ఈయనే"
(అ.కా. 4:11). క్రీస్తు ఒంటరిగా సిలువ మరణాన్ని పొందాడు. శిష్యులు పారి పోయారు. తండ్రి
కూడా మరచి పోయాడని తన ఒంటరి తనములో, " నా దేవా! నా దేవా! నీవు నన్నేల విడనాడితివి?"
అని బిగ్గరగా కేక పెట్టాడు (యో 27:46).
క్రీస్తు
సిలువపై మరణించాడు. అయితే, చేతులలో, కాళ్ళలో దించబడిన చీలల వలన ఆయన మరణించలేదు, తలపై
పెట్టిన ముండ్ల కిరీటము వలన మరణించలేదు, ఊపిరి ఆడక మరణించలేదు, మరియు శారీరక వేదనల
వలన మరణించలేదు. వీటన్నింటి కంటే ఎక్కువగా, ఆత్మ వేదనతో మరణించాడు. మన పాపాల నిమిత్తమై,
తండ్రి చిత్తముగా, లోక రక్షణార్ధమై మరణించాడు. క్రీస్తు శ్రమలలో శక్తి, అధికారము ఉన్నవి.
ధైర్యముగా శ్రమలను భరించాడు. శ్రమలను, వేదనలను క్షుణ్ణముగా తెలిసిన యేసు అవే అంతము
కాదని ఆయనకు తెలుసు. మరల మూడవ రోజున సజీవుడవుతాడని తెలుసు. అందరు విడచినను, తండ్రి
తనతో ఉన్నాడని తెలుసు. ఆయన విధేయత వలన తండ్రి తనకు మహిమను చేకూర్చాడు. ఆయన మరణాన్ని
జయించిన మృత్యుంజయుడు!
మానవ మాతృలమైన
మనము శ్రమలను పొందడం, మరణించడం ఇష్ట పడం. ఒక్కోసారి శ్రమలు, కష్టాలు, బాధలు అని వినగానే
వణికి పోతూ ఉంటాము. అయితే, క్రీస్తును అనుసరించే వారికి, శ్రమలు తప్పవు. ఒకానొక సందర్భములో యేసు తన శ్రమల గూర్చి చెప్పినప్పుడు,
పేతురు వ్యతిరేకించాడు. యేసు పేతురును వారించాడు. సరైన దృక్పధముతో మన శ్రమలను అంగీకరించాలని
ప్రభువు బోధించాడు. దీని అర్ధమేమనగా, క్రీస్తు దృక్పధమునే మనమూ కలిగి యుండాలి. పాపానికి
మరణించాలి. దేవుని చిత్తాన్ని విధేయించాలి. కుమారుని శ్రమలను మౌనముగా భరించి, దైవ చిత్తాన్ని
పాటించిన మరియ మన ఆదర్శం.
పవిత్ర
శుక్రవారమున, క్రీస్తు శ్రమల, మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. కల్వరికి క్రీస్తుతో పాటు
పయనిద్దాం! ఆయన తన జీవితాన్ని మనకోసం అర్పించారు. దేవునికి కృతజ్ఞతలు తెలుగు కొందాం!
No comments:
Post a Comment