జ్ఞాన వివాహము 1


జ్ఞాన వివాహము 1

జ్ఞాన వివాహము ఒక ఒడంబడిక. ఒక స్త్రీ, ఒక పురుషుడు జీవిత కాలము వరకు ఒడంబడికను ఏర్పరచుకొనుటయే వివాహము. వివాహ స్వభావము, భార్య, భర్తల ప్రేమ, సంతానం మరియు వారిని అన్నివిధాలుగా విద్యావంతులను చేయడం. "వివాహము అన్నింటిలో ఘనమైనది." జ్ఞానస్నానము పొందిన ఇరువురి వ్యక్తుల (స్త్రీ, పురుషులు) మధ్య జరిగెడి ఒప్పందమును లేక వివాహమును క్రీస్తు ప్రభువు దివ్యసంస్కారముగాచేసి ఉన్నతమైన స్థానమును కలుగజేసియున్నాడు.

ఒడంబడిక కేవలం న్యాయబద్ధమైనది మాత్రమేగాక, ఆధ్యాత్మికమైనది కూడా. ఎలాగంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆధ్యాత్మికమైన ఒడంబడికను ఏర్పరచుకొన్న విధముగా! మరియు క్రీస్తు తన త్యాగపూరితమైన మరణముద్వారా మనతో ఒక నూతన, శాశ్వతమైన ఆధ్యాత్మిక ఒడంబడికను ఏర్పరచుకొన్న విధముగా! వివాహ ఒడంబడిక పవిత్రమైన ప్రతిజ్ఞతో కూడుకొనియున్నది. కారణముచేతనే, వివాహము జీవితకాల అనుబంధము. ఒడంబడిక మరణముతోనే ముగుస్తుంది.

వివాహము జీవితకాల భాగస్వామ్యం. పవిత్రమైన, ఆధ్యాత్మికమైన వివాహబంధము ఏవో కొన్ని హక్కులు, బాధ్యతలతో కూడిన ఒడంబడిక మాత్రమేకాదు. వివాహ బంధములో, ఇరువురు ఒకరికొకరు సంపూర్ణముగా అర్పించుకోవాలి. సంపూర్ణ అర్పణ క్రీస్తునాధుని ప్రేమను, తన రక్తాన్ని చిందించి తన ప్రాణాలను సైతము అర్పించిన మనపైగల క్రీస్తు ప్రేమను ప్రతిబింబిస్తూ ఉండాలి. అందుకే, వివాహ బంధం సంపూర్ణ స్వీయార్పణము.

పైన చెప్పినట్లుగా, వివాహము యొక్క స్వభావము లేదా ఉద్దేశము రెండు విధాలు: మొదటగా భార్యభర్తల మధ్య ప్రేమ. స్వచ్చమైన, నిజమైన ప్రేమ  ఎంతో ఉన్నతమైనది. ఈనాడు ప్రేమను అన్నివిధాలుగా తప్పుగా అర్ధం చేసుకోవడం జరుగుతుంది. ప్రేమ పేరిట ఎన్నో మోసాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో వంచనలు! కొంత మందికి ప్రేమ అంటే కేవలం శారీరక ఆకర్షణ! వివాహ సంబంధమైన ప్రేమ భార్యభర్తలమధ్య శాశ్వతమైన, ఎప్పటికీ అతిక్రమించని, పవిత్రమైన నమ్మకాన్ని కోరుకుంటుంది. నమ్మకం భార్యభర్తలిరువురు ఒకరికొకరు సంపూర్ణముగా అర్పించుకొనుటలోనుండివచ్చే గొప్ప బహుమాన ఫలితము. ఒకరినొకరు అర్పించుకొనుటలో అతి సాన్నిహిత్యమైన ఐఖ్యత, శాశ్వతమైన నమ్మకము భార్యభర్తలు కలిగియుండాలి.

రెండవదిగా, సంతానం మరియు వారిని అన్నివిధములుగా విద్యావంతులను చేయడం. బహుసంతతిని కలిగియుండటము దేవుని వరము. భార్యభర్తల మధ్య ఉన్న ప్రేమ ఫలితం సంతానము. సంతాన పోషణ, వారిని అన్ని విధాలుగా విద్యావంతులను చేయడం తల్లిదండ్రుల భాద్యత. వివాహ దివ్యసంస్కార అనుగ్రహం, భార్యభర్తల మధ్య ప్రేమను పరిపూర్ణం చేస్తుంది, నమ్మకములో వారిరువురిని ఐఖ్యపరుస్తుంది. పిల్లలను పోషించుటకు సహాయం చేస్తుంది. వివాహ దివ్యసంస్కార అనుగ్రహానికి మూలం క్రీస్తు ప్రభువు. భార్యభర్తల ఒడంబడిక ప్రతిజ్ఞలను బలపరచి, క్షమ, కరుణతో ఒకరి కష్టాలు మరొకరు భరించుటకు వారితో ఉంటాడు.

పునీత పౌలుగారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖలో (5:21-33) భార్యభర్తల సంబంధముగూర్చి చక్కగా చెప్పియున్నారు: పరస్పరము విధేయులై ఉండవలయును. శ్రీసభ క్రీస్తుకు విధేయత చూపునట్లే భార్యలు తమ భర్తలకు సంపూర్ణ విధేయతను చూపవలయును. క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దానికొరకై తన ప్రాణములు అర్పించెనో, భర్తలు భార్యలను అట్లే ప్రేమింపుడు. తమనుతాము ప్రేమించునట్లే భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలన, తన భార్యను ప్రేమించు వ్యక్తి తననుతాను ప్రేమించుకొనును. "ఇందు వలననే, పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును. వారిరువురు ఒకే వ్యక్తిగ ఐక్యము అగుదురు." ఇది గొప్ప సత్యము. ప్రతి భర్త తన భార్యను తననుగానే ప్రేమింపవలెను. అట్లే, ప్రతి భార్య తన భర్తను గౌరవింపవలెను.

వివాహము - దివ్య సంస్కారము

దేవుని ప్రేమ గొప్పది, అనంతమైనది. మానవాళి ప్రేమలో ముఖ్యముగా వివాహ బంధములో దేవుని ప్రేమ ఎంతగానో ఇమిడియున్నది. నిజమైన ప్రేమను మాటలో చెప్పలేము. ఒకరిపైనొకరికి ఉన్న ప్రేమద్వారా, దైవప్రేమ ప్రదర్శింపబడుతుంది. వివాహ ప్రేమ బయటకు కనిపించెడి దేవుని ప్రేమకు చిహ్నము. అందుకే, తల్లి తిరుసభ వివాహమును దివ్యసంస్కారముగా గుర్తించినది. దివ్యసంస్కారము అనగా దైవ-మానవ ప్రేమను ఇవ్వడము మరియు స్వీకరించడము. వివాహ బంధములో, స్త్రీ, పురుషులు ఒకరిపై ఒకరు దివ్యసంస్కారాన్ని ఇచ్చుకోవడమనగా అర్ధము ఇదియే, లేక వారి అనంతమయిన ప్రేమ ప్రతిజ్ఞను, దివ్యసంస్కారముగా కొనియాడటము. వివాహ సాంగ్యములో గొప్ప ప్రేమనే కొనియాడటము మనము చూస్తున్నాము. ఉత్తానక్రీస్తు సాన్నిధ్యము వారి జీవితకాల ప్రయాణమంతయు భార్యభర్తలతో ఉండటము వలన బంధము దివ్యసంస్కారముగా చూస్తూ ఉన్నాము.

ప్రేమ - వివాహ జీవితం

"నేను మిమ్ము ప్రేమించినటులనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితులకొరకు తన ప్రాణమును ధారపోయువానికంటె ఎక్కువ ప్రేమకలవాడు ఎవడును లేడు. నేను ఆజ్ఞాపించువానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు" (యోహాను 15:12-14). ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ ప్రేమాజ్ఞ. మనము దేవున్ని ప్రేమించాలి. మన తోటివారిని ప్రేమించాలి. ఎలా? మన ప్రాణములను ఇతరులకొరకు ధారపోయాలి. సిలువపై వ్రేలాడాలని ప్రభువు మనలను కోరడంలేదు. కాని, ఆధ్యాత్మికముగా ప్రభువు మనలను కోరుచున్నారు. వివాహితులు, ఒకరికొకరు ప్రాణములను ధారపొయుదమని ప్రతిజ్ఞ చేయుచున్నారు.  పరిపూర్ణముగా ఎలా ప్రేమించాలో మనం నేర్చుకోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ప్రతీ క్షణం అధికమధికమవుతూ ఉండాలి.

జ్ఞాన వివాహము - కుటుంబ జీవితము

జ్ఞానవివాహము ద్వారా ఇరువురు వ్యక్తులు ఒక నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నారు. "నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు. అతనికి తోడునీడయగు స్త్రీని సృష్టింతును" (ఆది 2:18). జీవిత భాగస్వామిని ఒసగేది దేవుడే. ఈవిధముగా కుటుంబ జీవితములో ప్రవేశించువారు భాగ్యవంతులు. దేవుని కృప ఎల్లప్పుడూ వారితో ఉంటుంది కాబట్టి, వారియొక్క జీవితము ఆనందదాయకముగా ఉంటుంది. వారి కష్టాలను, ఇబ్బందులను జయించుటకు పవిత్రాత్మ శక్తి వారిలో ఉంటుంది. కష్టాలలోను, వేదనలలోను పరస్పరం సహాయపడుతూ, సహకరిస్తూ జీవించుటకు శక్తి, దేవుని చిత్త ప్రకారం జీవించే దంపతులకు ఉంటుంది.

కుటుంబ జీవితములో, ముఖ్యముగా బిడ్డలకు వివాహ సంబంధాలు చూస్తూ ఉండగా, క్రింది విషయాలు గమనించుట సముచితము:

1. ప్రార్ధన మరియు దైవ విశ్వాసముగల కుటుంబము
2. మోసము, అవినీతి పరమైన మార్గముల ద్వారా డబ్బును సంపాదించని కుటుంబము
3. సొంత కుటుంబ స్థితిగతులను కొనసాగించగలిగే జీవిత శైలి
4. కుటుంబ విషయాలలోను, పనిపాట్లలోను కలిగి ఉన్న లోకజ్ఞానం.
5. జీవిత వీక్షణములోగల ఐఖ్యత
పై విషయాలను గమనించి, పాటించినట్లయితే, కుటుంబ జీవితములో శాంతి, సమాధానాలు మరియు దంపతులకు మానసిక ఐఖ్యత కలుగుతుంది.

వివాహము - అర్పణ జీవితము

"ఆయన తల్లి మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారిరువురు కాపురము చేయకమునుపే పవిత్రాత్మ ప్రభావమువలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానించుట ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా, ప్రభువు దూత కలలో కనిపించి, 'దావీదు కుమారుడవగు యోసేపు! నీ భార్యయైన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు...'. నిదురనుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను" (మత్తయి 1:18-25).  వైవాహిక జీవితములో సంపూర్ణ సమర్పణను దేవుడు ఆశిస్తున్నాడు.

పరస్పర సమర్పణ

దంపతులు తమ దాంపత్యములో తీయదనాన్ని అనుభవించాలంటే, ఒకే శరీరము, ఒకే మనస్సు, ఒకే హృదయముతో ఐఖ్యమవ్వాలి. ప్రభువు ఇలా అంటున్నారు: "ప్రారంభమునుండి సృష్టికర్త వారిని స్త్రీ, పురుషులనుగా సృజించినట్లుగా మీరు ఎరుగరా? కారణము చేతనే పురుషుడు తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉండును. వారిరువురు ఏకశరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్నశరీరాలుకాక, ఏకశరీరులై ఉన్నారు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదు" (మత్తయి 19:4-6). "కుమారీ! నీవు నా పలుకులు సావధానముగా వినుము. మీ ప్రజలను, మీ పుట్టింటిని ఇక మరచి పొమ్ము. రాజు నీ సౌందర్యమునకు మురిసి పోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము" (కీర్తన 45:10-11).

స్త్రీ మరియు పురుషుడు పరస్పరము విశ్వసిస్తూ అర్పించుకొంటూ జీవితమును కొనసాగించాలి. దేవుడు ఏర్పరచిన వైవాహిక జీవితము, దానిలో ఉన్నటువంటి ప్రేమ, పరస్పర సమర్పణ, ఐఖ్యత, సమ్మతము సుస్థిరమైనది. పవిత్ర బంధం భార్యభర్తలయొక్క, సంతానముయొక్క మరియు  సమాజము యొక్క మేలుకై ఉద్దేశించబడినది. కనుక, దివ్యపూజాబలిలో, ప్రభుని మరియు ఆయన ప్రజల సమక్షములో ఏర్పరచబడిన బంధం జీవితకాలమంతయు దేవుని ప్రణాళిక, ఆజ్ఞల ప్రకారం వర్ధిల్లాలని ప్రార్ధిద్దాం!

వివాహ జీవితము, ఆనందముగా, సుఖాంతముగా ఉండాలంటే, మూడు అతి ముఖ్యమైన విషయాలు అత్యవసరం:

1. ప్రార్ధన: మిక్కిలిగా ప్రార్ధన చేయండి. ప్రార్ధన తండ్రియైన దేవునితో మాట్లాడటం. మన సంతోషాలను, బాధలను ఆయనతో పంచుకోవటం. ఆయన ప్రణాళికను, ఆజ్ఞలను తెలుసుకోవటం మరియు వాటిని ఆచరించడానికిగల శక్తిని పొందటం. ప్రార్ధన దేవుని ఆశీర్వాదాలను పొందటం. "కలసి ప్రార్ధించే కుటుంబం, ఎప్పటికి కలసి ఉంటుంది" (The family that prays together, stays together”) అనే నానుడి మనదరికి తెలిసిందే! వివాహ జీవిత ప్రారoభమునుండే, ప్రార్ధన అనే పునాదిని వేయండి. అప్పుడే వివాహజీవితం బలముగా ఉంటుంది. వివాహం దివ్యసంస్కారం అయినప్పుడు, అది దేవుని అనుగ్రహానికి, వరానికి మూలము. కేవలం మీరు మాత్రమేగాక, దేవుడుకూడా మీ వివాహజీవితం సంతోషముగా ఉండాలని ఆశిస్తున్నాడు. అన్ని సమయాలలో దేవునివైపు చూడటం నేర్చుకొని, ఆయనకు ప్రార్ధన చేయండి, తప్పక, మీ వివాహ జీవితం సంతోషముగా ఉంటుంది.

2. అనంతమైన ప్రేమ: దేవుడు మిమ్ములను అమితముగా, అనంతముగా ఎలాంటి షరతులు లేకుండా, మీలోనున్న లోపాలను చూడకుండా ప్రేమిస్తున్నాడో, మీరును ఒకరినొకరు అలా ప్రేమించుకొనుడి. అది దేవుని ప్రేమ గొప్పదనం. మీరును ఒకరిపట్ల ఒకరు అనంతముగా ప్రేమను కలిగియుండండి. నీభాగస్వామినుండి అమితముగా ఆశించక, ఇవ్వడానికి ప్రయత్నంచేయి. నీవు ఆశించిన దానిని నీవు పొందలేనప్పుడు, క్షమించు. నీనుండి ఆశించిన దానిని నీవు ఇవ్వలేనప్పుడు, క్షమించమని కోరు.

3. నమ్మకము: వివాహ జీవితాన్ని దేవుని చిత్తప్రకారముగా జీవించండి. జీవించడానికి ప్రయత్నంచేయండి. వివాహ సమయములో మీరు చేసిన వాగ్దానాలను జీవితాంతం మరువక వాని ప్రకారం జీవించండి. ఒకరిపట్ల ఒకరు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి యుండండి. అనుమానానికి చోటు ఇవ్వకండి.

No comments:

Post a Comment