25వ సామాన్య ఆదివారము,
YEAR C
ఆమో. 8:4-7; 1తిమో. 2:1-8; లూకా. 16:1-13
మనమందరమూ
దేవుని దత్తపుత్రులం. క్రీస్తానుచరులము. మన ప్రాధాన్య పిలుపు ఈ లోకములో దైవరాజ్యాన్ని
స్థాపించడం. దీనినిమిత్తమై భగవంతుడు మనకు ఎన్నోవరాలను, అనుగ్రహాలను దయచేసియున్నారు.
వాటిని వివేకముతో, దైవానుచిత్తముగా ఉపయోగించాలి. దైవరాజ్యమును స్థాపించుటకు మనమందరమూ
నీతి న్యాయాలతో జీవించాలని ఈనాటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి."మొదట ఆయన రాజ్యమును,
నీతిని వెదకుడు" (మత్త. 6:33). "నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలుగుము,
నీ దేవునిపట్ల వినయముతో ప్రవర్తింపుము" (మీకా. 6:8).
'న్యాయం' అనగా ఇతరుల హక్కులను గౌరవించడం. అలాగే ఇతరులు ఆ హక్కులను పొందటములో మనం బాధ్యతలను కలిగియుండటము. న్యాయాన్ని
రెండు రకాలుగా చెప్పవచ్చు: సామాజిక సేవ, సామాజిక న్యాయం. సేవ అప్పటికప్పుడు ఇతరుల
కష్టాలను, బాధలను తీర్చటం లేదా ఒదార్చటం. ఉదా. ఆకలితో నున్నవారికి అన్నం పెట్టడం.
అదే సామాజిక న్యాయం ఆ కష్టాలకు, బాధలకు కారణాన్ని కనుగొని శాశ్వత పరిష్కారం చేయడం.
న్యాయం అనగా ఇతరులకు చెందిన దానిని వారికి చెందేలాగున చేయడం. ఈనాటి మన సమాజ దుస్తుతికి,
అనగా అసమానతలకు కారణం సామాజిక న్యాయం లేకపోవటం వలననే. మన ప్రభుత్వాలు, ఇతర సామాజిక
సంఘాలు అలాగే మనమందరమూ సామాజిక న్యాయం కొరకు కృషి చేయాలని ఆశిద్దాం.
న్యాయముగా
జీవించడం దేవుని వరం. ఇది కేవలం వరదాయకమైనదేకాక, రక్షణదాయకమైనది. ఈ దేవుని వరాన్ని
మనం పొందాలంటే, మన పాపాలకు పశ్చాత్తాపపడి దివ్యసంస్కారమైన పాపసంకీర్తనం చేయాలి. ఈ
దివ్య సంస్కార ఫలితముగా ఈ వరాన్ని మనం పొందగలం.
ఈనాటి
పఠనాలను ధ్యానిద్దాం:
ఆమో.
8:4-7: "దీనుల తలమీద కాలు మోపుచు, పేదలను నాశనము చేయువారలారా వినుడు!..." తెకోవకు
చెందిన ఆమోసు ప్రవక్త ఇస్రాయేలు రెండవ యరోబాము (క్రీ.పూ. 782-753), యూదాలో ఉజ్జియా
(క్రీ.పూ.767-740) కాలములోని ప్రవక్త. ఆమోసు యూదారాజ్యానికి చెందిన వ్యక్తి. గొర్రెలకాపరిగా
జీవితం గడుపుతూ అత్తిపండ్లను అమ్ముకొంటూ జీవనోపాధిని సాగిస్తున్న అతనిని ఇస్రాయేలు
ప్రజలకు ప్రవచనము చెప్పమని దేవుడు పిలుచుకొన్నారు. ఆమోసు అనగా "బరువు మోయువాడు"
అని అర్ధము. యరోబాము కాలములో ఇస్రాయేలు రాజ్యము బాగా విస్తరించింది. వ్యాపారపరముగా, ఆర్ధికముగా
ప్రజలు పుంజుకున్నారు. అయితే, ఈ అభివృద్ది మత్తులో పడిపోయి, మతాచార వ్యవహారములో, ఆధ్యాత్మిక
విషయాలలో చిత్తశుద్ది లోపించి అంతా బాహ్యమైన తంతుగానే ఉండిపోయింది. అవినీతి, అన్యాయం,
మోసం బాగా పెరిగి పోయాయి. ఈ పరిస్థితుల్లో అవినీతి, అన్యాయాలకు విరుద్ధముగా ఆమోసు ప్రవచించాడు.
ప్రజల అవినీతిని ఎదురించడం ప్రవక్త కర్తవ్యం. పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగాలనే దేవుని
హెచ్చరికలను ఆమోసు ప్రవక్త ప్రవచించాడు. దురాశాపరులు, అవినీతిపరులు నిరుపేదలను వంచించడం
వంటి సాంఘిక అన్యాయాలను ఎత్తిచూపి, సాంఘిక న్యాయం కోసం పోరాడిన ప్రవక్త ఆమోసు.
ఈనాటి
పఠనములో ప్రజల వ్యాపారములో అవినీతి, అన్యాయపు కార్యాలను ఆమోసు ఎత్తిచూపుతున్నాడు. తప్పుడు
కొలమానములు, తూకములతో, దొంగత్రాసులతో ప్రజలను మోసగిస్తున్నారు. తాలు గోధుమలనుకూడా
ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. బాకీలు చెల్లింపలేని పేదలను, చెప్పులజోడు వెలకూడా చెల్లింపలేని
పేదలను కొంటున్నారు. ఇది అన్యాయం అని, అవినీతి అని ప్రవక్త వారికి తెలియజేసియున్నాడు.
"దొంగ తూకములకు, దొంగ కొలతలకు పాల్పడు వారిని ప్రభువు అసహ్యించుకొనును"
(సామె. 20:10). "పేదవానిని పీడించువాడు అతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును.
దరిద్రుని గౌరవించువాడు దేవుని గౌరవించును" (సామె. 14:31). అలాగే, దేవుడు ఏర్పాటు
చేసుకొన్న ఒడంబడికకు ఇస్రాయేలు ప్రజలు విశ్వాసులుగా ఉండాలని ప్రవక్త కోరియున్నాడు.
దేవుడు
నమ్మకస్తుడు కావున, ఆయన ప్రజలుకూడా నమ్మకముగా ఉండాలి. అదేవుడు అందరికి సమానముగా
న్యాయతీర్పును చేయువాడు. ఆయనకు అందరు సమానమే. "క్రీస్తు యేసునందు మీరందరునూ ఒక్కరే"
(గలతీ. 3:28).
పౌలు
తిమోతికి వ్రాసిని మొదటి లేఖలో (రెండవ పఠనం) అందరికొరకు ప్రార్ధన చేయాలని కోరుతున్నాడు. తిమోతి పౌలుకు
ప్రీతిపాత్రుడు. ప్రభువునందు విశ్వసనీయ సహచరుడు. పౌలు లేఖలు రాయడానికి సాయపడ్డాడు.
పౌలు తిమోతిని ఫిలిప్పు సంఘానికి తన రాయబారిగా పంపాడు. ఆపిమ్మట ఎఫేసు, తెస్సలోనిక సంఘాలలో
పనిచేసాడు. తిమోతి అనగా "దేవుని గౌరవించడం" అని అర్ధం. నిజమైన విశ్వాసాన్ని
పటిష్టం చేయడానికి పౌలు ఈ లేఖను రాసాడు. ఇతరుల కొరకు ప్రార్ధన చేయడం క్రైస్తవ బాధ్యత.
ఇది దైవచిత్తం. ప్రార్ధన శక్తివంతమైనది. అధికారములోనున్న వారికొరకు ప్రార్ధన చేయాలి.
మన ప్రార్ధనలద్వారా అన్యాయం, అవినీతి, దేవుడంటే అయిష్టత ఉన్న వారి హృదయాన్ని మార్చవచ్చు.
ప్రతీ ఒక్కరు సత్యమును తెలుసుకొని, రక్షణ పొందాలని ప్రార్ధన చేయాలి.
ఈనాటి
సువిశేష పఠనములో, "ముందు చూపుగల గృహనిర్వాహకుడు" అను ఉపమానమును ప్రభువు చెప్పియున్నారు.
ఈ గృహనిర్వాహకుడు మొదటగా అవినీతిపరుడు. యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని నేరము
అతనిపై మోపబడినది. ఆ రోజుల్లో గృహనిర్వాహకుడు ఒక బానిస. యజమాని అతనికి ఎంతో స్వేచ్చను,
స్వతంత్రాన్ని ఇచ్చి, గృహనిర్వాహన బాధ్యతలు
అప్పజేప్పేవాడు. గృహనిర్వాహణలో యజమానికి లాభాలు చేకూర్చవలసి ఉంటుంది. కాని, గృహనిర్వాహకుడు
ఇదే అదనుగా తీసుకొని స్వలాభంకోసం ఎక్కువ వడ్డీలను వసూలు చేసేవాడు. అది తెలుసుకున్న
యజమాని 'లెక్కలు అప్పజెప్పుమని, ఇక గృహనిర్వాహకుడిగా ఉండ వీలుపడదు' అని చెప్పియున్నాడు.
అయితే, తన పని కోల్పోయిన తరువాత ఋణస్తుల ఆశ్రయం, సహాయం పొందుటకు వారిని పిలిపించి వారి
ఋణాలను తక్కువగా చేసియున్నాడు. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా, ముందుచూపుతో ప్రవర్తించినందులకు
యజమానుడు మెచ్చుకొన్నాడు.
ఈ
ఉపమానమునుండి మనం ఏమి నేర్చుకోగలము?
1.
గృహ నిర్వాహకుని అవినీతిని అన్యాయాన్ని , ఉపమానం చెప్పిన ప్రభువు కాని, యజమాని కాని,
మనం కాని సమర్ధించడం లేదు. అతని యుక్తికి, ముందుచూపుతనాన్ని మెచ్చుకొంటున్నాము. ఋణాలను
తగ్గించి రాయడం వలన, అతను యజమానుని మోసంచేయలేదు. తన స్వలాభాన్ని త్యజించాడు. కారణం
ఏదైనా, తను చేసిన తప్పును సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసాడు. మనంకూడా, మన అనుదిన జీవితాలలో
అవినీతికి, అన్యాయాలకు దూరముగా ఉంటూ, యుక్తిగా ప్రవర్తించుటకు ప్రయాసపడాలి.
2.
ప్రభువు అంటున్నారు: "స్వల్ప విషయములలో నమ్మదగినవాడు, గొప్ప విషయములలోనూ, నమ్మదగిన
వాడిగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగనివాడు, గొప్ప విషయములలోనూ నమ్మదగనివాడుగా ఉండును"
(లూకా. 16:10). నమ్మకం చాలా గొప్పది. మన బంధాలలో, చేసే పనిలో తప్పకుండ నమ్మకం ఉండాలి.
క్రైస్తవులముగా, మనం ఈ లోకములో ఎన్నో బాధ్యతలను కలిగియున్నాము. నమ్మకముగా వానిని నేరవేర్చుదాం.
ఈలోక సంపదలయందు నమ్మకముగా ఉన్నప్పుడే, పరలోక సంపదలను దేవుడు మనకు అప్పజెప్పును.
"ఈలోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో, పరలోక సంపదలను ఎవడు మీకు ఇచ్చును?"
(లూకా. 16:11). చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయాలి.
3.
మనకున్న ఆధ్యాత్మిక వనరులను సద్వినియోగ పరచుకోవాలి. దివ్యసంస్కారాలు దేవుడు మనకిచ్చిన
గొప్ప వరాలు. వానిద్వారా దైవానుగ్రహాన్ని పొందగలుగుచున్నాము. అలాగే దివ్యగ్రంధము, తిరుసభ
బోధనలు గొప్ప వరాలు. గృహనిర్వాహకునివలె మనంకూడా మనకు ఇవ్వబడిన వరాలనుబట్టి అనగా
మన సమయం, సామర్ధ్యం, అవకాశాలు, ఆరోగ్యం, తెలివితేటలు, విద్య మొ.గు వానినిబట్టి దేవునికి
మనం లెక్కజెప్పవలసి ఉంటుంది. "మనము అందరమును న్యాయవిచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెనుగదా!
అప్పుడు వారివారి అర్హతలనుబట్టి మంచివిగాని, చెడ్డవిగాని భౌతికశరీరమున వారువారు ఒనర్చిన
కృత్యములనుబట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును" (2 కొరి. 5:10).
4.
ఈ లోక సంపద ఏదీ శాశ్వతం కాదు. ఈలోక సంపద మనకు శాశ్వత ఆనందమును ఇవ్వలేదు. శాశ్వత ఆనందమునొసగు
పరలోకములో మన సంపదను కూడబెట్టుకోవాలి. సంపదలున్న చోటనే మన హృదయం కూడా ఉంటుంది (మత్త.
6:19-21). ఈ లోక సంపదలు మన అవసరాలకొరకు ఇవ్వబడ్డాయి. అంతేగాని వాటిమీద మనం ఎప్పటికి
ప్రేమను పెంచుకోరాదు. అత్యాశతో వాటిని కూడబెట్టుకోవడం మంచిది కాదు. మనం సామాజిక న్యాయంకోసం కృషి చేయాలి. ఎవరికి చెందిన దానిని వారిని చెందనివ్వాలి. సామాజికన్యాయం లోపించుట
వలననే, ఇన్ని అసమానతలు, ఘోరాలు, బేదాభిప్రాయాలు ...
5.
అవినీతి, అన్యాయాలతో డబ్బు సంపాదించిన అది శాశ్వతం కాదు. అది ఎలా వస్తుందో అలాగే పోతుంది.
అవినీతి, అన్యాయాలు చేసేవారు గృహనిర్వాహకునివలె బాధ్యతలనుండి తప్పించబడతారు, అనగా
వారి జీవనోపాధిని కోల్పోతారు. దేవుని తీర్పుకు, ఖండనకు గురియవుతారు.
5.
దైవరాజ్య స్థాపనకై కృషిచేయాలి. దైవరాజ్యం ఈలోకానికి చెందినదికాదు. పాత ఒప్పందములో,
దేవుడు మహారాజుగా, తన శక్తితో, ఈ లోక దుష్టశక్తులతో కూడిన అన్యాయాన్ని అంతం చేసి న్యాయాన్ని,
సంతోషాన్ని, శాంతిని నెలకొల్పియున్నారు. ఇదే దేవుని సృష్టి ఉద్దేశాన్ని పరిపూర్ణం చేయడం.
ఇదే తండ్రి దేవుని కార్యాన్ని, పుత్రుడైన యేసు నూతన ఒప్పందములో గావించారు. "కాలము
సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు."
(మార్కు. 1:15). ఇదే దైవ పాలనారంభం. రక్షణకు మార్గం. ఇది దైవరాజ్య స్థాపనకు శుభవార్త.
యేసు తన బోధనలద్వారా, అద్భుతములద్వారా, తన వ్యక్తిత్వంద్వారా, మరణ-పునరుత్తానముల ద్వారా
దైవప్రేమ రాజ్యమును స్థాపించారు. ఈ దైవరాజ్యమును పవిత్రాత్మ శక్తి వలన కొనసాగించే
బాధ్యత తిరుసభది, అనగా మనందరిది. కాట్టి యుక్తిగా ప్రవర్తించుదాం.
క్రీస్తు
యేసుకూడా ఈ లోకమున అన్యాయాన్ని, అవినీతిని వ్యతిరేకించారు. సామాజిక న్యాయంకోసం తపించారు.
దైవరాజ్యాన్ని స్థాపించారు. "చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం" (మార్కు. 10:
14-15) అన్నారు ప్రభువు. అనగా చిన్న పిల్లలవలె ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలని అర్ధం.
దేవుని రాజ్యం పవిత్రాత్మతో నింపబడిన రాజ్యం. ప్రేమ, శాంతి సమాధానాలు కలిగిన రాజ్యం.
నీతిన్యాయములు నెలకొనిన రాజ్యం. ఇది ఆధ్యాత్మికమైన రాజ్యం. విమోచన కలిగిన రాజ్యం.
ఈ రాజ్యములో అందరూ సమానమే. "మీ రాజ్యం వచ్చును గాక" అని ప్రతీ రోజు మనం ప్రార్ధన
చేస్తున్నాం. ఇలాంటి రాజ్యమే మన ఈ భూలోకములో స్థాపించబడాలని ప్రార్ధన చేద్దాం.
No comments:
Post a Comment