ఈస్టరు 7వ వారము - బుధవారము (II)

ఈస్టరు 7వ వారము - బుధవారము
పునీత జుస్తీను
అ.కా. 20:28-38; యోహాను. 17:11-19

ధ్యానాంశము: ప్రార్ధన
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నావలె వారును లోకమునకు చెందినవారు కారు” (యోహాను 17:14, 16)
ధ్యానము: లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించి, అపోస్తలులు ఒకరుగ ఐఖ్యమై ఉండునట్లు, వారిని సురక్షితముగ ఉంచుమని, దుష్టునినుండి కాపాడుమని, సత్యమునందు వారిని ప్రతిష్టింపుమని యేసు తండ్రిని ప్రార్ధించారు. పౌలుకూడా ఎఫెసులో తన వీడ్కోలు ప్రసంగము ముగించి, వారందరితో తానుకూడా మోకరిల్లి ప్రార్ధించారు. క్రీస్తు శిష్యులు, ఈ లోకమునకు చెందినవారు కాదు అని ప్రభువు స్పష్టం చేసారు. వారు “పరలోక పౌరులు” (ఫిలిప్పీ. 3:20). అయినను, వారు ఈ లోకములో ఉండి, దేవుని రక్షణ ప్రణాళికను, క్రీస్తు ప్రేషిత కార్యమును కొనసాగించాల్సి యున్నది. ఈ క్రమములో వారు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే యేసు, పౌలులు తండ్రి దేవున్ని ప్రార్ధించారు.

నేడు తత్వవేత్త, క్షమార్ది, ఉపాధ్యాయుడు, రచయిత, వేదసాక్షి అయిన పునీత జుస్తీను (క్రీ.శ. 100-165) గారిని స్మరించుకుంటున్నాము. ఆయన మనకు ఆదర్శం. ఒక అన్యుడు, సత్యాన్వేషియై, జీవిత పరమార్ధం తెలుసుకోవాలన్న కాంక్షతో, క్రైస్తవ విశ్వాసాన్ని పరిశీలించి, ప్రార్ధించి, విశ్వసించి క్రైస్తవుడయ్యారు. రోమునగరము, చుట్టుప్రక్కల క్రీస్తును గురించి బోధించారు. క్రీస్తు విశ్వాసులుగా ఉన్నందున జుస్తీనును కొరడాలతో తీవ్రముగా కొట్టించి, అనంతరం తలను నరికించారు. వారు క్రీ.శ. 165లో వేదసాక్షి మరణం పొందారు. జుస్తీను అనగా ‘న్యాయము’, ‘సత్యము’ అని అర్ధం.

“నీతిమంతుని ప్రార్ధన మహాశక్తి మంతమైనది” (యాకో. 5:16). “పరలోక రాజ్యము దుష్టుల దౌర్జన్యమునకు గురియగుచున్నది. వారు దానిని దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు” (మత్త. 11:12) అని యేసు చెప్పెను. కనుక, దుష్టులచేత నేడు శ్రమలనుభవించుచున్న బోధకుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్ధించుదాం.

No comments:

Post a Comment