సృష్టి పరిరక్షణ కొరకు దివ్య బలిపూజ, పోప్ లియో XIV ప్రసంగము, 9 జూలై 2025

 సృష్టి పరిరక్షణ కొరకు దివ్య బలిపూజ
పోప్ లియో XIV గారి ప్రసంగము
బోర్గో లౌదాతో సి' (కాస్టెల్ గాండోల్ఫో)
బుధవారం, 9 జూలై 2025



ఈ అందమైన రోజున, ప్రకృతి సౌందర్యం నడుమ మనం ఇక్కడ ఏమి జరుపుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించమని నాతో సహా మీ అందరినీ కోరుతున్నాను. వృక్షాలు, సృష్టిలోని ఎన్నో అంశాలతో నిండిన ఈ “ప్రకృతి దేవాలయం” మనందరినీ ఇక్కడకు చేర్చింది. ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పే దివ్యబలి పూజ కొనియాడుటకు మనందరం ఒకటిగా ఇక్కడ సమావేశమయ్యాము.

ఈరోజు దివ్యబలి పూజలో ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడానికి అనేక కారణాలున్నాయి. సృష్టి పరిరక్షణ కోసం ఉద్దేశించిన దివ్యబలి పూజకు సంబంధించిన కొత్త ప్రార్థనలను ఉపయోగించి జరుపుతున్న మొదటి వేడుక బహుశా ఇదే కావచ్చు. ఈ ప్రార్థనలు వాటికన్ (హోలీ సీ) లోని అనేక డికాస్టరీలు (విభాగాలు) చేసిన కృషి ఫలితంగా రూపొందాయి.

ఈ ప్రార్థనల రూపకల్పనలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీకు తెలిసినట్లే, ప్రార్థనలు జీవితానికి ప్రతీకలు, మరియు లౌదాతో సి' సెంటర్’కు మీరే జీవం. ఈ సందర్భంగా, పోప్ ఫ్రాన్సిస్ గారి గొప్ప ఆలోచనను కార్యరూపం దాల్చడానికి మీరు చేస్తున్న కృషికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సృష్టిని, మన ఉమ్మడి నివాసాన్ని పరిరక్షించే కీలకమైన బాధ్యతను కొనసాగించడానికి, వారు ఈ చిన్న భూభాగాన్ని, ఈ ఉద్యానవనాలను, ఈ నడక మార్గాలను దానం చేసారు. ‘లౌదాతో సి' ప్రచురించిన పదేళ్ల తర్వాత, ఈ లక్ష్యాన్ని నిరంతరాయంగా కొనసాగించవలసిన ఆవశ్యకత  మరింత స్పష్టంగా కనిపించింది.



ఈ ప్రదేశం [ఒక జలధార ముందు] ప్రాచీన దేవాలయాలను తలపిస్తోంది. అప్పట్లో దేవాలయములోకి వెళ్ళేముందు, జ్ఞానస్నానం ఇచ్చే స్థలం (baptismal font) గుండా వెళ్ళేవారు. నేను ఇక్కడ ఈ నీటిలో జ్ఞానస్నానం తీసుకోవాలనుకుంటున్నానో లేదో నాకు తెలియదు... కానీ మన పాపాలు, ప్రక్షాళన చేసుకోవడానికి నీటి గుండా పయనించి, ఆపై శ్రీసభ అనే పవిత్ర రహస్యంలోకి ప్రవేశించడం అనే సందేశాన్ని నేటికీ మనకు తెలియపరుస్తుంది. దివ్యబలి పూజ ప్రారంభంలో, మన హృదయపరివర్తన(conversion) కొరకు ప్రార్థనలు చేశాం. మన ఉమ్మడి నివాసాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఇంకా గుర్తించని, శ్రీసభ లోపల, వెలుపల ఉన్న ఎందరో వ్యక్తుల మార్పు కోసం కూడా మనం ప్రార్థించాలని నా కోరిక.

మన ప్రపంచంలో దాదాపు ప్రతిరోజూ, అనేక ప్రదేశాల్లో, దేశాల్లో సంభవిస్తున్న అనేక సహజ విపత్తులు అన్నీ, మానవుల మితిమీరిన చర్యల వల్లే, మన జీవనశైలి వల్లే సంభవిస్తున్నాయి. మనం నిజంగా మారుమనస్సు (conversion) పొందుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మారుమనస్సు మనకెంత అవసరం!

ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన ప్రసంగాన్ని పంచుకోబోతున్నాను. మీరంతా దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఇందులో కొన్ని కీలక అంశాలు మన ఆలోచనలకు మరింత పదును పెడతాయి. భూతాపం [గ్లోబల్ వార్మింగ్], సాయుధ పోరాటాల కారణంగా ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, మనం సోదరభావంతో కూడిన, శాంతియుత క్షణాలను ఆస్వాదిస్తున్నాం. పోప్ ఫ్రాన్సిస్ తన ఎన్‌సిక్లికల్స్ 'లౌదాతో సి' మరియు 'ఫ్రతెల్లి తుత్తి'లలో ఇచ్చిన సందేశం నేటికీ ఎంతో సమయోచితంగా ఉంది.

మనం ఇప్పుడే విన్న సువార్తను గురించి ఆలోచిస్తే, తుఫాను మధ్య శిష్యులు అనుభవించిన భయం నేడు మానవాళిలో చాలా మందిలో ఉన్న భయాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, జూబిలీ సంవత్సరంలో మనం పదే పదే నిరీక్షణను నమ్ముతూ, ప్రకటిస్తున్నాం. మనం ఆ నిరీక్షణను యేసులో కనుగొన్నాం. ఆయనే తుఫానును శాంతింపజేస్తాడు. ఆయన శక్తి విచ్ఛిన్నం చేయదు, బలోపేతం చేస్తుంది. నాశనం చేయదు, నూతన సృష్టిని చేసి, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. “ఈయన ఎంతటి మహానుభావుడు! గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి” (మత్త 8:27) అని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

ఈ ప్రశ్నలో వ్యక్తమైన ఆశ్చర్యం, భయం నుండి విముక్తి పొందే దిశగా ఇది తొలి అడుగు. యేసు గలిలయ సముద్ర ప్రాంతమున నివసించి, ప్రార్థనలు చేశారు. అక్కడే ఆయన తన ప్రథమ శిష్యులను వారి దైనందిన జీవితంలో, పనిలో భాగంగా పిలిచారు. ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించిన ఉపమానాలు, ఆ భూమితో, ఆ జలాలతో, ఋతువుల క్రమంతో, సృష్టిలోని జీవుల జీవితంతో ఆయనకు ఉన్న లోతైన అనుబంధాన్ని స్పష్టం చేస్తాయి.

మత్తయి సువార్తికుడు తుఫానును ఒక కల్లోలంగా [గ్రీకు పదం, సేయిస్మోస్] వర్ణించారు. యేసు మరణించినప్పుడు, అలాగే ఆయన పునరుత్థానం పొందిన వేళ సంభవించిన భూకంపానికి కూడా మత్తయి ఇదే గ్రీకు పదాన్ని వాడారు. ఈ కల్లోలంపై క్రీస్తు తన పాదాలను స్థిరంగా నిలిపి నిలబడతారు. ఇక్కడే సువార్త మన గందరగోళ చరిత్రలో ఉన్న పునరుత్థానుడైన ప్రభువును మనకు చూపిస్తుంది. యేసు గాలిని, సముద్రాన్ని గద్దించడం, జీవితాన్ని, రక్షణను ఒసగే ఆయన శక్తిని స్పష్టం చేస్తుంది. ఈ శక్తి జీవులను వణికించే శక్తులన్నిటికంటే గొప్పది.

మరొక్కసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు: “ఈయన ఎంతటి మహానుభావుడు! గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి” (మత్త 8:27). మనం విన్న కొలొస్సీయులకు రాసిన లేఖలోని స్తోత్రం ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది: “క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన, దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను” (కొలొస్సీ 1:15-16).

ఆ రోజు తుఫానుకు చిక్కుకుని, శిష్యులు భయంతో నిండిపోయారు; యేసు గురించిన ఈ జ్ఞానం వారికి అప్పుడు పూర్తిగా బోధపడలేదు. అయితే, నేడు, మనకు అందించబడిన విశ్వాసం ప్రకారం, మనం మరింత ముందుకు వెళ్లి ఇలా చెప్పగలం: “ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు, సమస్తమున ఆయనయే ప్రధముడగుటకు ఆయన ఆదియై ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రధమ పుత్రుడు” (కొలొస్సీ 1:18).

ఆ మాటలు, ప్రతి యుగంలోనూ, మనల్ని జీవముగల శరీరంగా మారుస్తాయి, క్రీస్తు శిరస్సుగా ఉన్న ఆ శరీరానికి మనం నిబద్ధులం అయ్యేలా చేస్తాయి. సృష్టిని పరిరక్షించడం, శాంతిని, సఖ్యతను పెంపొందించడం మన లక్ష్యం. ఇది యేసు సొంత లక్ష్యం, అలాగే, ప్రభువు మనకు అప్పగించిన బాధ్యత. మనం భూమి యొక్క ఆక్రందనను వింటాం, పేదల రోదనను వింటాం, ఎందుకంటే ఈ విన్నపం దేవుని హృదయాన్ని చేరింది. మన ఆవేదనే ఆయన ఆవేదన; మన శ్రమ ఆయన శ్రమయే.

ఈ విషయంలో, కీర్తనకారుడి పాట మనకు స్ఫూర్తినిస్తుంది: “ప్రభువు స్వరము జలముల మీద విన్పించు చున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించు చున్నాడు. ఆయన స్వరము సాగరము మీద  విన్పించు చున్నది. ప్రభువు స్వరము మహాబలమైనది. మహా ప్రభావము కలది” (కీర్తన 29:3-4). ఆ స్వరం, ఈ లోకంలోని దుష్టశక్తులను వ్యతిరేకించడానికి ధైర్యం అవసరమైనప్పుడు ప్రవచనాత్మకంగా మాట్లాడటానికి సంఘాన్ని ప్రోత్సహిస్తుంది. సృష్టికర్తకు, ఆయన సృష్టికి మధ్య ఉన్న విడదీయరాని నిబంధన (covenant) మన మనస్సులను ప్రేరేపిస్తుంది. ఇది చెడును మంచిగా, అన్యాయాన్ని న్యాయంగా, అత్యాశను పంచుకోవడంగా మార్చడానికి మన ప్రయత్నాలను ఉత్సాహపరుస్తుంది.

అనంతమైన ప్రేమతో దేవుడు అన్నిటినీ సృష్టించి వాటికి ప్రాణం పోశాడు. అందుకే పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసుగారు ప్రతి జీవిని తన సోదరుడు, సోదరి, తల్లి అని పిలవగలిగారు. కేవలం ధ్యాన దృష్టి (contemplative gaze) మాత్రమే సృష్టితో మనకున్న సంబంధాన్ని మార్చగలదు. దేవునితో, మన పొరుగువారితో, భూమితో మన సంబంధాలు తెగిపోవడం వల్ల ఏర్పడిన పర్యావరణ సంక్షోభం నుండి ఇది మనల్ని బయటపడేస్తుంది. ఈ సంబంధాల విచ్ఛిన్నం పాపం యొక్క పర్యవసానం (లౌదాతో సి', 66 చూడండి).

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మనం ప్రస్తుతం ఉన్న ఈ బోర్గో లౌదాతో సి', పోప్ ఫ్రాన్సిస్ గారి దార్శనికతకు అనుగుణంగా, ఒక రకమైన “ప్రయోగశాల”గా రూపుదిద్దుకోవాలని ఆశిస్తోంది. సృష్టితో సామరస్యాన్ని అనుభవించడం ద్వారా స్వస్థతను, సఖ్యతను పొందడానికి ఇది ఒక వేదిక. మనకు అప్పగించబడిన సహజ పర్యావరణాన్ని రక్షించడానికి కొత్త, సమర్థవంతమైన మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి కృషి చేస్తున్న మీ అందరికీ నా ప్రార్థనలను, ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్నాను.

మనం జరుపుకునే దివ్యబలి పూజ మన శ్రమకు శక్తిని, అర్థాన్ని ఇస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ రాసినట్లుగా, “సృష్టించబడినవన్నీ దివ్యబలి పూజలోనే గొప్ప ఉన్నతిని పొందుతాయి. దేవుడు స్వయంగా మానవుడిగా మారి తన సృష్టికి ఆహారంగా మారినప్పుడు, స్పష్టంగా వ్యక్తమయ్యే కృప అసమానమైన వ్యక్తీకరణను కనుగొంది. మానవునిగా జన్మించిన రహస్యం యొక్క పరాకాష్టలో, ప్రభువు ఒక సూక్ష్మ పదార్థం ద్వారా మన అంతర్గత లోతులకు చేరుకోవాలని ఎంచుకున్నాడు. ఆయనపై నుండి కాదు, లోపల నుండి వస్తారు; మన ఈ ప్రపంచంలో మనం ఆయనను కనుగొనేలా వస్తారు” (లౌదాతో సి', 236).

ఈ ఆలోచనలను ముగించే ముందు, పునీత అగుస్తీను తన ‘కన్‌ఫెషన్స్’ చివరి పేజీలలో సృష్టిని, మానవాళిని ఒక విశ్వ స్తుతి గీతంలో ఏకం చేస్తూ చెప్పిన మాటలతో ముగించాలను కుంటున్నాను: ప్రభూ, “మీ కార్యములు మిమ్మల్ని స్తుతించుగాక, తద్వారా మేము మిమ్మల్ని ప్రేమించగలం; మేము మిమ్మల్ని ప్రేమించగలం, తద్వారా మీ కార్యములు మిమ్మల్ని స్తుతించుగాక” (XIII, 33, 48). సామరస్యాన్నే మనం ప్రపంచమంతటా వ్యాపింపజేద్దాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250709-omelia-custodia-creazione.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

No comments:

Post a Comment