23 వ సామాన్య ఆదివారము, YEAR C

23 వ సామాన్య ఆదివారము, YEAR C
సొ. జ్ఞాన. 9:13-18; ఫిలే. 9-10, 12-17; లూకా 14:25-33
క్రీస్తు - శిష్యరికం

మన భౌతిక జీవితాలు ఎంతో ఉన్నతముగా ఉండాలని ఆశిస్తున్న మనం, మన ఆధ్యాత్మిక జీవితాలు ఇంకా ఎంత మహోన్నతముగా ఉండాలని కోరుకోవాలి? ఆధ్యాత్మిక అభివృద్ధికికూడా పట్టుదల, కృషివలే విశ్వాసము, నమ్మకము, దైవభక్తి, సోదరప్రేమ కలిగి యుండాలి. దేవుని చిత్తానుసారముగా జీవించాలి. అన్నింటికన్నా ముఖ్యముగా, క్రీస్తును అనుసరించాలి. క్రీస్తును అనుసరించడమనగా, ఆయనలోనే మన సంపూర్ణ నమ్మకం. ఆయన బోధనలను పాటించడం. క్రీస్తునకు నిజమైన మరియు జీవితకాలం శిష్యులముగా ఉండాలంటే, క్రీస్తు మనలనుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకుందాం. ఈనాటి సువిశేష పఠనములో అదే విషయాన్ని స్పష్టముగా తెలియజేస్తున్నాడు.

నేటి సువిశేషం క్రీస్తు శిష్యరికంగూర్చి, శిష్యులకు ఉండవలసిన లక్షణాలగూర్చి బోధిస్తుంది. ప్రభువు గ్రామాలలో, పట్టణాలలో దైవరాజ్యముగూర్చి బోధిస్తున్నప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, గుంపులు గుంపులుగా ఎంతోమంది ఆయనను అనుసరించారు. అయితే, వారిలో ఎంతమంది నిజమైన క్రీస్తు అనుచరులు ఉన్నారు? ఈరోజు మనం జ్ఞానస్నానముద్వారా క్రీస్తు అనుచరులం. రోజూ ప్రార్ధనలు చేస్తూ ఉన్నాము. ఆరాధనలో, దివ్యపూజాబలిలో పాల్గొంటున్నాము. అయితే, మనలో ఎంతమందిమి నిజమైన క్రీస్తు అనుచరులము? ఇది తెలుసుకోవాలంటే, క్రీస్తును అనుసరించడానికి మనలనుండి ఆయన ఏమి కోరుతున్నాడో తెలుసుకోవాల్సినదే!

1. మొదటిగా, మన కుటుంబాన్ని, మన ప్రాణాన్ని త్యజింపాలి. గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను (11:29; 12:1). యేసు యెరూషలేమునకు ప్రయాణం చేయుచున్నారు (9:51). అనగా శ్రమలు, మరణం వైపునకు (9:22; 13:31-35). వారు ఏ ఉద్దేశముతో అనుసరిస్తున్నారు? రాజకీయ స్వతంత్రము కొరకా? స్వస్థత కొరకా? భోజనం కొరకా? యేసు వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను: “నన్ను వెంబడింపగోరి, తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపనివాడు, నా శిష్యుడు కానేరడు (లూకా. 14:26). మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను ద్వేషించాలని కాదు. యేసు తన తల్లిదండ్రులను ఎప్పుడు ద్వేషించలేదు! వారికన్న ఎక్కువగా ప్రభువును ప్రేమించాలి. ప్రభువు తరువాతనే ఏదైనా, ఎవరైనా అని అర్ధం. ప్రభువునకు ప్రాధాన్యత ఇవ్వాలని అర్ధం. ఇదే విషయాన్ని మత్త. 10:37 లో చూస్తున్నాము. తన తండ్రినిగాని, తల్లినిగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారునిగాని, కుమార్తెనుగాని, నాకంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు.” కనుక, క్రీస్తు శిష్యులు వారి కుటుంబముకన్న, తన ప్రాణముకన్న, ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తును మనం సంపూర్ణముగా అనుసరించాలంటే, ఇహలోక బాంధవ్యాలను వీడి, క్రీస్తుతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవాలి. తన ప్రాణమునైనను త్యజింపనివాడు” అనగా, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం; అవసరమైతే, వేదసాక్షి మరణాన్ని పొందడం. చదువుము లూకా. 18:29-30 – ప్రతిఫలం=నిత్యజీవితము.

2. రెండవదిగా, “తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, నాకు యోగ్యుడు కాడు (లూకా. 14:27; 9:23). ఆత్మత్యాగాన్ని సూచిస్తుంది. మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరింపవలెను. అనగా, ప్రభువు నిమిత్తము మన ప్రాణమును ధారపోయాలి (లూకా 9:24). క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు, విశ్వాసము కొరకు ఎన్నో కష్టాలను, అవమానములను, బాధలను పొందవలసి ఉంటుంది. ఇరుకైన మార్గమున ప్రవేశించవలసి ఉంటుంది. రోమను కాలములో, సిలువ మరణానికి, అవమానానికి చిహ్నం. సిలువపై మరణ శిక్షను పొందెడివారు, వారి సిలువను ఎత్తుకొని వెళ్ళెడివారు. అయితే, సిలువ మరణాన్ని పొందిన క్రీస్తు, దానికి ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సిలువ ప్రేమకు, క్షమకు, త్యాగానికి, దైవానుగ్రహానికి చిహ్నం. సిలువ ఎత్తుకోవడం అనగా, అది ఒక భారముగాని, అవమానముగాని కాదు. క్రీస్తును అనుసరించుటకు, మనలను మనం త్యజించుకోవడము. ప్రేమతో, ఓర్పుతో, క్షమతో, త్యాగముతో జీవించడం. నా నిమిత్తమై ప్రాణమును ధారబోయువాడు, దానిని దక్కించుకొనును(లూకా. 9:24). ఆనాటి ప్రజలు, యేసును రాజుగా భావించారు. రోమనులపై జయించి, ఒక నూతన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడని భావించారు. ఆ రాజ్యము త్వరలోనే వస్తుందని తలచారు (లూకా. 19:11). అయితే, ఎప్పుడైతే యేసు తాను అనేక శ్రమలను అనుభవించి, పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి, మరణాన్ని పొందవలసి యున్నాడని బోధించినప్పుడు (లూకా. 9:22), అనేకమంది ఆయనను తృణీకరించారు. వారి ఆలోచనలను, పద్ధతులను, కోరికలను ప్రభువు కొరకు విడనాడలేక పోయారు. అంతా మంచిగా, సాఫీగా సాగుతున్నప్పుడు, క్రీస్తును అనుసరించడం సులభమే! కాని, కష్టాలు, బాధలు, అవమానములు, సమస్యలు వచ్చినప్పుడు మన అనుసరణ ఎంత సత్యమో తెలుస్తుంది! ఆయనను అనుసరించువారు, కష్టాల పాలవుతారని, ప్రభువే చెప్పియున్నారు (యోహాను. 16:33). లూకా. 9:57-62 లో చూస్తున్నట్లుగా, ముగ్గురు వ్యక్తులు క్రీస్తును అనుసరించాలని ఎంతో ఉత్సాహముతో వచ్చారు. కాని, దానికి కావలసినటువంటి త్యాగాన్ని వారు చేయలేక పోయారు.

3. మూడవదిగా, మన సంపదలను త్యజింపాలి. తన సమస్తమును త్యజియించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు (లూకా. 14:33). సమస్తమును త్యజించడం అనగా అన్నీ వదలి అనామకముగా జీవించడము కాదు. మనకున్న సంపదలపై వ్యామోహాన్ని విడనాడాలి. ఇహలోక సంపదలపై అత్యాశను విడనాడాలి. పరలోక సంపదలపై మన దృష్టిని సారించాలి. మనకున్న దానిని ఇతరులతో పంచుకోవాలి. పొరుగు వారిని ప్రేమించాలి. న్యాయం కోసం కృషి చేయాలి. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో, వెళ్లి నీ ఆస్తిని అమ్మి, బీదలకు దానము చేయుము. అపుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము (మత్త. 19:21). చదువుము లూకా. 12:15.

నేడు క్రీస్తు శిష్యులు కానేరని వారు ఎవరంటే, దేవుని వాక్యాన్ని చదివి, విని దానిని పాటించనివారు, క్రీస్తు శిష్యులు కానేరరు. శ్రమలను భరించలేనివారు శిష్యులు కానేరరు. సువార్తను బోధించి పాటించనివారు, శిష్యులు కానేరరు.

- కనుక, క్రీస్తును అనుసరించడం అనగా, ఆయనకు ప్రధమ స్థానాన్ని ఇవ్వడం. క్రీస్తును అనుసరించడం అనగా, సంపూర్ణ పరిత్యాగం. నిత్యజీవితానికి ఏ ఆటంకాన్నైనను మనం తీసివేయాలి. లూకా 16:13లో ఇలా చదువుచున్నాము: (చదువుము). ఇహలోక వ్యామోహాలలో జీవిస్తూ, పాపములో జీవిస్తూ మనం క్రీస్తును అనుసరించలేము. ఆయన శిష్యులు కానేరము. కనుక, మనలో పరివర్తన కలగాలి.

* క్రీస్తును అనుసరించుటకు తగిన విధముగా సిద్ధపడాలి. యేసును అనుసరించడం అనేది అంత తేలికగా తీసుకొనే నిర్ణయం కాదు! ఈ విషయాన్ని రెండు ఉపమానములతో స్పష్టముగా వివరించియున్నాడు (లూకా. 14:28-32). గోపురము కట్టువాడు దానిని పూర్తి చేయుటకు తగిన వ్యయము ఉన్నదా లేదా అని ఆలోచింపడా? యుద్ధమునకు వెళ్ళు రాజు తన దగ్గర కావలిసినంత సైన్యము, బలగము ఉన్నదా లేదా అని  ఆలోచింపడా? అదేవిధముగా, మనము కూడా, క్రీస్తును అనుసరించుటకు తగిన విధముగా సిద్ధపడాలి. ప్రతీ నిత్యము దృఢచిత్తముతో క్రీస్తును అనుసరింపవలయును. రెండు ఉపమానములద్వారా, మనకు వివేకము మరియు దూరదృష్టి ఉండాలని అర్ధమగుచున్నది. క్రీస్తు శిష్యరికం చివరి శ్వాసవరకు.

క్రీస్తును అనుసరించుటకు కావలసిన ధృడనిర్ణయాన్ని తీసుకోవడానికి మనకు దైవజ్ఞానం అవసరము. ఈ దైవజ్ఞానాన్ని కేవలం పవిత్రాత్మ మాత్రమే మనకు ఇవ్వగలదు. నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గమునుండి నీ పవిత్రాత్మమును పంపిననే తప్ప, నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు? ఈ రీతిన నీవు దయచేసిన జ్ఞానముద్వార భూమి మీది నరులు ఋజుమార్గమున నడచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యము ఏదో తెలుసుకొనుచున్నారు (సొ.జ్ఞాన. 9:17-18). క్రీస్తు చెప్పిన విధముగా పవిత్రాత్మ శక్తి, మనకు మార్గము, సత్యము, జీవము గూర్చి తెలియజేయును. దేవున్ని సంతృప్తి పరచుట ఎలాగో మనకు తెలియ జేయును. మరియు ఆత్మయొక్క దైవజ్ఞానము ద్వారా మనము రక్షింపబడుదము. ఆత్మశక్తిద్వారా మనం మరల నూతనముగా జన్మించియున్నాము. మనం ఆత్మశక్తిచేత నడిపింపబడుచున్నాము. కనుక, క్రీస్తును అనుసరించుటకు నిత్యము ప్రార్ధన చేయాలి.

చివరిగా, క్రీస్తు శిష్యులముగా కొనసాగాలంటే, 1. ప్రతీ దినము ప్రార్ధన చేయాలి. 2. ఆదివార దివ్య పూజాబలిలో పాల్గొని, దివ్య సత్ప్రసాదాన్ని యోగ్యరీతిన స్వీకరించాలి. 3. దివ్యగ్రంద పఠనం చేయాలి. 4. సేవాపూరిత జీవితాన్ని జీవించాలి. 5. అందరితో ఆధ్యాత్మిక స్నేహాన్ని చేయాలి. 6. దైవకార్యము కొరకు మన సమయాన్ని, శక్తిని వెచ్చించాలి.

No comments:

Post a Comment