9వ ప్రపంచ పేదల దినోత్సవం సందర్భంగా పొప్ లియో XIV గారి సందేశం (13 జూన్ 2025)

 9వ ప్రపంచ పేదల దినోత్సవం సందర్భంగా పొప్ లియో XIV గారి సందేశం
33వ సామాన్య ఆదివారము
16 నవంబరు 2025



నీవే నా నమ్మిక (కీర్తన 71:5)

[ప్రపంచ పేదల దినోత్సవం (World Day of the Poor) ప్రతి సంవత్సరం నవంబర్ మూడవ ఆదివారం నాడు జరుపబడుతుంది. ఈ దినోత్సవాన్ని పోప్ ఫ్రాన్సిస్ 2016లో స్థాపించారు, పేదల పట్ల అవగాహన, సంఘీభావం మరియు వారికి సహాయం చేయాలనే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తారు.]

1. “దేవా! నీవే నా నమ్మిక” (కీర్తనలు 71:5). ఈ మాటలు తీవ్రమైన కష్టాలతో భారమైన హృదయం నుండి వెలువడుతున్నాయి: “నీవు నన్ను పెక్కు శ్రమలకు కీడులకు గురిచేసితివి” (71:20) అని కీర్తన కారుడు ఆవేదనతో పలికాడు. అదే సమయములో, అతని హృదయం తెరచి ఉంది, దేవునిపై నమ్మకాన్ని కలిగి ఉంది. దేవుడే “రక్షణ దుర్గము, సురక్షితమైన కోట” అని ఎలుగెత్తి పిలిచాడు (71:3). అందుకే, దేవునిపై ఉంచిన నమ్మకము ఎన్నటికీ నిరాశపరచదనే అతని నిరంతర విశ్వాసం ఇది: “ప్రభూ! నేను నిన్ను ఆశ్రయించితిని. నేను ఏ నాడును అవమానము చెందకుందును గాక!” (71:1).

 

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో నింపబడింది కాబట్టి, మన నిరీక్షణ స్థిరంగా, భరోసాతో నిండి ఉంటుంది. నిరీక్షణ మనకు ఎన్నటికీ నిరాశను కలిగించదు (రోమీ 5:5). అందుకే, పునీత పౌలు తిమోతికి ఇలా వ్రాశాడు: “కనుకనే, సర్వ మానవులకు, అందును విశేషించి, విశ్వాసము కల వారికి, రక్షకుడగు సజీవ దేవుని యందు మన నమ్మికను నిలిపి వుంచుకొని ప్రయాస పడుచు గట్టి కృషి చేయుచున్నాము” (1 తిమోతి 4:10). నిజానికి, జీవముగల దేవుడే “నిరీక్షణకు మూలము” (రోమీ 15:13). అంతేకాదు, యేసుక్రీస్తు తన మరణం, పునరుత్థానం ద్వారా “మన నమ్మికగా”గా మారాడు (1 తిమోతి 1:1). మనం ఈ నిరీక్షణ ద్వారానే రక్షించబడ్డామని, అందులోనే స్థిరంగా పాతుకుపోయి ఉండాలని ఎన్నటికీ మర్చిపోకూడదు.

 

2. నిరుపేదలు నిస్సందేహంగా, బలమైన, స్థిరమైన నిరీక్షణకు సాక్షులుగా నిలుస్తారు. ఎందుకంటే, వారు అనిశ్చితి, పేదరికం, అస్థిరత్వం, వివక్షల మధ్య జీవిస్తూ కూడా తమ జీవితాల్లో నిరీక్షణను నింపుకుంటారు. వారికి అధికారం, ఆస్తులు వంటి భద్రతలు లేవు; పైగా, అవి వారికి ప్రమాదకరంగా మారి, తరచుగా వాటికి బాధితులుగా మారుతుంటారు. కాబట్టి, వారి నిరీక్షణను వేరే చోట వెతుక్కోవాల్సి ఉంటుంది. దేవుడే మన మొదటి, ఏకైక నిరీక్షణ అని మనం గుర్తించినప్పుడు, మనం కూడా అశాశ్వతమైన ఆశల నుండి శాశ్వతమైన నిరీక్షణ వైపు పయనిస్తాము. దేవుడు మన జీవిత ప్రయాణంలో తోడుగా ఉండాలని మనం కోరుకున్నప్పుడు, భౌతిక సంపదలు సాపేక్షంగా మారిపోతాయి. ఎందుకంటే, మనకు నిజంగా అవసరమైన సంపదను మనం అప్పుడు కనుగొంటాం. ప్రభువైన యేసు తన శిష్యులతో చెప్పిన మాటలు బలంగా, స్పష్టంగా ఉన్నాయి: “ఈ లోకములో సంపదలు కూడబెట్టు కొనవలదు. చెదపురుగులు, త్రుప్పు వానిని తినివేయును. దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టు కొనుము. అచట వానిని చెదపురుగులు, త్రుప్పు తినివేయవు; దొంగలు కన్నము వేసి దోచుకొనరు” (మత్త 6:19-20).

3. దేవుడిని తెలుసుకోకపోవడం అత్యంత ఘోరమైన పేదరికం. పోప్ ఫ్రాన్సిస్ తన ‘ఎవాంజెలీ గౌదియుమ్’లో ఈ విషయాన్ని నొక్కి చెప్పారు: “పేదలు ఎదుర్కొనే అత్యంత దారుణమైన వివక్ష ఆధ్యాత్మిక సంరక్షణ లేకపోవడం. పేదలలో చాలామందికి విశ్వాసం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది; వారికి దేవుడు కావాలి. కాబట్టి, మనం వారికి ఆయన స్నేహాన్ని, ఆశీర్వాదాన్ని, వాక్యాన్ని, సంస్కారాల ఆచరణను, మరియు విశ్వాసంలో ఎదుగుదలకు, పరిపక్వతకు మార్గాన్ని అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదు” (నం. 2000). ఇది మనం దేవునిలో మన నిజమైన సంపదను ఎలా కనుగొనగలమో అనే ఒక ప్రాథమిక, కీలకమైన అవగాహనను అందిస్తుంది. అపోస్తలుడైన యోహాను కూడా ఈ విషయాన్నే బలపరుస్తూ ఇలా అన్నాడు: “ఎవరైనను తాను దేవుని ప్రేమింతుననిచెప్పుకొనుచు తన సోదరును ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు”  (1 యోహాను 4:20).

 

ఇది విశ్వాసానికి సంబంధించిన ఒక నియమం, ఆశకు సంబంధించిన రహస్యం: ఈ లోకములో ఉన్న వస్తువులు, భౌతిక సుఖాలు, ప్రపంచంలోని సౌకర్యాలు, ఆర్థిక శ్రేయస్సు ఇవన్నీ ఎంత ముఖ్యమైనవైనా మన హృదయాలకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. సంపద తరచుగా నిరాశను కలిగిస్తుంది. అంతేకాదు, అది పేదరికం వంటి విషాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా, దేవుని పట్ల మనకున్న అవసరాన్ని గుర్తించకుండా, ఆయన లేకుండా జీవించడానికి ప్రయత్నించడం వల్ల కలిగే పేదరికం ఇది. పునీత అగుస్తీను గారు చెప్పిన మాటలు ఈ సందర్భంలో గుర్తుకు చేసుకుందాం: “మీ ఆశలన్నీ దేవుడిపైనే ఉంచండి. ఆయన పట్ల మీ అవసరాన్ని గుర్తించండి, ఆయన ఆ అవసరాన్ని తీర్చనివ్వండి. ఆయన లేకుండా, మీరు కలిగి ఉన్నది ఏదైనా మిమ్మల్ని మరింత శూన్యంగా మారుస్తుంది”.

 

4. దేవుని వాక్యం ప్రకారం, క్రైస్తవ నిరీక్షణ జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఒక నిశ్చయమైన భరోసా. ఇది మన మానవ బలంపై ఆధారపడదు, బదులుగా ఎల్లప్పుడూ నమ్మకమైన దేవుని వాగ్దానంపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే, క్రైస్తవులు మొదటి నుండీ నిరీక్షణను లంగరు (Anchor) గుర్తుతో సూచించారు. లంగరు ఓడకు స్థిరత్వం, భద్రతను అందించినట్లే, క్రైస్తవ నిరీక్షణ కూడా మన హృదయాలను ప్రభువైన యేసు వాగ్దానంలో స్థిరంగా పాతుకుపోయేలా చేస్తుంది. ఆయన తన మరణం, పునరుత్థానం ద్వారా మనలను రక్షించారు, మరియు మళ్ళీ మన మధ్యకు వేంచేస్తారు. ఈ నిరీక్షణ మనలను “క్రొత్త దివి”, మరియు “క్రొత్త భువి” (2 పేతురు 3:13) వైపు నిరంతరం నడిపిస్తుంది. ఇది మన ఉనికికి నిజమైన గమ్యం, అక్కడ ప్రతి జీవితం దాని యదార్థమైన అర్థాన్ని కనుగొంటుంది. ఎందుకంటే, మన నిజమైన స్వదేశం పరలోకంలోనే ఉంది (ఫిలిప్పీ 3:20).

 

‘దేవుని నగరం’ (City of God), మానవ నగరాలను మెరుగుపరచడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మన నగరాలు దైవిక నగరానికి ప్రతిబింబంగా మారాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో నింపబడిన దేవుని ప్రేమ (రోమీ 5:5) ద్వారా నిలిచే నిరీక్షణ, మానవ హృదయాలను సారవంతమైన భూమిగా మారుస్తుంది. అక్కడ ప్రపంచ శ్రేయస్సు కోసం దాతృత్వం వికసించగలదు. శ్రీసభ సంప్రదాయం విశ్వాసం, నిరీక్షణ మరియు దాతృత్వం అనే మూడు వేదాంతపరమైన సద్గుణాల మధ్య ఉన్న అన్యోన్య సంబంధాన్ని నిరంతరం నొక్కి చెబుతుంది. నిరీక్షణ విశ్వాసం నుండి ఉద్భవిస్తుంది మరియు అన్ని సద్గుణాలకు మూలం అయిన దాతృత్వం అనే పునాదిపై విశ్వాసం దానిని పోషిస్తుంది, నిలబెడుతుంది. మనందరికీ ఇప్పుడే, ఈ క్షణమే దాతృత్వం అవసరం. దాతృత్వం కేవలం ఒక వాగ్దానం కాదు; అది సంతోషంతో మరియు బాధ్యతతో స్వీకరించబడవలసిన వాస్తవం. దాతృత్వం మనల్ని కలుపుకుని, సాధారణ శ్రేయస్సు వైపు మన నిర్ణయాలను నడిపిస్తుంది. దీనికి విరుద్ధంగా, దాతృత్వం లేనివారు విశ్వాసం మరియు నిరీక్షణను కోల్పోవడమే కాకుండా, తమ పొరుగువారి నుండి కూడా నిరీక్షణను లాగేసుకుంటారు.

 

5. బైబిల్ గ్రంథంలోని ఆశ గురించిన పిలుపు, చరిత్రలో మన బాధ్యతలను ఏ మాత్రం సంకోచం లేకుండా స్వీకరించాల్సిన కర్తవ్యాన్ని స్పష్టం చేస్తుంది. వాస్తవానికి, దాతృత్వం అనేది “ప్రముఖమైన సాంఘిక ఆజ్ఞ” (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 1889). పేదరికానికి నిర్మాణపరమైన కారణాలు ఉన్నాయి, వాటిని పరిష్కరించి, పూర్తిగా తొలగించాలి. ఈలోగా, శతాబ్దాలుగా ఎంతో మంది పునీతులు ఆచరించినట్లే, క్రైస్తవ దాతృత్వానికి నిదర్శనంగా నిలిచే కొత్త ఆశకు చిహ్నాలను అందించడానికి మనలో ప్రతి ఒక్కరం పిలవబడ్డాం. ఉదాహరణకు, ఆసుపత్రులు, పాఠశాలలు అత్యంత బలహీనంగా, అణగారిన స్థితిలో ఉన్నవారికి చేరువయ్యేందుకు స్థాపించబడిన సంస్థలు. ఈ సంస్థలు ప్రతి దేశం యొక్క ప్రభుత్వ విధానంలో అంతర్భాగంగా ఉండాలి, అయినప్పటికీ యుద్ధాలు, అసమానతలు తరచుగా దీనికి అడ్డుపడుతున్నాయి. నేడు, ఆశకు సంబంధించిన చిహ్నాలు వృద్ధాశ్రమాలు, మైనర్ల కోసం కమ్యూనిటీలు, వివిధ వినడం, ఆమోదించే కేంద్రాలు, సూప్ కిచెన్‌లు, నిరాశ్రయ ఆశ్రమాలు వంటి చోట్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నిశ్శబ్ద ఆశకు చిహ్నాలు తరచుగా గుర్తించబడకపోయినా, మన ఉదాసీనతను పక్కన పెట్టి, ఇతరులను వివిధ రకాల స్వచ్ఛంద సేవల్లో పాలుపంచుకునేలా ప్రేరేపించడంలో ఇవి అత్యంత కీలకమైనవి!

 

నిరుపేదలు శ్రీసభకి ఏ మాత్రం భారం కాదు, బదులుగా వారు మన ప్రియ సహోదరీ, సహోదరులే. వారి జీవితాలు, మాటలు, జ్ఞానం ద్వారా వారు మనకు సువార్త సత్యాన్ని పరిచయం చేస్తారు. “పేదలు మన ఆధ్యాత్మిక కార్యకలాపాలన్నింటికీ కేంద్రబిందువు” అని, ప్రపంచ పేదల దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. ఇది కేవలం శ్రీసభ చేసే ధార్మిక కార్యక్రమాలకే పరిమితం కాదు, అది ప్రకటించే సందేశానికి కూడా ఇది వర్తిస్తుంది. దేవుడు పేదరికాన్ని ధరించి, వారి మాట ద్వారా, వారి కథల ద్వారా, వారి ముఖాల ద్వారా మనల్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేయడానికి వచ్చారు. ప్రతి పేదరికం, ఎటువంటి మినహాయింపు లేకుండా, సువార్తను ఆచరణలో అనుభవించడానికి, మరియు ఆశకు శక్తివంతమైన చిహ్నాలను అందించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది.

 

6. ఈ జూబిలీ వేడుక మనకు అందిస్తున్న ఆహ్వానం ఇదే. ప్రపంచ పేదల దినోత్సవాన్ని ఈ కృపా కాలం చివరిలో జరుపుకోవడం యాదృచ్ఛికం కాదు. పవిత్ర ద్వారం మూసివేసిన తర్వాత, ఈ సంవత్సరం పొడవునా మనకు లభించిన ప్రార్థన, మార్పు, సాక్ష్యాల వంటి దైవిక బహుమతులను మనం పదిలంగా ఉంచుకుని ఇతరులతో పంచుకోవాలి. పేదలు మన ఆధ్యాత్మిక సంరక్షణను స్వీకరించేవారు మాత్రమే కాదు, ఈనాడు సువార్తను ఆచరించడానికి కొత్త మార్గాలను కనుగొనేలా మనల్ని సవాలు చేసే సృజనాత్మక వ్యక్తులు వారు. పేదరికాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, మనం కఠినంగా, నిరాశకు లోనయ్యే ప్రమాదం ఉంది. ప్రతిరోజూ మనం పేదరికంలో ఉన్నవారిని కలుస్తూనే ఉంటాం. ఒక్కోసారి మనం కూడా గతంలో కంటే తక్కువ కలిగి ఉండవచ్చు, లేదా ఒకప్పుడు సురక్షితంగా అనిపించిన వాటిని కోల్పోవచ్చు. అవి ఇల్లు, ప్రతిరోజూ సరిపడా ఆహారం, ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, సమాచారం, మత స్వేచ్ఛ, మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ కావచ్చు.

అందరి శ్రేయస్సును ప్రోత్సహించడంలో, మన సామాజిక బాధ్యత దేవుని సృష్టి కార్యంపై ఆధారపడి ఉంది. ఇది లోకములో ఉన్న సంపదలలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది. ఈ సంపదలతో సమానంగా, మానవ శ్రమ ఫలితాలు కూడా అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. పేదలకు సహాయం చేయడం అనేది దాతృత్వానికి సంబంధించిన ప్రశ్న కంటే ముందు న్యాయానికి సంబంధించిన విషయం. పునీత అగుస్తీను ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇలా అన్నారు: “మీరు ఆకలితో ఉన్న వ్యక్తికి రొట్టె ఇస్తారు; కానీ ఎవరూ ఆకలితో ఉండకుండా ఉంటే అది ఇంకా మంచిది, అప్పుడు మీరు దాన్ని ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. మీరు బట్టలు లేనివారికి దుస్తులు ఇస్తారు, కానీ అందరూ దుస్తులు ధరించి ఉంటే, ఈ లోటును తీర్చాల్సిన అవసరం ఉండదు”.

 

జూబిలీసంవత్సరం, పాత మరియు కొత్త రకాల పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన విధానాలను మెరుగు పరచాలని, అలాగే అత్యంత నిరుపేదలకు మద్దతు, సహాయం అందించే నూతన కార్యక్రమాలను ప్రోత్సహించాలని నేను ఆశిస్తున్నాను. శ్రమ, విద్య, గృహనిర్మాణం, ఆరోగ్యం అనేవి భద్రతకు పునాదులు. వీటిని ఆయుధాల వినియోగంతో ఎన్నటికీ సాధించలేము. ఇప్పటికే ఉన్న కార్యక్రమాలకు, మరియు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది మంచి మనసున్న వారు  ప్రతిరోజూ చేసే ప్రయత్నాలకు నా ప్రశంసలను తెలియజేస్తున్నాను.

 

కష్టపడెడు వారలకు ఆదరువు అయిన పరిశుద్ధ మరియ మాతకు, మనల్ని మనం అప్పగించుకుందాం. ఆమెతో కలిసి, నిరీక్షణ గీతాన్ని ఆలపిద్దాం. “ప్రభువా, నీవే మా నిరీక్షణ, మేము నిష్ఫలంగా ఆశించము” (‘తే దేయుమ్' Te Deum).

 

వాటికన్, 13 జూన్ 2025, పునీత పాదువా పురి అంథోని స్మరణ, పేదల పాలక పునీతుడు

 

LEO PP. XIV

 

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/messages/poor/documents/20250613-messaggio-giornata-poveri.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment