దివ్యకారుణ్య మహోత్సవం - ఈస్టర్ రెండవ ఆదివారం, Year C

రెండవ పాస్క ఆదివారము  - దివ్య కారుణ్య మహోత్సవము
అ.కా.5:12-16; ద.గ్రం. 1:9-13, 17-19; యోహాను 20:19-31



క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ సహోదరీ సహోదరులారా! ఈరోజు రెండవ పాస్క ఆదివారము. రెండవ పాస్క ఆదివారమును దివ్యకారుణ్య ఆదివారము అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ పండుగ ఈస్టర్ తరువాత వచ్చే మొదటి ఆదివారం నాడు వస్తుంది. ఈ రోజున, యేసుక్రీస్తు యొక్క అనంతమైన కరుణను ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటాము మరియు ఆరాధిస్తాము. ముందుగా, రెండవ పాస్క ఆదివార పఠనాలను ధ్యానిద్దాం!

క్రీస్తు ఉత్థానం - నూతన సృష్టి 
క్రీస్తు ఉత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలం. "క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే. మీ విశ్వాసమును వ్యర్ధమే అని పునీత పౌలుగారు, క్రీస్తు ఉత్థానము యొక్క ప్రాముఖ్యతను 1 కొరి 15:14లో స్పష్టం చేసియున్నారు. శిష్యులకు క్రీస్తు ఉత్థానం ఓ దివ్యానుభూతి. క్రీస్తు ఉత్థానములోని పరమ రహస్యాన్ని వారు పూర్తిగా అర్ధము చేసుకొనలేక పోయారు. కాని, క్రీస్తు ఉత్థానం వారి విశ్వాసాన్ని బలపరచినది అనడములో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని వారు అనుభవించారు. క్రీస్తు ఉత్థానం వారిని నిజ మనుషులుగా, దృఢవిశ్వాసులుగా మార్చినది. విశ్వాసులుగా హింసలను, అవమానములను ధైర్యముగా ఎదుర్కొనుటకు వారిని బలపరచినది. ఉత్థానమైన తరువాత, క్రీస్తు వారితో ఉన్నాడు, వారితో మాట్లాడాడు, వారితో భుజించాడు, వారికి బోధించాడు. ఇప్పుడు వారు ఇతరులలో విశ్వాసాన్ని నింపడానికి పిలువ బడినారు. అనాది క్రైస్తవుల దృఢవిశ్వాసం ఎంత గొప్పదో మనందరికి తెలిసిన విషయమే! జ్ఞానస్నానము పొందిన క్రైస్తవులు, ఎప్పుడైతే యేసు మెస్సయ్యా అని విశ్వసించారో, మరణమునుండి ఉత్థానమైనాడని విశ్వసించారో, వారు నూతన జీవితాన్ని, జీవనాన్ని పొందారు. నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందారు. క్రీస్తు కొరకు హింసలను భరించుటకును, మరణించుటకు సిద్ధపడ్డారు. 

మొదటి పఠనములో అపోస్తలులు ఉత్థాన క్రీస్తునకు సాక్షులుగా, క్రీస్తు దైవకార్యాన్నిఈ లోకములో కొనసాగించడం చూస్తూ ఉన్నాము. ఉత్థాన క్రీస్తు నామమున అనేకమైన అద్భుతములను, సూచక క్రియలను వారు చేసియున్నారు. దీని మూలముగా, “అనేకులు మరియెక్కువగ, విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి.” ప్రజలు అపోస్తులలో ఉన్న దేవుని శక్తిని విశ్వసించారు. “పేతురు నడచి పోవునప్పుడు కనీసము అతని నీడనైన కొందరిపై పడగలదు అను ఆశచేత వారు రోగులను చాపలమీద, పరుపుల మీద పెట్టుకొని, మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. యెరుషలేము చుట్టు పట్టులనున్న పట్టణములనుండి జనులు వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరు స్వస్థత పొందిరి.” ఈవిధముగా, క్రీస్తు ఉత్థానముద్వారా, దేవుడు మనకు నూతన జీవితమును, సంతోషమును ఒసగుచున్నాడు. అయితే, మన భూలోక జీవితమున మన క్రైస్తవ జీవితమునకు విశ్వాసులుగా ఉండవలయును. క్రీస్తు మరణమును జయించి మనందరికి శాశ్వత జీవమును ఏర్పాటు చేసియున్నాడు. 

సువిశేష పఠనములో ఉత్థాన క్రీస్తు శిష్యులకు దర్శన మివ్వటం చూస్తూ ఉన్నాము. యూదుల భయముచే శిష్యులు ఇంటిలో తలుపులు మూసుకొని యుండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, ‘మీకు శాంతి కలుగునుగాక!” అనెను. శాంతి వచనాలతో (షాలొమ్) వారిలోనున్న భయాన్ని ఉత్థాన క్రీస్తు తొలగించాడు. ఆయన ఉత్థాన క్రీస్తు అని తెలియజేయుటకు వారికి తన చేతులను, ప్రక్కను చూపగా, వారు ప్రభువును చూచి ఆనందించారు. ఆ తరువాత ఆయన వారి మీద శ్వాసను ఊది “పవిత్రాత్మను పొందుడు” అని చెప్పారు. తాను ఆరంభించిన పనిని తన శిష్యులు కొనసాగించాలని ఆదేశించారు. పవిత్రాత్మను పొందడం అనగా నూతన సృష్టిని పొందడం. తండ్రి తనను పంపినట్లుగా, ప్రభువు తన శిష్యులను దైవకార్యమునకై పంపుచున్నారు. యేసు శిష్యరికములో ఈ దైవకార్యం చాలా ప్రాముఖ్యమైనది. వారుకూడా ప్రభువువలె జీవించుటకు, ఇతరులను ప్రభువు మార్గములో నడిపించుటకు పిలువ బడియున్నారు. పవిత్రాత్మ శక్తి వలన, పాపములను క్షమించు అధికారమును శిష్యులు పొందియున్నారు. “మీరు ఎవరి పాపములనైనను, క్షమించిన యెడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింపబడవు.” దీని ద్వారా, ఈ లోకములో ఒకే మనస్సు, ఒకే హృదయముగల ఒకే కుటుంబమును ఏర్పాటు చేయవలసి యున్నది. మానవాళిని దేవునితో సఖ్యపరచ వలసిన అవసరము ఉన్నది.

తోమాసు - యేసు దర్శనము 
సువిశేష రెండవ భాగం అపోస్తలుడు తోమాసు - ప్రభువు దర్శనాన్ని గూర్చి చూస్తూ ఉన్నాము. పాస్కా ఆదివారమున యేసు శిష్యులకు దర్శన మిచ్చినప్పుడు, తోమాసు వారితో లేకుండెను. యేసు దర్శనాన్ని గూర్చి తోమాసుకు తెలియ జేసినప్పుడు, అతను విశ్వసించడానికి నిరాకరించాడు. “నేను ఆయన చేతులలో చీలల గురుతులు చూచి, అందు వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను” అని అన్నాడు. యేసు ఉత్థానాన్ని విశ్వసించుటకు వ్యక్తిగతముగా ప్రభువు సాన్నిధ్యాన్ని అనుభవించాలని ఆశించాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తోమాసు అవిశ్వాసి అని చెప్పడం సబబు కాదు. వ్యక్తిగా తోమాసుగారు చాలా ధైర్యవంతుడు, విశ్వాసపరుడు. లాజరు మరణించినప్పుడు, తోమాసుగారు “మనము కూడ వెళ్లి ఆయనతో పాటు చనిపోవుదము” (యో 11:16) అని తోడి శిష్యులతో అన్నాడు. అయితే, ఇక్కడ తోమాసు గారు, తన అవిశ్వాసాన్ని ప్రకటించడానికి కారణం, ఉత్థాన ప్రభువును దర్శించిన ఇతర శిష్యులు ఇంకా ఎందుకు యూదులకు భయపడి ఇంటిలో తలుపులు మూసుకొని ఉన్నారు? ఉత్థాన క్రీస్తుకు ధైర్యముగా సాక్ష్యమీయవలసి ఉన్నది కదా! అని తలంచి యుండవచ్చు! వాస్తవానికి, తోమాసుగారు దృఢ విశ్వాసి. ఆయన విశ్వాసము కొరకు ఎంతో దూరమునుండి భారత దేశమునకు వచ్చి తన విశ్వాసము కొరకు మరణించాడు. 

ఎనిమిది దినముల పిమ్మట యేసు శిష్యులు మరల ఇంటి లోపల ఉన్నారు. తోమా సహితము వారితో ఉన్నాడు. మూసిన తలుపులు మూసినట్లుండగనే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, “మీకు శాంతి కలుగును గాక” అని పలికారు. అపుడు తోమా “నా ప్రభూ! నా దేవా!” అని పలికి తన విశ్వాసాన్ని ప్రకటించాడు. అయితే, ప్రభువు, “నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా! చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు” అని పలికి యున్నారు. 

దివ్య కారుణ్య మహోత్సవము 
దివ్యకారుణ్య పండుగ యొక్క మూలాలు 20వ శతాబ్దములో పోలాండ్‌కు చెందిన పునీత ఫౌస్టిన కోవల్స్కాకు యేసుక్రీస్తు ఇచ్చిన దర్శనాలలో చూడవచ్చు. ఆమె తన డైరీలో యేసు ఆమెకు కనిపించి, ఆయన దివ్య కరుణ యొక్క చిత్రాన్ని చిత్రించమని మరియు ఈస్టర్ తరువాత వచ్చే మొదటి ఆదివారము నాడు ప్రత్యేక కరుణ పండుగను జరుపుకోవాలని కోరినట్లుగా రాసింది. అందుకే, పరిశుద్ధ రెండవ జాన్ పౌల్ పాపుగారు 2000ల సంవత్సరములో, పునీత ఫౌస్టినమ్మ గారి పునీత పట్టం సందర్భముగా, క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాత వచ్చు ఆదివారమును దివ్యకారుణ్య పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చి యున్నారు. అప్పటినుండి రోమను కతోలిక సంఘము నందు ఈ పండుగ కొనియాడబడు చున్నది. 

అసలు 'దివ్య కారుణ్యం' అంటే ఏమిటి? ఈ పండుగ జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? దివ్య కారుణ్యం అంటే, 'దేవుని కరుణ' అని అర్ధం. ‘కరుణ' అనే తెలుగు మాటకు ఆంగ్లములో 'Mercy' అందురు. ‘Mercy' అనే ఆంగ్ల మాట mercedem లేదా merces అనే లాటిన్ మాట నుండి ఉద్భవించినది. ‘mercedem’ లేదా ‘merces’ అనే మాటకు ‘ప్రతిఫలము, జీతము, కిరాయి’ అనే అర్ధాలు ఉన్నాయి. బైబిలు పరి భాషలో ఈ మాటకు (Mercy) ‘ప్రతిఫలము లేదా జీతము లేదా కిరాయి చెల్లించ బడినది’ అని అర్ధము. 

యేసుక్రీస్తు పునీత ఫౌస్టినమ్మ గారితో ఇలా చెప్పియున్నారు, “నా కుమార్తె, ఊహించలేని నా కరుణ గురించి ప్రపంచమంతటికీ తెలియజేయి. కరుణ యొక్క పండుగ అన్ని ఆత్మలకు, ముఖ్యముగా పాపులకు ఆశ్రయము, రక్షణముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజున, నా సున్నితమైన కరుణ యొక్క అగాధాలు తెరవబడతాయి. నా కరుణ యొక్క ధారలను చేరుకునే ఆత్మలపై నేను దయ యొక్క మహాసముద్రాన్ని కుమ్మరిస్తాను. ఎవరైతే పాపవిముక్తి పొంది, దివ్యసత్ప్రసాదమును స్వీకరిస్తారో, వారు పాపవిముక్తిని, సంపూర్ణ క్షమాపణను పొందుతారు.”

 దివ్యకారుణ్య సందేశము
దివ్యకారుణ్య సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలంటే, మూడు కార్యాలు చేయాలి:
మొదటిగా, దివ్యకరుణను వేడుకోవాలి: ప్రార్ధనలో మనం దేవున్ని తరచూ కలుసు కోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకు పశ్చత్తాపపడి, ఆయన కరుణను మనపై, సమస్త లోకముపై క్రుమ్మరించ బడాలని, దివ్యకరుణా మూర్తిని వేడుకోవాలి.

రెండవదిగా, కరుణ కలిగి జీవించాలి: మనం కరుణను పొంది, మనద్వారా ఆ కరుణను ఇతరులుకూడా పొందాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏవిధముగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో, ఆవిధముగానే, మనముకూడా ఇతరుల పట్ల ప్రేమను, మన్నింపును చూపాలని ప్రభువు ఆశిస్తున్నారు.

మూడవదిగా, యేసును సంపూర్ణముగా విశ్వసించాలి: తన దివ్యకరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడి యున్నవని తెలుసుకోవాలనేదే ప్రభువు కోరిక. మనం ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే, అంతగా ఆయన కరుణ కృపా వరాలను పొందుతాము.

గ్రుడ్డివాడైన బర్తిమయి, “దావీదు కుమారా! యేసుప్రభూ, నన్ను కరుణింపుముఅని అరిచాడు, ఫలితముగా, చూపును పొందాడు. కననీయ స్త్రీ ప్రభూ, దావీదు కుమారా! నాపై దయ చూపుముఅని మొరపెట్టుకున్నది. ఫలితముగా, ఆమె కుమార్తె స్వస్థత పొందినది. పదిమంది కుష్ఠరోగులు, “ఓ యేసు ప్రభువా! మమ్ము కరుణింపుముఅని కేకలు పెట్టారు. ఫలితముగా, వారు శుద్ధి పొందారు. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, “ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుముఅని ప్రార్ధించాడు. ఫలితముగా, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి యున్నాడు.
 
దేవుని ప్రేమకు అవధులు! హద్దులు, ఎల్లలు లేనేలేవు. అవధులు లేని కారుణ్యము కలిగిన క్రీస్తు ప్రభువును, మనం విశ్వసించి, ఆయనను వెంబడిస్తూ, ఆ దివ్య కారుణ్యమును మనమందరమూ  పొందుకుందాం. క్రీస్తు ప్రభుని దివ్య కారుణ్యమును మనము పొందుకొని, ఇతరుల యెడల మనము కూడా కారుణ్యమును కలిగి జీవిద్దాం. దేవుని దివ్య కారుణ్యము మన యెడల అమితముగా నున్నది.  ఆయన కారుణ్యము మనయెడల ఉండబట్టే, మనము పరిశుద్ధాత్మచే, నడిపింపబడుతున్నాము. దేవుడు మనందరి యెడల ఆయన దివ్య కారుణ్యము ఏ విధముగా ప్రదర్శిస్తున్నారో మనము కూడా, ఒకరి యెడల ఒకరము, ప్రేమ, క్షమాపణ, దయ, కనికరము, ఓర్పు, సహనమును కలిగి యుండాలి.

దివ్య కారుణ్య ఆదివారం మనకు దేవుని యొక్క అనంతమైన ప్రేమను, క్షమాపణను గుర్తుచేస్తుంది. మన పాపాలు ఎంత పెద్దవైనా, మనం దేవుని కరుణను విశ్వసిస్తే, ఆయన మనలను క్షమించడానికి, మనకు శాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఈ రోజు మనకు తెలియ జేస్తుంది. ఇది మన జీవితాల్లో కరుణను చూపించడానికి, ఇతరులపై దయ చూపడానికి కూడా మనలను ప్రోత్సహిస్తుంది.

మీ అందరకు దివ్యకారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు!

దేవుడు దయామయుడు. ప్రేమస్వరూపి. మన కొరకు తన ప్రేమను, కరుణను ధారపోసి యున్నారు. కనుక, దేవుని కరుణను విశ్వసించుదాం. పరులపట్ల కరుణను చూపుదాం. ఎవరును దేవుని కరుణకు దూరము కాకూడదని ప్రభువు కోరిక. ఇదియే దివ్యకారుణ్య సందేశము. రాబోవు జీవితమున దేవుని కరుణను మనం పొందాలంటే, ఈ జీవితమున ఇతరులపట్ల కరుణతో జీవించాలి. దేవుడు మనందరిని మిక్కిలిగా ప్రేమిస్తున్నారు. మన పాపములకన్న ఆయన ప్రేమ ఎంతో ఉన్నత మైనది, అనంత మైనది. హద్దులు లేనిది, షరతులు లేనిది. నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి, ఆయన కరుణను పొంది, మన ద్వారా, ఇతరులకు కూడా ఆ కరుణ ప్రవహించాలనేదే దేవుని కోరిక. అప్పుడు ప్రతిఒక్కరు దైవసంతోషములో పాలుపంచుకొన గలరు.

“దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు” (మత్త 5:7). పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 281లో ఇలా ఉంది, “నాకు ఒసగబడిన ఈ దైవకార్యము నా మరణముతో అంతము కాదని, ఇది ఆరంభమేనని, నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా! దేవుని మంచితనము గూర్చి మీకు ఎరుక పరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీచెంతకు తీసుకొని వత్తును. పునీత రెండవ జాన్‌ పాల్‌ జగద్గురువులు ఇలా చెప్పియున్నారు, “యేసుక్రీస్తునందు ప్రధమముగా బహిరంగ పరచబడిన దేవుని దివ్యకరుణ రహస్యం, ఈ యుగానికొక గొప్ప సందేశము. మానవ చరిత్ర ప్రతి దశలోనూ ముఖ్యముగా, ప్రస్తుత యుగములో దివ్యకరుణ రహస్యాన్ని, సందేశాన్ని లోకానికి చాటిచెప్పాల్సిన భాద్యత శ్రీసభకున్నది”. అలాగే, “యేసుక్రీస్తు కారుణ్యమూర్తి. క్రీస్తును దర్శిస్తే దైవకారుణ్యమును దర్శించడమేఅని 16వ బెనెడిక్ట్‌ జగద్గురువులు పలికియున్నారు.

దివ్యకారుణ్య మహోత్సవమున, “ప్రభువా! నాపై దయచూపుము, క్రీస్తువా! నాపై దయచూపుము, ప్రభువా! నాపై దయచూపుము అని ప్రార్ధన చేద్దాం. ఫలితముగా, దివ్యకారుణ్యమును పొందుదాం. దేవుని దయను, కరుణను, ప్రేమను, శాంతిని, స్వస్థతను, దైవకృపాను గ్రహములను పొందుదాం. “ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును” (కీర్తన. 118:1) అని కీర్తనాకారుడితో కలిసి స్తుతించుదాం!

1 comment: