26వ సామాన్య ఆదివారము, YEAR C - ధనవంతుడు-లాజరు

26వ సామాన్య ఆదివారము, YEAR C
పఠనాలు: ఆమోసు 6:1,4-7; 1 తిమోతి 6:11-16; లూకా 16:19-31


ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు మనం 26వ సామాన్య ఆదివారాన్ని కొనియాడు చున్నాం. ముందుగా, నేటి పఠనాల సందేశ వాక్యాలను ఆలకించుదాం:

ఆమోసు 6:4 - “దంతముపొదిగిన మంచాలపైపరుండి పాన్పులపై తమను దాచుకొనుచు మందలో మేలిమి గొర్రెపిల్లలను, శాలలల్లోని లేదూడలను వధించి మెక్కు మీకు అనర్ధము తప్పదు.”

1 తిమోతి 6:11-12 - “దైవజనుడవగు నీవు వీనికి దూరముగ ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము, అనువాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాససంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్యజీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఒనర్చినపుడు, దేవుడు నిన్ను ఈ జీవనమునకే పిలిచెను.”

లూకా 16:19-26 - “ధనవంతుడొకడు పట్టువస్త్రములు ధరించి నిత్యము విందులతో, వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీదనుండి జారిపడు మెతుకులకొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా, దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళమునుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని వున్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచూ ‘తండ్రీ అబ్రహామా! నన్ను కనికరింపుము. నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలోముంచి, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము’ అనెను.‌ అందుకు అబ్రహాము, ‘కుమారా! మరువకుము. నీ జీవితములో నీవు సకలసంపదలను అనుభవించుచుండ, లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇపుడు కష్టపడుచుండ, అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మనమధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు. ఇచటివారు అచటకు పోలేరు’ అని పలికెను.”

ప్రియ సహోదరీ సహోదరులారా, మనందరం ఈ లోకములో నిరీక్షణ ప్రయాణికులం. మన అంతిమ గమ్యం పరలోక రాజ్యం. ఈ భూమిపై మన జీవిత ప్రయాణం ముగిసి, తండ్రి రాజ్యంలోకి ప్రవేశించాలంటే, మన నడవడిక, మన జీవితం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి. యేసుక్రీస్తు ఆజ్ఞలు, విలువలు, బోధనల ప్రకారం మనం జీవించాలి. మారుమనస్సు, పశ్చాత్తాపం మన జీవితాలకు చాలా అవసరం. దివ్యసంస్కారాల ద్వారా దైవానుగ్రహాన్ని, పవిత్రాత్మ వరాలను పొందుతూ, మన జీవితాలను ముందుకు నడిపించుకుందాం. ఎందుకంటే, ‘ఈ లోక జీవితం, గడ్డి పువ్వువంటి వైభవం, కాని, పరలోక జీవితం, శాశ్వతమైన నిత్యజీవము’.

ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి పఠనాలు, మనం సమాజములో, మన అనుదిన జీవితంలో ఎలా జీవించాలో స్పష్టంగా బోధిస్తున్నాయి. పేదవారిపట్ల, అవసరంలో ఉన్నవారిపట్ల మనం కలిగి ఉండవలసిన సామాజిక బాధ్యతను అవి నొక్కిచెబుతున్నాయి. పేదవారితో మన సంపదను పంచుకోవాలి, ఆకలిగొన్నవారికి ఆహారం, దప్పికగొన్నవారికి నీరు ఇవ్వాలి. పరదేశులను ఆదరించాలి, వస్త్రహీనులకు వస్త్రాలను ఇవ్వాలి. రోగులను, చెరసాలలో ఉన్నవారిని పరామర్శించాలి. ఎందుకంటే, ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికిని ఇవి చేసినా అవి ప్రభువుకు చేసినట్లవుతుంది (మత్త 25:31-44).

మొదటి పఠనంలో ఆమోసు ప్రవక్త విలాసవంతమైన జీవితం గడుపుతూ, పేదవారిని, బాధలలో ఉన్నవారిని పీడిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు ఘోర శిక్ష తప్పదని ప్రవచిస్తున్నాడు. విలాసాలకు అలవాటు పడి, ఇతరుల కష్టాలను విస్మరిస్తే ఎదురయ్యే అనర్ధాన్ని ఆమోసు ప్రవక్త తెలియజేశాడు. ఇది మత్తయి 25:46వ వచనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది: “అవినీతిపరులు నిత్యశిక్షకు వెడలిపోదురు. నీతిమంతులు నిత్యజీవంలో ప్రవేశింతురు.”

ఆమోసు ప్రవక్త చెప్పిన ప్రవచనం, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు (రాజధాని: సామరియ) మరియు దక్షిణ రాజ్యమైన యూదా (రాజధాని: యెరూషలేము) రెండింటికీ వర్తిస్తుంది. ముఖ్యంగా, ఇశ్రాయేలు రాజ్యం రాజైన యరోబాము పాలనలో ఆర్ధికంగా అత్యంత శ్రేయస్సు, సైనికపరంగా శాంతితో విలసిల్లుతున్న సమయంలో ఈ సందేశాన్ని ఇచ్చాడు. నేటి ప్రవచనాలు, ప్రధానంగా ధనవంతులైన నాయకులను, ఉన్నత వర్గాలను ఉద్దేశించి చెప్పబడ్డాయి. ఎందుకంటే, వారు అతి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, సమాజంలో పెరుగుతున్న పేదరికాన్ని, అన్యాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ‘మేము దేవుని ప్రజలం’ అని అతి విశ్వాసాన్ని పెంచుకున్నారు. చుట్టుపక్కల దేశాలకు వినాశనం వస్తున్నప్పటికీ, తమకు మాత్రం విపత్తు రాదనే అహంకారంతో జీవించారు. తద్వారా రాబోయే దేవుని తీర్పును హాస్యాస్పదంగా భావించారు.

ఈవిధంగా, నేటి మొదటి పఠనం, ధనవంతుల నిర్లక్ష్య వైభోగాన్ని, సామాజిక బాధ్యతారాహిత్యాన్ని వ్యతిరేకిస్తుంది. మరి మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకుందాం! ప్రస్తుత సమాజంలో కూడా ఎంతోమంది సుఖజీవనాన్ని గడుపుతూ ‘మేము సురక్షితంగా ఉన్నాము’ అని భావిస్తున్నారు. విచ్చలవిడిగా జీవించడానికి ఎంతో ధనమును వృధా చేస్తున్నారు. కనుక ప్రియ సహోదరీ, సహోదరులారా! మనము ఎంత తగ్గించుకొని దేవుడు సమకూర్చిన దానిలో, మనము మంచిగా జీవిస్తూ, సాటి వారికి సహాయపడుతూ, సహాయం చేస్తూ, సాటివారి సహాయములో దేవుని చూడగలుగుతూ జీవిస్తే, అట్టి జీవితము ధన్యమవుతుంది. ముందు మన పక్కవారి పరిస్థితి ఎలా ఉందో మనం గమనించుకోవాలి. మనము చేతనైనంత సహాయం వారికి చేయగలగాలి.

నేటి మొదటి పఠనం నుండి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే, సౌకర్యాల మధ్య, మన చుట్టూ ఉన్నవారి కష్టాలను, అన్యాయాన్ని విస్మరించకూడదు. సామాజిక న్యాయంపై దేవుని దృష్టి పెట్టాలి. దేవుని ప్రజలు అయినంత మాత్రాన, మన పాపాల నుండి, సామాజిక అన్యాయాల నుండి రక్షణ ఉంటుందని మనం భావించకూడదు. మన అహంకారం, నిస్సత్తువ కారణంగా, దేవుని తీర్పు అనివార్యమని మనం తెలుసుకోవాలి. కాబట్టి, భౌతిక సంపద, భద్రత పట్ల అతి విశ్వాసం, పొరుగువారి పట్ల ప్రేమ, కరుణ లేకపోవడం దేవుని ఆగ్రహానికి, తీర్పుకు దారితీస్తుందని మనమందరం గ్రహించాలి!

ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి మొదటి పఠన సందేశాన్ని ప్రభువు ధనికుడు-లాజరు ఉపమానం (లూకా 16:19-31) ద్వారా స్పష్టంగా, అర్థవంతంగా తెలియజేస్తున్నారు. ప్రభువు ఈ ఉపమానాన్ని ధనాపేక్ష కలిగి, పేదవారిపట్ల కనికరంలేని పరిసయ్యులకు గుణపాఠం చెప్పడానికి బోధించారు. ధనవంతులే దేవుని ఆశీర్వాదం పొందినవారని, పేదరికం పాపానికి శిక్ష అని ఆ కాలంలో యూదులలో ఉన్న తప్పుడు భావనను సరిదిద్దడానికి కూడా ఈ ఉపమానాన్ని బోధించారు.

ఉపమానంలో మనం విన్నట్లు, ధనికుడు ఈ లోకంలో పట్టువస్త్రాలు ధరించి, విందులతో కాలాన్ని గడిపాడు. కానీ, తన ఇంటి వాకిట ఉన్న పేదవాడైన లాజరును ఎప్పుడూ పట్టించుకోలేదు, చేరదీయలేదు, పరామర్శించలేదు. మరణం తర్వాత, ధనికుడు పాతాళంలోకి త్రోయబడ్డాడు, లాజరును దేవదూతలు అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. ధనికుడు తన సంపద కారణంగా పాతాళానికి పోలేదు. అతను మోషే మరియు ప్రవక్తల బోధనలను, పేదవారిపట్ల చూపవలసిన కనికరాన్ని పూర్తిగా విస్మరించాడు. ఇతరులకు శారీరకంగా హాని చేయకపోయినా, తన చుట్టూ కష్టంలో ఉన్నవారిని ఆదరించకపోవడం అతడు చేసిన ఘోరమైన తప్పు. దీనిని మనం ‘Sin of Omission’ అని అంటాం. అంటే, దేవుడు చేయమని ఆజ్ఞాపించిన లేదా నైతికంగా చేయవలసిన బాధ్యత ఉన్న మంచి పనిని చేయకపోవడం ద్వారా ఈ పాపం జరుగుతుంది. ఇది ఒక కార్యాన్ని చేయడంలో విఫలమవడం లేదా నిర్లక్ష్యం చేయడం. కొన్ని ఉదాహరణలు: పేదవారికి సహాయం చేయకపోవడం, దేవుని ఆరాధనను నిర్లక్ష్యం చేయడం, క్షమించాల్సిన వారిని క్షమించకపోవడం...లాంటివి. ఇలాంటి పాపము గురించి యాకోబు 4:17లో స్పష్టంగా చెప్పబడింది, “మేలైనది చేయ నెరిగియు అట్లు చేయని వాడు పాపము చేసిన వాడు అగును”. కనుక, మంచి పనులు చేయాలో తెలిసి కూడా చేయకపోతే, అది పాపమవుతుంది. మంచి పనులు చేయకుండా విఫలమవడం కూడా పాపమే. ఒక వ్యక్తి సరైన అవకాశాన్ని, బాధ్యతను లేదా ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తే, అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. ధనవంతుడు ఇలాంటి పాపాన్నే మూటగట్టు కున్నాడు. అందుకే దాటుటకు వీలులేని అగాధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రియ సహోదరీ సహోదరులారా, మనం ఈ భూలోకంలో ఉండగానే మారుమనస్సు పొంది, క్రీస్తు బోధనలను పాటించాలి. దేవుడు మనకు వరాలు, అనుగ్రహాలు పుష్కలంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ధనం, ఆరోగ్యం, సమయం, తెలివితేటలు - ఇలా ఒక్కొక్కరికి ఒకో విధముగా ప్రత్యేకమైన వరాలను ఇచ్చారు. ఈ దృష్టిలో, మనమందరమూ ధనికులమే! ఈ అనుగ్రహాలన్నింటిని స్వార్థంతో కేవలం మన కొరకే కాకుండా, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారి కొరకు ఉపయోగించాలి.

సమాజంలో, సంఘంలో స్వార్ధముతో జీవింపక, ఒకరికొరకు ఒకరం జీవించాలని, అలాగే, ఇతరుల పట్ల మనం బాధ్యతకలిగి జీవించాలని, మనకున్నవాటిని ఇతరులతో పంచుకోవాలని ఈ ఉపమానం మనకు బోధిస్తుంది. మత్తయి 25వ అధ్యాయంలో చూస్తున్నట్లుగా, మన తుది తీర్పు ఈ పంచుకోవడముపైనే ఆధారపడి ఉంటుంది. ఇతరులపట్ల దయ, కనికరం చూపాలి. జగమంతా ఒకే కుటుంబమన్న భావనతో ఐక్యంగా జీవించాలి.

ప్రభువు చెప్పిన ధనికుడు-లాజరు ఉపమానం కేవలం పేదలకు సహాయం చేయకపోవడం గురించి మాత్రమే కాదు; అది ధనం వలన కలిగే ప్రమాదాన్ని కూడా తెలియజేస్తుంది. ధనవంతుడు పేరు లేకుండా ఉన్నాడు (కేవలం ‘ధనికుడు’ అని మాత్రమే చెప్పబడింది). బైబిల్లో పేరు లేని వ్యక్తి తరచుగా గుర్తింపు లేని, ప్రాముఖ్యత లేని వ్యక్తిగా పరిగణించబడతాడు. ధనవంతుడికి పేరు లేకపోవడం గురించి పునీత అగస్టీనుగారు ఇలా అన్నారు, “పరలోకంలో అతని పేరు వ్రాయబడలేదు కాబట్టే, పరలోకంలో నివసించే దేవుడు ఆ ధనవంతుడి పేరును మౌనంగా ఉంచాడు. పేదవాడి పేరును మాత్రం చెప్పాడు, ఎందుకంటే ఆ పేరు పరలోకంలో వ్రాయబడి ఉంది.” కనుక, ఈ లోకంలో మనకు ఎంత పేరు, ప్రఖ్యాతి ఉన్నా, దేవుని రాజ్యంలో మన పేరు వ్రాయబడి ఉందా లేదా అనేదే ముఖ్యం. లోకసంబంధమైన గుర్తింపు నిత్యజీవానికి లెక్కలోనికి రాదు.

లోకసంపదలు మన కళ్ళు కప్పి, మన చుట్టూ ఉన్నవారిని, ముఖ్యంగా కష్టాలలో ఉన్నవారిని చూడకుండా అడ్డుకుంటాయి. ధనం దేవునికి బదులుగా మనకు భద్రతాభావం ఇస్తుంది. ఇది మనల్ని విలాసాలకు, స్వార్థానికి బానిసలను చేసి, మన ఆత్మీయ దృష్టిని దెబ్బతీస్తుంది. ధనవంతుడు లాజరును చూడగలిగాడు, కానీ పరిగణలోకి తీసుకోలేదు. మనం సంపద మనకు ఉపయోగపడేదిగా ఉంచుకుంటున్నామా, లేక సంపదకే మనం దాసులం అయ్యామా? అని ఆత్మపరిశీలన చేసుకుందాం!

ధనికుడు మరణం తరువాత మాత్రమే పశ్చాత్తాపపడ్డాడు, బాధ పడ్డాడు. ఎందుకంటే, అతడు పేదవాడికి దయ చూపక, తన సౌకర్యాలలో మునిగిపోయాడు. అయితే, అప్పుడు ఎంత వేడుకున్నా, ఫలితం లేకపోయింది. అబ్రహాము ‘దాటడానికి వీలులేని అగాధం’ గురించి చెప్పాడు. ఇది మరణానంతరం పశ్చాత్తాపానికి, మార్పుకు అవకాశం లేదనే సత్యాన్ని తెలియజేస్తుంది. కనుక, మారుమనస్సు కేవలం ఈ లోకంలో, ఈ జీవితంలో మాత్రమే సాధ్యమవుతుంది. “ఇదిగో, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము” అని 2 కొరి 6:2లో చదువుచున్నాం. రేపటి గురించి కాదు, మనం ఈ రోజు క్రీస్తు మార్గంలో నడవాలి, ఈ రోజు మన సంపదను పంచుకోవాలి, ఈ రోజు పేదవారిని ఆదుకోవాలి. మరణం తర్వాత వచ్చే నిత్యజీవానికి మనం ‘ఈ రోజు’ తీసుకునే నిర్ణయాలే ఆధారం. ‘తరువాత చూద్దాం’ అనే అలసత్వం ఆత్మీయ మరణానికి దారితీస్తుంది.

ధనికుడు పాతాళంలో బాధపడుతూ, తన సోదరులను హెచ్చరించడానికి లాజరును పంపమని అబ్రహామును వేడుకున్నాడు. దానికి అబ్రహాము స్పష్టంగా ఇలా బదులిచ్చాడు: “వారికి మోషేయు, ప్రవక్తల బోధనలు ఉన్నాయి; వారు వాటిని వినవలెను.” చనిపోయినవారిలో నుండి ఒకరు లేచినా కూడా వారు నమ్మరని ఆయన నొక్కి చెప్పాడు. ఈ భాగం యొక్క అంతరార్థం చాలా లోతైనది. అద్భుతాలు, సంకేతాలు, లేదా మరణం తర్వాత వచ్చే దర్శనాలు కాదు, మన నిత్యజీవితానికి నిజమైన ఆధారం మన చేతిలో ఉన్న దేవుని వాక్యం మాత్రమే. మనకు ఇప్పటికే పాత నిబంధన (మోషే ధర్మశాస్త్రం), కొత్త నిబంధన (క్రీస్తు సువిశేషం) రూపంలో సంపూర్ణమైన సత్యం లభించింది. ఈ వాక్యం పేదవారికి దయ చూపడం, కనికరం కలిగి ఉండడం వంటి దేవుని చిత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. క్రీస్తు బోధనలు, మోషే ధర్మశాస్త్రం రెండూ ఒకే నీతి మార్గాన్ని బోధిస్తున్నాయి. ఆ మార్గం కనికరం, ప్రేమ, మరియు పంచుకోవడమే. మనం నిత్యం అద్భుతాల కోసం ఆరాటపడకుండా, దేవుడు మనకిచ్చిన లిఖితపూర్వక వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నాం? ఆ వాక్యం ద్వారా మనల్ని మనం నిజాయితీగా మార్చుకుంటున్నామా? అని ఆత్మపరిశీలన చేసుకుందాం! దేవుని వాక్యంపై ఉన్న నమ్మకం, దానిని నిత్యజీవితంలో పాటించడం మాత్రమే మన రక్షణకు, మోక్షానికి బలమైన పునాది. కేవలం వినడం కాదు, ఆచరించడం ద్వారానే మనం నిత్యజీవానికి వారసులమవుదాం.

ప్రియ సహోదరీ, సహోదరులారా! ధనికుడు-లాజరు ఉపమానం కేవలం అప్పటి కాలానికే పరిమితం కాదు. ఈ రోజు కూడా మన చుట్టూ ఎంతోమంది లాజరులు ఉన్నారు. ధనికుడంటే కోట్ల ఆస్తులున్న వ్యక్తి మాత్రమే కాదు. సమయం, ఆరోగ్యం, మంచి విద్య, స్థిరమైన ఉద్యోగం వంటి వరాలు పొందిన మనమందరమూ దేవుని దృష్టిలో ధనికులమే. కనుక పేదవారికి సహాయం చేయాలి. మన వద్ద ఉన్న సమయాన్ని పేదవారి సేవ కోసం పంచుకోకపోవడం, ధనాన్ని స్వార్థంతో ఖర్చుచేయడం, తెలివిని ఇతరులకు సహాయం చేయకుండా మనకోసమే వాడుకోవడం ఇవన్నీ ఆధునిక ధనికులు చేస్తున్న తప్పే. మరి మనమందరం ఆత్మపరిశీలన చేసుకుందాం! పునీత క్రిసోస్టమ్ గారు, “మన సంపదను పేదలతో పంచుకోకపోవడం అనేది పేదల నుండి దొంగిలించడమే మరియు వారి జీవనోపాధిని దోచుకోవడమే. మనం మన సంపదను కాదు, వారి సంపదను కలిగి ఉన్నాం” అని అన్నారు.

ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ఎఫేసు సంఘానికి అధిపతియైన (ఈనాటి పీఠాధిపతి) తిమోతిని హెచ్చరిస్తూ, సలహాలను ఇస్తున్నాడు. “ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి” (1 తిమో 6:10) కనుక, ధనకాంక్షలకు దూరముగా ఉండమని పౌలుగారు తెలియజేస్తున్నారు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యముతో జీవింప ప్రయత్నం చేయాలి (6:11). మనం ఈ లోకంలోనికి వచ్చునపుడు ఏమియు వెంట తీసుకొని రాలేదు, మనం ఈ లోకంనుండి నిష్క్రమించునపుడు ఏమియును వెంట తీసుకొని పోజాలము (6:7). కనుక, ఇహమందు ధనవంతులైనవారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములగు సంపదలయందు నమ్మకముంచక, మనము సంతోషంగా అనుభవించుటకు ధారాళముగా కావలసిన దంతయు దయచేయు దేవునియందే నమ్మకము ఉంచాలి (6:17). ఇదియే నిజమైన జీవాన్ని సంపాదించు కోవడానికి, రాబోవు కాలానికి దృఢమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడం.

దేవుడు మనకు ఇచ్చిన సంపదను, వరాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయాసపడుదాం. పేదవారిని ఆదుకోవడానికి, వ్యాధిగ్రస్తులను పరామర్శించడానికి, కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాన్ని ఇహలోక సంపదపై కాక, దేవుని పట్ల నమ్మకంపై నిర్మించుకుందాం. సాటివారికి సహాయ పడడం దైవస్వభావం. ఈ స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి. ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడం, దాహముతో ఉన్నవారికి మంచినీరు ఇవ్వగలగడం, కష్టాలలో ఉన్న వారికి మన చేతనయినంత సహాయం చేసి మనోధైర్యాన్ని ఇవ్వగలగడం మానవత్వం, దైవస్వభావం. యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడిచి, ఆయన బోధనలను పాటిద్దాం. మోక్షవాసులమవుదాం!

ప్రియ సహోదరీ, సహోదరులారా, ఈ లోకమునకు మనము ఏమీ తీసుకురాలేదు. సమస్తమును మనకు దేవుడు దయచేసియున్నారు. దేవుడు నీకు, నాకు, మనకు, ఇచ్చిన సమస్తమును, దేవుని చిత్తానికి, దేవుడు మననుండి ఇష్టపడే కార్యాలకు, సంతోషముగా ఖర్చుచేద్దాం. (దేవుడు మనకు దయచేసిన తెలివి కానీ, జ్ఞానము కానీ, సంపద కానీ, ధనమును కానీ, ఆస్తులను కానీ, మంచితనమును కానీ, ఏదైనా కానీ...) దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుడు మెచ్చే కార్యాలను చేద్దాం. అప్పుడు దేవునికి ఇష్టమైన జీవితాలను మనం జీవిస్తున్నట్లే. పరలోక రాజ్యములో మన పేర్లను చేర్చుకునే ధన్యతను పొందుకుంటాం.

మనలో చాలామందిమీ, ఈ లోకాన్ని, ఈ లోక మనుషులను, నమ్ముకొని జీవిస్తున్నాం. వారు నన్ను కాపాడతారులే, వారు నా అక్కరలలో ఆసరాగా ఉంటారులే అని, మనుషులను నమ్ముతున్నాం. దేవుని వాక్కు చెప్తుంది కదా! దేవుని వాక్కుపై ఆధారపడు. దేవుని యందు విశ్వాసముతో జీవించు. నీవు మరణించి మట్టిలో కలిసిపోగానే నీ మంచి జీవితమును బట్టి దేవుని సన్నిధికి, నీ ఆత్మ చేరుకుంటుంది.

ఆత్మపరిశీలన చేసుకుందాం: మనలో ఎంతమందిమి దేవుని వాక్కును విశ్వసిస్తున్నాం? మనలో ఎంతమందిమి నీతి కలిగిన జీవితాలను జీవిస్తున్నాం? మనలో ఎంతమందిమి దేవుని యందు భక్తి/ విశ్వాసములను అలవర్చుకొని ప్రవర్తిస్తున్నాం? మనలో ఎంతమందిమి సాటివారి యెడల ప్రేమను/ సహనమును కలిగి నడుచుకుంటున్నాం?

25వ సామాన్య ఆదివారము, YEAR C - న్యాయంగా జీవించడం

25వ సామాన్య ఆదివారము, YEAR C
ఆమో. 8:4-7; 1తిమో. 2:1-8; లూకా 16:1-13
న్యాయంగా జీవించడం


ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు మనం 25వ సామాన్య ఆదివారమును కొనియాడుచున్నాం.

మన సమాజం అన్యాయం, అవినీతితో నిండిపోయింది. మనలో కొందరం ఈ అన్యాయాలకు బలవుతూ ఉంటే, మరికొందరం అన్యాయం, అవినీతికి కారణమయ్యే అవకాశం ఉంది! ఈ పరిస్థితుల్లో, మనం నీతి, న్యాయం కలిగి జీవించాలని, దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ఈరోజు పఠనాల ద్వారా దేవుడు మనలను కోరుతున్నారు.

మనమందరమూ దేవుని దత్తపుత్రులం. క్రీస్తు విశ్వాసులం, క్రీస్తు అనుచరులం. దేవుని బిడ్డలముగా, ఈ లోకములో దైవరాజ్యాన్ని స్థాపించడమే మన పిలుపు. ఇందుకోసం దేవుడు మనకు ఎన్నోవరాలను, అనుగ్రహాలను ఇచ్చారు. వాటిని వివేకముతో, దైవానుచిత్తముగా ఉపయోగించు కోవాలి.

ఈరోజు పఠనాలు దైవరాజ్యమును స్థాపించుటకు మనమందరమూ నీతి న్యాయాలతో జీవించాలని మనకు బోధిస్తున్నాయి. మత్త 6:33లో “మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు” అని చదువుచున్నాం. మీకా 6:8లో “నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము, నీ దేవునిపట్ల వినయముతో ప్రవర్తింపుము” అని చదువుచున్నాం. కనుక, ఈరోజు పఠనాలు మనం దేవుని సేవకులమని, ఆయన మన నుండి విశ్వసనీయమైన మరియు వివేకవంతమైన జీవితాన్ని ఆశిస్తున్నారని గుర్తుకు చేస్తున్నాయి. దేవుడు మనకిచ్చిన ప్రతిభను, సంపద వంటి ఆశీర్వాదాలను స్వర్గాన్ని చేరుకోవడానికి తెలివిగా ఉపయోగించుకోవాలని ఈ పఠనాలు మనకు సవాలు చేస్తున్నాయి.

‘న్యాయం’ అంటే ఏమిటి? న్యాయం అంటే ఇతరుల హక్కులను గౌరవించడం. ఆ హక్కులు వారికి లభించేలా చూడటం న్యాయాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు: సామాజిక సేవ మరియు సామాజిక న్యాయం. సేవ అప్పటికప్పుడు ఇతరుల కష్టాలను, బాధలను తీర్చటం లేదా ఒదార్చటం. ఉదాహరణకు, ఆకలితో నున్నవారికి అన్నం పెట్టడం. అదే సామాజిక న్యాయం ఆ కష్టాలకు, బాధలకు కారణాన్ని కనుగొని శాశ్వత పరిష్కారం చేయడం. ‘న్యాయం’ అనగా ఇతరులకు చెందిన దానిని వారికి చెందేలాగున చేయడం.

పునీత అలోషియస్ గోన్జాగ వారు ఇలా అన్నారు, మన పొరుగువారు మనకు సేవ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు, మనం అన్నింటినీ త్యజించి వారికి సహాయం చేయాలి.” ప్రతి మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు కాబట్టి, ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలి. ఈ గౌరవం వారి ఆర్థిక పరిస్థితి, సామాజిక అంతస్తు, మతం, జాతితో సంబంధం లేకుండా ఇవ్వాలి. పేదలు, వలసదారులు, అణగారిన వర్గాల ప్రజల గౌరవాన్ని రక్షించడం మనందరి బాధ్యత. కనుక, ఈనాటి మన సమాజ దుస్తుతికి, అనగా అసమానతలకు కారణం సామాజిక న్యాయం లేకపోవటం వలననే అని స్పష్టంగా చెప్పవచ్చు! నేడు మనం ఎదుర్కుంటున్న సైబర్ మోసాలు, కార్పొరేట్ అన్యాయాలు, నిజాయితీ లేని ప్రకటనలనుండి, ప్రభుత్వాలు, సామాజిక సంఘాలు అలాగే మనమందరమూ సామాజిక న్యాయం కొరకు కృషి చేయాలని ఆశిద్దాం. సమాజంలో ప్రతి ఒక్కరికీ శ్రేయస్సు లభించినప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. సామాజిక శ్రేయస్సు అంటే ప్రతి వ్యక్తి తన సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించడం. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తిగతంగా మనమందరం ఈ లక్ష్యం కోసం కృషి చేయాలి.

న్యాయముగా జీవించడం దేవుని వరం. ఇది కేవలం వరదాయకమైనదేకాక, రక్షణదాయకమైనది కూడా.

ఈనాటి పఠనాలను ధ్యానిద్దాం

మొదటి పఠనం ఆమో. 8:4-7 వరకు ఆలకిస్తున్నాం, “దీనుల తలమీద కాలు మోపుచు, పేదలను నాశనము చేయువారలారా వినుడు!” అనే ఒక హెచ్చరికతో ప్రారంభ మవుతుంది. తెకోవకు చెందిన ఆమోసు ప్రవక్త ఇస్రాయేలు రాజ్యంలో రెండవ యరోబాము (క్రీ.పూ. 782-753) రాజు కాలమున, మరియు యూదా రాజ్యంలో ఉజ్జియా (క్రీ.పూ. 767-740) రాజు కాలములో జీవించి, ప్రవచించిన  ప్రవక్త. ఆమోసు యూదారాజ్యానికి చెందినవాడు. గొర్రెలకాపరిగా జీవితం గడుపుతూ అత్తిపండ్లను అమ్ముకొంటూ జీవనోపాధిని సాగిస్తూ ఉండేవాడు. ఆమోసు యూదా రాజ్యమునకు చెందిన వాడైనప్పటికినీ దేవుడు అతనిని పిలిచి, ప్రవక్తగా ఎన్నుకొని, ఇస్రాయేలు రాజ్య ప్రజలకు ప్రవచనము చెప్పమని పంపుచున్నారు. ఆమోసు అనగా “బరువు మోయువాడు” అని అర్ధము.

ప్రియ సహోదరీ సహోదరులారా, యరోబాము కాలములో ఇస్రాయేలు రాజ్యము బాగా విస్తరించింది. వ్యాపార పరంగా, ఆర్ధిక పరంగా ప్రజలు పుంజుకున్నారు, ఎంతగాని అభివృద్ధి చెందారు. అయితే, ఈ అభివృద్ది మత్తులో పడిపోయి, ప్రజలు జీవన విధానం, మతాచార వ్యవహారాలలో, ఆధ్యాత్మిక విషయాలలో చిత్తశుద్ది లోపించి అంతా బాహ్యమైన తంతుగానే ఉండిపోయింది. అవినీతి, అన్యాయం, మోసం బాగా పెరిగి పోయాయి. ఈ పరిస్థితుల్లో అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకముగా ఆమోసు ప్రవచించాడు. ప్రజల అవినీతిని ఎదురించడం ప్రవక్త కర్తవ్యం. పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగాలనే దేవుని హెచ్చరికలను ఆమోసు ప్రవక్త ప్రజలకు తెలియ జేశాడు. దురాశ పరులు, అవినీతి పరులు నిరుపేదలను వంచించడం వంటి సాంఘిక అన్యాయాలను ఎత్తిచూపి, సాంఘిక న్యాయం కోసం పోరాడిన ప్రవక్త ఆమోసు.

ఈనాటి పఠనములో, ప్రజల వ్యాపారములో అవినీతి, అన్యాయపు కార్యాలను ఆమోసు ఎత్తిచూపుతున్నాడు. తప్పుడు కొలమానములు, తూకములతో, దొంగత్రాసులతో ప్రజలను మోసగిస్తున్నారు. తాలు గోధుమలనుకూడా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. బాకీలు చెల్లింపలేని పేదలను, చెప్పులజోడు వెలకూడా చెల్లింపలేని పేదలను కొంటున్నారు. ఇది అన్యాయం, అవినీతి అని ప్రవక్త వారికి తెలియ జేస్తున్నాడు. సామె. 20:10లో “దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు అసహ్యించుకొనును” అని చదువుచున్నాం. అలాగే, సామె. 14:31లో “పేదవానిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును. దరిద్రుని గౌరవించువాడు దేవుని గౌరవించును” అని చదువుచున్నాం. అలాగే, తన ప్రవచనాల ద్వారా, దేవుడు ఏర్పాటు చేసుకొన్న ఒడంబడికకు ఇస్రాయేలు ప్రజలు విశ్వాసులుగా ఉండాలని ఆమోసు ప్రవక్త కోరుచున్నాడు.

దేవుడు నమ్మకస్తుడు కావున, ఆయన ప్రజలుకూడా నమ్మకముగా ఉండాలి. దేవుడు అందరికి సమానముగా న్యాయ తీర్పును చేయువాడు. ఆయనకు అందరు సమానమే. 11వ కీర్తన 7లో, “ప్రభువు నీతిమంతుడు, నీతికార్యములనే ప్రేమించును” అని చదువుచున్నాం. ద్వితీయోపదేశకాండము 32:4లో “ప్రభువు న్యాయవంతుడు, విశ్వసనీయుడు, న్యాయమును, ధర్మమును పాటించువాడు” అని చదువుచున్నాం. 1 యోహాను 2:1లో “నీతిమంతుడైన యేసు క్రీస్తు మనకు కలడు” అని చదువుచున్నాం. “క్రీస్తు యేసునందు మీరందరునూ ఒక్కరే’ అని గలతీ. 3:28లో చదువుచున్నాం. క్రీస్తుప్రభువు పేదలు, బలహీనులు, అనారోగ్యంతో ఉన్నవారితో ఎక్కువ సమయం గడిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, మనం కూడా పేదల అవసరాలకు, హక్కులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కేవలం దాతృత్వం కాదు, న్యాయం కోసం జీవించడం.

ప్రియ సహోదరీ సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకుందాం! మీరు ఒక వ్యాపారి అయితే, మీ కస్టమర్‌లకు సరైన తూకంతో, సరైన ధరకు వస్తువులను అమ్ముచున్నావా? ఎవరినీ మోసం చేయకుండా ఉంటున్నావా? రోజువారీ లావాదేవీలలో నీవు నిజాయితీగా ఉంటున్నావా? సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవించుచున్నావా? పేద, ధనిక, సామాజిక అంతస్తుతో సంబంధం లేకుండా అందరితో మర్యాదగా ప్రవర్తిస్తున్నావా?

ఇక ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి రెండవ పఠనం,  తిమోతికి వ్రాసిని మొదటి లేఖలో అందరికొరకు ప్రార్ధన చేయాలని పౌలు కోరుతున్నాడు. తిమోతి పౌలుకు ప్రీతిపాత్రుడు. ప్రభువునందు విశ్వసనీయ సహచరుడు. పౌలు లేఖలు రాయడానికి సాయపడ్డాడు. పౌలు తిమోతిని ఫిలిప్పు సంఘానికి తన రాయబారిగా పంపాడు. ఆ పిమ్మట ఎఫేసు, తెస్సలోనిక సంఘాలలో పనిచేసాడు. తిమోతి అనగా “దేవున్ని గౌరవించడం” అని అర్ధం. విశ్వాసాన్ని పటిష్టం చేయడానికి పౌలు ఈ లేఖను రాసాడు. ఇతరుల కొరకు ప్రార్ధన చేయడం క్రైస్తవ బాధ్యత. ఇది దైవచిత్తం. ప్రార్ధన శక్తివంతమైనది. అధికారములోనున్న వారికొరకు ప్రార్ధన చేయాలి. మన ప్రార్ధనలద్వారా అన్యాయం, అవినీతిని, దేవుడంటే అయిష్టత ఉన్న వారి హృదయాన్ని మార్చవచ్చు. ప్రతీ ఒక్కరు సత్యమును తెలుసుకొని, రక్షణ పొందాలని ప్రార్ధన చేయాలి.

ఇక, ప్రియ సహోదరీ సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో, “ముందు చూపుగల గృహ నిర్వాహకుడు” అను ఉపమానమును ప్రభువు చెప్పుచున్నారు. ఈ గృహనిర్వాహకుడు మొదటగా అవినీతిపరుడు. యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని నేరము అతనిపై మోపబడినది. యజమాని అతనికి ఎంతో స్వేచ్చను, స్వతంత్రాన్ని యిచ్చి, గృహ నిర్వాహణ బాధ్యతలు అప్పజెప్పాడు. గృహ నిర్వాహణలో యజమానికి లాభాలు చేకూర్చవలసి ఉంటుంది. కాని, గృహ నిర్వాహకుడు ఇదే అదనుగా తీసుకొని స్వలాభంకోసం ఎక్కువ వడ్డీలను వసూలు చేసాడు. అది తెలుసుకున్న యజమాని ‘లెక్కలు అప్పజెప్పుమని, ఇక గృహ నిర్వాహకుడిగా ఉండ వీలుపడదు’ అని చెప్పియున్నాడు. అయితే, తన పని కోల్పోయిన తరువాత ఋణస్తుల ఆశ్రయం, సహాయం పొందుటకు వారిని పిలిపించి వారి ఋణాలను తక్కువగా చేసియున్నాడు. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా, ముందుచూపుతో ప్రవర్తించినందులకు యజమానుడు మెచ్చుకొన్నాడు.

ప్రియ సహోదరీ సహోదరులారా, ఈ ఉపమానమునుండి మనం ఏమి నేర్చుకోగలము?

1. గృహ నిర్వాహకుని అవినీతిని అన్యాయాన్ని, ఉపమానం చెప్పిన ప్రభువు కాని, ఆ యజమాని కాని, మనం కాని సమర్ధించడం లేదు. అయితే, అతడు చూపిన యుక్తిని లేదా తెలివైన ఆలోచనను మరియు అతని ముందుచూపుతనాన్ని మాత్రమే మెచ్చుకొంటున్నాము. ఋణాలను తగ్గించి రాయడం వలన, అతను యజమానుని మోసం చేయలేదు. తన స్వలాభాన్ని త్యజించాడు. కారణం ఏదైనా, తను చేసిన తప్పును సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసాడు. మనం కూడా, మన అనుదిన జీవితాలలో అవినీతికి, అన్యాయాలకు దూరముగా ఉంటూ, యుక్తిగా ప్రవర్తించుటకు ప్రయాసపడాలి. బైబులులో జ్ఞానం అనేది కేవలం తెలివితేటలు కాదు, అది దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం, దాని ప్రకారం జీవించడం. మనం ఈ లోకంలోని జ్ఞానాన్ని మంచి కోసం, అంటే, దేవుని రాజ్యం కోసం, దేవుని రాజ్య స్థాపనకోసం ఉపయోగించాలి.

2. ప్రభువు అంటున్నారు, “స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోనూ, నమ్మదగిన వాడిగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు, గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును” (లూకా 16:10).చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండడమే ఒక గొప్ప విషయం” అని పునీత జాన్ క్రిసోస్తం గారి మాటలను, అలాగే, “చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయండి” అని పునీత మదర్ తెరెసా గారి మాటలను గుర్తుకు చేసుకుందాం! నమ్మకం చాలా గొప్పది. మన బంధాలలో, మనం చేసే పనిలో, చెప్పే మాటలలో తప్పకుండ నమ్మకం ఉండాలి. క్రైస్తవులముగా, మనం ఈ లోకములో ఎన్నో బాధ్యతలను కలిగియున్నాము. నమ్మకముగా వానిని నేరవేర్చుదాం. ఈలోక సంపదలయందు నమ్మకముగా ఉన్నప్పుడే, పరలోక సంపదలను దేవుడు మనకు అప్పజెప్తారు. లూకా 16:11లో “ఈలోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు  ఇచ్చును? అని చదువుచున్నాం. కనుక, చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయాలి.

3. మనకున్న ఆధ్యాత్మిక వనరులను మనం తెలివిగా సద్వినియోగ పరచుకోవాలి. దివ్యసంస్కారాలు దేవుడు మనకిచ్చిన గొప్ప వరాలు. వాని ద్వారా దైవానుగ్రహాన్ని పొందగలుగు చున్నాము. అలాగే దివ్యగ్రంధము, తిరుసభ బోధనలు గొప్ప వరాలు. గృహ నిర్వాహకునివలె మనంకూడా మనకు ఇవ్వబడిన వరాలనుబట్టి అనగా మన సమయం, సామర్ధ్యం, అవకాశాలు, ఆరోగ్యం, తెలివితేటలు, విద్య మొదలగు వానిని బట్టి దేవునికి మనం లెక్క జెప్పవలసి ఉంటుంది. 2 కొరి 5:10లో “మనము అందరమును న్యాయ విచారణకై, క్రీస్తు ఎదుట అగపడవలెనుగదా! అప్పుడు వారివారి అర్హతలనుబట్టి మంచివిగాని, చెడ్డవిగాని భౌతికశరీరమున వారువారు ఒనర్చిన కృత్యములనుబట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును” అని చదువుచున్నాం.

4. ఈ లోక సంపదలు ఏవీ శాశ్వతం కాదు. ఈలోక సంపదలు మనకు శాశ్వత ఆనందమును ఇవ్వలేవు. శాశ్వత ఆనందము నొసగు పరలోకములో మన సంపదలను కూడబెట్టు కోవాలి. “నీ సంపదలున్న చోటనే నీ హృదయ ముండును” అని మత్త 6:21లో చదువుచున్నాం. ఈ లోక సంపదలు మన అవసరాల కొరకు ఇవ్వబడ్డాయి. అంతేగాని వాటిమీద మనం ఎప్పటికి ప్రేమను పెంచుకోరాదు. అత్యాశతో వాటిని కూడబెట్టుకోవడం మంచిది కాదు. మనం సామాజిక న్యాయంకోసం కృషి చేయాలి. ఎవరికి చెందిన దానిని వారిని చెందనివ్వాలి. సామాజికన్యాయం లోపించుట వలననే, నేడు మన సమాజంలో ఊహించని అసమానతలు, ఘోరాలు, బేదాభిప్రాయాలను చవిచూస్తున్నాం. కనుక, అవినీతి, అన్యాయంతో డబ్బు సంపాదించిన అది శాశ్వతం కాదు అని నేడు మనం గ్రహించాలి. అది ఎలా వస్తుందో అలాగే పోతుంది. అవినీతి, అన్యాయాలు చేసేవారు, ఉపమానంలోని గృహ నిర్వాహకునివలె బాధ్యతలనుండి తప్పించ బడతారు, అనగా వారి జీవనోపాధిని కోల్పోతారు. దేవుని తీర్పుకు, ఖండనకు గురియవుతారు అన్నది వాస్తవం!.

5. దైవరాజ్య స్థాపనకై కృషిచేయాలి. దైవరాజ్యం ఈలోకానికి చెందినది కాదు. పాత ఒప్పందములో, దేవుడు మహారాజుగా, తన శక్తితో, ఈ లోక దుష్టశక్తులతో కూడిన అన్యాయాన్ని అంతం చేసి న్యాయాన్ని, సంతోషాన్ని, శాంతిని నెలకొల్పి యున్నారు. ఇదే దేవుని సృష్టి ఉద్దేశాన్ని పరిపూర్ణం చేయడం. ఇదే తండ్రి దేవుని కార్యాన్ని, పుత్రుడైన యేసు నూతన ఒప్పందములో గావించారు. మార్కు 1:15లో “కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు” అని ప్రభువు ప్రకటించారు. ఇదే దైవ పాలనారంభం! రక్షణకు మార్గం. ఇది దైవరాజ్య స్థాపనకు శుభవార్త, సువార్త! యేసు తన బోధనల ద్వారా, అద్భుతముల ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా, మరణ-పునరుత్తానముల ద్వారా దేవుని ప్రేమ రాజ్యమును స్థాపించారు. ఈ దైవరాజ్యమును పవిత్రాత్మ శక్తి వలన కొనసాగించే బాధ్యత తిరుసభది, అనగా మనందరిది. కాబట్టి యుక్తిగా ప్రవర్తించుదాం.

ఈ విషయంలో, మనం బైబులునుండి ఇద్దరు వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవచ్చు: ఒకరు యోసేపు, అతను ఐగుప్తులో ఒక బానిసగా, తరువాత ఖైదీగా ఉన్నప్పటికీ, తన తెలివితేటలు, జ్ఞానంతో ఫరో రాజుకు ప్రధానమంత్రిగా ఎదిగాడు. భవిష్యత్తులో రాబోయే ఏడు సంవత్సరాల కరవును గురించి కలల ద్వారా గ్రహించిన యోసేపు, ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు. ఆయన ఈ ప్రణాళికను కేవలం తన సొంత లాభం కోసం కాకుండా, మొత్తం ఐగుప్తు ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేశాడు. యోసేపు ఐగుప్తులోని ప్రజలందరి నుంచి సమృద్ధిగా ఉన్న సంవత్సరాలలో ధాన్యాన్ని సేకరించి, దాన్ని గిడ్డంగుల్లో నిల్వ చేశాడు. ఈ చర్య అతని జ్ఞానానికి, ముందుచూపుకు నిదర్శనం. కరవు వచ్చినప్పుడు, ధాన్యాన్ని కేవలం ధనవంతులకు మాత్రమే కాకుండా, పేదలకు, బలహీనులకు కూడా అందించేలా యోసేపు చూశాడు. ఈ నిర్ణయం ద్వారా అతను సమాజంలో అసమానతలు పెరగకుండా, ప్రతి ఒక్కరూ కష్టకాలంలో జీవించగలిగేలా సహాయపడ్డాడు. యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకోగలిగేది ఏమిటంటే, అధికారం అనేది స్వలాభం కోసం కాకుండా, ప్రజల కష్టాలను తీర్చడానికి, సమాజంలో న్యాయాన్ని స్థాపించడానికి ఉపయోగ పడాలి.

ఇంకొకరు మోషే, మోషే జీవితం సామాజిక న్యాయం కోసం చేసిన ఒక మహత్తరమైన పోరాటం. మోషే ఒక రాజకుటుంబంలో పెరిగినప్పటికీ, తన ప్రజలైన ఇస్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా పడుతున్న కష్టాలను చూసి చలించి పోయాడు. వారి దుస్థితిని గమనించిన మోషే, వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుని ఆదేశం మేరకు పోరాటం మొదలు పెట్టాడు. మోషే ఫరో రాజును ఎదుర్కొని, తమ ప్రజలను విడిచి పెట్టమని కోరాడు. ఇది అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలనపై ఒక ధైర్యవంతమైన నిరసనగా చూడవచ్చు. మోషే నాయకత్వంలో, ఇస్రాయేలీయులు బానిసత్వం నుండి విముక్తిని పొందారు. ఈ సంఘటన అణచివేతకు గురైన ప్రజలకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, దానికోసం పోరాడటం ఎంత అవసరమో తెలియజేస్తుంది. మోషే జీవితం మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, సామాజిక న్యాయం కోసం పోరాడాలంటే ధైర్యం, కరుణ, దైవభక్తి ఎంతో అవసరం. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడమని, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం కృషి చేయమని మోషే జీవితం మనలను ప్రేరేపిస్తుంది.

ప్రియ సహోదరీ సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకుందాం! ఒక ఉద్యోగిగా, నీ పనిని నిజాయితీగా, సమయానికి పూర్తి చేయుచున్నావా? నీవు పని చేసే సంస్థకు నష్టం కలిగించకుండా ఉంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన వనరులను, సమయం, తెలివితేటలు, ధనమును, నీవు ఎలా ఉపయోగిస్తున్నావు?

పునీత ఇగ్నేషియస్ లొయోలా గారు మన సంపదను, మన సమయాన్ని, మన తెలివితేటలను దేవుని మహిమ కొరకు మాత్రమే ఉపయోగించాలి” అని అన్నారు. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన పని చేసే హక్కు ఉంది. శ్రమ కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాకుండా, మానవ గౌరవాన్ని పెంచుతుంది. కార్మికులకు సరైన వేతనం, భద్రత కల్పించడం యజమానుల నైతిక బాధ్యత.

యేసుక్రీస్తు కూడా ఈ లోకమున అన్యాయాన్ని, అవినీతిని వ్యతిరేకించారు. సామాజిక న్యాయం కోసం తపించారు. దైవరాజ్యాన్ని స్థాపించారు. “చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం” అని మార్కు 10:14లో ప్రభువు పలికారు. అనగా చిన్న పిల్లలవలె ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలని అర్ధం. దేవుని రాజ్యం పవిత్రాత్మతో నింపబడిన రాజ్యం. ప్రేమ, శాంతి సమాధానాలు కలిగిన రాజ్యం. నీతిన్యాయములు నెలకొనిన రాజ్యం. ఇది ఆధ్యాత్మికమైన రాజ్యం. విమోచన కలిగిన రాజ్యం. ఈ రాజ్యములో అందరూ సమానమే. “మీ రాజ్యం వచ్చును గాక” అని ప్రతీ రోజు మనం ప్రార్ధన చేస్తున్నాం. ఇలాంటి రాజ్యమే మన ఈ భూలోకములో స్థాపించబడాలని ప్రార్ధన చేద్దాం. పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు, దేవుని రాజ్యం మన హృదయంలో, మన చర్యలలో మొదలవుతుంది” అని అన్నారు.

ముగింపు

ప్రియ సహోదరీ సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిన పఠనాలు, మనం జీవించే సమాజంలో నీతి, న్యాయం, మరియు విశ్వసనీయత ఎంత ముఖ్యమో మనకు స్పష్టంగా తెలియజేశాయి. ఈ పఠనాల్లోని సారాంశాన్ని మన జీవితాల్లో అమలు చేద్దాం! మనలో ఉన్న ప్రతిభ, సమయం, సంపద వంటి దైవిక వరాలను కేవలం మన స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, దైవరాజ్య స్థాపన కోసం ఉపయోగించుకుందాం. సమాజంలో అణగారిన, నిస్సహాయ ప్రజల హక్కుల కోసం నిలబడదాం. అన్యాయం, అవినీతి మన హృదయాన్ని, సమాజాన్ని కలుషితం చేయకుండా జాగ్రత్త పడదాం.

చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా, నిజాయితీగా ఉందాం. ఎందుకంటే, దేవుని దృష్టిలో చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయడమే అత్యంత ముఖ్యమైనది. మన నిత్య జీవితంలో, మన వృత్తిలో, మన సంబంధాలలో న్యాయాన్ని పాటిస్తూ, మన క్రియల ద్వారా మనం దైవబిడ్డలమని లోకానికి చాటి చెబుదాం. దీని ద్వారా, మనం కోరుకునే దైవరాజ్యం మన హృదయాల్లోనూ, మన సమాజంలోనూ నిజమవుతుంది. దేవుడు మిమ్ము దీవించుగాక! ఆమేన్. 🙏

24 వ సామాన్య ఆదివారము, YEAR C

24 వ సామాన్య ఆదివారము, YEAR C
నిర్గమ. 32: 7-11, 13-14; I తిమో. 1:12-17; లూకా. 15:1-32



క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా, 24వ సామాన్య ఆదివార వాక్యోపదేశానికి మీ అందరకు హృదయపూర్వక స్వాగతం.

దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, కోపపడువాడు, కాని క్షమించువాడు. దేవుని కోపం, ఆయన ప్రేమతో సమానం. తను ఎన్నుకొన్న ప్రజలు అవిధేయించినప్పుడు, అవిశ్వాసములో జీవించినప్పుడు, కోపపడినను, తన కరుణాహృదయముతో వారిని క్షమించి, వారిపై తన ప్రేమను చాటుకొంటూ ఉంటారు. మనందరి వ్యక్తిగత జీవితములో, దేవుని ప్రేమను, కరుణను, క్షమను పొందియున్నాము. దానినిమిత్తమై, ముందుగా దేవునికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొందాము. 1 పేతు 1:3లో ఇలా చాడువుచున్నాం, “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక! యేసుక్రీస్తు పునరుత్థానముద్వారా మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము”.

మొదటి పఠనములో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను క్షమించడం చూస్తున్నాము. వారు చేసిన పాపం చాలా పెద్దది: బంగారు దూడను చేసి, విగ్రహారాధన చేసారు, దానిని బలులతో ఆరాధించారు, వారు మతభ్రష్టులైయ్యారు, తద్వారా దేవుని ఆజ్ఞను మీరారు. ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడు నెలలకు, యిస్రాయేలీయులు సినాయి అరణ్యమునకు వచ్చారు. అచటనే కొండకెదురుగా విడిది చేసారు. మోషే కొండనెక్కి దేవుని కడకు వెళ్ళాడు. దేవుడు కొండనుండి అతనిని పిలచి యిస్రాయేలీయులకు తన ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను వెల్లడించుమని చెప్పారు (నిర్గమ 3). మోషే కొండమీదికి వెళ్లి చాలా కాలము వరకు తిరిగి రాలేదు. ఈలోగా వారు మోషే ఇక తిరిగి రాడని భావించి, బంగారు దూడను చేసి పూజించారు, ఆరాధించారు, బలులు అర్పించారు. ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన దేవర యితడే అని పల్కారు. అది చూసిన దేవుడు కోపపడ్డారు. ఆయన కోపము గనగన మండి వారిని బుగ్గి చేయాలని హెచ్చరించారు. ఆ తరువాత, మోషేనుండి మహాజాతిని పుట్టించ తలచాడు. కాని, మోషే దేవునికి వారిని నాశనం చేయవద్దని మొరపెట్టుకొన్నాడు, మనవి చేసుకొన్నాడు, ప్రార్ధన చేసాడు. కనుక ప్రభువు తన తలంపును మార్చుకున్నారు, యిస్రాయేలీయులకు తలపెట్టిన కీడును విరమించుకొన్నారు (నిర్గమ 32). దీనినిబట్టి, దేవుని ప్రేమను, కరుణను, క్షమను మనం అర్ధం చేసుకోవచ్చు. మానవుని పాపం - దేవుని క్షమ గురించియే, బైబిలు చరిత్రనంతయును చూస్తూ ఉంటాము. ఆనాడు మోషే వేడుదల వలన, ఇశ్రాయేలు ప్రజలు క్షమించబడినారు. ఈనాడు మనం క్రీస్తు పాస్కా పరమరహస్యము ద్వారా (శ్రమలు, మరణం, ఉత్థానం) క్షమించబడియున్నాము.

రెండవ పఠనములో, పౌలుగారు దేవుని కృపకు, దయకు, కనికరమునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. సౌలుగా అతను క్రీస్తును, క్రీస్తానుచరులను దూషించి, హింసించి అవమానపరచాడు. అయితే క్రీస్తు అతనిని కనికరించి, ఎంచి తన సేవకు, పరిచర్యకు నియమించుకొన్నారు. ఆయనను విశ్వసింపవలసిన వారందరికి, పౌలు ఆదర్శప్రాయుడుగా ఉండునట్లు చేసారు. దేవుని ప్రేమకు, దయకు, కరుణకు, క్షమకు పౌలుగారి జీవితం ఓ గొప్ప నిదర్శనం! “దేవుని కృప అపారము. మన పట్ల ఆయన ప్రేమ అమితము” అని ఎఫెసీ 2:4లో చదువుచున్నాం. కనుక, మనము నిత్యము దేవునకు కృతజ్ఞతలు అర్పించవలయును.

నేటి సువిశేష పఠనములో - యేసు మూడు ఉపమానములను (త్రోవతప్పిన గొర్రె, పోగొట్టుకొన్న నాణెము, తప్పిపోయిన కుమారుడు) చెప్పుచున్నారు. ఈ మూడు కూడా, హృదయపరివర్తనమును గురించిన ఉపమానములు. ఇవి దేవుని ప్రేమ, దయ, కరుణలను తెలియజేస్తున్నాయి. పాపులు, సుంకరులు అందరును యేసు బోధలు వినుటకు (వినుటకు, ఆలకించుటకు 5:1; 6:47; 9:35) ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు యేసు పాపులను చేరదీయుచు వారితో కలసి భుజించుచున్నారని సణుగుకొనసాగిరి (సుంకరులకు, పాపాత్ములకు మిత్రుడు 7:34. 5:30; 19:7). అయితే ప్రభువు ఉద్దేశం, 5:32లో స్పష్టం చేయబడినది, అదేమిటంటే, “హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ వచ్చితినికాని, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు.” అలాగే 19:10లో – “మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు” అని. అప్పుడు యేసు వారికి ఉపమానములను చెప్పారు (15:3). ఈ ఉపమానములద్వారా, సుంకరులను, పాపాత్ములను చేరదీయడాన్ని సమర్ధించుకుంటున్నారు. ఎందుకన, తన ఉద్దేశ్యం - వారి హృదయపరివర్తనము.

“త్రోవతప్పిన గొర్రె” - పాత నిబంధనలో, దేవుడు మంచి కాపరిగా చెప్పబడినారు (ఆ.కాం. 48:15; 49:24; కీర్త 23; యిర్మియా 23:3). మంచికాపరి అయిన ప్రభువు తప్పిపోయిన గొర్రెలను వెదకునని, యెహెజ్కేలు 34:16లో చూడవచ్చు. దేవుని దృష్టిలో ప్రతీ ఒక్కరు ముఖ్యమే. వందలో ఒకటి అని కాకుండా, ప్రతీ ఒక్కరు సమానమే! తప్పోపియిన వారిని కనుగొన్న తరువాత, ఆయన తన భుజములపై మోస్తారు (15:5). ప్రవాసమునుండి తిరిగి వచ్చు సమయములో, దేవుడు తన ప్రజలను తన భుజములపై మోసెను (చదువుము యెషయ 40:11; 49:22). తిరిగి వచ్చిన వారిని తిరిగి దేవుడు పునరుద్దరించును. పరివర్తన చెందినవారిపట్ల పరలోకములో ఆనందము ఉండును (15:7 అలాగే దేవదూతలు సంతోషించును (15:10). ఆ ఆనందాన్ని స్నేహితులతో, ఇరుగుపొరుగు వారితో కూడా పంచుకోవాలి (15:9). యెహెజ్కేలు 18:23లో ఇలా చదువుచున్నాము: “దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలగుట వలన కాదా అని ప్రభువు నుడువు చున్నారు”.

“పోగొట్టుకొన్న నాణెము” - తప్పిపోయిన వారిని దేవుడు “పట్టుదలతో” (15:8) వెదకునని తెలియజేయుచున్నది.
యేసు పాపులకొరకై, వారి రక్షణ నిమిత్తమై వచ్చెను. అందరూ పాపాత్ములే. మనలో పాపము చేయనివారు ఎవరునూ లేరు. నీతిమంతులని చెప్పుకొనెడి పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు కూడా పాపాత్ములే! పాపులు, సుంకరులు పశ్చాత్తాపముతో యేసు బోధనలను ఆలకించుటకు వచ్చారు. కాని పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులు దైవకుమారుడైన యేసునే త్రుణీకరించారు. మనం అందరం ఈలోకములో పాపము వలన తప్పిపోయిన వారమే! ప్రభువు పరలోకమును వీడి మనలను వెతుక్కొంటూ ఈ లోకానికి వచ్చియున్నారు. ఆయన మంచి కాపరి. గొర్రెలకాపరి ఎలా తప్పిపోయిన గొర్రెను వెదకుతాడో, మనం పోగొట్టుకున్న నాణెమును (ఒక రోజు వేతనము) ఎలా వెతకుతామో, తప్పిపోయిన కుమారుని రాకకై ఓ తండ్రి ఏవిధముగా ఎదురు చూస్తాడో, పాపముచేసి తప్పిపోయిన మనందరి కోసం కూడా దేవుడు తన ప్రేమ, దయ, కరుణతో మన రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. “పశ్చాత్తాపము అవసరములేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతులకంటే (పరిసయ్యులు - హృదయ పరివర్తనము అవసరంలేదని భావిస్తారు 18:9), హృదయపరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును” (లూకా. 15:7) అని ప్రభువు చెప్పియున్నారు.

“తప్పిపోయిన కుమారుడు” - ఉపమానం ప్రపంచములోనే అతి గొప్పదైన కథగా పేరు. దీనిద్వారా, పరలోక తండ్రి దయ, ప్రేమ, కరుణా స్వభావములు మనకు అర్ధమగుచున్నాయి. తండ్రి ప్రేమ అనంతమయినది. ఆ ప్రేమకు ఎలాంటి షరతులు లేవు. తప్పిపోయిన కుమారుడు తిరిగివచ్చినప్పుడు ఆ తండ్రి అతనిపై కోపపడలేదు. దానికి బదులుగా, మేలిమి వస్త్రములను కట్టబెట్టెను, వ్రేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులను తొడిగెను, క్రొవ్విన కోడెదూడను వధించి విందును ఏర్పాటు చేసెను. తండ్రి అనంత ప్రేమకు, కరుణకు నిదర్శనం! ఈ ఉపమానమును మరింత వివరముగా, లోతుగా ధ్యానిద్దాం:

ఒకనికి ఇద్దరు కుమారులు ఉండిరి (15:11): ఆ ఒకరు తండ్రి దేవుడు. పెద్ద కుమారుడు - ఇస్రాయేలు ప్రజలను (చదువుము నిర్గమ 4:22). చిన్న కుమారుడు - దూరదేశమున వసించుచు, ధర్మశాస్త్రమును పాటించక, పందులను మేపుకొను చిన్నకుమారుడు అన్యులను సూచిస్తుంది. 15:12-24 చిన్నకుమారుని గురించి, 15:25-32 పెద్దకుమారుని గురించి వేరువేరుగా వింటున్నాము. ఈ ఇరువురు కుమారుల మధ్యనున్న వ్యత్యాసాన్ని చూస్తున్నాము. అయితే, ఇరువురి విషయములో తండ్రిదే ఆఖరిమాట!

15:12 - తండ్రి మరణం తరువాతనే ఆస్తి పంచబడాలి (సంఖ్యా 27:8; సీరా. 33:20-24). చిన్న కుమారుడు ఆస్తిని పంచమని అడిగాడు. తన తండ్రి తనకు చనిపోయినట్లేనని భావించాడు. చిన్నకుమారుని కోరిక మేరకు తండ్రి ఆస్తిని పంచి యిచ్చాడు. ద్వితీయ 21:17 ప్రకారం, పెద్దకుమారునికి ఆస్తిలో రెండువంతులు పంచి ఇవ్వాలి, కనుక, చిన్నకుమారునికి రావలసినది పంచి ఇచ్చాడు.

15:13-16 - చిన్నకుమారుడు దూరదేశమునకు వెళ్ళాడు. అక్కడ భోగవిలాసములతో, ధనమంతయు దుర్వినియోగము చేసి, తన ఆస్తిని మంట కలిపాడు. కరువు దాపురించుటచే, పందులను మేపాడు. యూదులకు పందులు అపరిశుభ్రమైన జంతువులు (లేవీ 11:7; ద్వితీయ 14:8 అశుచికరమైనది). అనగా అతను అన్యులవలె “చాలా దూరముగా” జీవిస్తున్నాడు అని అర్ధం. అతను ఇస్రాయేలు సంఘము నుండి వెలివేయబడినవాడు. దేవుడు లేకుండా ఈ ప్రపంచమున జీవించడం అని అర్ధం (చదువుము ఎఫెసీ 2:12-13).

15:17-19 - తనకు కనువిప్పు కలిగినది. తన తండ్రి చనిపోయాడని భావించిన అతను ఇప్పుడు చనిపోవుచున్నది తానే అని గుర్తించాడు. తాను తప్పిపోయానని గుర్తించాడు. తన పశ్చాత్తాపాన్ని తనలోతాను అనుకొని (18-19), తండ్రి వద్ద తన పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాడు (15:21): “పరలోకమునకును, నీకును ద్రోహము చేసితిని...” - తోటివారిపట్ల పాపం చేసినప్పుడు, చివరికి దేవునికి వ్యతిరేకముగా కూడా పాపము చేసినట్లే అని అర్ధం (నిర్గమ 10:16). పశ్చాత్తాప సూచనలు - తండ్రి దయను గుర్తించడం (15:17); “లేచి తండ్రి వద్దకు వెళ్ళడం” (15:18, 20); “లేవడం” అనే పదం క్రీస్తు ఉత్థానమును గురించి కూడా వాడబడింది (లూకా 18:33; 24:7, 46). అనగా, “మరణించిన” కుమారుడు “మరల జీవము” పొందుచున్నాడని అర్ధం (15:24, 32).

15:20 - దేవుడు పాపి హృదయపరివర్తన కొరకు ఓపికతో ఎదురుచూచుచున్నాడు. దూరమున ఉండగానే, తండ్రి అతనిని చూచాడు. అతని మనసు కరిగింది (యేసు కనికరం 7:13; 10:33). కుమారుని వద్దకు పరుగెత్తి వెళ్ళాడు. కుమారున్ని కౌగలించుకున్నాడు. కుమారున్ని ముద్దు పెట్టుకున్నాడు. ఇవన్నీ దేవుని కనికరమునకు నిదర్శనాలు.

15:21-24 – తండ్రి, కుమారుని పశ్చాత్తాపాన్ని మధ్యలోనే అడ్డుకున్నాడు. పూర్తిగా చెప్పేవరకు కూడా ఆగలేదు. మేలివస్త్రములను కట్టబెట్టమని, వ్రేలికి ఉంగరమును, కాళ్ళకు చెప్పులను తొడుగుడని, క్రొవ్విన కోడె దూడను వధింపమని సేవకులకు ఆజ్ఞాపించాడు. వీటన్నింటికి అర్ధం, తిరిగి “కుమారుని” స్థానాన్ని తండ్రి తిరిగి ఇచ్చాడు. మరణించినవాడు, బ్రతికాడని, పోయినవాడు తిరిగి దొరికాడని తండ్రి గుర్తించాడు. అనగా, తండ్రి కుమారున్ని పూర్తిగా క్షమించాడు. దీనిని పౌలు ఎఫెసీ 2:1, 4-5లో విచారించాడు (చదువుము): “మీ అపరాధముల వలనను, పాపముల వలనను, గతమున ఆధ్యాత్మికముగ మీరు మృతులైతిరి కాని, ఆయన మిమ్మ్ము బ్రతికించెను... దేవుని కృప అపారము. మనపట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగ నిర్జీవులమై ఉన్న మనలను, క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని కృప వలననే మీరు రక్షింప బడితిరి.” కనుక, ఆనందముతో, సంతోషముతో విందు చేసుకున్నారు.

15:25-28 - రెండవ భాగములో పెద్దకుమారుని గురించి చూస్తున్నాము. జరిగిన విషయాన్ని పనివానిద్వారా తెలుసుకున్నాడు. అందుకు పెద్దకుమారుడు “మండి పడ్డాడు” (15:28). తండ్రి వెలుపలకు వచ్చి పెద్దకుమారున్ని బ్రతిమాలాడాడు.

15:29-30 - పెద్దకుమారుడు తననుతాను సేవకునిగా, పనివానిగా భావించాడు. “తండ్రీ!’ అని ఎప్పుడు సంభోదించలేదు. చిన్నకుమారుని సోదరునిగా భావించలేదు. “నేను ఎన్నడు నీ ఆజ్ఞను మీరలేదు” అని అన్నాడు (ద్వితీయ 26:13). తండ్రి కనికరాన్ని గుర్తించలేదు. ఒకరకముగా, పెద్దకుమారుడు కూడా తప్పిపోయిన వాడే!

15:31-32 - పెద్దకుమారుడిని “కుమారా!” అని తండ్రి సంబోధించాడు. విందునకు ఆహ్వానిస్తున్నాడు. పెద్దకుమారుడు, విందులో చేరినది లేనిదీ చెప్పబడలేదు. అనగా, ఎవరివారే నిర్ణయం చేయాలి అని అర్ధం.

ప్రియ సహోదరీ సహోదరులారా,
ప్రతీ దివ్యపూజా బలిలో, తన శరీర రక్తములను స్వీకరించుటకు, తన క్షమను పొందుటకు క్రీస్తు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు. పెద్దకుమారుడు, “ఇతరులు మనకన్న ఎక్కువ” అని భావించి బాధపడ్డాడు. తండ్రి పక్షపాతం చూపిస్తున్నాడని భావించాడు. హృదయపరివర్తనం చెంది ఇంటికి తిరిగి వచ్చిన తమ్ముని ఆదరించక, తండ్రిని తప్పుబట్టాడు. కాని, దేవునిదృష్టిలో అందరమూ సమానమే. అసమానతలు, ఎక్కువ-తక్కువ, పేద-ధనిక, మొ.నవి, మన స్వార్ధము వలన ఏర్పరచుకొన్నవే! దేవుని కుటుంబములో అందరం సమానమే!

మొదటిగా, ఆత్మపరిశీలన చేసుకొందాం. పాపములోనున్న మనలను, దేవుడు తన కరుణతో క్షమించి స్వీకరించుటకు సిద్దముగా ఉన్నారు. క్రీస్తు పాపాత్ములను ఆదరించారు. దేవుని ప్రేమ, క్షమ మన జీవితములోనికి రావాలని ప్రార్ధన చేద్దాం. అదే ప్రేమను, క్షమను ఇతరులపై చూపునట్లు శక్తినివ్వమని ప్రార్ధన చేద్దాం. కొలస్సీ 3:12-14లో ఇలా చదువుచున్నాం, “మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు. ఆయనకు పరిశుద్దులును, ప్రియులును అయినవారు. కాబట్టి, మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరచుకొనుడు. ఎవడైనను మరియొకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగియున్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమించవలయును. మిమ్ములను ప్రభువు క్షమించునట్లుగానే, మీరు ఒకరినొకరు క్షమించవలయును. వీనికంటే అధికముగా, ప్రేమను అలవరచుకొనుడు. అది అన్నింటిని, ఐక్యముగా ఉంచగలదు”. లూకా 6:36 – “మీ తండ్రి వలె మీరును కనికరము కలిగి ఉండుడు”.

రెండవదిగా, హృదయ పరివర్తనము చెంది, పశ్చాత్తాపముతో మన పాపాలను ఒప్పుకొని తిరిగి మరల శాంతిని, దేవుని స్నేహాన్ని పొందుదాము. దుడుకు చిన్నవాడు, తాను చేసిన తప్పును తెలుసుకొన్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. హృదయ పరివర్తనముతో తండ్రి చెంతకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. తండ్రి కుమారున్ని చూసినప్పుడు, కుమారుని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని చూసాడు. అందుకే తండ్రి అతనిని కుమారునిగా అంగీకరించి, గొప్ప విందును ఏర్పాటు చేసాడు. “హృదయ పరివర్తనము చెందు పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును.” మార్పు, కనువిప్పు, పశ్చత్తాపం మనకూ కలగాలి. అప్పుడే దేవుడు మనపట్ల సంతోషిస్తాడు. దేవుని చెంతకు తిరిగి రావాలని నిర్ణయించుటకు పవిత్రాత్మ శక్తికి ప్రార్ధన చేద్దాం.

23 వ సామాన్య ఆదివారము, YEAR C

23 వ సామాన్య ఆదివారము, YEAR C
సొ. జ్ఞాన. 9:13-18; ఫిలే. 9-10, 12-17; లూకా 14:25-33

క్రీస్తు - శిష్యరికం


క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! నేడు మనం 23వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుచున్నాం. నేటి పఠనాల సందేశం నిజమైన క్రైస్తవ శిష్యరికం అంటే ఏమిటి? లేదా క్రీస్తును అనుసరించడం అంటే ఏమిటి? క్రీస్తును అనుసరించాలంటే మనం ఏమిచేయాలి? క్రీస్తు శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? క్రీస్తు శిష్యులముగా, మనం మన రోజువారి జీవితాలలో ఎలా జీవించాలి? అన్న ముఖ్యమైన విషయాలను నేడు ధ్యానిస్తున్నాం.

 మన భౌతిక జీవితాలు ఎంతో ఉన్నతముగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. మరి అలాగే, మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా ఇంకా మహోన్నతముగా ఉండాలని కోరుకోవాలి! ఆధ్యాత్మికముగా మనం ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే, విశ్వాసము, నమ్మకము, దైవభక్తి, సోదరప్రేమ కలిగియుండాలి. దేవుని చిత్తానుసారముగా జీవించాలి. అన్నింటికన్నా ముఖ్యముగా, క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును అనుసరించడమంటే, క్రీస్తులోనే మన సంపూర్ణ నమ్మకం. క్రీస్తు బోధనలను పాటించడం.

క్రీస్తునకు నిజమైన, జీవితకాలం శిష్యులముగా ఉండాలంటే, క్రీస్తు మనలనుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. ఈనాటి సువిశేష పఠనములో అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు స్పష్టముగా తెలియజేస్తున్నారు. నేటి పఠనాలు మన జ్ఞానస్నానపు వాగ్దానాలను సవాలు చేస్తూ, దేవుని చిత్తానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని, మన జీవితాల్లో దేవునికే మొదటి స్థానం ఇవ్వాలని బోధిస్తున్నాయి. నిజమైన క్రైస్తవ శిష్యరికం అంటే ఇదే!

ప్రియ సహోదరీ సహోదరులారా! నేటి సువిశేషం క్రీస్తు శిష్యరికంగూర్చి, శిష్యులకు ఉండవలసిన లక్షణాలగూర్చి బోధిస్తుంది. ప్రభువు గ్రామాలలో, పట్టణాలలో దైవరాజ్యముగూర్చి బోధిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, గుంపులు గుంపులుగా ఎంతోమంది ఆయనను అనుసరించారు. అయితే, వారిలో ఎంతమంది నిజమైన క్రీస్తు అనుచరులు ఉన్నారు? ఈరోజు మనం జ్ఞానస్నానముద్వారా క్రీస్తు అనుచరులం అయ్యాం. రోజూ ప్రార్ధనలు చేస్తూ ఉన్నాం. ఆరాధనలో, దివ్యపూజాబలిలో పాల్గొంటున్నాం. అయితే, మనలో ఎంతమందిమి నిజమైన క్రీస్తు అనుచరులం? ఇది తెలుసుకోవాలంటే, క్రీస్తును అనుసరించడానికి మనలనుండి ఆయన ఏమి కోరుతున్నారో తెలుసుకోవాల్సిందే!

నేటి సందేశం మనకు మన రోజువారి జీవితాలకు ఎంతో ప్రాముఖ్యం, ఎందుకంటే, ఈనాడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లు, లోకం యొక్క ఒత్తిడిల మధ్య, క్రీస్తుకు నిజమైన శిష్యులంగా ఎలా ఉండాలో ఈ పఠనాలు మనకు స్పష్టంగా మార్గం చూపిస్తున్నాయి.

1. మొదటిగా, లూకా 14:26లో ప్రభువు అంటున్నారు, “నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు”. మన కుటుంబాన్ని, మన ప్రాణాన్ని త్యజింపాలి అని ప్రభువు కోరుచున్నారు. గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను (11:29; 12:1). యేసు యెరూషలేమునకు ప్రయాణం చేయుచున్నారు (9:51). అనగా శ్రమలు, మరణం వైపునకు (9:22; 13:31-35). మరి జనసమూహము ఏ ఉద్దేశముతో క్రీస్తును అనుసరిస్తున్నారు? రాజకీయ స్వతంత్రము కొరకా? స్వస్థత కొరకా? భోజనం కొరకా?

యేసు వెనుకకు తిరిగి వారితో ఇలా అన్నారు: నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు, నా శిష్యుడు కానేరడు (లూకా 14:26). మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ద్వేషించాలని కాదు. యేసు తన తల్లిదండ్రులను ఎప్పుడు ద్వేషించలేదు! వారికన్న ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి అని అర్ధం. ప్రభువు తరువాతనే ఏదైనా, ఎవరైనా అని అర్ధం. ప్రభువునకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్ధం. ఇదే విషయాన్ని మత్త 10:37లో చూస్తున్నాము.తన తండ్రినిగాని, తల్లినిగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారునిగాని, కుమార్తెనుగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. కనుక, ప్రియ సహోదరీ సహోదరులారా, క్రీస్తు శిష్యులు తమ కుటుంబముకన్న, తమ ప్రాణముకన్న, ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తును మనం సంపూర్ణముగా అనుసరించాలంటే, ఇహలోక బాంధవ్యాలను వీడి, క్రీస్తుతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. తన ప్రాణమునైనను త్యజింపనివాడు అనగా, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం; అవసరమైతే, వేదసాక్షి మరణాన్ని పొందడం.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన రోజువారి జీవితంలో ప్రభువు పలికిన ఈ మాటలను మనం ఎలా జీవించాలి: “కుటుంబాన్ని త్యజించడం అంటే మన రోజువారీ జీవితంలో దాని అర్థం ఏమిటి? వాస్తవంగా కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు. దాని అసలైన భావం ఏమిటంటే: (1) దేవునికి మొదటి స్థానం ఇవ్వడం: మన జీవితంలో దేవునికి, ఆయన చిత్తానికి, ఆయన రాజ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మన కుటుంబ సభ్యుల ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదని గుర్తించాలి. అంటే, కుటుంబ సభ్యుల కోరికలు లేదా ఆసక్తులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, మనం దేవుని పక్షాన నిలబడాలి. (2) దేవుని చిత్తాన్ని అనుసరించడం: దేవుడు మనలను ఏదైనా చేయడానికి పిలిచినప్పుడు, అది మన కుటుంబం అనుకుంటున్న దానికి భిన్నంగా ఉన్నప్పటికీ, మనం దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీరు సువార్త పరిచర్య చేయాలని దేవుడు కోరుకున్నప్పుడు, మీ కుటుంబం దానికి అంగీకరించకపోయినా, మీరు ఆ పనిని కొనసాగించాలి. (3) ప్రేమలో ప్రాధాన్యతను గుర్తించడం: మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించకుండా ఉండకూడదు. బదులుగా, దేవునిపై మనకున్న ప్రేమ కుటుంబ ప్రేమ కంటే చాలా గొప్పది మరియు దృఢమైనదిగా ఉండాలి. దేవుని ద్వారానే మనకు నిజమైన ప్రేమ లభిస్తుంది, ఆ ప్రేమను మనం మన కుటుంబ సభ్యులతో పంచుకోగలం. ఈ విధంగా, కుటుంబాన్ని త్యజించడం అనేది త్యాగాన్ని సూచిస్తుంది, దానిద్వారా మనం క్రీస్తు శిష్యులుగా మారడానికి అవసరమైన నిబద్ధతను కలిగి ఉంటాము. ఈ నిబద్ధతతో మనం దేవునిని అనుసరిస్తే, ఆయన మనకు, మన కుటుంబాలకు కూడా దీవెనలు కురిపిస్తారు.

అలా జీవిస్తే, మనం పొందుకొనే ప్రతిఫలం గురించి లూకా 18:29-30లో చదువుచున్నాం: “దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజించిన ప్రతివాడు ఇహలోకమున నిత్యజీవమును పొందును”. కుటుంబం మనకు ఎంతో విలువైనది, కానీ దేవుని పిలుపు దానికి మించినది. మన కుటుంబం, మన నిర్ణయాలు లేదా మన ఆలోచనలు దేవుని మార్గానికి అడ్డు వచ్చినప్పుడు, దేవుని వైపే నిలబడాలి. దేవుని మార్గంలో నడవాలంటే, కొన్నిసార్లు కుటుంబంతో విభేదాలు రావచ్చు లేదా మనం వారికి దూరంగా ఉండాల్సి రావచ్చు. అప్పుడు, మన విశ్వాసం కోసం ఆ బాధను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి.

2. రెండవదిగా, లూకా 14:27లో ప్రభువు అంటున్నారు, “తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, నాకు యోగ్యుడు కాడు (9:23). ఈ మాటలు, ఆత్మత్యాగాన్ని సూచిస్తుంది. మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరింపవలెను. అనగా, ప్రభువు నిమిత్తము మన ప్రాణమును ధారపోయాలి. “తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగుట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించు కొనును” అని లూకా 9:24లో చదువుచున్నాం. క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు, విశ్వాసము కొరకు ఎన్నో కష్టాలను, అవమానములను, బాధలను పొందవలసి ఉంటుంది. ఇరుకైన మార్గమున ప్రవేశించవలసి ఉంటుంది. రోమను కాలములో, సిలువ మరణం, అవమానానికి చిహ్నం. సిలువపై మరణ శిక్షను పొందెడివారు, వారి సిలువను ఎత్తుకొని వెళ్ళెడివారు. అయితే, సిలువ మరణాన్ని పొందిన క్రీస్తు, దానికి ఓ నూతన అర్ధాన్ని ఇచ్చారు. ఇప్పుడు సిలువ ప్రేమకు, క్షమకు, త్యాగానికి, దైవానుగ్రహానికి చిహ్నం. సిలువ ఎత్తుకోవడం అనగా, అది ఒక భారముగాని, అవమానముగాని కాదు. క్రీస్తును అనుసరించుటకు, మనలను మనం త్యజించుకోవడము. ప్రేమతో, ఓర్పుతో, క్షమతో, త్యాగముతో జీవించడం.

ఆనాటి ప్రజలు, యేసును రాజుగా భావించారు. రోమనులపై జయించి, ఒక నూతన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని భావించారు. ఆ రాజ్యము త్వరలోనే అవతరింపనున్నదని వారు తలంచారు (లూకా 19:11). అయితే, ఎప్పుడైతే యేసు తాను అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, మరణాన్ని పొందవలసి యున్నారని బోధించినప్పుడు (లూకా 9:22), అనేకమంది ఆయనను తృణీకరించారు. వారి ఆలోచనలను, పద్ధతులను, కోరికలను ప్రభువు కొరకు విడనాడలేక పోయారు. అంతా మంచిగా, సాఫీగా సాగుతున్నప్పుడు, క్రీస్తును అనుసరించడం సులభమే! కాని, కష్టాలు, బాధలు, అవమానములు, సమస్యలు వచ్చినప్పుడు మన అనుసరణ ఎంత సత్యమో తెలుస్తుంది! ఆయనను అనుసరించువారు, లోకమున కష్టాల పాలగుదురని, ప్రభువే చెప్పియున్నారు (యోహాను 16:33). లూకా 9:57-62 లో చూస్తున్నట్లుగా, ముగ్గురు వ్యక్తులు క్రీస్తును అనుసరించాలని ఎంతో ఉత్సాహముతో వచ్చారు. కాని, దానికి కావలసినటువంటి త్యాగాన్ని వారు చేయలేక పోయారు.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన రోజువారి జీవితములో, ప్రభువు పలికిన ఈ మాటలను మనం ఎలా జీవించాలి: సిలువను ఎత్తుకోవడం అంటే శారీరకంగా ఒక పెద్ద బరువును మోయడం కాదు. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం చాలా లోతైనది.

మొదటిగా, ఆత్మత్యాగం మరియు స్వార్థాన్ని విడిచిపెట్టడం: సిలువను ఎత్తుకోవడం అంటే, మన స్వంత కోరికలు, సుఖాలు, స్వార్థపూరితమైన ఆలోచనలను విడిచిపెట్టడం. క్రీస్తు మన కోసం తనను తాను త్యాగం చేసుకున్నారు. అదేవిధంగా, మనం కూడా మన స్వంత ఆశలను, ప్రణాళికలను దేవుని చిత్తానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఉదాహరణ: మీరు ఎవరిపైనైనా కోపంగా ఉన్నప్పుడు, ఆ కోపాన్ని మనసులో పెట్టుకోకుండా, క్షమించడానికి ప్రయత్నించడం. మనకు ఇష్టం లేకపోయినా, పేదవారికి లేదా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ముందుకు రావడం.

రెండవదిగా, కష్టాలను సహనంతో స్వీకరించడం: క్రీస్తును అనుసరించినప్పుడు మన జీవితంలో సమస్యలు, బాధలు, అవమానాలు రావచ్చు. ఇవి కూడా మన సిలువలో భాగమే. వీటిని మనం ఓర్పుతో, విశ్వాసంతో ఎదుర్కోవాలి. సమస్యల నుండి పారిపోకుండా, వాటిని దేవుని మహిమ కొరకు స్వీకరించాలి. ఉదాహరణ: మీ విశ్వాసం కోసం ఇతరుల నుంచి వ్యతిరేకత లేదా విమర్శ ఎదురైనప్పుడు, దానిని ధైర్యంగా ఎదుర్కొని, దేవునిపై మీ నమ్మకాన్ని కొనసాగించాలి. కుటుంబంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే కష్టాలను, దేవునిపై ఆధారపడి సహనంతో భరించడం.

మూడవదిగా, దేవునిపట్ల నిబద్ధత కలిగి జీవించడం:సిలువను ఎత్తుకోవడం అనేది కేవలం ఒక్కరోజు చేసే పని కాదు. అది మన జీవితాంతం కొనసాగే ఒక నిబద్ధత. ప్రతి రోజు మనం చేసే పనులు, ఆలోచనలు, నిర్ణయాలు దేవునికి మహిమ కలిగించేవిగా ఉండాలి. ఉదాహరణ: ప్రతిరోజు ప్రార్థన, బైబులు పఠనంలో సమయం గడపాలి. మీ పనులు, మాటల ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే మన కష్టాల ద్వారా క్రీస్తుతో ఐక్యమవ్వడం. ఈ ప్రక్రియలో మనల్ని మనం దేవునికి పూర్తిగా సమర్పించుకుంటాము. ఈ మార్గంలో మనం నడిచినప్పుడు, దేవుడు మనకు బలం ఇస్తారు మరియు ఆశీర్వదిస్తారు.

3. ప్రియ సహోదరీ సహోదరులారా, ఇక మూడవదిగా, లూకా 14:33లో, “తన సమస్తమును త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు” అని ప్రభువు పలుకుతున్నారు. అనగా మన సంపదలను త్యజింపాలి. సమస్తమును త్యజించడం అనగా అన్నీ వదలి అనామకముగా జీవించడము కాదు. పేదరికంలో జీవించాలని కాదు. మనకున్న సంపదలపై వ్యామోహాన్ని విడనాడాలి. ఇహలోక సంపదలపై అత్యాశను విడనాడాలి. భౌతిక సంపదలు దేవుని కంటే ముఖ్యమైనవిగా మారకుండా చూసుకోవాలి. పరలోక సంపదలపై మన దృష్టిని సారించాలి. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. పొరుగు వారిని ప్రేమించాలి. న్యాయం కోసం కృషి చేయాలి. మత్త 19:21లో ప్రభువు పలికిన మాటలను గుర్తుచేసుకుందాం, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము”. అలాగే, లూకా 12:15లో ఇలా ప్రభువు ఇలా చెప్పుచున్నారు, “జాగరూకత వహింపుడు. ఎట్టి లోభమునకును లోనుకాకుడు. ఏలయన, మానవ జీవితము సిరిసంపదల సమృద్దిలో లేదు”.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన రోజువారీ జీవితంలో మనకున్న సంపదలను త్యజించాలి” అన్న మాటలను మనం ఎలా జీవించాలి:

మొదటిగా, దాతృత్వం మరియు పంచుకోవడం: మనకున్న సంపదలో కొంత భాగాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. ఇది డబ్బు రూపంలోనే కాకుండా, మన సమయాన్ని, తెలివిని, వనరులను కూడా పంచుకోవచ్చు. ఉదాహరణకు: నిరుపేదలకు ఆహారం, బట్టలు ఇవ్వడం. నిస్సహాయులకు సహాయం చేయడం. అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించడం.

రెండవదిగా, వస్తు వ్యామోహాన్ని విడిచిపెట్టడం: మనం కొత్త వస్తువుల మీద లేదా విలాసవంతమైన జీవితం మీద అధికంగా ఆసక్తిని చూపకూడదు. డబ్బును అనవసరమైన వాటిపై ఖర్చుచేయకుండా, దేవుని రాజ్యానికి, ఇతరులకు సహాయపడటానికి ఉపయోగించాలి.

మూడవదిగా, దేవునిపై ఆధారపడటం: మన సంపద మన భద్రతకు మూలం అని భావించకుండా, దేవుడే మనకు ఆశ్రయం, భద్రత అని విశ్వసించాలి. మన అవసరాలను తీర్చడానికి దేవుడు ఉన్నాని మనం నమ్మాలి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా, దేవుడు మనకు మార్గం చూపిస్తాని ప్రార్థించాలి. ఈ విధంగా, సంపదను త్యజించడం అంటే మన హృదయాలను సంపదల నుంచి వేరుచేసి, దేవునిపై సంపూర్ణంగా కేంద్రీకరించడం. మనం ఈ లోకంలోని సంపదలపై వ్యామోహం లేకుండా, పరలోకంలోని నిత్య జీవితానికి విలువ ఇవ్వాలని ఈ వాక్యం బోధిస్తుంది.

ప్రియ సహోదరీ సహోదరులారా, నేడు క్రీస్తు శిష్యులు కానేరని వారు ఎవరంటే, దేవుని వాక్యాన్ని చదివి, విని దానిని పాటించనివారు; అటువంటివారు క్రీస్తు శిష్యులు కానేరరు. శ్రమలను భరించలేనివారు శిష్యులు కానేరరు. సువార్తను బోధించి పాటించనివారు, శిష్యులు కానేరరు. కనుక, క్రీస్తును అనుసరించడం అనగా, ఆయనకు ప్రధమ స్థానాన్ని ఇవ్వడం. క్రీస్తును అనుసరించడం అనగా, సంపూర్ణ పరిత్యాగం. నిత్యజీవితానికి ఏ ఆటంకాన్నైనను మనం తీసివేయాలి. లూకా 16:13లో “మీరు దైవమును, ద్రవ్యమును సేవింప లేరు” అని చదువుచున్నాం. కనుక, ఇహలోక వ్యామోహాలలో జీవిస్తూ, పాపములో జీవిస్తూ మనం క్రీస్తును అనుసరించలేము. ఆయన శిష్యులు కానేరము. కనుక, మనలో పరివర్తన కలగాలి.

క్రీస్తును అనుసరించుటకు తగిన విధముగా మనం సిద్ధపడాలి. యేసును అనుసరించడం అనేది అంత తేలికగా తీసుకొనే నిర్ణయం కాదు! ఈ విషయాన్ని ప్రభువు రెండు ఉపమానములతో స్పష్టముగా వివరించారు (లూకా 14:28-32). మొదటిది,

గోపురము కట్టువాడు దానిని పూర్తి చేయుటకు తగిన వ్యయము ఉన్నదా లేదా అని ఆలోచింపడా? ఈ ఉపమానం, క్రైస్తవ శిష్యరికంలో మనకు కావలసిన ముందుచూపు మరియు నిబద్ధత గురించి తెలియజేస్తుంది. ఈ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, క్రీస్తును అనుసరించడం అనేది ఒక గొప్ప నిర్ణయం, దీనికి తగినంత సంసిద్ధత మరియు త్యాగం అవసరమని తెలియజేస్తుంది. క్రీస్తు శిష్యులుగా మారాలనుకునేవారు, దానివల్ల వచ్చే కష్టాలు, సవాళ్లు మరియు త్యాగాలను ముందుగానే లెక్కించుకోవాలి. గోపురము కట్టడం మొదలుపెట్టి పూర్తి చేయకుండా ఆపేయడం ఎలాగైతే అవమానమో, అలాగే క్రీస్తును అనుసరించడం మొదలుపెట్టి మధ్యలో ఆపేయడం కూడా అంతే. క్రీస్తు శిష్యరికం అనేది జీవితాంతం కొనసాగే ఒక ప్రయాణం. దానికి స్థిరమైన నమ్మకం మరియు ఓర్పు అవసరం. ఈ ఉపమానంలో, వ్యయమును లెక్కించకుండా మొదలుపెట్టిన వ్యక్తిని చూసి ఇతరులు ఇతడు ఆరంభశూరుడేకాని కార్యసాధకుడు కాలేక పోయెను” అని వెక్కిరిస్తారు. అలాగే, దేవుని మార్గంలో నిబద్ధత లేకపోతే, మన విశ్వాసం అవమానానికి గురవుతుంది. ఈ ఉపమానం ద్వారా క్రీస్తు మనకు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే, క్రీస్తును అనుసరించాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు, దానికి అవసరమైన త్యాగానికి, కష్టాలకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఈ మార్గం సులభమైనది కాదు, కానీ పూర్తి నిబద్ధతతో ముందుకు వెళ్తేనే నిత్యజీవపు ప్రతిఫలం లభిస్తుంది.

రెండవది, యుద్ధమునకు వెళ్ళు రాజు తన దగ్గర కావలిసినంత సైన్యము, బలగము ఉన్నదా లేదా అని  ఆలోచింపడా? ఈ ఉపమానం, క్రీస్తును అనుసరించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తుంది. యుద్ధానికి వెళ్లే రాజు ఎలాగైతే తన శక్తిని, బలగాన్ని అంచనా వేసుకుంటాడో, అదేవిధంగా క్రైస్తవ శిష్యులు కూడా తమ ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన నిబద్ధత, బలం ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ఈ ఉపమానం బోధిస్తుంది. క్రీస్తును అనుసరించే మనం కూడా మనకు ఎదురయ్యే ఆధ్యాత్మిక యుద్ధంలో మన శత్రువైన సాతాను బలం ఎంత ఉందో తెలుసుకోవాలి. క్రీస్తు శిష్యులుగా మారాలంటే, శత్రువైన సాతానుపై విజయాన్ని సాధించాలంటే, మనకు దేవుని సహాయం, పవిత్రాత్మ బలం అవసరమని గుర్తించాలి. ఈ ఉపమానం ద్వారా, క్రీస్తును అనుసరించడం అనేది ఒక చిన్నపాటి ప్రయాణం కాదు, ఇది ఒక యుద్ధం లాంటిదని యేసు హెచ్చరిస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో గెలవాలంటే, మనం పూర్తిగా క్రీస్తుకు కట్టుబడి ఉండాలి. లేకపోతే, మనం ఓడిపోతాం. కాబట్టి, క్రీస్తు శిష్యులుగా మనం అన్ని పరిస్థితులకు, సవాళ్లకు సిద్ధంగా ఉండాలి. ఆయనను అనుసరించడానికి, మన సర్వస్వాన్ని ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనం దేవునితో కలిసి ఈ యుద్ధంలో విజయం సాధించగలం.

మొదటి పఠనం: క్రీస్తును అనుసరించుటకు కావలసిన ధృడనిర్ణయాన్ని తీసుకోవడానికి మనకు దైవజ్ఞానం ఎంతో అవసరం. ఈ దైవజ్ఞానాన్ని కేవలం పవిత్రాత్మ మాత్రమే మనకు ఇవ్వగలదు. అందుకే, నేటి మొదటి పఠనంలో ఇలా వింటున్నాం, నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గమునుండి నీ పవిత్రాత్మమును పంపిననే తప్ప, నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? ఈ రీతిన నీవు దయచేసిన జ్ఞానముద్వార భూమి మీది నరులు ఋజుమార్గమున నడచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యము ఏదో తెలుసుకొనుచున్నారు (సొ.జ్ఞాన. 9:17-18). కనుక, క్రీస్తుకు నిజమైన శిష్యులుగా జీవించుటకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ నుండి వివేచన, బలం కోసం ప్రార్థించాలి.

క్రీస్తు చెప్పిన విధముగా పవిత్రాత్మ శక్తి, మనకు మార్గము, సత్యము, జీవము గూర్చి తెలియజేయును. దేవున్ని సంతృప్తి పరచుట ఎలాగో మనకు తెలియ జేయును. మరియు ఆత్మయొక్క దైవజ్ఞానము ద్వారా మనము రక్షింపబడుదము. ఆత్మశక్తిద్వారా మనం మరల నూతనముగా జన్మించియున్నాము. మనం ఆత్మశక్తిచేత నడిపింపబడుచున్నాము. కనుక, క్రీస్తును అనుసరించుటకు నిత్యము ప్రార్ధన చేయాలి.

చివరిగా, క్రీస్తు శిష్యులముగా కొనసాగాలంటే, 1. ప్రతీ దినము ప్రార్ధన చేయాలి. 2. ఆదివార దివ్య పూజాబలిలో పాల్గొని, దివ్యసత్ప్రసాదాన్ని యోగ్యరీతిన స్వీకరించాలి. 3. దివ్యగ్రంధ పఠనం చేయాలి. 4. సేవాపూరిత జీవితాన్ని జీవించాలి. 5. అందరితో ఆధ్యాత్మిక స్నేహాన్ని చేయాలి. 6. దైవకార్యము కొరకు మన సమయాన్ని, శక్తిని వెచ్చించాలి.

నేటి రెండవ పఠనంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునికి విరక్తత్వము, త్యాగం చాలా అవసరమని బోధిస్తుంది. క్రీస్తుకు బాధ్యతాయుతమైన అపోస్తలుడిగా, ఉత్సాహవంతుడైన శిష్యుడిగా, పౌలు తన కొత్త సహాయకుడు నేసిము యొక్క సేవను వదులుకొని, అతని యజమాని వద్దకు తిరిగి పంపవలసి వచ్చింది. అదేవిధంగా, క్రీస్తుకు నూతన శిష్యుడిగా నేసిము పౌలును విడిచిపెట్టి, పారిపోయిన బానిసగా తన యజమానిని ఎదుర్కొని, దాని పర్యవసానాలను అంగీకరించాల్సి వచ్చింది.

ప్రియ సహోదరీ సహోదరులారా, క్రైస్తవ శిష్యరికపు సవాలును మనం గొప్ప నిబద్ధతతో స్వీకరించి, ఆచరణలో పెట్టాలి. ఇది ఈ క్రింది విధాలుగా సాధ్యమవుతుంది:

మొదటిగా, ప్రార్థన ద్వారా: ప్రతిరోజూ దేవునితో మాట్లాడటం, బైబిల్ పఠనం, ధ్యానం ద్వారా ఆయన మాట వినడం వంటివి చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక శక్తిని పునరుద్ధరించుకోవాలి.

రెండవదిగా, దివ్య సత్ప్రసాదంలో భాగస్వామ్యం ద్వారా: తరచుగా దివ్యసత్ప్రసాద వేడుకల్లో పాల్గొనడం వల్ల దేవుని జీవితంలో మనం పాలుపంచుకోవచ్చు. అలాగే, మనం పాపం చేసినప్పుడు, ఆయనకు దూరం అయినప్పుడు సమాధాన దివ్యసంస్కారంను కృతజ్ఞతతో స్వీకరించాలి.

మూడవదిగా, విరక్తత్వము మరియు త్యాగం ద్వారా: చెడు అలవాట్లను వదిలి, విరక్తత్వం మరియు త్యాగ భావనలను అలవరచుకోవాలి.

నాలుగవదిగా, సేవ ద్వారా: మన సమయాన్ని, ప్రతిభను, వనరులను విశ్వవ్యాప్తమైన సంఘానికి, ముఖ్యంగా మన విచారణ సంఘంలో దేవుని సేవకోసం దాతృత్వంతో ఉపయోగించాలి. ఈ విషయంలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వంపై ఆధారపడాలి.

ఐదవదిగా, ప్రేమ, దయ ద్వారా: అణగారిన వారితో సహా దేవుని బిడ్డలందరినీ ప్రేమించాలి. వినయం, నిస్వార్థంతో దయ, కరుణ, క్షమ, సేవ వంటి పనులను చేయాలి.

ఆరవదిగా, బాధ్యతతో కూడిన జీవనం ద్వారా: మన వృత్తిలో, జీవితంలో మనకు అప్పగించిన బాధ్యతలను, విధులను నిబద్ధతతో నెరవేర్చాలి. ఉదాహరణకు, వివాహంలో విశ్వాసంగా ఉండటం, మన జీవితంలో, వృత్తిలో న్యాయానికి కట్టుబడి ఉండటం.

ఆత్మపరిశీలన చేసుకుందాం: ఈ రోజు నేను నా జీవితంలో క్రీస్తుకు మొదటి స్థానం ఇస్తున్నానా? లేదా నా కుటుంబం కంటే దేవున్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా? క్రీస్తుకు నిజమైన, నిబద్ధత కలిగిన శిష్యులముగా జీవించుటకు కావలసిన వరమును, శక్తిని, బలమును, పవిత్రాత్మ శక్తిని ఒసగమని ప్రార్ధన చేద్దాం!