5వ ప్రపంచ తాత/మ్మలు, వృద్ధుల దినోత్సవం 2025, పరిశుద్ధ పొప్ సందేశము, 27 జూలై 2025

 పరిశుద్ధ పొప్ సందేశము
5వ ప్రపంచ తాత/మ్మలు, వృద్ధుల దినోత్సవం 2025
27 జూలై 2025 



“నమ్మకముతో జీవించు నరుడు ధన్యుడు” (సీరా 14:2)

ప్రియ సహోదరీ, సహోదరులారా,

మనం జరుపుకుంటున్న ఈ జూబిలీ సందర్భముగా, నిరీక్షణ (ఆశ) అనేది వయస్సుతో సంబంధం లేకుండా, నిరంతరం ఆనందాన్ని పంచుతుందని గ్రహించాలి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో, నిరీక్షణ కష్టాలను తట్టుకొని నిలబడినప్పుడే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

బైబులులో ఎంతో మంది స్త్రీపురుషుల ఉదాహరణలు ఉన్నాయి. వారందరినీ ప్రభువు వారి జీవిత చరమాంకంలో తన రక్షణ ప్రణాళికలో భాగస్వాములను చేశారు. అటువంటి వారిలో అబ్రాహాము, సారా గొప్ప ఉదాహరణ. వయస్సు మీద పడినప్పటికీ, దేవుడు వారికి బిడ్డను వాగ్దానం చేసినప్పుడు, వారు నమ్మలేకపోయారు. వారికి పిల్లలు లేకపోవడం భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేకుండా చేసింది.

బప్తిస్త యోహాను జననం గురించిన దూత ప్రకటనను విన్నప్పుడు జెకర్యా స్పందన కూడా భిన్నంగా ఏమీ లేదు. “ఇదెట్లు జరుగును? నేనా ముసలి వాడను. నా భార్యకు కూడ వయస్సు వాలినది” (లూకా 1:18) అని దేవదూతతో పలికాడు. వృద్ధాప్యం, గొడ్రాలుతనం, భౌతిక క్షీణత, జీవితంపై సంతానంపై గల ఆశను అడ్డుకుంటాయని వారు భావించారు. “నూతనంగా జన్మించడం” గురించి యేసు నికోదేముతో మాట్లాడినప్పుడు, నికోదేము, “వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింప గలడు? అతడు తల్లి గర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింప గలడా?” అని యేసును ప్రశ్నించాడు (యోహాను 3:4). అయినప్పటికినీ, ఎప్పుడైతే మన పరిస్థితులు మారవని భావిస్తామో, సరిగ్గా అప్పుడే ప్రభువు తన రక్షణ శక్తితో మనల్ని ఆశ్చర్యపరుస్తారు.

వృద్ధులు, నిరీక్షణకు సంకేతాలు

బైబులులో, దేవుడు జీవిత చరమాంకంలో ఉన్న వ్యక్తులను ఎంచుకోవడం ద్వారా, తన దైవిక సంరక్షణను పదేపదే తెలియ జేశారు. అబ్రాహాము, సారా, జెకర్యా, ఎలిశబెతమ్మ విషయములో మాత్రమే కాదు, మోషే విషయంలో కూడా ఇదే జరిగింది; దేవుడు తన ప్రజలను విడిపించడానికి మోషేను పిలిచినప్పుడు అతనికి అప్పటికే ఎనభై సంవత్సరాలు (నిర్గమ 7:7). దీని ద్వారా దేవుని దృష్టిలో వృద్ధాప్యం అనేది ఆశీర్వాదం మరియు కృపతో కూడిన కాలం అని మనకు బోధపడుతుంది. అంతేకాకుండా, దేవుని దృష్టిలో వృద్ధులు నిరీక్షణకు ప్రథమ సాక్షులుగా ఉన్నారు. పునీత అగుస్తీను గారు, “వృద్ధాప్యం అంటే ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, దేవుడే ఆ ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారని చెబుతాడు, “మీ బలం క్షీణించనివ్వండి, తద్వారా నా బలం మీలో నివసిస్తుంది, అప్పుడు మీరు అపోస్తలుడైన పౌలుతో “నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని చెప్పగలరు (2 కొరి 12:10). వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది మనం వివేకంతో అర్థం చేసుకోవాల్సిన ఒక కాలపు సూచన, తద్వారా చరిత్రలోని ఈ క్షణాన్ని సరిగ్గా వివరించగలం.

శ్రీసభ మరియు ప్రపంచము యొక్క జీవితాన్ని తరాల ప్రవాహం వెలుగులోనే అర్థం చేసుకోగలం. వృద్ధులను అక్కున చేర్చుకోవడం ద్వారా జీవితం వర్తమానం మాత్రమే కాదని, కేవలం పైపై పరిచయాలు, క్షణిక సంబంధాలతో వృథా చేయకూడదని అర్థం చేసుకుంటాం. అలాగే, జీవితం నిరంతరం మనల్ని భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ఆదికాండంలో, వృద్ధుడైన యాకోబు తన మనవలకు, యోసేపు కుమారులకు దీవెనలిచ్చిన హృదయాన్ని కదిలించే ఘట్టాన్ని మనం చూస్తాం. భవిష్యత్తును ఆశతో చూడమని, దేవుని వాగ్దానాలు నెరవేరే సమయంగా భావించమని చేసిన విజ్ఞప్తిగా యాకోబు మాటలను చూస్తున్నాము (ఆది 48:8-20). వృద్ధుల బలహీనతకు యువత శక్తి అవసరం అనేది నిజమైతే, భవిష్యత్తును జ్ఞానంతో నిర్మించడానికి యువత అనుభవరాహిత్యానికి వృద్ధుల సాక్ష్యం అవసరం అనేది కూడా అంతే నిజం. ఎన్నిసార్లు మన తాతలు మనకు విశ్వాసం, భక్తి, పౌర ధర్మం, సామాజిక నిబద్ధతకు, కష్టాలలో జ్ఞాపకశక్తికి, పట్టుదలకు ఉదాహరణలుగా నిలిచారు! వారు ఆశతో, ప్రేమతో మనకు అందించిన అమూల్యమైన వారసత్వం ఎల్లప్పుడూ కృతజ్ఞతకు మూలం, పట్టుదలకు ఒక పిలుపు.

వృద్ధులకు నిరీక్షణ సంకేతాలు

బైబులు కాలం నుండి, జూబిలీ, విమోచన సమయంగా అర్థం చేసుకోబడింది. ఈ సమయంలో, బానిసలు స్వేచ్ఛ పొందారు, అప్పులు రద్దు చేయబడ్డాయి, భూమి అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడింది. జూబిలీ అనేది దేవుడు కోరుకున్న సామాజిక క్రమం తిరిగి స్థాపించబడే సమయం, సంవత్సరాలుగా పేరుకుపోయిన అసమానతలు, అన్యాయాలు సరిదిద్దబడే సమయం. నజరేతులో ప్రార్థనా మందిరంలో, యేసు పేదలకు సువార్తను, గ్రుడ్డివారికి చూపును, ఖైదీలకు, అణగారినవారికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించినప్పుడు, ఆ విమోచన క్షణాలను గుర్తుచేశారు (లూకా 4:16-21).

జూబిలీ స్ఫూర్తితో వృద్ధులను చూసినప్పుడు, వారికి విమోచనను, ముఖ్యంగా ఒంటరితనం, నిర్లక్ష్యం నుండి విమోచనను అనుభవించేలా తోడ్పడాలి. అలా చేయడానికి ఈ జూబిలీ సంవత్సరం సరియైన సమయం. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడంలో చూపే విశ్వసనీయత, వృద్ధాప్యంలో ఒక దివ్యమైన ఆనందం ఉందని మనకు బోధిస్తుంది. ఇది నిజమైన సువార్త ఆనందం. వృద్ధులు తరచుగా తమను తాము బంధించుకునే నిర్లక్ష్యం (ఉదాసీనత) అనే అడ్డుగోడలను బద్దలు కొట్టడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన సమాజాలు, జీవితంలో అత్యంత ముఖ్యమైన, సుసంపన్నమైన వృద్ధులను విస్మరించడానికి, వారిని పక్కన పెట్టడానికి అలవాటు పడుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం.

ఈ పరిస్థితిలో, శ్రీసభ వృద్ధుల పట్ల బాధ్యతను తీసుకోవడం ఎంతో అవసరం. ప్రతి విచారణ, సంఘం, ప్రతీ సమూహం వృద్ధుల విషయములో కీలక పాత్ర పోషించాలి. వృద్ధులను క్రమం తప్పకుండా సందర్శించడం, వారికి వారికి మద్దతు ఇవ్వడం, ప్రార్థనల సమూహాలను ఏర్పాటు చేయడం, వారికి ఆశ, గౌరవాన్ని తిరిగి తీసుకురాగల సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. క్రైస్తవ నిరీక్షణ ఎల్లప్పుడూ మనల్ని మరింత ధైర్యంగా ఉండమని, గొప్పగా ఆలోచించమని, ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తి చెందకుండా ఉండమని ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంలో, వృద్ధులకు లభించాల్సిన గౌరవం, ఆప్యాయతను తిరిగి తీసుకురాగల మార్పు కోసం మనం కృషి చేయాలి.

అందుకే పోప్ ఫ్రాన్సిస్, ప్రపంచ తాతలు, వృద్ధుల దినోత్సవాన్ని ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులతో కలిసి జరుపుకోవాలని కోరారు. ఈ కారణంగా, ఈ పవిత్ర జూబిలీ సంవత్సరంలో రోముకు తీర్థయాత్ర చేయలేని వారు “ఒంటరిగా ఉన్న వృద్ధులను సందర్శిస్తే జూబిలీ ఇండల్జెన్స్ పొందవచ్చు... ఒక రకంగా, వారిలో ఉన్న క్రీస్తు వద్దకు తీర్థయాత్ర చేయడమే” (మత్త 25:34-36) (అపోస్టోలిక్ పెనిటెన్షియరీ, జూబ్లీ ఇండల్జెన్స్ మంజూరుకు సంబంధించిన నిబంధనలు, III). ఒక వృద్ధుడిని సందర్శించడం అనేది యేసును కలుసుకోవడానికి ఒక మార్గం, ఇది మనల్ని ఉదాసీనత మరియు ఒంటరితనం నుండి విముక్తి చేస్తుంది.

