జ్ఞాన వివాహము 3

 జ్ఞాన వివాహము 3


వివాహము ఏడు దివ్యసంస్కారాలలో ఒక దివ్యసంస్కారము. ఈ వివాహముద్వారా, జ్ఞానస్నానము తీసుకున్న ఇరువురు కతోలిక క్రైస్తవులు దేవుని సమక్షములో, దైవప్రజల సమక్షములో, ఓ నూతన క్రైస్తవ కతోలిక కుటుంబాన్ని ఏర్పరచుకొనుచున్నారు. కనుక నేడు మనమందరం దేవునికి కృతజ్ఞులై ఉండాలి. వివాహం దివ్యసంస్కారం కనుక, అది యేసుక్రీస్తుతో ముడిపడి ఉంటుంది; ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. నూతన వధూవరులకు గట్టిగా చప్పట్లతో అభినందనలను తెలుపుదాం! ఆది 2:20లో, దేవుడు "పురుషునికి తగిన తోడెవ్వరు దొరకలేదు" అని చదువుచున్నాం. మరి నేడు వీరిరువురిని ఇక్కడ దంపతులుగా నిలబెట్టడానికి వారి తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసాలు పడి ఉంటారు. కనుక, వారి తల్లిదండ్రులకు గట్టిగా 
చప్పట్లతో అభినందనలను తెలుపుదాం!

వివాహము దేవుని విశ్వసనీయతకు సూచన (ఎఫెసీ 5:28-32): వివాహం దివ్యసంస్కారం కనుక, దానికి శాశ్వత విలువ ఉన్నది. మీరు (వధూవరులు) ఒకరికొకరు చేసే 'వాగ్దానం' మరణం వరకు ఉంటుంది. కనుక ఎల్లప్పుడు ఒకరికొకరు నమ్మకం కలిగి జీవించాలి. పాత నిబంధనలో, దేవుడు తన ప్రజలతో 'శాశ్వత ఒప్పందాన్ని' చేసుకొని దానికి విశ్వసనీయతతో కట్టుబడి యున్నాడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలపట్ల విశ్వసనీయముగా ఉన్నాడు. వారు పాపముచేసినను వారిని ఎన్నడు ఎడబాయలేదు. నూతన నిబంధనలో, క్రీస్తుకు, శ్రీసభకు మధ్యనున్న సంబంధాన్ని చూస్తున్నాము. శ్రీసభ కొరకు క్రీస్తు తన ప్రాణాలను సైతము సిలువపై అర్పించాడు. కనుక, మీ వివాహములో ఒకరిపై ఒకరికి ఉండవలసినది విశ్వసనీయత; అది దేవునికి-ఆయన ప్రజలకు మధ్యనున్న విశ్వసనీతను, క్రీస్తుకు-శ్రీసభకు మధ్యనున్న విశ్వసనీయతను సూచిస్తుంది. మీ ఇరువురిమధ్య కూడా అలాంటి విశ్వసనీయత, నమ్మకం ప్రేమ ఉండాలి. కనుక, నేడు మీరు చేసే వాగ్దానాలను ఎప్పుడు, కలకాలం, మరణం వరకు కాపాడుకోవాలి.

క్రీస్తు ప్రేమ సుమాతృక: (యోహాను 15:12-16): క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించాడో, ప్రేమిస్తున్నాడో మనదరికి తెలుసు! ఎదో ఒక సందర్భములో ఆయన ప్రేమను మనం వ్యక్తిగతముగా పొందియున్నాము! మనలను (తన వధువైన శ్రీసభ కొరకు) సిలువ మరణం వరకు ప్రేమించాడు. నిజమైన ప్రేమ అర్ధంచేసుకుంటుంది; త్యాగానికి సిద్ధపడుతుంది; ఇతరుల కొరకు తాను బాధలను అనుభవిస్తుంది; ఇతరుల మంచి కొరకు పాటుపడేలా చేస్తుంది. ఇలాంటి ప్రేమనే ప్రభువు తన మాటలలో వ్యక్తపరచాడు యోహాను 15:13 - "తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయు వానికంటే ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు". అలాగే, భార్యాభర్తలిరువురు అలాంటి ప్రేమను కలిగి జీవించాలి.

