మ్రాని కొమ్మల ఆదివారం (PALM SUNDAY)

మ్రాని కొమ్మల ఆదివారం (PALM SUNDAY)
“సియోను కుమారీ! నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారీ! నీవు ఆనంద నాదము చేయుము. అదిగో! నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు, జయశీలుడునై విజయము చేయును. కాని వినయాత్ముడై గాడిద పిల్ల ఎక్కి వచ్చును” (జెక 9:9).
శ్రీసభ ఉత్థాన పండుగకు ముందు ఆదివారమును ‘మ్రాని కొమ్మల ఆదివారం’గాను, ‘మట్టల ఆదివారం’గాను కొనియాడు చున్నది. ఈ రోజు ‘యేసు ప్రభువుని యెరూషలేము పురప్రవేశము’ అనే సంఘటనను ధ్యానిస్తాము. యేసు యెరూషలేములో ప్రవేశించినపుడు, అతనికి ముందు వెనుక వచ్చిన జనసమూహము, “దావీదు కుమారా! హోసాన్న! అని విజయ ధ్వానములు చేసారు. నిజానికి ఇంత గొప్ప స్వాగతము, రాజసం, ఆ కల్వరి కొండపై శ్రమలను అనుభవించి, సిలువపై మరణించుటకే! ఎవరైతే హోసాన్న అంటూ విజయ ధ్వానములు పలికారో, వారే “సిలువ వేయుడు, సిలువ వేయుడు” అని కేకలు వేసారు. యేసు యెరూషలేములో గాడిద పిల్లపై ఎక్కిరావటానికి గల కారణాలు ఏమిటంటే, కానా పెండ్లిలో, యేసు మరియతో, “నా సమయం ఇంకనూ రాలేదు” అని పలికాడు. మరి అతడు మహిమ పరుపబడే సమయం ఇప్పుడు వచ్చిందని తెలియజేయుటకు, అలాగే, జెకర్యా ప్రవక్త ప్రవచనం నెరవేర్చుటకు! తాను మృధుస్వభావం కలవాడని, వినయాత్ముడని తెలియజేయుటకు, తానే మెస్సయా అని నిరూపించుటకు ప్రభువు యెరూషలేము పురప్రవేశం చేశారు. యేసు, మెస్సయా అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే! (1 యోహాను 5:1).

ఈనాటి దివ్య పనాల ధ్యానాంశము 
మొదటి పనం (యెషయ 50:4-7): యెషయ ప్రవక్త ప్రవచించిన ప్రభువు సేవకుని గూర్చిన మూడవ గీతము ఈనాటి మొదటి పనం. ప్రభువు సేవకుని నీతిగల, బాధామయ, దోషిగా ఎంచబడిన సేవకునిగా యెషయ చూపించారు. 
నీతిగల సేవకుడు - ప్రభువైన దేవుడు నాకు జ్ఞానము దయచేసెను. అలసి పోయిన వారిని ఒదార్చుటకు, నాకు సంభాషణ శక్తిని దయచేసెను (యెషయ 50:4-5).
బాధామయ సేవకుడు - నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి, నన్ను అవమానించు చుండగా నేనేమి చేయనైతిని (యెషయ 50:6).
దోషిగా ఎంచబడిన సేవకుడు - నేను నిర్దోషినని సమర్ధించి చెప్పువాడు నా ప్రక్కనే యున్నాడు. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును, నేను దోషినని నిరూపింపగల వాడెవడు? (యెషయ 50:8-9).
పాటం: నీతిగల, బాధామయ, దోషిగా ఎంచబడిన సేవకునివలె మనముకూడా, ప్రభువే మనకు అన్నీ దయచేశాడు. మన గొప్పతనం వలన మనకు ఏమీ కలుగలేదని, నీతికోసం, నిజాయితీకోసం, శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నించే తరుణములో వచ్చే బాధలను తట్టుకొని, దోషిగా భావింపబడినను మనకు తోడు అని ప్రభువులో ముందుకు సాగాలి.
రెండవ పనం (ఫిలిప్పీ. 2:6-11): పునీత పౌలు క్రీస్తు (ప్రభువు సేవకుడు) యొక్క వినయమును, గొప్పతనమును తెలియజేయు చున్నారు. అతడు దైవస్వభావం కలవాడైనను, దేవునితో సమానత్వం పరిగణించలేదు. తననుతాను రిక్తునిగా చేసుకొని సేవకరూపం దాల్చాడు. అతను వినయము గలవాడై, మరణము వరకు విధేయుడాయెను. అందుకే, అతడు అత్యన్నత స్థానమునకు లేవనెత్త బడెను. అన్ని నామముల కంటెను ఘనమగు నామము ఆయనకు ప్రసాదించ బడెను.
పాటం: ఆ దీన సేవకునివలె మనముకూడా వినయముతో, విధేయతతో దేవుని ప్రణాళికకు తోడ్పడుతూ నడుచుకుంటే ఆ సేవకుడు పొందిన మహిమలో మనము కూడా పాలుపంచుకుంటాము.
సువిశేష పనం (మత్త. 26: 14-27:66 లేదా మత్త. 21:1-11)
క్రీస్తు పాటులను స్మరించమని శ్రీసభ ఈరోజు మనలను ఆహ్వానిస్తున్నది.
క్రీస్తుని పాటులు
గెత్సేమనిలో ఆవేదన: క్రీస్తుని పాటులు, శ్రమలు, బాధలు, గెత్సేమని తోటలో రక్తాన్ని చెమర్చటముతో మొదలయ్యాయి. ప్రభువు చింతాక్రాంతుడై శిష్యులతో కలిసి ప్రార్ధన చేయుటకు గెత్సేమనిలో ప్రవేశించాడు. శిష్యులనుంచి కొంత దూరం వెళ్లి, “ఓ తండ్రీ! సాధ్యమయిన యెడల ఈ పాత్రను నా నుండి తొలగి పోనిండు. అయినను నా యిష్టము కాదు. నీ చిత్తమే నెరవేరనిమ్ము” అని మూడుసార్లు ప్రార్ధన చేసాడు. శోధనకు గురికాకుండా ప్రార్ధన చేయుడని శిష్యులతో పలికాడు. “తన ఇహలోక జీవితమున, మృత్యువునుండి, తనను రక్షింప శక్తికలిగిన దేవునిగూర్చి, యేసు ఏడ్పులతోను, కన్నీటితోను, పెద్దగా ఎలుగెత్తి ప్రార్ధించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుటచే దేవుడు ఆయన ప్రార్ధన ఆలకించెను” (హెబ్రీ 5:7,8).
అన్నా, కైఫాల ఎదుట: యేసుని అవమానించుచూ, అతని ముఖముపై ఉమిసి, పిడికిళ్ళతో గుద్దారు. కొందరు ఆయన చెంపపై కొట్టి తనను ఎవరు కొట్టినదో చెప్పమని హేళన చేశారు. అప్పుడు తేజోవంతమైన ఆయన ముఖము వికృత రూపం దాల్చింది. “జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృతరూపము తాల్చియున్నందున నరునివలె కంపింపడయ్యెను” (యెషయ 52:14). యేసుని ముఖము వికృతరూపం దాల్చటానికి గల కారణం, మనలనుండి పాపమనే ముసుగును తీసివేయుటకు. “మనమందరము ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమనే ప్రతిబింబించు చున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువునుండి ప్రసరించు అధికమగు మహిమతో మనము ఆయనను పోలి ఉండునట్లు మార్చి వేయును” (2 కొరి. 3:18).
పిలాతుని ఎదుట: పిలాతుని గృహమువద్ద యేసు వస్త్రములను ఒలచి, ఎర్రని అంగీని ధరింప చేశారు. ముండ్ల కిరీటము అల్లి ఆయన శిరముపై పెట్టారు. ఈ ముండ్ల బాధను ప్రభువు అనుభవించి మనం మన పాపలద్వారా పెంచుకున్న తలభారాన్ని తగ్గించుటకు, మన బాధలు, కష్టాలు, తొలగించుటకును, మనం పాపాలను కడిగి, మనలను శుద్ధి చేయుటకే.
రాతి స్తంభము వద్ద: యేసును రాతి స్తంభమునకు కట్టి కొరడాలతో కొట్టారు. ఈ బాధను ప్రభువు అనుభవించడానికి గల కారణాలు రెండు. మొదటిది, శరీర వ్యతిరేక పాపాన్ని కడిగి వేయుటకును, మనకు శరీరశుద్ధి దయచేయుటకును. “అతడు మన తప్పిదముల కొరకు నీతి కొరకు జీవించునట్లుగ, ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువను మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందిరి” (1 పేతు. 2:24).
మేకులు అతని శరీరములో దించినప్పుడు: సైనికులు ఆయన చేతులలో, కాళ్ళలో మేకులు దించారు. మన చేతుల్ని పాపంనుండి దూరంచేసి, మనం చేతులద్వారా చేసే ప్రతీ పని పావనమగుటకు, అతనిని ఎల్లవేళలా సేవించుటకును, మన పాదాలను పాప మార్గములో నడవనీయకుండా, మనం వెళ్ళే మార్గమందు జారిపోకుండా ఆయన ఈ బాధను అనుభవించాడు.
గుండెలో బాకుతో పొడిచినపుడు: యేసు మరణించి ఉండుట చూసి, ఆయన కాళ్ళను విరగ కొట్టకుండా, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించాయి. “ఆయన ఎముకలలో ఒకటైనను విరగ గొట్ట బడదు” అను లేఖనము నెరవేరినది. మన హృదయాలను మాలిన్యమునుంచి శుభ్రపరచుటకు ఆయన ఈ బాధను అనుభవించాడు. “మానవుని మాలిన్యపరచునది వాని అంతరంగమునుండి వెలువడినదే. ఏలన, హృదయమునుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారం, దురాశ, దౌష్ట్యము, మోసం, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము వెలువడును” (మార్కు. 7:21-22).
పాటం: యేసు క్రీస్తు ఇన్ని బాధలు అనుభవించినది ఎందుకు? మన మీద తనకున్న ప్రేమను చూపించుటకు కాదా? పాపాన్ని నాశనం చేసి జీవం మనకు ప్రసాదించుటకు కాదా? పాపములో ఉండే తాత్కాలిక తత్వాన్ని చూపించి మనలను పాపము నుంచి విముక్తులను చేయటానికి కాదా? ఇలా మనలను రక్షించడానికి ఆయన బాధలు అనుభవించలేదా? దేవునితో సమానత్వం వదిలి, మానవమాత్రునిగా సేవక రూపందాల్చి, ఒక మానవునిచే దూషింపబడి, మానవ న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడి ఎందుకు, ఇంత కష్టాన్ని ఒర్చుకున్నాడు? మానవులచే అంగీకరింప బడకపోయినా మనలను దేవుని బిడ్డలుగా చేయుటకు కాదా? క్రీస్తు మనలను సిలువ శ్రమల, మరణముద్వారా, రక్తం చిందించి మనలను కొనుక్కున్నాడు. నిత్యజీవానికి పాత్రులను చేయుటకు! మరి అటువంటి త్యాగాన్ని మనం పాపం కట్టుకొని వృధా చేయటం లేదా? మనలను ఎంతో ప్రేమించి, తననుతాను రిక్తుని చేసుకొని, ఇన్ని బాధలు అనుభవించినందుకు మనలనుండి ప్రభువు ఏమి ఆశిస్తున్నాడు? అతనికి అనుగుణముగా ఉండే నడవడిక కాదా? మరి అతని కోరిక ప్రకారం జీవిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం. పశ్చాత్తాప హృదయముతో ప్రభువును చేరుకుందాం. ఉత్థాన ఫలాలను మెండుగా పొందుదాం. ఆమెన్.

2 comments: