పాస్కా కడరా విందు మహోత్సవము (పవిత్ర గురువారం) 28 March 2013


పాస్కా కడరా విందు మహోత్సవము (పవిత్ర గురువారం) 28 March 2013

ఈ పవిత్ర గురువారం పండుగ రోజున తల్లి తిరుసభ పాస్కా కడరా విందు మహోత్సవమును కొనియాడుతూ వుంది. ఈ కడరా విందు సమయములోనే యేసు కూడా దివ్య సత్ప్రసాదమును, గురుత్వమును స్థాపించియున్నారు. మత్తయి, మార్కు, లూకా సువార్తలు కడరా విందు సమయములోనే యేసుకి మరియు తన శిష్యులకు మధ్య ఏమి జరిగిందో చక్కగా వివరించారు. కాని యోహాను సువార్తీకుడు ఈ విషయాన్ని మరొక విధముగా వివరిస్తూ ఉన్నారు. అదే యేసు శిష్యుల పాదాలు కడగటం. ఒక్క యోహాను సువార్తలో మాత్రమే మనం దీనిని చూడవచ్చు.

ఈ నాటి మొదటి పఠనములో ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు బానిసత్వము నుండి విముక్తి చెంది, దేవుని వాగ్ధత్త  భూమికి సాగిన ప్రయాణములో ఏ విధముగా వారు అన్ని నియమనిభంధనలను తు.చ. తప్పకుండా పాటించాలో తెలియ జేస్తుంది. ప్రతీ సం,,ము ఒక్కో కుటుంబము వారి పొరుగు వారితో కలసి పాస్కా విందును జరుపు కోవాలి. ఈ విందు వారికి వారు ఏవిధముగా ఈజిప్టు బానిసత్వమునుండి, విముక్తి పొందారో గుర్తు చేస్తూ ఉంది. యేసు కూడా తన శిష్యులతో కలసి పస్కా విందును భుజించాలని నిర్ణయించుకొన్నాడు. ఈ పాస్కా పండుగ విందులో ఒక ముఖ్య విషయాన్ని మనం గ్రహించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఈ పండుగను ఒక సంఘముగా అందరూ కలసి చేసుకొంటారు. అయితే, నూతన దేవుని ప్రజలు అందరూ కలసిపోయి స్వేచ్చను తిరిగి పొందటానికి ఈ పండుగను చేసుకొంటారు. ఈ స్వేచ్చ క్రీస్తు ప్రభు మాత్రమే ఇవ్వగలరు. కనుక దేవుడు మనకిచ్చే ఈ స్వేచ్చా జీవితం మన ముందు ఉన్నది. ఈ స్వేచ్చా జీవితాన్ని ప్రతీ రోజు పొందాలంటే, యేసుతో జీవితాంతం నడవగాలగాలి. ఆయన సిలువ బాటలో మనం మన సిలువలను మోసుకొంటూ ముందుకు సాగాలి. ఈ స్వేచ్చా జీవితములో ముందుకు సాగమని యేసు ఎల్లప్పుడూ మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం ఈనాడు జరుపుకొనే యేసు కడరా విందు మరియు ఆ తరువాతి మూడు దినాలలో మనం జరుపుకొనే అర్చన ప్రార్ధనలు, నిజమైన స్వేచ్చలో జీవించడానికి తోడ్పడతాయి. మనం జ్ఞానస్నానం ద్వారా ఈ స్వేచ్చలోనికి పిలువబడినామని ఈ పండుగలు గుర్తు చేస్తున్నాయి. హీబ్రూ ప్రజలు జరుపుకున్న పాస్కా విందు ఏవిధముగా "ఒక సంఘాన్ని" సూచించినదో మనం జరుపుకొనే నూతన పాస్కా పండుగ కూడా మన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నది.

రెండవ పఠనములో పునీత పౌలుడు ఎలాంటి పరిస్థితిలో, ఏ రీతిగా ఈ నూతన పాస్కా విందును జరుపుకోవాలో తెలియచేస్తూ ఉన్నాడు. అసూయతో విడిపోయి ఎవరికీ వారుగా జీవిస్తూ ఉన్న ఒక దైవ సంఘానికి ఆయన ఈ లేఖను వ్రాసాడు. అలాంటి వారు దివ్య బలి పూజ సమర్పించే సమయములో బయటికి పోవాలి అని చెప్పుచున్నాడు. కారణం వారిలో ఐఖ్యత,ఒకే మనసు లేనప్పుడు, స్వార్ధముతొ జీవించినప్పుడు, పూజలో పాలుగొనడములో  అర్ధము లేదు. వారు జీవించే విధానం పూజా బలికి వ్యతిరేకముగా ఉంటూ ఉన్నది. కనుక క్రీస్తు బలిని అర్పించాలంటే, దానిలో పాల్గొనాలంటే, అందరు ప్రేమలో జీవించినప్పుడే దానికి ఒక అర్ధం, పరమార్ధం ఉంటుంది. ప్రేమ లేకుండా పూజా బలిలో పాల్గొంటే అది నిజాయితీ లేనితనం అవుతుంది. యేసు కడరా భోజనాన్ని తన శిష్యులతో పూర్తి స్వేచ్చతో మరియు సర్వమానవాళిపై అమితమైన ప్రేమతో జరుపుకొన్నాడు. కనుక మనం అదే బలిలో పాల్గొన్నప్పుడు, క్రీస్తు కలిగిన ప్రేమను, స్వేచ్చను కలిగియుండాలి అని పౌలుగారు బోధిస్తూ ఉన్నాడు. పూజా బలిలో  పాల్గొన్నప్పుడు, మనం క్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకొంటూ ఉన్నాము, ఆయన ఉత్తానములో పాలుపంచుకొంటూ ఉన్నాము మరియు మరల ఆయన తిరిగి వస్తాడన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. కనుక, ఇది అటు దేవునికి, ఇటు ప్రపంచానికి ఒక కొత్త నిబంధన. కనుక ఆయన గొప్ప ప్రేమని సర్వమానవాళి గుర్తించాలి. ఆయన అమితమైన ప్రేమను, ఉదారతను మనం అనుసరించాలి.

ఈనాటి సువార్తలో యేసు శిష్యుల పాదాలు కడుగుట ద్వారా, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయువానికంటే అధిక ప్రేమ మరొకటి లేదు అని తను పలికిన మాటలను రుజువుచేస్తూ ఉన్నాడు. యేసు తన ప్రేమని మాటల రూపములోనే కాక క్రియల రూపములో నిరూపిస్తూ ఉన్నాడు. ఇదే సందేశాన్ని పౌలుగారు తీసుకొని నిజమైన ప్రేమ ఎలా ఉండాలో కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖలోని 13 వ అధ్యాయములో వివరించాడు.

"మానవ భాషలను, దేవదూతల భాషలను నేను మాటలాడగలిగినను, నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగెడి కంచుతోను, గణగణలాడెడి తాళముతోను సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యములను అర్ధము చేసికోగలిగినను, సమస్త  జ్ఞానము కలిగిన వాడైనను, పర్వతములను కూడా పెకిలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను, ప్రేమ లేనివానినైనచో, నేను వ్యర్దుడనే! నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను, దహనార్ధము  నా శరీరమునే త్యజించినను, ప్రేమలేని వాడనైనచో, అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు. సత్యముననే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును. సమస్తమును విశ్వసించును. సమస్తమును ఆశించును. సమస్తమును సహించును." అని పౌలుగారు చక్కగా వివరించి యున్నారు. ఇలాంటి ప్రేమనే మనం క్రీస్తులో చూస్తూ ఉన్నాము.

యేసు శిష్యుల పాదాలు కడగటం, సేవను సూచిస్తూ ఉన్నది. శిష్యుల పాదాలు కడుగుటలో ఉన్న నిగూఢ అర్ధాన్ని, ఆ సమయములో శిష్యులు అర్ధం చేసుకోలేక పోయారు. అందుకే పేతురు యేసును అడ్డుకొన్నాడు. వారు దానిని అర్ధం చేసుకోవాడానికి ప్రభువు ఉత్తానం వరకు వేచి ఉండవలసి వచ్చింది. శిష్యుల పాదాలు కడగటం ఒక చిహ్నం. యేసు ప్రేమ అంతిమ పరిక్ష పవిత్ర శుక్రవారం సిలువలో మరణించినప్పుడు చూస్తూ ఉన్నాము. ఉత్తానుడైన యేసు ప్రేమను జ్ఞానస్నానం ద్వారా మన పాపాలను కడిగినప్పుడు మనం పొందుతూ ఉన్నాము. దీని ద్వారా ఆయన మనలను తండ్రి దేవుని జీవితములో భాగాస్తులను చేస్తూ ఉన్నాడు. ఆయనకు దగ్గరగా మనలను చేరుస్తూ ఉన్నాడు. కనుక ఈ పవిత్ర గురువారం యొక్క సందేశం: యేసు మనలను తన స్నేహితులుగా చేసుకొంటూ ఉన్నాడు. అందుకే తనను తాను బలిగా అర్పించు కొన్నాడు. తన జీవితాన్ని, మనకు పంచుతున్నాడు. దీనిని తిరిగి మనం మన కుటుంబాలలో పంచుకొని జీవించాలి. మనం పని చేసే చోట, జీవించే చోట, ఈ ప్రేమను పంచాలి.

చివరిగా, జ్ఞానస్నానం ద్వారా, మనం అందరం యేసు గురుత్వములొ పాలుపంచుకొంటున్నాము. కాని, ఈ రోజు గురువులు యేసు గురుత్వములొ ప్రత్యేకముగా పాలుపంచు కొంటున్నారు. కారణం, యేసు కడరా విందులో గురుత్వాన్ని స్థాపించడం. యేసు ఎప్పుడైతే, "దీనిని మీరు నా జ్ఞాపకార్ధముగా జేయుడు" అని పలికాడో అప్పుడు తన శిష్యులకు, మరియు తరతరాలుగా దేవుని పిలుపును అందుకొన్నవారికి యేసు తన గురుత్వములొ పాలుపంచుకొనే విధముగా వారిని ఎన్నుకొన్నాడు. కనుక గురువు పూజా బలిని అర్పిస్తాడు, ఒక సంఘం కాపరిగా ఉంటాడు, ఆధ్యాత్మిక జీవితములో జీవిస్తాడు. కనుక ఈ రోజు మనందరి గురువుల పండుగ. వారికోసం ఈ రోజు ప్రత్యేకముగా ప్రార్ధన చేయాలి. చివరిగా, ఈ పవిత్ర గురువారం మనకు మూడు విషయాలు నేర్పుతూ ఉన్నది. 1. దివ్య సత్ప్రసాదాన్ని ఆరాధించాలి. భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని క్రీస్తు శరీరములో భాగస్తులం కావటం. 2. ప్రేమలో జీవించడం. 3. క్రీస్తు గురుత్వములొ భాగస్తులైన మన గురువులను గౌరవించి వారు చూపించిన ప్రేమ బాటలో, క్రీస్తు బాటలో, విశ్వాస బాటలో ముందుకు సాగటం. కనుక, ఈ వరాలను దయచేయమని ప్రార్ధిస్తూ, రాబోయే మూడు రోజులు కూడా క్రీస్తు సిలువను అనుసరిస్తూ ఆయన ఉత్థానం వైపు ముందుకు సాగుదాం. ఆమెన్.

No comments:

Post a Comment