పవిత్ర గురువారము, 9 ఏప్రిల్ 2020


పవిత్ర గురువారము
“ప్రభువు భోజనము” లేదా “కడరాత్రి భోజనము” ప్రభువు జీవితములో అత్యంత ముఖ్యమైన మరియు ప్రాముఖ్యమైన ఘట్టము అని చెప్పడములో ఎలాంటి సందేహము లేదు. ఇది ‘వీడ్కోలు భోజనము’, ‘కడరా భోజనము’. పై గదిలో ప్రభువు తన శిష్యులతో కలిసి పంచుకున్న ‘కడరా భోజనము’.

పాత నిబంధనలో పాస్కా పండుగ సందర్భమున, ప్రతీ యిస్రాయేలు కుటుంబము ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించారు. వధింప బడిన గొర్రెపిల్ల రక్తమును కొంత తీసుకొని ఇంటి వాకిళ్ళ కమ్ముల మీద పూయవలయునని నియమమును పొందిరి. బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల రక్తము ప్రతీ యిస్రాయేలు కుటుంబమును మరణము నుండి కాపాడినది (నిర్గమ. 12).

గమనించ వలసిన విషయం ఏమనగా! ప్రభువు ‘కడరా భోజనము’ కూడా యిస్రాయేలు పాస్కా పండుగ దినములలోనే జరిగెను. కనుక, గొర్రెపిల్ల రక్తము క్రీస్తు రక్తముతో భర్తీ చేయునని సూచిస్తున్నది. క్రీస్తు “లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల” (యోహాను. 1:29, 36). అనేకుల రక్షణకై ఆయన రక్తము చిందించ బడెను. అలాగే, ‘కడరావిందు’ ప్రభువును నూతన మోషేగా సూచిస్తున్నది. మోషే ద్వారా దేవుడు ‘మన్నా’ను కురిపిస్తే (నిర్గమ. 16), క్రీస్తు ద్వారా ‘జీవాహారము’ను ఒసగెను (యోహాను. 6). పాత నిబంధన పాస్కా, యిస్రాయేలు ప్రజలకు జ్ఞాపక మహోత్సవమైతే, నూతన నిబంధన పాస్కా, నిత్య నూతన నిబంధన జ్ఞాపక మహోత్సవము, అదియే “దివ్యబలి పూజ”, కృతజ్ఞాతార్చన బలి. పాస్కావలె సంవత్సరములో ఒకసారి గాక, “దివ్యబలి పూజ”ను అనుదినం కొనియాడు చున్నాము. దీనికి కారణం మనం పొందిన అనంతమైన రక్షణకు కృతజ్ఞతా భావము. “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు...ఈ రొట్టెను భుజించునపుడెల్ల, ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు” (1 కొరి. 11:23-26) అని ప్రభువు పలికి యున్నారు. ఈ కృతజ్ఞతా బలిని అర్పించునప్పుడు, రొట్టె, ద్రాక్ష సారాయమును అర్పించిన మెల్కీసెదెకు పూజారి (ఆ.కాం. 14:18) పాత్రను క్రీస్తు పోషిస్తున్నాడు.

పవిత్ర గురువారమున ప్రభువు మనకు నూతన ఆజ్ఞను ఇచ్చి యున్నాడు, “మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు.” ప్రభువే స్వయముగా ఇచ్చిన ఈ నూతన ఆజ్ఞను “శిష్యుల కాళ్ళు కడుగుట” ద్వారా చేసి చూపించాడు. “యేసు భోజన పంక్తి నుండి లేచి, తన పై వస్త్రమును తీసివేసి, నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని, ఒక పళ్ళెములో నీరు పోసి, తన శిష్యుల పాదములు కడిగి, నడుమునకు కట్టుకొనిన తుండు గుడ్డతో తుడచెను” (చదువుము. యోహాను 13:1-15).

అయితే, ప్రభవు కడరాభోజన సమయములో అసాధారణమైన దానిని చేసియున్నాడు, అదియే తన శిష్యుల పాదాలను కడగడం. తనను అప్పగించిన యూదా పాదాలను కడిగాడు, అలాగే తనను ఎరుగనని బొంకిన పేతురు పాదాలు కడిగాడు. తనను బంధించినప్పుడు పారిపోయిన మిగతా శిష్యుల పాదాలను కడిగాడు. దీనిని బట్టి మనకు అర్ధం అయ్యే విషయం ఏమిటంటే, ప్రభువును విశ్వసించువారు, తన వారికి (బంధువులు, స్నేహితులు) మాత్రమే సేవలు చేయక, తమను వ్యతిరేకించే వారిని, తమకు ద్రోహం చేసేవారికి కూడా సేవలు చేయాలి!

పాదాలు కడుగు సాంగ్యం, జ్ఞానస్నానములో పొందే అనుగ్రహాన్ని గుర్తుకు చేస్తుంది. ప్రభువు ఎందుకు పాదాలు కడుగాలో పేతురుకు అర్ధం కాలేదు. అందుకే పేతురు బిగ్గరగా, “నీవు నా పాదములు ఎన్నటికిని కడుగరాదు” అని అన్నాడు. అప్పుడు పభువు, “నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు” అని చెప్పాడు. అందుకు పేతురు, “అట్లయిన ప్రభూ! నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను, నా తలను కూడ కడుగుము” (యోహాను 13:8-9). కనుక, క్రీస్తులో భాగస్తులము కాగోరినచో, తప్పక జ్ఞానస్నాన నీటితో పరుశుద్దులము గావింప బడవలెను.

పవిత్ర గురువారం, పవిత్ర శుక్రవారానికి నాంది పలుకుతుంది. కడరా భోజనము తరువాత ప్రభువు రాత్రంతయు ప్రార్ధనలో గడిపాడు. కీలక సమయములో, ప్రభువు ఆవేదనలో శిష్యులు, వారి బలహీనత వలన, ప్రభువును వెంబడింపలేక (జాగరణ) పోయారు. ప్రభువు శిష్యుల వద్దకు వచ్చి,”ఇదేమి! మీరు నాతో ఒక గంటయైనను మేలుకొని ఉండలేక పోతిరా?” (మత్త. 26:40) అని ప్రశ్నించాడు.

ఈరోజు, దివ్యసత్ప్రసాదమును, గురుత్వమును స్థాపించిన ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుదాం. గురువుల కొరకు ప్రత్యేకముగా ప్రార్ధన చేద్దాం. ఈ రాత్రంతయు ప్రభువుతో మేల్కొని ప్రార్ధన చేద్దాం.
దేవుడు మనలను ఆశీర్వదించును గాక!

పవిత్ర గురువారపు ఇతర ప్రససంగాలు: 
LINK ONE

LINK TWO

LINK THREE


No comments:

Post a Comment