సిరాకు గ్రంథం (14:2) ఆశను కోల్పోని వారు ధన్యులు అని చెబుతుంది. బహుశా, మన జీవితం సుదీర్ఘంగా ఉంటే, భవిష్యత్తు వైపు కాకుండా గతం వైపే చూసేందుకు మనం ప్రలోభపడవచ్చు. అయినప్పటికీ, పోప్ ఫ్రాన్సిస్ తన చివరి దశలో ఆసుపత్రిలో ఉండగా ఇలా వ్రాసారు, “మన శరీరాలు బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రేమించకుండా, ప్రార్థించకుండా, మనల్ని మనం అర్పించుకోకుండా, ఒకరికొకరు తోడుగా ఉండకుండా, విశ్వాసంతో ఆశకు ప్రకాశవంతమైన చిహ్నాలుగా ఉండకుండా ఏదీ మనల్ని నిరోధించదు” (త్రికాల ప్రార్ధన, మార్చి 16, 2025). ఏ కష్టమూ దూరం చేయలేని ప్రేమించే, ప్రార్థించే స్వేచ్ఛ మనకు ఉంది. ప్రతి ఒక్కరూ, ఎల్లప్పుడూ, ప్రేమించగలరు, ప్రార్థించగలరు.

మన శక్తులు సన్నగిల్లినా, ప్రియమైన వారిపై, భార్య లేదా భర్తపై, పిల్లలపై, ప్రకాశవంతం చేసే మనవలు, మనవరాళ్లపై మనకున్న ప్రేమ తగ్గదు. నిజానికి, వారి ప్రేమ తరచుగా మనలో శక్తిని పునరుజ్జీవింప జేస్తుంది, ఆశను, ఓదార్పును కలిగిస్తుంది.

దేవునిలో మూలాలున్న ఈ ప్రేమకు సంబంధించిన సూచనలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. “భౌతికముగ క్షీణించుచున్నను, ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము” (2 కొరి 4:16) అని ఆ సూచనలు మనకు గుర్తుచేస్తాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ, ప్రభువుపై నమ్మకంతో ముందుకు సాగుదాం. ప్రార్థనలోనూ, పవిత్ర దివ్యబలిపూజలోనూ ఆయనతో మన కలయిక ద్వారా ప్రతిరోజూ మనం నూతనపరచబడతాం.

వాటికన్, 26 జూన్ 2025

మూలము”
https://www.vatican.va/content/leo-xiv/en/messages/grandparents/documents/20250626-messaggio-nonni-anziani.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.


త్రికాల ప్రార్ధన, లియో XIV, 13 జూలై 2025

 లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా దెల్ల లిబర్తా (కాస్టెల్ గండోల్ఫో)
ఆదివారము, 13 జూలై 2025

 


ప్రియ సహోదరీ సహోదరులారా! శుభోదయం!

మీకు ఆదివారం శుభాకాంక్షలు! నేటి సువిశేషం యేసును అడిగిన ఒక గొప్ప ప్రశ్నతో మొదలవుతుంది: “బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలయును? (లూకా 10:25). ఈ మాటలు మన జీవితంలోని నిరంతర కోరికను వ్యక్తపరుస్తాయి: రక్షణ కొరకు మన తపన, మరియు అపజయం, చెడు, మరణం లేని జీవితం కోసం మన నిరంతర ఆకాంక్షను ఆ ప్రశ్న తెలియ జేస్తుంది.

మానవ హృదయపు ఈ నిరీక్షణను “వారసత్వ సంపదగా” పొందాలని వివరింపబడింది; దీన్ని బలవంతంగా సంపాదించడం కుదరదు, యాచించి పొందడం సాధ్యం కాదు, లేదా సంప్రదింపులతో సాధించేది కాదు. నిత్య జీవితాన్ని దేవుడు మాత్రమే ప్రసాదించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చినట్లే ఇదివారసత్వంగా దక్కుతుంది.

అందుకే, మనం దేవుని బహుమతిని పొందాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని యేసు తెలియజేసారు. ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడింది: “నీ ప్రభువైన దేవున్ని నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, మరియు “నీ పొరుగువారిని నిన్నువలె ప్రేమించాలి” (లూకా 10:27; ద్వితీ 6:5; లేవీ 19:18). మనం ఈ రెండు ఆజ్ఞలను పాటించినపుడు, తండ్రి ప్రేమకు మనం ప్రతిస్పందించినవారమవుతాము. దేవుని చిత్తమే జీవిత నియమం. దీనిని తండ్రి అయిన దేవుడు స్వయంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని అనంతంగా ప్రేమించడం ద్వారా మొదట పాటించారు.

సహోదరీ సహోదరులారా, మనం యేసు వైపు చూద్దాం! దేవుని పట్ల, ఇతరుల పట్ల ఉన్న నిజమైన ప్రేమకు అర్థాన్ని ఆయన మనకు చూపుతారు. ఆ ప్రేమ ఉదారమైనది, స్వార్థపూరితమైనది కాదు. అది నిస్సంకోచంగా క్షమించే ప్రేమ, ఇతరులకు చేయూతనిచ్చి, ఎప్పుడూ విడిచిపెట్టని ప్రేమ. క్రీస్తులో, దేవుడు ప్రతి స్త్రీ, పురుషుడికి పొరుగువాడు అయ్యాడు. అందుకే మనలో ప్రతి ఒక్కరూ మనం కలిసే ప్రతి ఒక్కరికీ పొరుగువారు కాగలరు, మరియు కావాలి. లోక రక్షకుడైన యేసును ఆదర్శంగా తీసుకుని, మనం కూడా ముఖ్యంగా నిరుత్సాహంగా మరియు నిరాశతో ఉన్నవారికి ఓదార్పును, నిరీక్షణను అందించడానికి పిలవబడ్డాము.

నిత్యం జీవించడానికి, మనం మరణాన్ని మోసగించాల్సిన అవసరం లేదు. బదులుగా, మన జీవితకాలంలో ఇతరులను ప్రేమగా చూసుకోవడం ద్వారా జీవితానికి సేవ చేయాలి. ఇదే అన్ని సామాజిక నియమాలకు అతీతమైన, వాటికి అసలైన అర్థాన్ని ఇచ్చే అత్యున్నత సూత్రం.

దయగల కన్యక అయిన మరియ మాతను మనం వేడుకుందాం. దేవుని చిత్తానికి మన హృదయాలను తెరవడానికి ఆమె మనకు సహాయం చేయుగాక. ఎందుకంటే, ఆయన చిత్తం ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన రక్షణ చిత్తమే. ఈ విధంగా, మన జీవితంలో ప్రతిరోజూ మనం శాంతిని స్థాపించే వారంగా మారతాం.

త్రికాల ప్రార్ధన తరువాత

ప్రియ సహోదరీ సహోదరులారా,

కాస్టెల్ గండోల్ఫోలో మీ అందరితో కలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి పౌర, సైనిక అధికారులకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే, నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.

నిన్న, బార్సిలోనాలో, 1909లో విశ్వాసం పట్ల ద్వేషంతో హత్య చేయబడిన బ్రదర్ లికారియోన్ మే (ఫ్రాంకోయిస్ బెంజమిన్) ధన్యుడిగా ప్రకటించబడ్డారు. ఈయన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మారిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ది స్కూల్స్‌’కు చెందిన మఠవాసి. ప్రతికూల పరిస్థితులలోనూ, ఆయన తన విద్యా, బోధనాపరమైన బాధ్యతను అంకితభావంతో, ధైర్యంగా నిర్వర్తించారు. ఈ హతసాక్షి వీరోచిత సాక్ష్యం మనందరికీ, ముఖ్యంగా యువత విద్య కోసం పనిచేసే వారికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.

పోలాండ్ నుండి వచ్చిన లిటర్జికల్ అకాడమీ వేసవి కోర్సులో పాల్గొంటున్న వారందరికీ, అలాగే ఈ రోజు చెస్టోచోవా పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రలో పాల్గొంటున్న పోలిష్ యాత్రికులకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నేటితో బెర్గామో మేత్రాసన జూబిలీ తీర్థయాత్ర ముగుస్తుంది. తమ బిషప్‌తో కలిసి పవిత్ర ద్వారం గుండా వెళ్ళడానికి రోముకు వచ్చిన యాత్రికులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పెరూలోని చిక్లాయోకు చెందిన కొలెజియో సాన్ అగస్టిన్‌లోని బ్లెస్సెడ్ అగస్టిన్ ఆఫ్ టరానో పాస్టోరల్ కమ్యూనిటీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూబిలీ వేడుకల కోసం వారు కూడా రోముకు వచ్చారు. అలాగే, అల్కాలా ది హెనరెస్ మేత్రాసనములోని సాన్ పెడ్రో అపోస్టల్ విచారణ నుండి వచ్చిన యాత్రికులకు (వారు తమ విచారణ స్థాపించి 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నారు); కొలంబియాలోని ఉరిబియా-లా గ్వాజిరా నుండి వచ్చిన లీజియొనరీస్ ఆఫ్ మేరీ సభ్యులకు; మెర్సిఫుల్ లవ్ కుటుంబ సభ్యులకు; అగేషి అల్కామో 1వ స్కౌట్ గ్రూప్‌కు; మరియు చివరగా, ఇక్కడ హాజరైన ఆగస్టీనియన్ మఠవాసులకు కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఫ్రాన్స్ నుండి వచ్చిన అకాడెమీ మ్యూజికల్ ది లీస్సే బాలల బృందానికి స్వాగతం పలుకుతున్నాము. మీరు హాజరైనందుకు మరియు గానం, సంగీతం పట్ల మీ నిబద్ధతకు ధన్యవాదాలు.

ఈరోజు వెల్లెత్రి స్కూల్‌లోని కరబినీరీ కోర్సుకు చెందిన 100 మంది క్యాడెట్‌లు మనతో ఉన్నారు. ఈ స్కూల్ గౌరవనీయులైన సాల్వో డి'అక్విస్టో పేరు మీద ఉంది. కమాండర్‌కు, అలాగే ఇతర అధికారులు, నాన్-కమిషన్డ్ అధికారులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దేశానికి, పౌర సమాజానికి సేవ చేయడంలో మీ శిక్షణను కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ధన్యవాదాలు! వారి సేవకు గాను మనమంతా ఉత్సాహంగా చప్పట్లు కొడదాం.

వేసవి నెలల్లో, పిల్లలు మరియు యువత కోసం అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సేవకు తమను తాము అంకితం చేసుకుంటున్న విద్యావేత్తలకు, నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా, ప్రపంచం నలుమూలల నుండి యువతను ఒకచోట చేర్చే గిఫోనీ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం దాని థీమ్ “మానవత్వం పొందడం”.

సహోదరీ సహోదరులారా, హింస లేదా యుద్ధం కారణంగా బాధలు, అవసరాల్లో ఉన్న వారందరి కోసం మరియు శాంతి కోసం ప్రార్థించడం మనం మర్చిపోవద్దు.

మీ అందరికీ ఆదివార శుభాకాంక్షలు!

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250713-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

సృష్టి పరిరక్షణ కొరకు దివ్య బలిపూజ, పోప్ లియో XIV ప్రసంగము, 9 జూలై 2025

 సృష్టి పరిరక్షణ కొరకు దివ్య బలిపూజ
పోప్ లియో XIV గారి ప్రసంగము
బోర్గో లౌదాతో సి' (కాస్టెల్ గాండోల్ఫో)
బుధవారం, 9 జూలై 2025



ఈ అందమైన రోజున, ప్రకృతి సౌందర్యం నడుమ మనం ఇక్కడ ఏమి జరుపుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించమని నాతో సహా మీ అందరినీ కోరుతున్నాను. వృక్షాలు, సృష్టిలోని ఎన్నో అంశాలతో నిండిన ఈ “ప్రకృతి దేవాలయం” మనందరినీ ఇక్కడకు చేర్చింది. ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పే దివ్యబలి పూజ కొనియాడుటకు మనందరం ఒకటిగా ఇక్కడ సమావేశమయ్యాము.

ఈరోజు దివ్యబలి పూజలో ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడానికి అనేక కారణాలున్నాయి. సృష్టి పరిరక్షణ కోసం ఉద్దేశించిన దివ్యబలి పూజకు సంబంధించిన కొత్త ప్రార్థనలను ఉపయోగించి జరుపుతున్న మొదటి వేడుక బహుశా ఇదే కావచ్చు. ఈ ప్రార్థనలు వాటికన్ (హోలీ సీ) లోని అనేక డికాస్టరీలు (విభాగాలు) చేసిన కృషి ఫలితంగా రూపొందాయి.

ఈ ప్రార్థనల రూపకల్పనలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీకు తెలిసినట్లే, ప్రార్థనలు జీవితానికి ప్రతీకలు, మరియు లౌదాతో సి' సెంటర్’కు మీరే జీవం. ఈ సందర్భంగా, పోప్ ఫ్రాన్సిస్ గారి గొప్ప ఆలోచనను కార్యరూపం దాల్చడానికి మీరు చేస్తున్న కృషికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సృష్టిని, మన ఉమ్మడి నివాసాన్ని పరిరక్షించే కీలకమైన బాధ్యతను కొనసాగించడానికి, వారు ఈ చిన్న భూభాగాన్ని, ఈ ఉద్యానవనాలను, ఈ నడక మార్గాలను దానం చేసారు. ‘లౌదాతో సి' ప్రచురించిన పదేళ్ల తర్వాత, ఈ లక్ష్యాన్ని నిరంతరాయంగా కొనసాగించవలసిన ఆవశ్యకత  మరింత స్పష్టంగా కనిపించింది.



ఈ ప్రదేశం [ఒక జలధార ముందు] ప్రాచీన దేవాలయాలను తలపిస్తోంది. అప్పట్లో దేవాలయములోకి వెళ్ళేముందు, జ్ఞానస్నానం ఇచ్చే స్థలం (baptismal font) గుండా వెళ్ళేవారు. నేను ఇక్కడ ఈ నీటిలో జ్ఞానస్నానం తీసుకోవాలనుకుంటున్నానో లేదో నాకు తెలియదు... కానీ మన పాపాలు, ప్రక్షాళన చేసుకోవడానికి నీటి గుండా పయనించి, ఆపై శ్రీసభ అనే పవిత్ర రహస్యంలోకి ప్రవేశించడం అనే సందేశాన్ని నేటికీ మనకు తెలియపరుస్తుంది. దివ్యబలి పూజ ప్రారంభంలో, మన హృదయపరివర్తన(conversion) కొరకు ప్రార్థనలు చేశాం. మన ఉమ్మడి నివాసాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఇంకా గుర్తించని, శ్రీసభ లోపల, వెలుపల ఉన్న ఎందరో వ్యక్తుల మార్పు కోసం కూడా మనం ప్రార్థించాలని నా కోరిక.

మన ప్రపంచంలో దాదాపు ప్రతిరోజూ, అనేక ప్రదేశాల్లో, దేశాల్లో సంభవిస్తున్న అనేక సహజ విపత్తులు అన్నీ, మానవుల మితిమీరిన చర్యల వల్లే, మన జీవనశైలి వల్లే సంభవిస్తున్నాయి. మనం నిజంగా మారుమనస్సు (conversion) పొందుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మారుమనస్సు మనకెంత అవసరం!

ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన ప్రసంగాన్ని పంచుకోబోతున్నాను. మీరంతా దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఇందులో కొన్ని కీలక అంశాలు మన ఆలోచనలకు మరింత పదును పెడతాయి. భూతాపం [గ్లోబల్ వార్మింగ్], సాయుధ పోరాటాల కారణంగా ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, మనం సోదరభావంతో కూడిన, శాంతియుత క్షణాలను ఆస్వాదిస్తున్నాం. పోప్ ఫ్రాన్సిస్ తన ఎన్‌సిక్లికల్స్ 'లౌదాతో సి' మరియు 'ఫ్రతెల్లి తుత్తి'లలో ఇచ్చిన సందేశం నేటికీ ఎంతో సమయోచితంగా ఉంది.

మనం ఇప్పుడే విన్న సువార్తను గురించి ఆలోచిస్తే, తుఫాను మధ్య శిష్యులు అనుభవించిన భయం నేడు మానవాళిలో చాలా మందిలో ఉన్న భయాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, జూబిలీ సంవత్సరంలో మనం పదే పదే నిరీక్షణను నమ్ముతూ, ప్రకటిస్తున్నాం. మనం ఆ నిరీక్షణను యేసులో కనుగొన్నాం. ఆయనే తుఫానును శాంతింపజేస్తాడు. ఆయన శక్తి విచ్ఛిన్నం చేయదు, బలోపేతం చేస్తుంది. నాశనం చేయదు, నూతన సృష్టిని చేసి, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. “ఈయన ఎంతటి మహానుభావుడు! గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి” (మత్త 8:27) అని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

ఈ ప్రశ్నలో వ్యక్తమైన ఆశ్చర్యం, భయం నుండి విముక్తి పొందే దిశగా ఇది తొలి అడుగు. యేసు గలిలయ సముద్ర ప్రాంతమున నివసించి, ప్రార్థనలు చేశారు. అక్కడే ఆయన తన ప్రథమ శిష్యులను వారి దైనందిన జీవితంలో, పనిలో భాగంగా పిలిచారు. ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించిన ఉపమానాలు, ఆ భూమితో, ఆ జలాలతో, ఋతువుల క్రమంతో, సృష్టిలోని జీవుల జీవితంతో ఆయనకు ఉన్న లోతైన అనుబంధాన్ని స్పష్టం చేస్తాయి.

మత్తయి సువార్తికుడు తుఫానును ఒక కల్లోలంగా [గ్రీకు పదం, సేయిస్మోస్] వర్ణించారు. యేసు మరణించినప్పుడు, అలాగే ఆయన పునరుత్థానం పొందిన వేళ సంభవించిన భూకంపానికి కూడా మత్తయి ఇదే గ్రీకు పదాన్ని వాడారు. ఈ కల్లోలంపై క్రీస్తు తన పాదాలను స్థిరంగా నిలిపి నిలబడతారు. ఇక్కడే సువార్త మన గందరగోళ చరిత్రలో ఉన్న పునరుత్థానుడైన ప్రభువును మనకు చూపిస్తుంది. యేసు గాలిని, సముద్రాన్ని గద్దించడం, జీవితాన్ని, రక్షణను ఒసగే ఆయన శక్తిని స్పష్టం చేస్తుంది. ఈ శక్తి జీవులను వణికించే శక్తులన్నిటికంటే గొప్పది.

మరొక్కసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు: “ఈయన ఎంతటి మహానుభావుడు! గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి” (మత్త 8:27). మనం విన్న కొలొస్సీయులకు రాసిన లేఖలోని స్తోత్రం ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది: “క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన, దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను” (కొలొస్సీ 1:15-16).

ఆ రోజు తుఫానుకు చిక్కుకుని, శిష్యులు భయంతో నిండిపోయారు; యేసు గురించిన ఈ జ్ఞానం వారికి అప్పుడు పూర్తిగా బోధపడలేదు. అయితే, నేడు, మనకు అందించబడిన విశ్వాసం ప్రకారం, మనం మరింత ముందుకు వెళ్లి ఇలా చెప్పగలం: “ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు, సమస్తమున ఆయనయే ప్రధముడగుటకు ఆయన ఆదియై ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రధమ పుత్రుడు” (కొలొస్సీ 1:18).

ఆ మాటలు, ప్రతి యుగంలోనూ, మనల్ని జీవముగల శరీరంగా మారుస్తాయి, క్రీస్తు శిరస్సుగా ఉన్న ఆ శరీరానికి మనం నిబద్ధులం అయ్యేలా చేస్తాయి. సృష్టిని పరిరక్షించడం, శాంతిని, సఖ్యతను పెంపొందించడం మన లక్ష్యం. ఇది యేసు సొంత లక్ష్యం, అలాగే, ప్రభువు మనకు అప్పగించిన బాధ్యత. మనం భూమి యొక్క ఆక్రందనను వింటాం, పేదల రోదనను వింటాం, ఎందుకంటే ఈ విన్నపం దేవుని హృదయాన్ని చేరింది. మన ఆవేదనే ఆయన ఆవేదన; మన శ్రమ ఆయన శ్రమయే.

ఈ విషయంలో, కీర్తనకారుడి పాట మనకు స్ఫూర్తినిస్తుంది: “ప్రభువు స్వరము జలముల మీద విన్పించు చున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించు చున్నాడు. ఆయన స్వరము సాగరము మీద  విన్పించు చున్నది. ప్రభువు స్వరము మహాబలమైనది. మహా ప్రభావము కలది” (కీర్తన 29:3-4). ఆ స్వరం, ఈ లోకంలోని దుష్టశక్తులను వ్యతిరేకించడానికి ధైర్యం అవసరమైనప్పుడు ప్రవచనాత్మకంగా మాట్లాడటానికి సంఘాన్ని ప్రోత్సహిస్తుంది. సృష్టికర్తకు, ఆయన సృష్టికి మధ్య ఉన్న విడదీయరాని నిబంధన (covenant) మన మనస్సులను ప్రేరేపిస్తుంది. ఇది చెడును మంచిగా, అన్యాయాన్ని న్యాయంగా, అత్యాశను పంచుకోవడంగా మార్చడానికి మన ప్రయత్నాలను ఉత్సాహపరుస్తుంది.

అనంతమైన ప్రేమతో దేవుడు అన్నిటినీ సృష్టించి వాటికి ప్రాణం పోశాడు. అందుకే పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసుగారు ప్రతి జీవిని తన సోదరుడు, సోదరి, తల్లి అని పిలవగలిగారు. కేవలం ధ్యాన దృష్టి (contemplative gaze) మాత్రమే సృష్టితో మనకున్న సంబంధాన్ని మార్చగలదు. దేవునితో, మన పొరుగువారితో, భూమితో మన సంబంధాలు తెగిపోవడం వల్ల ఏర్పడిన పర్యావరణ సంక్షోభం నుండి ఇది మనల్ని బయటపడేస్తుంది. ఈ సంబంధాల విచ్ఛిన్నం పాపం యొక్క పర్యవసానం (లౌదాతో సి', 66 చూడండి).

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మనం ప్రస్తుతం ఉన్న ఈ బోర్గో లౌదాతో సి', పోప్ ఫ్రాన్సిస్ గారి దార్శనికతకు అనుగుణంగా, ఒక రకమైన “ప్రయోగశాల”గా రూపుదిద్దుకోవాలని ఆశిస్తోంది. సృష్టితో సామరస్యాన్ని అనుభవించడం ద్వారా స్వస్థతను, సఖ్యతను పొందడానికి ఇది ఒక వేదిక. మనకు అప్పగించబడిన సహజ పర్యావరణాన్ని రక్షించడానికి కొత్త, సమర్థవంతమైన మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి కృషి చేస్తున్న మీ అందరికీ నా ప్రార్థనలను, ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్నాను.

మనం జరుపుకునే దివ్యబలి పూజ మన శ్రమకు శక్తిని, అర్థాన్ని ఇస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ రాసినట్లుగా, “సృష్టించబడినవన్నీ దివ్యబలి పూజలోనే గొప్ప ఉన్నతిని పొందుతాయి. దేవుడు స్వయంగా మానవుడిగా మారి తన సృష్టికి ఆహారంగా మారినప్పుడు, స్పష్టంగా వ్యక్తమయ్యే కృప అసమానమైన వ్యక్తీకరణను కనుగొంది. మానవునిగా జన్మించిన రహస్యం యొక్క పరాకాష్టలో, ప్రభువు ఒక సూక్ష్మ పదార్థం ద్వారా మన అంతర్గత లోతులకు చేరుకోవాలని ఎంచుకున్నాడు. ఆయనపై నుండి కాదు, లోపల నుండి వస్తారు; మన ఈ ప్రపంచంలో మనం ఆయనను కనుగొనేలా వస్తారు” (లౌదాతో సి', 236).

ఈ ఆలోచనలను ముగించే ముందు, పునీత అగుస్తీను తన ‘కన్‌ఫెషన్స్’ చివరి పేజీలలో సృష్టిని, మానవాళిని ఒక విశ్వ స్తుతి గీతంలో ఏకం చేస్తూ చెప్పిన మాటలతో ముగించాలను కుంటున్నాను: ప్రభూ, “మీ కార్యములు మిమ్మల్ని స్తుతించుగాక, తద్వారా మేము మిమ్మల్ని ప్రేమించగలం; మేము మిమ్మల్ని ప్రేమించగలం, తద్వారా మీ కార్యములు మిమ్మల్ని స్తుతించుగాక” (XIII, 33, 48). సామరస్యాన్నే మనం ప్రపంచమంతటా వ్యాపింపజేద్దాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250709-omelia-custodia-creazione.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

9వ ప్రపంచ పేదల దినోత్సవం సందర్భంగా పొప్ లియో XIV గారి సందేశం (13 జూన్ 2025)

 9వ ప్రపంచ పేదల దినోత్సవం సందర్భంగా పొప్ లియో XIV గారి సందేశం
33వ సామాన్య ఆదివారము
16 నవంబరు 2025



నీవే నా నమ్మిక (కీర్తన 71:5)

[ప్రపంచ పేదల దినోత్సవం (World Day of the Poor) ప్రతి సంవత్సరం నవంబర్ మూడవ ఆదివారం నాడు జరుపబడుతుంది. ఈ దినోత్సవాన్ని పోప్ ఫ్రాన్సిస్ 2016లో స్థాపించారు, పేదల పట్ల అవగాహన, సంఘీభావం మరియు వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తారు.]

1. “దేవా! నీవే నా నమ్మిక” (కీర్తనలు 71:5). ఈ మాటలు తీవ్రమైన కష్టాలతో భారమైన హృదయం నుండి వెలువడుతున్నాయి: “నీవు నన్ను పెక్కు శ్రమలకు కీడులకు గురిచేసితివి” (71:20) అని కీర్తన కారుడు ఆవేదనతో పలికాడు. అదే సమయములో, అతని హృదయం తెరచి ఉంది, దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉంది. దేవుడే “రక్షణ దుర్గము, సురక్షితమైన కోట” అని ఎలుగెత్తి పిలిచాడు (71:3). అందుకే, దేవునిపై ఉంచిన నమ్మకము ఎన్నటికీ నిరాశపరచదనే అతని నిరంతర విశ్వాసం ఇది: “ప్రభూ! నేను నిన్ను ఆశ్రయించితిని. నేను ఏ నాడును అవమానము చెందకుందును గాక!” (71:1).

 

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో నింపబడింది కాబట్టి, మన నిరీక్షణ స్థిరంగా, భరోసాతో నిండి ఉంటుంది. నిరీక్షణ మనకు ఎన్నటికీ నిరాశను కలిగించదు (రోమీ 5:5). అందుకే, పునీత పౌలు తిమోతికి ఇలా వ్రాశాడు: “కనుకనే, సర్వ మానవులకు, అందును విశేషించి, విశ్వాసము కల వారికి, రక్షకుడగు సజీవ దేవుని యందు మన నమ్మికను నిలిపి వుంచుకొని ప్రయాస పడుచు గట్టి కృషి చేయుచున్నాము” (1 తిమోతి 4:10). నిజానికి, జీవముగల దేవుడే “నిరీక్షణకు మూలము” (రోమీ 15:13). అంతేకాదు, యేసుక్రీస్తు తన మరణం, పునరుత్థానం ద్వారా “మన నమ్మికగా”గా మారాడు (1 తిమోతి 1:1). మనం ఈ నిరీక్షణ ద్వారానే రక్షించబడ్డామని, అందులోనే స్థిరంగా పాతుకుపోయి ఉండాలని ఎన్నటికీ మర్చిపోకూడదు.

 

2. నిరుపేదలు నిస్సందేహంగా, బలమైన, స్థిరమైన నిరీక్షణకు సాక్షులుగా నిలుస్తారు. ఎందుకంటే, వారు అనిశ్చితి, పేదరికం, అస్థిరత్వం, వివక్షల మధ్య జీవిస్తూ కూడా తమ జీవితాల్లో నిరీక్షణను నింపుకుంటారు. వారికి అధికారం, ఆస్తులు వంటి భద్రతలు లేవు; పైగా, అవి వారికి ప్రమాదకరంగా మారి, తరచుగా వాటికి బాధితులుగా మారుతుంటారు. కాబట్టి, వారి నిరీక్షణను వేరే చోట వెతుక్కోవాల్సి ఉంటుంది. దేవుడే మన మొదటి, ఏకైక నిరీక్షణ అని మనం గుర్తించినప్పుడు, మనం కూడా అశాశ్వతమైన ఆశల నుండి శాశ్వతమైన నిరీక్షణ వైపు పయనిస్తాము. దేవుడు మన జీవిత ప్రయాణంలో తోడుగా ఉండాలని మనం కోరుకున్నప్పుడు, భౌతిక సంపదలు సాపేక్షంగా మారిపోతాయి. ఎందుకంటే, మనకు నిజంగా అవసరమైన సంపదను మనం అప్పుడు కనుగొంటాం. ప్రభువైన యేసు తన శిష్యులతో చెప్పిన మాటలు బలంగా, స్పష్టంగా ఉన్నాయి: “ఈ లోకములో సంపదలు కూడబెట్టు కొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టు కొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు; దొంగలు కన్నము వేసి దోచుకొనరు” (మత్త 6:19-20).

3. దేవుడిని తెలుసుకోకపోవడం అత్యంత ఘోరమైన పేదరికం. పోప్ ఫ్రాన్సిస్ తన ‘ఎవాంజెలీ గౌదియుమ్’లో ఈ విషయాన్ని నొక్కి చెప్పారు: “పేదలు ఎదుర్కొనే అత్యంత దారుణమైన వివక్ష ఆధ్యాత్మిక సంరక్షణ లేకపోవడం. పేదలలో చాలామందికి విశ్వాసం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది; వారికి దేవుడు కావాలి. కాబట్టి, మనం వారికి ఆయన స్నేహాన్ని, ఆశీర్వాదాన్ని, వాక్యాన్ని, సంస్కారాల ఆచరణను, మరియు విశ్వాసంలో ఎదుగుదలకు, పరిపక్వతకు మార్గాన్ని అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదు” (నం. 2000). ఇది మనం దేవునిలో మన నిజమైన సంపదను ఎలా కనుగొనగలమో అనే ఒక ప్రాథమిక, కీలకమైన అవగాహనను అందిస్తుంది. అపోస్తలుడైన యోహాను కూడా ఈ విషయాన్నే బలపరుస్తూ ఇలా అన్నాడు: “ఎవరైనను తాను దేవుని ప్రేమింతుననిచెప్పుకొనుచు తన సోదరును ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు”  (1 యోహాను 4:20).

 

ఇది విశ్వాసానికి సంబంధించిన ఒక నియమం, ఆశకు సంబంధించిన రహస్యం: ఈ లోకములో ఉన్న వస్తువులు, భౌతిక సుఖాలు, ప్రపంచంలోని సౌకర్యాలు, ఆర్థిక శ్రేయస్సు ఇవన్నీ ఎంత ముఖ్యమైనవైనా మన హృదయాలకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. సంపద తరచుగా నిరాశను కలిగిస్తుంది. అంతేకాదు, అది పేదరికం వంటి విషాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా, దేవుని పట్ల మనకున్న అవసరాన్ని గుర్తించకుండా, ఆయన లేకుండా జీవించడానికి ప్రయత్నించడం వల్ల కలిగే పేదరికం ఇది. పునీత అగుస్తీను గారు చెప్పిన మాటలు ఈ సందర్భంలో గుర్తుకు చేసుకుందాం: “మీ ఆశలన్నీ దేవుడిపైనే ఉంచండి. ఆయన పట్ల మీ అవసరాన్ని గుర్తించండి, ఆయన ఆ అవసరాన్ని తీర్చనివ్వండి. ఆయన లేకుండా, మీరు కలిగి ఉన్నది ఏదైనా మిమ్మల్ని మరింత శూన్యంగా మారుస్తుంది”.

 

4. దేవుని వాక్యం ప్రకారం, క్రైస్తవ నిరీక్షణ జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఒక నిశ్చయమైన భరోసా. ఇది మన మానవ బలంపై ఆధారపడదు, బదులుగా ఎల్లప్పుడూ నమ్మకమైన దేవుని వాగ్దానంపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే, క్రైస్తవులు మొదటి నుండీ నిరీక్షణను లంగరు (Anchor) గుర్తుతో సూచించారు. లంగరు ఓడకు స్థిరత్వం, భద్రతను అందించినట్లే, క్రైస్తవ నిరీక్షణ కూడా మన హృదయాలను ప్రభువైన యేసు వాగ్దానంలో స్థిరంగా పాతుకుపోయేలా చేస్తుంది. ఆయన తన మరణం, పునరుత్థానం ద్వారా మనలను రక్షించారు, మరియు మళ్ళీ మన మధ్యకు వేంచేస్తారు. ఈ నిరీక్షణ మనలను “క్రొత్త దివి”, మరియు “క్రొత్త భువి” (2 పేతురు 3:13) వైపు నిరంతరం నడిపిస్తుంది. ఇది మన ఉనికికి నిజమైన గమ్యం, అక్కడ ప్రతి జీవితం దాని యదార్థమైన అర్థాన్ని కనుగొంటుంది. ఎందుకంటే, మన నిజమైన స్వదేశం పరలోకంలోనే ఉంది (ఫిలిప్పీ 3:20).

 

‘దేవుని నగరం’ (City of God), మానవ నగరాలను మెరుగుపరచడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మన నగరాలు దైవిక నగరానికి ప్రతిబింబంగా మారాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో నింపబడిన దేవుని ప్రేమ (రోమీ 5:5) ద్వారా నిలిచే నిరీక్షణ, మానవ హృదయాలను సారవంతమైన భూమిగా మారుస్తుంది. అక్కడ ప్రపంచ శ్రేయస్సు కోసం దాతృత్వం వికసించగలదు. శ్రీసభ సంప్రదాయం విశ్వాసం, నిరీక్షణ మరియు దాతృత్వం అనే మూడు వేదాంతపరమైన సద్గుణాల మధ్య ఉన్న అన్యోన్య సంబంధాన్ని నిరంతరం నొక్కి చెబుతుంది. నిరీక్షణ విశ్వాసం నుండి ఉద్భవిస్తుంది మరియు అన్ని సద్గుణాలకు మూలం అయిన దాతృత్వం అనే పునాదిపై విశ్వాసం దానిని పోషిస్తుంది, నిలబెడుతుంది. మనందరికీ ఇప్పుడే, ఈ క్షణమే దాతృత్వం అవసరం. దాతృత్వం కేవలం ఒక వాగ్దానం కాదు; అది సంతోషంతో మరియు బాధ్యతతో స్వీకరించబడవలసిన వాస్తవం. దాతృత్వం మనల్ని కలుపుకుని, సాధారణ శ్రేయస్సు వైపు మన నిర్ణయాలను నడిపిస్తుంది. దీనికి విరుద్ధంగా, దాతృత్వం లేనివారు విశ్వాసం మరియు నిరీక్షణను కోల్పోవడమే కాకుండా, తమ పొరుగువారి నుండి కూడా నిరీక్షణను లాగేసుకుంటారు.

 

5. బైబిల్ గ్రంథంలోని ఆశ గురించిన పిలుపు, చరిత్రలో మన బాధ్యతలను ఏ మాత్రం సంకోచం లేకుండా స్వీకరించాల్సిన కర్తవ్యాన్ని స్పష్టం చేస్తుంది. వాస్తవానికి, దాతృత్వం అనేది “ప్రముఖమైన సాంఘిక ఆజ్ఞ” (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 1889). పేదరికానికి నిర్మాణపరమైన కారణాలు ఉన్నాయి, వాటిని పరిష్కరించి, పూర్తిగా తొలగించాలి. ఈలోగా, శతాబ్దాలుగా ఎంతో మంది పునీతులు ఆచరించినట్లే, క్రైస్తవ దాతృత్వానికి నిదర్శనంగా నిలిచే కొత్త ఆశకు చిహ్నాలను అందించడానికి మనలో ప్రతి ఒక్కరం పిలవబడ్డాం. ఉదాహరణకు, ఆసుపత్రులు, పాఠశాలలు అత్యంత బలహీనంగా, అణగారిన స్థితిలో ఉన్నవారికి చేరువయ్యేందుకు స్థాపించబడిన సంస్థలు. ఈ సంస్థలు ప్రతి దేశం యొక్క ప్రభుత్వ విధానంలో అంతర్భాగంగా ఉండాలి, అయినప్పటికీ యుద్ధాలు, అసమానతలు తరచుగా దీనికి అడ్డుపడుతున్నాయి. నేడు, ఆశకు సంబంధించిన చిహ్నాలు వృద్ధాశ్రమాలు, మైనర్ల కోసం కమ్యూనిటీలు, వివిధ వినడం, ఆమోదించే కేంద్రాలు, సూప్ కిచెన్‌లు, నిరాశ్రయ ఆశ్రమాలు వంటి చోట్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నిశ్శబ్ద ఆశకు చిహ్నాలు తరచుగా గుర్తించబడకపోయినా, మన ఉదాసీనతను పక్కన పెట్టి, ఇతరులను వివిధ రకాల స్వచ్ఛంద సేవల్లో పాలుపంచుకునేలా ప్రేరేపించడంలో ఇవి అత్యంత కీలకమైనవి!

 

నిరుపేదలు శ్రీసభకి ఏ మాత్రం భారం కాదు, బదులుగా వారు మన ప్రియ సహోదరీ, సహోదరులే. వారి జీవితాలు, మాటలు, జ్ఞానం ద్వారా వారు మనకు సువార్త సత్యాన్ని పరిచయం చేస్తారు. “పేదలు మన ఆధ్యాత్మిక కార్యకలాపాలన్నింటికీ కేంద్రబిందువు” అని, ప్రపంచ పేదల దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. ఇది కేవలం శ్రీసభ చేసే ధార్మిక కార్యక్రమాలకే పరిమితం కాదు, అది ప్రకటించే సందేశానికి కూడా ఇది వర్తిస్తుంది. దేవుడు పేదరికాన్ని ధరించి, వారి మాట ద్వారా, వారి కథల ద్వారా, వారి ముఖాల ద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేయడానికి వచ్చారు. ప్రతి పేదరికం, ఎటువంటి మినహాయింపు లేకుండా, సువార్తను ఆచరణలో అనుభవించడానికి, మరియు ఆశకు శక్తివంతమైన చిహ్నాలను అందించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది.

 

6. ఈ జూబిలీ వేడుక మనకు అందిస్తున్న ఆహ్వానం ఇదే. ప్రపంచ పేదల దినోత్సవాన్ని ఈ కృపా కాలం చివరిలో జరుపుకోవడం యాదృచ్ఛికం కాదు. పవిత్ర ద్వారం మూసివేసిన తర్వాత, ఈ సంవత్సరం పొడవునా మనకు లభించిన ప్రార్థన, మార్పు, సాక్ష్యాల వంటి దైవిక బహుమతులను మనం పదిలంగా ఉంచుకుని ఇతరులతో పంచుకోవాలి. పేదలు మన ఆధ్యాత్మిక సంరక్షణను స్వీకరించేవారు మాత్రమే కాదు, ఈనాడు సువార్తను ఆచరించడానికి కొత్త మార్గాలను కనుగొనేలా మనల్ని సవాలు చేసే సృజనాత్మక వ్యక్తులు వారు. పేదరికాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, మనం కఠినంగా, నిరాశకు లోనయ్యే ప్రమాదం ఉంది. ప్రతిరోజూ మనం పేదరికంలో ఉన్నవారిని కలుస్తూనే ఉంటాం. ఒక్కోసారి మనం కూడా గతంలో కంటే తక్కువ కలిగి ఉండవచ్చు, లేదా ఒకప్పుడు సురక్షితంగా అనిపించిన వాటిని కోల్పోవచ్చు. అవి ఇల్లు, ప్రతిరోజూ సరిపడా ఆహారం, ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, సమాచారం, మత స్వేచ్ఛ, మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ కావచ్చు.

అందరి శ్రేయస్సును ప్రోత్సహించడంలో, మన సామాజిక బాధ్యత దేవుని సృష్టి కార్యంపై ఆధారపడి ఉంది. ఇది లోకములో ఉన్న సంపదలలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. ఈ సంపదలతో సమానంగా, మానవ శ్రమ ఫలితాలు కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. పేదలకు సహాయం చేయడం అనేది దాతృత్వానికి సంబంధించిన ప్రశ్న కంటే ముందు న్యాయానికి సంబంధించిన విషయం. పునీత అగుస్తీను ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నారు: “మీరు ఆకలితో ఉన్న వ్యక్తికి రొట్టె ఇస్తారు; కానీ ఎవరూ ఆకలితో ఉండకుండా ఉంటే అది ఇంకా మంచిది, అప్పుడు మీరు దాన్ని ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. మీరు బట్టలు లేనివారికి దుస్తులు ఇస్తారు, కానీ అందరూ దుస్తులు ధరించి ఉంటే, ఈ లోటును తీర్చాల్సిన అవసరం ఉండదు”.

 

జూబిలీసంవత్సరం, పాత మరియు కొత్త రకాల పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన విధానాలను మెరుగు పరచాలని, అలాగే అత్యంత నిరుపేదలకు మద్దతు, సహాయం అందించే నూతన కార్యక్రమాలను ప్రోత్సహించాలని నేను ఆశిస్తున్నాను. శ్రమ, విద్య, గృహనిర్మాణం, ఆరోగ్యం అనేవి భద్రతకు పునాదులు. వీటిని ఆయుధాల వినియోగంతో ఎన్నటికీ సాధించలేము. ఇప్పటికే ఉన్న కార్యక్రమాలకు, మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది మంచి మనసున్న వారు  ప్రతిరోజూ చేసే ప్రయత్నాలకు నా ప్రశంసలను తెలియజేస్తున్నాను.

 

కష్టపడెడు వారలకు ఆదరువు అయిన పరిశుద్ధ మరియ మాతకు, మనల్ని మనం అప్పగించుకుందాం. ఆమెతో కలిసి, నిరీక్షణ గీతాన్ని ఆలపిద్దాం. “ప్రభువా, నీవే మా నిరీక్షణ, మేము నిష్ఫలంగా ఆశించము” (‘తే దేయుమ్' Te Deum).

 

వాటికన్, 13 జూన్ 2025, పునీత పాదువా పురి అంథోని స్మరణ, పేదల పాలక పునీతుడు

 

LEO PP. XIV

 

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/messages/poor/documents/20250613-messaggio-giornata-poveri.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

సృష్టి సంరక్షణ కొరకు 10వ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం - పోప్ లియో XIV సందేశం, 30 జూన్ 25

 పోప్ లియో XIV గారి సందేశం
సృష్టి సంరక్షణ కొరకు 10వ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం, 2025
శాంతి మరియు నిరీక్షణా బీజాలు (Seeds of Peace and Hope)



ప్రియ సహోదరీ సహోదరులారా,

మన ప్రియతమ పోప్ ఫ్రాన్సిస్ ఎంపిక చేసిన “ప్రపంచ సృష్టి సంరక్షణ ప్రార్థనా దినోత్సవం” యొక్క అంశం: “శాంతి మరియు నిరీక్షణా బీజాలు”. ‘లౌదాతో సీ’ (Laudato Si') ఎన్‌సిక్లికల్ (Encyclical) పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రార్థనా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంశం ప్రస్తుత జూబిలీ అంశం “నిరీక్షణ యాత్రికులు”కు చాలా సముచితంగా ఉంది.

దేవుని రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు, యేసు తరచుగా ‘విత్తనం’ రూపాన్ని ఉదాహరణగా ఉపయోగించారు. విత్తనం భూమిలో నాటబడి, అదృశ్యమైనప్పటికీ, దానిలో దాగి ఉన్న జీవం చివరికి మొలకెత్తుతుంది. ఇది ఊహించని చోట్ల కూడా నూతన ఆరంభాల వాగ్దానాన్ని సూచిస్తుంది. తన శ్రమల సమయం సమీపిస్తున్నప్పుడు, ఫలమివ్వడానికి నశించవలసిన గోధుమ గింజతో తనను తాను పోల్చుకుంటూ (యోహాను 12:24) యేసు తనకే అన్వయించుకున్నారు. ఇది ఆయన త్యాగం ద్వారా మానవాళికి లభించే నూతన జీవానికి మరియు నిరీక్షణకు ప్రతీక. ఈ భావనను మన నిత్య జీవితంలో కూడా చూడవచ్చు. ఉదాహరణకు, మన రోడ్ల పక్కన యాదృచ్ఛికంగా పడిన విత్తనాల నుండి మొలకెత్తే పువ్వులను గమనించండి! ఆ పువ్వులు పెరిగే కొద్దీ, అవి బూడిద రంగు తారును అందంగా మారుస్తాయి, చివరికి దాని కఠినమైన ఉపరితలాన్ని కూడా చీల్చుకొని బయటకు వస్తాయి. ఇది ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా జీవం మరియు అందం ఎలా మొలకెత్తుతుందో తెలియజేస్తుంది. ఈ దృశ్యం నిరీక్షణ యొక్క శక్తికి మరియు జీవం యొక్క అద్భుతానికి స్పష్టమైన ఉదాహరణ.

క్రీస్తులో, మనం కూడా విత్తనాలమే, వాస్తవానికి, “శాంతి మరియు నిరీక్షణ విత్తనాలమే”. ఈ భావన ప్రవక్త యెషయా చెప్పిన మాటల్లో మరింత స్పష్టంగా వ్యక్తమవుతుంది. దేవుని ఆత్మ బీడు భూమిని తోటగా, విశ్రాంతి మరియు ప్రశాంతత గల ప్రదేశంగా మార్చగలదని యెషయా తెలియజేశాడు. ఆయన మాటల్లోనే: “ప్రభువు పైనుండి తన అనుగ్రహమును మన మీద కురియించును. ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును. పొలములలో పంటలు పుష్కలముగా పండును. ఎడారిలో న్యాయము నెలకొనును. పంట పొలములలో నీతి నిల్చును. నీతి వలన శాంతి కలుగును. నీతి వలన నిత్యము నమ్మకము, నిబ్బరము కలుగును. దేవుని ప్రజలు చీకు చింత లేకుండ శాంతి సమాధానములతో జీవింతురు” (యెషయా 32:15-18). [ఈ లేఖనం, దేవుని కృప మరియు మనలో నాటబడిన శాంతి, నిరీక్షణ విత్తనాలు ఎంతటి పరివర్తనను తీసుకురాగలవో తెలియజేస్తుంది. ఎండిన భూమిని పచ్చని తోటగా మార్చగలిగిన దైవశక్తి, మన జీవితాల్లోనూ, మనం నివసించే సమాజంలోనూ శాంతిని, న్యాయాన్ని, సమృద్ధిని తీసుకురాగలదని ఇది సూచిస్తుంది. కేవలం ప్రార్థనలే కాకుండా, మనం స్వయంగా ఆ శాంతికి, నిరీక్షణకు ప్రతీకలుగా మారినప్పుడు, అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి.]

ప్రవక్త పలికిన ఈ మాటలు “సృష్టి కాలం” (Season of Creation) తోడుగా నిలుస్తాయి. ఇది సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 4, 2025 వరకు జరుపుకోబడే ఒక ఎక్యూమెనికల్ (సర్వమత) కార్యక్రమం. “దేవుని స్పర్శ” (Laudato Si’, 84) మన ప్రపంచానికి స్పష్టంగా కనిపించాలంటే, ప్రార్థనతో పాటు పట్టుదల మరియు ఆచరణాత్మక చర్యలు ఎంతగానో అవసరమని ఈ మాటలు మనకు గుర్తుచేస్తాయి. న్యాయం, చట్టబద్ధతకు పూర్తి విరుద్ధంగా ఉన్న ఎడారి విధ్వంసాన్ని ప్రవక్త వివరిస్తున్నారు. మన భూమి వివిధ ప్రాంతాల్లో తీవ్రంగా ధ్వంసమవుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఆయన సందేశం అత్యంత సమయానుకూలమైనది. అన్యాయం, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, ప్రజల హక్కుల ఉల్లంఘన, తీవ్రమైన అసమానతలు, వాటికి ఆజ్యం పోసే అత్యాశ వంటివి అడవుల నరికివేతకు, కాలుష్యానికి, జీవవైవిధ్య నష్టానికి కారణమవుతున్నాయి. మానవ కార్యకలాపాల వల్ల సంభవించే వాతావరణ మార్పుల ద్వారా కలిగే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు తీవ్రతలోనూ, సంఖ్యలోనూ పెరుగుతున్నాయి (Laudato Deum, 5 చూడండి). ఇక సాయుధ పోరాటాల వల్ల కలిగే మానవ, పర్యావరణ విధ్వంసం యొక్క మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రభావాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. [ఈ పరిస్థితుల్లో, మనం ‘శాంతి మరియు నిరీక్షణ విత్తనాలుగా మారి, మన పరిసరాలను, పర్యావరణాన్ని సంరక్షించడానికి క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.]

ప్రకృతి విధ్వంసం అందరినీ ఒకే విధంగా ప్రభావితం చేయదని మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం. న్యాయం, శాంతి కాలరాయబడినప్పుడు, ఎక్కువగా నష్టపోయేది పేదలు, అట్టడుగు వర్గాలవారు, మరియు సమాజం నుండి వెలివేయబడినవారే. ఈ విషయంలో గిరిజన వర్గాల కష్టాలు అత్యంత స్పష్టమైన నిదర్శనం. [వారు తరచుగా ప్రకృతితో మమేకమై జీవిస్తారు, వారి జీవనోపాధి మరియు సంస్కృతి సహజ వనరులపై ఆధారపడి ఉంటాయి. అడవుల నరికివేత, కాలుష్యం, మరియు వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రకృతి వైపరీత్యాలు వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వారి సంప్రదాయ భూములు లాక్కోబడతాయి, వారి నీటి వనరులు కలుషితమవుతాయి, మరియు వారి జీవనోపాధి మార్గాలు ధ్వంసమవుతాయి. ఈ పరిణామాలు వారిని మరింత పేదరికంలోకి నెట్టివేసి, వారి హక్కులను కాలరాస్తాయి. ఈ అసమానతను గుర్తించడం ద్వారానే మనం మరింత న్యాయబద్ధమైన మరియు సమానమైన ప్రపంచాన్ని నిర్మించగలం. ప్రకృతి సంరక్షణ అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, అది ఒక సామాజిక న్యాయ సమస్య కూడా.]

ఇది మాత్రమే కాదు, ప్రకృతి కూడా కొన్నిసార్లు బేరసారాల వస్తువుగా, ఆర్థిక లేదా రాజకీయ ప్రయోజనాల కోసం అమ్ముడుపోయే సరుకుగా మారిపోతోంది. ఫలితంగా, దేవుని సృష్టి ముఖ్యమైన వనరుల నియంత్రణ కోసం ఒక యుద్ధభూమిగా రూపాంతరం చెందుతుంది. దీన్ని మనం వ్యవసాయ ప్రాంతాలలో [లాభాపేక్షతో కేవలం ఒకే రకమైన పంటలను పండించడం, రసాయనాలను విపరీతంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటోంది], ల్యాండ్‌మైన్‌లతో నిండిన అడవులలో, [యుద్ధాలు లేదా సంఘర్షణల వల్ల అడవులు నాశనమవుతున్నాయి, ఇక్కడ జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది], “కాల్చివేసిన భూమి” (scorched earth) విధానాలలో, [సైనిక వ్యూహాలలో భాగంగా భూమిని, దాని వనరులను పూర్తిగా నాశనం చేయడం], నీటి వనరులపై తలెత్తే సంఘర్షణలలో [నదులు, సరస్సులు వంటి నీటి వనరుల నియంత్రణ కోసం దేశాల మధ్య లేదా ప్రాంతాల మధ్య ఘర్షణలు], మరియు ముడి పదార్థాల అసమాన పంపిణీలో [సహజ వనరులు అధికంగా ఉన్న పేద దేశాల నుండి సంపన్న దేశాలు వాటిని తక్కువ ధరకు దోచుకోవడం] చూస్తున్నాము. ఇవన్నీ పేద దేశాలను మరింతగా దెబ్బతీసి, సామాజిక స్థిరత్వాన్నే నాశనం చేస్తున్నాయి. [ఈ పరిణామాలన్నీ పేద దేశాలను మరింతగా దెబ్బతీసి, సామాజిక స్థిరత్వాన్నే నాశనం చేస్తున్నాయి. ప్రకృతిని కేవలం వినియోగ వస్తువుగా చూడటం మానేసి, దానిని గౌరవించి, సంరక్షించాల్సిన ఆవశ్యకతను ఇది నొక్కి చెబుతుంది. ప్రకృతితో సామరస్యంగా జీవించడం ద్వారానే నిజమైన శాంతి మరియు సుస్థిరత సాధ్యమవుతాయి.]

ప్రకృతికి జరిగిన ఈ గాయాలన్నీ పాపం యొక్క పర్యవసానమే. దేవుడు తన స్వరూపంలో సృష్టించిన స్త్రీపురుషులకు భూమిని అప్పగించినప్పుడు (ఆది 1:24-29 చూడండి) ఆయన ఉద్దేశ్యం ఇది కాదు. “సృష్టిపై నియంతృత్వం” చెలాయించడానికి బైబులు మనకు ఎలాంటి సమర్థననూ ఇవ్వదు (Laudato Si', 200). దీనికి విరుద్ధంగా, “బైబులు గ్రంథాలను వాటి సందర్భంలో, సరైన వ్యాఖ్యానంతో చదవాలి. అవి ప్రపంచమనే తోటను ‘సాగుచేయాలి, కాపాడుకోవాలి’ (ఆది 2:15 చూడండి) అని మనకు చెబుతున్నాయి. ‘సాగుచేయడం’ అంటే దున్నడం లేదా పని చేయడం, అయితే ‘కాపాడుకోవడం’ అంటే సంరక్షించడం, రక్షించడం, పర్యవేక్షించడం మరియు భద్రపరచడం. ఇది మానవులకు మరియు ప్రకృతికి మధ్య పరస్పర బాధ్యతాయుత సంబంధాన్ని సూచిస్తుంది” (Laudato Si', 67). [మనం ప్రకృతిని కేవలం వాడుకోవడానికి మాత్రమే కాకుండా, దానిని జాగ్రత్తగా చూసుకోవడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి బాధ్యత వహించాలి. మన చర్యల ద్వారా ప్రకృతికి కలిగే నష్టాన్ని తగ్గించి, దానిని పునరుద్ధరించడం మనందరి నైతిక బాధ్యత.]

ప్రవక్తలు సూచనప్రాయంగా ప్రకటించిన పర్యావరణ న్యాయం ఇకపై కేవలం ఒక ఊహాజనిత భావనగానో, లేదా చేరుకోలేని లక్ష్యంగానో పరిగణించబడదు. ఇది కేవలం పర్యావరణాన్ని రక్షించడం కంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన తక్షణ అవసరం. ఎందుకంటే ఇది సామాజిక, ఆర్థిక మరియు మానవ న్యాయానికి సంబంధించిన విషయం. విశ్వాసులకు ఇది విశ్వాసం నుండి పుట్టిన ఒక కర్తవ్యం కూడా. సమస్తము సృష్టించబడిన, విమోచించబడిన యేసుక్రీస్తు రూపాన్ని విశ్వం ప్రతిబింబిస్తుంది. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, కాలుష్యం వంటి వినాశకరమైన ప్రభావాలను మనలో అత్యంత బలహీనమైన సహోదరీ సహోదరులే మొదట అనుభవిస్తున్న ఈ ప్రపంచంలో, సృష్టి సంరక్షణ అనేది మన విశ్వాసానికి, మానవత్వానికి నిజమైన మార్గముగా మారుతుంది.

“దేవుని సృష్టిని సంరక్షించే బాధ్యతను నిర్వర్తించడం సద్గుణ జీవితానికి అత్యంత ఆవశ్యకం; ఇది మన క్రైస్తవ అనుభవంలో ఐచ్ఛికమైన లేదా ద్వితీయ శ్రేణి అంశం కాదు” (Laudato Si’, 217). [సృష్టి సంరక్షణ అనేది మన విశ్వాస జీవితంలో అంతర్భాగం. ఇప్పుడు కేవలం సంభాషణలు, చర్చలు కాదు, ఆచరణాత్మక చర్యలతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.] ప్రేమతో, పట్టుదలతో కృషి చేయడం ద్వారా, మనం అనేక న్యాయ బీజాలను నాటవచ్చు. దీనివల్ల శాంతి వృద్ధి చెందడానికి, ఆశలు చిగురించడానికి తోడ్పడగలం. ఈ మొక్క మొదటి ఫలాలను ఇవ్వడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఆ సంవత్సరాలు నిరంతరాయంగా సాగే, విశ్వసనీయమైన, సహకారంతో కూడిన, ప్రేమతో నిండిన ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆ ప్రేమ ప్రభువు యొక్క ఆత్మబలిదాన ప్రేమను ప్రతిబింబిస్తే ఇది మరింత సాధ్యమవుతుంది.

శ్రీసభ చేపట్టిన కార్యక్రమాలలో, సృష్టి సంరక్షణ కృషిలో నాటిన విత్తనాలలో ఒకటి బోర్గో లౌదాతో సీ (Borgo Laudato Si’) ప్రాజెక్ట్. దీనిని పోప్ ఫ్రాన్సిస్ కాస్టెల్ గండోల్ఫోలో మనకు బహుకరించారు. ఇది న్యాయం, శాంతి ఫలాలను అందించే ఒక విత్తనం లాంటిది. అంతేకాకుండా, ఇది సమగ్ర పర్యావరణ విద్యకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్. ‘లౌదాతో సీ’ ఎన్‌సిక్లికల్ సూత్రాలను అనుసరించి ప్రజలు ఎలా జీవించవచ్చు, పని చేయవచ్చు, మరియు సమాజాన్ని ఎలా నిర్మించుకోవచ్చు అనేదానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. బోర్గో లౌదాతో సీ ప్రాజెక్ట్, పర్యావరణ స్పృహను పెంపొందించడం ద్వారా, భవిష్యత్ తరాలకు సుస్థిరమైన మరియు సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి ఒక ఆశాదీపంగా నిలుస్తోంది.

సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు సమృద్ధిగా తన “ఉన్నత స్థలం నుండి ఆత్మను” (యెషయా 32:15) పంపాలని నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా మనం నాటిన ఈ విత్తనాలు, మరియు వీటిలాంటి ఇతర విత్తనాలు కూడా శాంతి మరియు ఆశల సమృద్ధియైన పంటను అందిస్తాయి.

‘లౌదాతో సీ’ ఎన్‌సిక్లికల్ గత పదేళ్లుగా కతోలిక శ్రీసభకు, మరియు మంచి మనసున్న ఎంతోమందికి నిజంగా ఒక మార్గదర్శకంగా నిలిచింది. ఇది మనల్ని మరింతగా ప్రేరేపించాలి, అలాగే సమగ్ర పర్యావరణ శాస్త్రం (integral ecology) సరైన మార్గంగా విస్తృతంగా ఆమోదించబడాలి. ఈ విధంగా, ఆశల విత్తనాలు గుణించబడతాయి. మన గొప్ప, తరగని ఆశ అయిన పునరుత్థానుడైన క్రీస్తు కృపచే అవి 'సాగుచేయబడి, కాపాడబడతాయి'. ఆయన నామంలో, మీ అందరికీ నా ఆశీర్వాదాలు.

వాటికన్, 30 జూన్ 2025

ప్రధమ వేదసాక్షుల స్మరణ

 LEO PP. XIV

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/messages/creation/documents/20250630-messaggio-giornata-curacreato.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

గురువుల పవిత్రీకరణ కొరకు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భముగా పొప్ లియో XIV సందేశము, 27 జూన్ 2025

 గురువుల పవిత్రీకరణ కొరకు ప్రపంచ ప్రార్థనా దినోత్సవం సందర్భముగా
పొప్ లియో XIV సందేశము
[27 జూన్ 2025, యేసు తిరు హృదయ మహోత్సవము]

 


ప్రియ సోదర గురువులారా!

యేసు పవిత్ర హృదయ మహోత్సవమును పురస్కరించుకొని మనం జరుపుకుంటున్న గురువుల పవిత్రీకరణ దినోత్సవం నాడు, ప్రియ గురువులైన మీ అందరికీ నా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ప్రేమతో గాయపడిన క్రీస్తు హృదయం, సజీవంగా, జీవంతో నిండిన శరీరమై మనందరినీ అక్కున చేర్చుకుంటుంది. అది మనల్ని మంచి కాపరి స్వరూపంలోకి మారుస్తుంది. అక్కడే మన సేవ యొక్క నిజమైన స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటాం. దేవుని దయతో నిండినవారమై, స్వస్థపరిచే, తోడుగా ఉండే, మరియు విమోచించే ఆయన ప్రేమకు మనం ఆనందంతో సాక్ష్యమిస్తాం.

నేటి ఈ మహోత్సవము, దేవుని పవిత్ర ప్రజలకు సేవ చేయడానికి మనల్ని పూర్తిగా అంకితం చేసుకోవాలనే పిలుపును మన హృదయాల్లో తిరిగి నింపుతుంది. ఈ సేవ ప్రార్థనతోనే ప్రారంభమై, ప్రభువుతో ఐక్యతలో కొనసాగుతుంది. ఆయన మనలో యాజకత్వానికి సంబంధించిన పవిత్ర వరాన్ని నిరంతరం పునరుజ్జీవింపజేస్తూనే ఉంటారు.

అనుగ్రహాన్ని మనం హృదయంలో నిలుపుకోవడం అంటే, పునీత అగుస్తీను గారు చెప్పినట్లుగా, “విశాలమైన మరియు లోతైన అంతర్గత మందిరంలోకి” ప్రవేశించడమే (cf. కన్ఫెశ్శన్స్, X, 8.15). ఇది కేవలం గతాన్ని గుర్తుచేసుకోవడం కాదు, దాని గొప్ప సంపదలను ఎల్లప్పుడూ నూతనముగా, ప్రస్తుతానికి తగినట్లుగా నిలుపుకోవడం. ఇలాంటి జ్ఞాపకం ద్వారానే ప్రభువు మనకు అప్పగించిన, ఆయన పేరిట పంచమని ఆదేశించిన ఆ వరాన్ని మనం అనుభవించగలం, పునరుద్ధరించగలం. జ్ఞాపకం, మన హృదయాలను క్రీస్తు హృదయంతో, మన జీవితాలను ఆయన జీవనంతో ఏకం చేస్తుంది. తద్వారా, ప్రేమతో నిండిన సఖ్యతగల లోకాన్ని తీసుకురావడానికి, దేవుని పవిత్ర ప్రజలకు రక్షణ వాక్యాన్ని, దివ్యసంస్కారాలను అందించడానికి ఇది మనకు మార్గం సుగమం చేస్తుంది. యేసు హృదయంలోనే మనం దేవుని బిడ్డలుగా, ఒకరికొకరు సోదరసోదరీమణులుగా మన నిజమైన మానవత్వాన్ని గుర్తించగలం. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని, ఈరోజు నేను మీకు ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, అదేమిటంటే, మీరు ఐక్యతను, శాంతిని నిర్మించండి!

ప్రపంచవ్యాప్తంగా, కుటుంబాల్లో, అలాగే వివిధ సంఘాలలో కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ తరుణంలో, గురువులు సఖ్యతను ప్రోత్సహించి, ఐక్యతను పెంపొందించడం అత్యవసరం. ఐక్యతను, శాంతిని నిర్మించాలంటే, మనం వివేకవంతమైన విచక్షణ గల కాపరులుగా ఉండాలి. మనకు అప్పగించిన జీవితాల్లోని చీలికలను తిరిగి ఏకము చేయగలిగే నైపుణ్యం మనకు ఉండాలి. అప్పుడే జీవితంలోని కష్టాల మధ్య కూడా ప్రజలు సువార్త వెలుగును చూడగలుగుతారు. సంక్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకొని, విశ్లేషించే సామర్థ్యం దీనికి చాలా ముఖ్యం. అంతేకాకుండా, క్షణికమైన భావోద్వేగాలు, భయాలు, తాత్కాలిక పోకడల ఒత్తిడిని అధిగమించగలగాలి. దీనివల్ల, మంచి సంబంధాలను, ఐక్యతా బంధాలను, సహభాగ్యపు స్ఫూర్తితో ప్రకాశించే సంఘాలను నిర్మించడం ద్వారా విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేసే మరియు తిరిగి నిలిపే ఆధ్యాత్మిక పరిష్కారాలను అందించడం సాధ్యపడుతుంది. ఐక్యతకు, శాంతికి నిర్మాతలుగా ఉండటం అంటే సేవ చేయడమే తప్ప, అధికారం చెలాయించడం కాదు. మనం గురువులుగా కలిసి సాగే ప్రయాణంలో యాజక సహోదరత్వం ఒక ప్రత్యేక లక్షణంగా ఉన్నప్పుడు, అది పునరుత్థానమైన ప్రభువు మన మధ్య ఉన్నాడనడానికి నమ్మదగిన సంకేతం అవుతుంది.

ఈ రోజు, మీ గురుపట్టాభిషేకం నాడు దేవునికి, ఆయన పవిత్ర ప్రజలకు మీరు ఇచ్చిన “అవును” అను మాటను క్రీస్తు హృదయమునందు పునరుద్ధరించుకోవాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కృప ద్వారా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఆ రోజు మీరు పొందిన ఆత్మ అగ్నిని కాపాడుకోండి. తద్వారా, ఆయనతో ఐక్యమై, మీరు లోకంలో యేసు ప్రేమకు సజీవ సంస్కారంగా మారవచ్చు. మీ వ్యక్తిగత బలహీనతకు భయపడకండి: ప్రభువు పరిపూర్ణ గురువులను కోరడు, కానీ మారుమనస్సుకు సిద్ధంగా ఉన్న, ఇతరులను ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ప్రేమించడానికి సిద్ధంగా ఉన్న వినయపూర్వకమైన హృదయాలను మాత్రమే కోరతాడు.

ప్రియమైన సోదర గురువులారా, పోప్ ఫ్రాన్సిస్ గారు మనల్ని పవిత్ర హృదయానికి తిరిగి అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఇది ప్రభువుతో మన వ్యక్తిగత అనుభవానికి (cf. దిలెక్సిత్ నోస్, 103) కేంద్రమని ఆయన అన్నారు. మన అంతర్గత సంఘర్షణలనే కాకుండా, మనం జీవిస్తున్న ప్రపంచాన్ని చీల్చివేస్తున్న సంఘర్షణలను కూడా ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే ఆయనలో, “మనం ఒకరితో ఒకరం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రీతిలో సంబంధాలను ఏర్పరుచుకోవాలని, మరియు ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ, న్యాయం యొక్క రాజ్యాన్ని నిర్మించాలని నేర్చుకుంటాము. మన హృదయాలు, క్రీస్తు హృదయంతో ఏకమై, ఈ సామాజిక అద్భుతాన్ని చేయగలవు” (దిలెక్సిత్ నోస్, 28).

అపోస్తలుల రాణి, గురువుల తల్లి అయిన మరియ మాతకు మీ అందరినీ అప్పగిస్తూ, హృదయపూర్వక ఆశీస్సులు మీకు అందిస్తున్నాను.

వాటికన్, జూన్ 27, 2025

లియో PP. XIV

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/messages/pont-messages/2025/documents/20250627-messaggio-santificazione-sacerdotale.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.