జ్ఞాన వివాహము 2
వివాహం ద్వారా స్త్రీ పురుషుల మధ్య జీవితాంతం ఒక భాగస్వామ్యం ఏర్పడుతుంది ఈ భాగస్వామ్యం ఏమిటంటే దంపతుల శ్రేయస్సు సంతానం పిల్లల విద్య కోసం నిర్దేశించబడినది.
వివాహము దేవుని ప్రణాళిక / దైవానుగ్రహము
వివాహం ఓ దివ్య సంస్కారం అని మనందరికీ తెలుసు, ఎందుకంటే, వివాహాన్ని స్వయంగా దేవుడే ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఎప్పుడైతే స్త్రీపురుషులను సృష్టించాడో, వారి ఇరువురి నైజంలోనే వైవాహిక పిలుపును రాసి ఉన్నది. దేవుడు ప్రేమతో నరుని సృష్టించాడు, ఎందుకంటే, దేవుడు ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడు (1 యోహా 4:8). అలాగే వారిని ప్రేమించటానికి పిలుపునిచ్చాడు. ఇది అందరికీ సహజసిద్ధమైన, ప్రాథమికమైన పిలుపు. అలాగే దేవుడు మానవుని తన రూపంలో తన పోలికలో సృష్టించాడు (ఆ.కాం. 1:27; 1 యోహాను 4:8,16). అందుకే మానవుడు ప్రేమ కలిగి జీవించాలి. అలాగే దేవుడు నరుని ఒంటరిగా ఉండనీయలేదు; స్త్రీ పురుషులను సృష్టించాడు (ఆ.కాం. 1:27). అందుకే వారు అన్యోన్య ప్రేమతో, సంపూర్ణముగా, అపజయమెరుగని వారిగా జీవించాలి. ఈ అన్యోన్య ప్రేమను దేవుడు దీవించాడు. ఏమని దీవించాడంటే, “వ్యాప్తి చెందండి, భూమిని నింపండి, దానిని వశం చేసుకోండి” (ఆ.కాం. 1:28).
దేవుడు స్త్రీ పురుషులను ఒకరికోసం ఒకరిని సృష్టించాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. “మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు” (ఆ.కాం. 2:28). అందుకే పురుషునికి తోడుగా స్త్రీని సృష్టించాడు (ఆ.కాం. 2:18-25). స్త్రీ “అతని మాంసంలో మాంసం” అనగా స్త్రీ అతని సహచరిని, అతనికి సమానురాలు; సహధర్మచారిణిగా దేవుడు ఆమెను అతనికిచ్చాడు. అందుకే “నరుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యకు హత్తుకుంటాడు. వాళ్ళిద్దరు ఏక శరీరులవుతారు” (ఆ.కాం. 2:24).
ఈ విధముగా వివాహం అనేది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. వివాహము ద్వారా స్త్రీ, పురుషులు ఏకశరీరులుగా అగుచున్నారు. ఇదే విషయాన్ని అనగా తండ్రి దేవుని ప్రణాళికను, చిత్తమును సుత దేవుడు క్రీస్తు ప్రభువు కూడా వివరించి యున్నారు (మత్త 19:3-12). ప్రభువు అంటున్నారు: “ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులనుగా సృష్టించాడు. ఈ కారణముచేతనే పురుషుడు, తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని యుండును. వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏకశరీరులై యున్నారు (మత్త 19:4-6).
ఈ సందర్భముగా పాపము ఎలా వివాహ జీవితమును నాశనం చేసి ఉందో తెలుసుకోవాలి. ఎందుకనగా పాపం ఈ నాటికి కూడా అనేక రూపాలలో వివాహ వ్యవస్థను, కుటుంబ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పాపము అనగా దేవునికి వ్యతిరేకముగా చేయటం, జీవించడం; దేవున్ని అవిధేయించడం. ఈ పాపము వలన స్త్రీ పురుషుల సంబంధములో, వైషమ్యం, ఆధిక్యతభావం, నమ్మకద్రోహం, అసూయ, సంఘర్షణలు, ద్వేషం, ఎడబాట్లు, గందరగోళ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఈ రోజుల్లో విడాకులు, ఆస్తిసమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లలు లేనితనం, ఉద్యోగ సమస్యలు, అక్రమ సంబంధాలు, ఇగో సమస్యలు, పంతాలు పట్టింపులు, ప్రసార సాధనాల వల్ల వచ్చే ఇబ్బందులు మొదలగునవి ఎన్నో ఉన్నాయి. ఈ కల్లోల పరిస్థితిని చూసినప్పుడు, చాలా బాధగా ఉంటుంది.
పాపంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఏదైనా సమస్యలలో ఉన్నప్పుడు, దేవుడు మనలను తృణీకరించడని గుర్తుంచుకోవాలి. ఎందుకన, ఆయన దయగల దేవుడు, కృపా మయుడు. ఆయనను విశ్వసిస్తే, పరిష్కార మార్గాలను చూపిస్తాడు. సమస్యలను అధిగమించేలా చేస్తాడు. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా విడాకులు అంటున్నారు. మత్తయి 19:8 లో ప్రభువు అంటున్నారు, “ఆరంభమునుండి విడాకులు లేవు. మీ హృదయ కాఠిన్యమునుబట్టి, విడిపోవుటకు మోషే అనుమతించాడు.” కానీ, ఇప్పుడు ప్రభువు అంటున్నారు స్త్రీ పురుషుల వివాహ బంధం విడదీయరానిది అని. “దేవుడు జత పరిచిన జంటను వేరుపరపరాదు” (మత్త 19:6). ఈ విధముగా వివాహబంధంలో ఉన్న సమస్యలను ప్రభువు పునరుద్ధరిస్తున్నారు.
వైవాహిక జీవితం కొనసాగడానికి కావలసిన బలాన్ని, కృపావరాన్ని ప్రభువే స్వయంగా ఇస్తారు. క్రైస్తవ వైవాహిక కృపావరం, క్రీస్తు సిలువ ఫలమే. ఆ సిలువే క్రైస్తవ జీవన సర్వస్వానికి మూలం. అందుకే పునీత పౌలుగారు ఇలా అంటున్నారు: “క్రీస్తు శ్రీ సభను ప్రేమించిన విధముగా శ్రీసభను పరిశుద్ధ పరచటానికి, తననుతాను సమర్పించుకున్న విధముగా, భర్త, భార్యను ప్రేమించాలి. ఈ కారణం చేతనే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి తన భార్యతో ఐక్యం అవుతాడు.” (ఎఫే 5:25-26; 31-32; ఆ.కాం.2:25).
అంగీకారం / ప్రమాణం
స్త్రీ పురుషులిద్దరూ కూడా వివాహ జీవితానికి తమ అంగీకారాన్ని స్వేచ్ఛగా తెలపాలి. వారు ఎలాంటి నిర్బంధంలో ఉండకూడదు. నిర్బంధంలో ఉన్న యెడల ఆ వివాహం కలకాలం నిలవదు. పరస్పర అంగీకారం లోపిస్తే వివాహమే లేదు. అందుకే, బలవంతపు పెళ్లిళ్లు చేయరాదు; ఇష్టం లేని పెళ్లిళ్లు బలవంతంగా చేయరాదు. ఆస్తికి, డబ్బుకు, సంపదకు ఆశపడి బలవంతపు పెళ్లిళ్లు చేస్తే, అవి కలకాలం నిలవవు. పరస్పర అంగీకారం ఉన్నప్పుడే ఒకరినొకరు భాగస్వాములుగా అంగీకరిస్తారు. మనస్ఫూర్తిగా, “నేను నిన్ను నా భార్యగా, నా భర్తగా అంగీకరిస్తున్నాను” అని చెప్పగలరు. ఈ పరస్పర అంగీకారం, గురువు లేదా దీకను శ్రీసభ తరపున ఆమోదించి వారికి దీవెనలను అందిస్తారు.
దాంపత్య ప్రేమకు అవసరమయ్యే అంశాలు
ఐక్యత, అవిచ్ఛిన్నత: వారు ఇద్దరు కాదు, ఒకే దేహం; వివాహములో వారు ఐక్యమై ఉన్నారు (మత్త 19:6; ఆ.కాం. 2:24).
విశ్వసనీయత: దాంపత్య ప్రేమకు దంపతుల అచంచల విశ్వసనీయత అవసరం. ఇది నిర్దిష్టమైన, అన్యోన్య ప్రేమను కోరుతుంది.
సంతానంపట్ల ఆకాంక్ష: ఫలించి, విస్తరించండి అని దేవుడు దీవించాడు. వైవాహిక ప్రేమ స్వభావమే సంతాన ప్రాప్తి; వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పడానికి నిర్దేశిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రధమ, ప్రధాన విద్యాబోధకులు. ఇది కుటుంబ ప్రాథమిక కర్తవ్యం.
No comments:
Post a Comment