వివాహ వాగ్దానాన్ని ఒప్పందముగాగాక (అశాశ్వతమైనది; రాద్దుచేసుకోవచ్చు), శాశ్వత వాగ్ధానముగా, 'ఒడంబడిక'గా  పరిగణించాలి. ఒప్పందం తుంచుకుంటే తెగిపోతుంది, కాని 'ఒడంబడిక' శాశ్వతమైనది. ఇది ఒక ఆధ్యాత్మిక వాగ్దానం. ఎందుకన, ప్రభువు నామమున, దైవజనుల సమక్షములో మీరు నేడు మీ వాగ్దానములద్వారా ఒకటవుతున్నారు, ఏకశరీరులవుతున్నారు. స్వయముగా క్రీస్తే మీ వివాహాన్ని ఆశీర్వదించుచున్నారు, కనుక మీ ప్రేమను, బంధాన్ని నిలబెట్టుకోవడానికి, ఎప్పుడు క్రీస్తు వైపుకు మరలండి. ఆయనే మన సర్వస్వానికి మూలం, ఆధారం.

వివాహము దేవుని తలంపు (ఆది 1:26-28): దేవుడు మానవ జాతిని సృజించాడు. తన పోలికలో మానవుని చేసాడు. "నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు" (ఆది 2:18) అని దేవుడు తలంచి, వారిని స్త్రీ పురుషులనుగా సృష్టించాడు. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడని వారికి ఆజ్ఞాపించాడు. కనుక వివాహ బంధముద్వారా, దేవుని తలంపును, చిత్తమును మనం పరిపూర్ణం చేయాలి.

దేవుడు ప్రేమామయుడు; అనంత ప్రేమ కలిగినవాడు. వివాహ బంధములోని భార్యా భర్తల ప్రేమలో ఈ దేవుని ప్రేమ ప్రతిబింబిస్తుంది, విస్తరిస్తుంది. కనుక భార్యాభర్తల పరస్పర ప్రేమ దేవుని ప్రేమను సూచిస్తుంది. ఇది మనం తప్పక గుర్తుంచుకోవలసిన విషయం! భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ తప్పక ఉండాలి, ఎందుకన, దేవుడు స్త్రీని సృష్టించినపుడు, పురుషుడు ఇలా పలికాడు: "చివరకు ఈమె నా వంటిదైనది. ఈమె నా యెముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి యగును.

వివాహము దేవుని తలంపు కనుకనే, యేసుకూడా కానా పల్లెలోని పెండ్లికి వెళ్లి, తన దైవ సాన్నిధ్యముతో, వధూవరులను ఆశీర్వదించాడు (యోహాను 2:1-11). వారికోసం తన ప్రధమ అద్భుతాన్ని (నీళ్ళను ద్రాక్షారసముగ మార్చాడు) చేసాడు. వివాహము దేవుని తలంపు కనుకనే, పరిసయ్యులు విడాకుల గురించి అడిగినప్పుడు, యేసు వారికి ఇలా సమాధానమిచ్చాడు: మత్తయి 19:8 - ఆరంభమునుండి విడాకులు దేవుని తలంపు కాదు; అది మానవులు ఏర్పాటు చేసుకున్నదని యేసు స్పష్టం చేసాడు. మత్తయి 19:6లో "దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదు" (మార్కు 10:9) అని యేసు ఖరాఖండిగా చెప్పాడు. వివాహములోని 'అవిచ్చిన్నత' స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. అనగా అది శాశ్వత బంధం.

సత్యోపదేశం:

ప్రేమ పునాది: జీవితములో, ప్రేమతో కలిసి కరిగిపోయేలా మమేకమవటం వలన వైవాహిక జీవితం ఏర్పడుతుంది. దేవుడే వివాహమును స్థాపించాడు. దైవ ప్రేమ ఈ వివాహ బంధములో ప్రదర్శితం  కావాలి. స్త్రీ పురుషునికి సహచరిణి. పురుషునితో సమానురాలు. సహ ధర్మచారిణిగా దేవుడు అతనికిచ్చాడు. అందుకే వారు ఏకశరీరులవుతారు (ఆది 2:24). కనుక, బేధాభిప్రాయాలు ఉండకూడదు. ఏకశరీరులవటం ఒక రోజులో (ఒక రాత్రిలో) జరిగేది కాదు; ఇది నిరంతరం జరిగేది; వైవాహిక జీవితంలో కలిసి పంచుకోవడం ద్వారా అనుదినం మెరుగవుతారు, అభివృద్ధి చెందుతారు. ఏకశరీరులవటం అనగా ఒకరినొకరు ప్రేమించుకోవడం; ఒకరితోనొకరు తమ జీవితాలను పంచుకోవడం; స్వార్ధం నుండి బయట పడటం... ఏకమవడం అనగా విడిగా వున్న ఇద్దరు వ్యక్తులు శారీరకముగా, మానసికముగా, ఆర్ధికముగా ఏకమై ముందుకు సాగడం.

పాపసంకీర్తనం: పాపసంకీర్తనంద్వారా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సన్నద్ధం కావడం సముచితం.

దివ్యబలిపూజ - దివ్యసత్ప్రసాదం: వివాహం సాధారణముగా దివ్యపూజలో జరుగుతుంది. ఎందుకనగా, క్రీస్తు ఏవిధంగా శ్రీసభ కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడో, దంపతులుకూడా ఒకరికోసం ఒకరు సమర్పించుకొనే వైవాహిక ప్రమాణాన్ని గుర్తుకు చేస్తుంది. అలాగే, దివ్యసత్ప్రసాదం స్వీకరించడంద్వారా, క్రీస్తు ప్రభుని ఒకే శరీరాన్ని, ఒకే రక్తాన్ని స్వీకరించడంద్వారా, క్రీస్తునందు ఒకే దేహముగా రూపొందుచున్నారు. 

పవిత్రాత్మ: వాళ్ళ ఒప్పందానికి ఆమోద ముద్ర పవిత్రాత్మ. ఆయనే వాళ్ళ ప్రేమకు మూలం. వాళ్ళ విశ్వసనీయతను నూత్నీకరించే బలం ఆయనే.

సమస్యలు - దేవుని కృపావరం: ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు, వరితోపాటు వారి బలహీనతలను మోసుకొస్తారు; వివాహ జీవితం ప్రారంభించాక తెలియని బలహీనతలు బయటపడతాయి. కనుక, వివాహ బంధములో ఎన్నోసమస్యలు తలెత్తడం సర్వసాధారణం: వైషమ్యం, ఆధిక్యతాభావం, నమ్మకద్రోహం, అసూయ, సంఘర్షణలు, ద్వేషం, ఎడబాట్లు, ఆరోపణలు, మనస్పర్ధలు, మొ.వి (దాంపత్య, ఆర్ధిక, ఆరోగ్య, సామాజిక, కుటుంబ సమస్యలు). అయితే, ప్రేమించడానికి, క్షమించడానికి, స్వస్థపరచడానికి వివాహ జీవితం ఓ గొప్ప అవకాశం! అయితే, ఈ గాయాలను, బలహీనతలను మాన్పడానికి దేవుని కృపావరం అవసరం. విశాలభావం కలిగి పరస్పర సహాయం, ఆత్మత్యాగాలను చేసుకోవడానికి వివాహం తోడ్పడుతుంది. క్రైస్తవ వైవాహిక కృపావరం క్రీస్తు శిలువ ఫలమే. సర్వమానవాళిని ఆయన రక్షించడానికి వచ్చాడు. కనుక, వివాహ బంధములోని సమస్యలనుండికూడా మిమ్ములను రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం, నమ్మకం ఉంచండి.

దాంపత్య జీవితములోని నాలుగు ముఖ్యమైన అంశాలు: ఐఖ్యత (వారు ఇరువురు కాదు; ఒకే శరీరం), అవిచ్చిన్నత (విడదీయరాని బంధం; తుదిశ్వాస వరకు ఉండే బంధం), ప్రేమపట్ల విశ్వసనీయత (అన్యోన్య ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకం), సంతానం పట్ల ఆకాంక్ష (పిల్లల పెంపుదల, విద్య, విశ్వాస బోధ).

తిరు కుటుంబం (మరియ, యోసేపు, బాలయేసు) ప్రతీ కుటుంబానికి ఆదర్శం: ప్రతీ కుటుంబం ఒక గృహస్థ శ్రీసభ, దేవుని కుటుంబము. మానవ జీవితం సుసంపన్నమయ్యే పాఠశాల. వివాహ జీవితం ఒక ప్రేమ పాఠశాల. కుటుంబములోనే సహనాన్ని, ఆనందాన్ని, సోదరప్రేమను, క్షమాగుణాన్ని, ప్రార్ధనను నేర్చుకుంటారు. కానా పెళ్ళిలో తన మధ్యస్థ వేడుదలద్వారా సహాయం చేసిన మరియ తల్లి, మీకొరకు కూడా ప్రార్ధంచును గాక! కుటుంబ పాలకుడైన జోజప్పగారు మీకు సహాయపడును గాక! దివ్య బాలయేసు మీ కుటుంబములో నివసించును గాక!

No comments:

Post a Comment