26వ సామాన్య ఆదివారము, YEAR C

26వ సామాన్య ఆదివారము, YEAR C
పఠనాలు: ఆమోసు 6:1,4-7, I తిమోతి 6:11-16; లూకా 16:19-31

ప్రియ సోదరీ, సోదరా! మన గమ్యం పరలోక రాజ్యం. ఈ లోకములో మనం కేవలం ప్రయాణికులం. ఏదో ఒకప్పుడు ఈ ప్రయాణం ముగియవలసినదే! అయితే, పరలోక రాజ్యములో స్థానాన్ని పొందాలంటే, ఈ భూలోకయాత్ర దేవుని చిత్తానుగుణముగా కొనసాగాలి. తుదితీర్పును (మత్తయి 25:31-44) దాటి తండ్రి రాజ్యములో ప్రవేశించాలంటే, భూలోక జీవితం క్రీస్తు ఆజ్ఞలు, చూపిన విలువలు, బోధనలప్రకారం కొనసాగాలి. మారు మనస్సు, పశ్చాత్తాపం మనకి ఎంతో అవసరం. దివ్య సంస్కారములద్వారా దైవానుగ్రహాన్ని, పవిత్రాత్మ వరాలను పొందుతూ మన జీవితాలను ముందుకు కొనసాగించాలి.


అదేవిధముగా, ఈనాటి పఠనాలు, మనం సమాజములో, మన అనుదిన జీవితాలను ఎలా జీవించాలో బోధిస్తున్నాయి. పేదవారితో మన సంపదలను పంచుకోవాలి. ఆకలిగొన్నవారికి ఆహారం ఒసగాలి, దప్పికగొన్నవారికి దాహమును తీర్చాలి, పరదేశులను ఆదరించాలి, వస్త్రహీనులకు వస్త్రములను ఇవ్వాలి, రోగులను పరామర్శించాలి, చెరసాలలో ఉన్నవారిని దర్శించాలి. ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికిని ఇవి చేసినను అవి ప్రభువుకు చేసినట్లే!


మొదటి పఠనములొ ఆమోసు ప్రవక్త భోగప్రియులైన ఇస్రాయేలు ప్రజలకు అనర్ధము, ఘోరశిక్ష తప్పదని ప్రవచిస్తున్నాడు. ఎందుకన, వారు పేదవారిని, బాధలలో ఉన్నవారిని పీడిస్తూ, అణగద్రొక్కుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుచున్నారు.


"నీతిమంతులు నిత్య జీవితములో ప్రవేశింతురు. అవినీతి పరులు నిత్య శిక్షకు వెడలిపోవుదురు" (మత్తయి 25:46). మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకొందాం!


ఈ విషయాన్ని ఈనాటి సువిశేష పఠనములొని ధనికుడు-లాజరు ఉపమానము ద్వారా, ప్రభువు మనకు క్షున్నముగా, అర్ధవంతముగా తెలియజేస్తున్నారు. అయితే, ముందుగా ప్రభువు ఈ ఉపమానాన్ని ఎందులకు చెప్పారో తెలుసుకొందాం: ప్రభువు ఈ ఉపమానాన్ని ధనాపేక్ష కలిగిన పరిసయ్యులకు, పేదవారిపట్ల కనికరములేని పరిసయ్యులకు గుణపాఠం చెప్పడానికి చెప్పియున్నారు. మరియు ఈ ఉపమానాన్ని, ఆకాలములో యూదులలో ఉన్న తప్పుడు భావనలను సరిదిద్దుటకు చెప్పియున్నాడు. ఆ తప్పుడు భావనలు ఏవనగా: మొదటగా, లోకసంపదలు కేవలం కొంతమందికి ముఖ్యముగా నీతిగా పరిగణింపబడే వారికే దేవుడిచ్చిన గొప్ప వరమని, పేదరికం, అనారోగ్యం పాపాలకి శిక్షయని భావించెడివారు. కనుక వారికి సహాయము చేయనవసరములేదు. వారు దేవునిచేత శపింపబడియున్నారని భావించెడివారు. రెండవదిగా, సంపద దేవుని వరము కనుక దేవునికి కృతజ్ఞతలు తెలపడానికి, మొదటగా దశమభాగము దేవునికి ఇచ్చిన తరువాత, ఆ సంపదను  భోగవిలాసాలతో, తినుతూ, త్రాగుతూ అనుభవించాలని భావించెడివారు. మూడవదిగా, మరణం తర్వాత ఆత్మ జీవింపదని మన కార్యాలను బట్టి నూతన జీవితములో ప్రతిఫలం ఉండదని సద్దూకయ్యులు భావించెడివారు. ఈ ఉపమానము ద్వారా, ఈ తప్పుడు భావనలను యేసు ఖండించారు.


ఉపమానములో విన్నట్లుగా, ధనికుడు ఈ భూలోకమున పట్టువస్త్రములు ధరించి, నిత్యము విందులతో, వినోదములతో కాలాన్ని గడిపాడు. తన వాకిట ఉన్న లాజరు అను పేదవాన్ని ఎప్పుడూ చేరదీయలేదు, పరామర్శించలేదు. ఇరువురు ఈ భూలోక యాత్ర ముగించిన తరువాత, ధనికుడు పాతాళములోనికి త్రోయబడ్డాడు. లాజరును దేవదూతలు అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు, సంపదతో జీవించాడని పాతాళములోనికి త్రోయబడలేదు. కాని, అతడు సకల సంపదలను అనుభవించుచూ, మోషే, ప్రవక్తల బోధనలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. ధనికుడు శారీరకముగా ఎవరికీ ఏ హాని చేసి ఉండక పోవచ్చు. కాని, తన చుట్టూవున్న పేదవారిని ఆదరించలేదు, కష్టములో, బాధలో ఉన్నవారిని పరామర్శించలేదు. అందుకే, పాతాళమునుండి దాటుటకు వీలులేని అగాధమును ఏర్పాటు చేసుకొన్నాడు. ధనికుడు, తుదితీర్పు తరువాత బాధపడ్డాడు, కనికరింపుమని అబ్రహామును వేడుకొన్నాడు. కాని, ప్రియ సోదరీ! సోదరా! మనం ఈ భూలోకమున ఉండగానే మారుమనస్సు పొందాలి, పశ్చాత్తాప పడాలి. క్రీస్తు బోధనలను ఆలకించి, పాటించాలి. మనం దేవుని నుండి ఎన్నో వరాలను, అనుగ్రహాలను పొందిన గొప్పవారము. మనమందరమూ ధనికులమే! దేవుడు మనకు కావలసిన ధనాన్ని, సంపదనూ, ఆరోగ్యాన్ని, సమయాన్ని, తెలివి తేటలను, ఇలా ఒక్కొక్కరికి ఒకో విధముగా ప్రత్యేకమైన వరాలను ఒసగియున్నాడు. ఆ అనుగ్రహాలన్నింటినికూడా స్వార్ధముతో కేవలము మనకొరకేగాక, ఇతరులకొరకుకూడా  ముఖ్యముగా అవసరములో ఉన్నవారికి కొరకు ఉపయోగించాలి.


ఈ ఉపమానముద్వారా, సంఘములో స్వార్ధముతో జీవింపక, మనం సామాజిక జీవులమని, ఒకరికొరకు ఒకరం జీవింపాలని, అలాగే, ఇతరుల పట్ల మనం బాధ్యతకలిగి జీవింపాలని, మనకున్నవాటిని పంచుకోవాలని బోధిస్తున్నది. మన తుదితీర్పు కూడా ఈ పంచుకోవడముపైనే ఉన్నదని మత్తయి 25 వ అధ్యాములో చూస్తున్నాము. ఆహారమును, పానీయమును, గృహమును, ఇతరులతో పంచుకోవాలి. ఇతరులపట్ల దయ, కనికరముతో జీవించాలి.  ధనికుడు లాజరును ఒక సోదరునిగా పరిగణించలేదు. జగమంతా ఒకే కుటుంబము. ఎన్ని భిన్నత్వాలున్న ఐక్యముగా జీవింపాలి.


ఈనాటి రెండవ పఠనములొ పౌలుగారు ఎఫేసు సంఘానికి అధిపతియైన (ఈనాటి పీఠాధిపతి) తిమోతిని హెచ్చరిస్తూ, అతనికి మంచి సలహాలను ఇస్తున్నాడు. "ధనకాంక్ష సర్వ అనర్ధములకు మూలము" (1 తిమో. 6:10). పొగరుబోతుతనం, వాగ్వివాదములు, వాగ్యుద్ధములు, అసూయలు, కలహములు, దూషణలు, దుష్టసందేహములు, ధనకాంక్షలకు దూరముగా ఉండమని పౌలుగారు తెలియజేస్తున్నారు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యముతో జీవింప ప్రయత్నం చేయాలి (6:11). మనము ఈ లోకములోనికి వచ్చునప్పుడు ఏమియు వెంటతీసుకొనిరాలేదు. మనము ఈ లోకమునుండి నిష్క్రమించునప్పుడు ఏమియు వెంటతీసుకొనిపోజాలము (6:7). కనుక, ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులుగా ఉండక, అస్థిరములగు ధనములందు నమ్మకముంచక, మనము సంతోషముగా అనుభవించుటకు దారాళముగా కావలసినదంత దయచేయు దేవునియందే నమ్మకము ఉంచవలయును (6:17). ఇదియే, నిజమైన జీవమును సంపాదించుకొనుటకై రాబోవు కాలమునకు దృఢమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడం.


అయితే, సలహాలు మనకు కావలసినన్ని ఉన్నాయి కాని, వాటిని పాటించినప్పుడే, వాటి ఫలితాన్ని పొందగలము. కనుక, దేవుడు మనకు ఇచ్చిన సంపదను, వరాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయాసపడుదాం. పేదవారిని అవమానపరచక, కించపరచక, ఆదుకొనే ప్రయత్నం చేద్దాం. వ్యాధిగ్రస్తులను పరామర్శించుదాం. కష్టములోనున్నవారికి చేయూతనిద్దాం. మన జీవితాన్ని, ఇహలోక సంపదపైగాక, దేవునిపట్ల నమ్మకముపై నిర్మించుకొందాం. యేసుక్రీస్తు చూపిన మార్గములో పయనిద్దాం. ఆయన బోధనలను పాటిద్దాం. మోక్షవాసులమవుదాం!


కీర్తన. 119: 49-50: "ఈదాసునికి నీవు చేసిన వాగ్ధానమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. అది నాకు ఆశను కల్పించెను. నీ వాగ్ధానము నాకు జీవమును  ఒసగెను. కనుక నా బాధలలో కూడా నేను ఓదార్పును పొందితిని."

No comments:

Post a Comment