దివ్యకారుణ్య మహోత్సవం - ఈస్టర్ రెండవ ఆదివారం, Year C

దివ్యకారుణ్య మహోత్సవం
ఈస్టర్ రెండవ ఆదివారం, Year C


“పునరుత్థాన పండుగ తరువాత వచ్చు ఆదివారమున, దివ్యకారుణ్య మహోత్సవం కొనియాడబడాలనేదే నా కోరిక. ఆ రోజున, దివ్యకరుణ సకల జనులకు ఒసగబడును. పాపసంకీర్తనం చేసి, దివ్యసత్ప్రసాదమును స్వీకరించువారికి సంపూర్ణ పాపవిమోచనము, శిక్షనుండి విముక్తి లభించును. మానవ లోకము నా దరికి చేరిననే తప్ప అది శాంతమును పొందలేదు. ఆనాడు, అనంత దివ్యవరానుగ్రహాలు ప్రవహించే దివ్యద్వారాలన్నీ తెరచే ఉంటాయి. వారి పాపాలు ఎంతటివైనను, నన్ను చేరడానికి ఏ ఆత్మగాని భయపడక ఉండునుగాక! నా దరి చేరు ఆత్మలకు నా కరుణా సముద్ర వరాలను కృమ్మరించెదను. దివ్యకారుణ్య మహోత్సవం సకల ఆత్మలకు, ముఖ్యముగా పాపాత్ములకు శరణముగాను, ఆదరణముగాను ఉండునుగాక!” (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 699).

22 ఫిబ్రవరి 1931న, స్వయముగా దివ్యకారుణ్య ప్రభువు పునీత ఫౌస్తీనమ్మతో పలికిన పలుకులు. దీనిద్వారా, శ్రీసభలో ‘దివ్యకారుణ్య మహోత్సవం’ స్థాపించబడాలనేది ప్రభువు చిత్తమని స్పష్టమగుచున్నది. 2000 సం.లో, ఈస్టర్ రెండవ ఆదివారమును, పునీత జాన్ పౌల్ జగద్గురువులు దివ్యకారుణ్య పండుగను స్థాపించారు. కరుణ మహోత్సవమును కొనియాడుటద్వారా, మన రక్షణ పాస్క పరమ రహస్యమునకు, దివ్యకారుణ్యమునకు దగ్గరి సంబంధమున్నదని విదితమగుచున్నది. ఆరోజున, రక్షణ పరమ రహస్యమైన దివ్యకారుణ్యము, అతి గొప్ప వరప్రసాదమని ధ్యానించాలి.

దివ్యకరుణ మహోత్సవాన్ని ఘనముగా, వైభవముగా కొనియాడాలనేదే ప్రభువు ఆకాంక్ష. ఈ మహోత్సవాన్ని జరుపుకొనే విధానాన్ని ప్రభువు రెండు విధాలుగా సూచించారు. మొదటగా, దివ్యకరుణ చిత్రపఠమును ఆశీర్వదించి, సమూహముగా గౌరవించి, ఆరాధించాలి (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 49, 341, 414, 742). రెండవదిగా, ఆ దినమున గురువులు దివ్యకరుణగూర్చి దైవప్రజలకు బోధించాలి (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 570, 1521).

లతీనులో ‘మిసెరెరి’ (misereri) అనగా ‘కనికరము చూపుట’ లేదా ‘కరుణ కలిగియుండుట’; ‘కోర్’ (cor) అనగా ‘హృదయం’. దివ్యకారుణ్యం అనగా, ‘హృదయములోనుండి కరుణ’ను చూపటం. గ్రీకులో, ఎలెయ్-సోన్ (eleison) అనగా ‘దయ’. హీబ్రూలోని రఖమ్ (racham) అను శబ్దార్ధ ప్రకారం, ‘గర్భం’ అని అర్ధం. ‘గర్భం’, నూతన జీవితానికి, నూతన సృష్టికి సూచిక. దేవుని కారుణ్యము అంత లోతైనదని అర్ధం; అలాగే, హెసెద్ (hesed) అనగా ‘స్థిరమైన ప్రేమ’. వీటన్నింటికి అర్ధం, “ప్రభువా, నాపై దయ చూపుము. నీ కారుణ్యమును నాపై కుమ్మరించుము. నీ దయను, కృపను, ప్రేమను నాపై కుమ్మరించుము.” మనలను తన ‘గర్భము’లో దాచుకొని నూతన సృష్టిగా మనలను చేయుమని ప్రార్ధిస్తున్నాము.

‘దయ’ను రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. మొదటిది, మన పాపాలకు శిక్షార్హులమైనను మనం శిక్షను పొందక పోవడం. మన పాపాలను బట్టి మనం శిక్షార్హులము. దేవుని కోపానికి గురికావలసిన వారము. కాని దేవుడు మన పాపాలను బట్టి మనలను శిక్షకు గురి చేయడం లేదు. “మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు. మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు” (కీర్తన 103:10). ఇదే దివ్యకారుణ్య దయ, కనికరము, ప్రేమ! దీనిని మనం పాపసంకీర్తన దివ్యసంస్కారములో అనుభూతి పొందుచున్నాము. రెండవదిగా, మంచిని పొందుటకు అర్హులము కాకున్నను పొందటం. ఇదే దైవకృప, దైవానుగ్రహము, దైవాశీర్వాదము! ఇదియే దివ్యకారుణ్యము! మనం దేవునివైపుకు తిరిగి వచ్చిన ప్రతీసారి దీనిని పొందుచున్నాము.

దివ్యకారుణ్య సందేశము

దేవుడు దయామయుడు. ప్రేమస్వరూపి. మన కొరకు తన ప్రేమను, కరుణను ధారపోసియున్నారు. కనుక, దేవుని కరుణను విశ్వసించుదాం. పరులపట్ల కరుణను చూపుదాం. ఎవరును దేవుని కరుణకు దూరము కాకూడదని ఆయన కోరిక. ఇదియే దివ్యకారుణ్య సందేశము. రాబోవు జీవితమున దేవుని కరుణను మనం పొందాలంటే, ఈ జీవితమున ఇతరులపట్ల కరుణతో జీవించాలి. దేవుడు మనందరిని మిక్కిలిగా ప్రేమిస్తున్నారు. మన పాపములకన్న ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అనంతమైనది. హద్దులులేనిది, షరతులులేనిది. నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి, ఆయన కరుణను పొంది, మనద్వారా, ఇతరులకుకూడా ఆ కరుణ ప్రవాహించాలనేదే దేవుని కోరిక. ఆవిధముగా, ప్రతిఒక్కరు దైవసంతోషములో పాలుపంచుకొనగలరు.

దివ్యకారుణ్య సందేశాన్ని మనం పుణికిపుచ్చుకోవాలంటే, మూడు కార్యాలు చేయాలి:

దివ్యకరుణను వేడుకోవాలి: ప్రార్ధనలో మనం దేవున్ని తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకి పశ్చత్తాపపడి, ఆయన కరుణను మనపై, సమస్త లోకముపై క్రుమ్మరించబడాలని, దివ్యకరుణామూర్తిని వేడుకోవాలి.

కరుణ కలిగి జీవించాలి: మనం కరుణను పొంది, మనద్వారా ఆ కరుణను ఇతరులుకూడా పొందాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏవిధముగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో, ఆవిధముగానే, మనముకూడా ఇతరుల పట్ల ప్రేమను, మన్నింపును చూపాలని ప్రభువు ఆశిస్తున్నారు.

యేసును సంపూర్ణముగా విశ్వసించాలి: తన దివ్యకరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడియున్నవని తెలుసుకోవాలనేదే ప్రభువు కోరిక. మనం ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే, అంతగా ఆయన కరుణ కృపావరాలను పొందుతాము.

“దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు” (మత్త 5:7). “నాకు ఒసగబడిన ఈ దైవకార్యము నా మరణముతో అంతముకాదని, ఇది ఆరంభమేనని, నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా! దేవుని మంచితనముగూర్చి మీకు ఎరుకపరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీచెంతకు తీసుకొనివత్తును” (పునీత ఫౌస్తీనమ్మ డైరీ, 281). యేసుక్రీస్తునందు ప్రధమముగా బహిరంగ పరచబడిన దేవుని దివ్యకరుణ రహస్యం, ఈ యుగానికొక గొప్ప సందేశము. మానవ చరిత్ర ప్రతిదశలోనూ ముఖ్యముగా, ప్రస్తుత యుగములో దివ్యకరుణ రహస్యాన్ని, సందేశాన్ని లోకానికి చాటిచెప్పాల్సిన భాద్యత శ్రీసభకున్నది (పునీత రెండవ జాన్‌ పాల్‌ జగద్గురువులు).

“యేసుక్రీస్తు కారుణ్యమూర్తి. క్రీస్తును దర్శిస్తే దైవకారుణ్యమును దర్శించడమే” (16వ బెనెడిక్ట్‌ జగద్గురువులు). గ్రుడ్డివాడైన బర్తిమయి, “దావీదు కుమారా! యేసుప్రభూ, నన్ను కరుణింపుము” అని అరిచాడు, ఫలితముగా, చూపును పొందాడు. కననీయ స్త్రీ “ప్రభూ, దావీదు కుమారా! నాపై దయ చూపుము” అని మొరపెట్టుకున్నది. ఫలితముగా, ఆమె కుమార్తె స్వస్థత పొందినది. పదిమంది కుష్ఠరోగులు, “ఓ యేసు ప్రభువా! మమ్ము కరుణింపుము” అని కేకలు పెట్టారు. ఫలితముగా, వారు శుద్ధిపొందారు. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, “ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము” అని ప్రార్ధించాడు. ఫలితముగా, దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళాడు.

దివ్యకారుణ్య మహోత్సవమున, “ప్రభువా! నాపై దయచూపుము, క్రీస్తువా! నాపై దయచూపుము, ప్రభువా! నాపై దయచూపుము అని ప్రార్ధిద్దాం. ఫలితముగా, దివ్యకారుణ్యమును పొందుదాం. దేవుని దయను, కరుణను, ప్రేమను, శాంతిని, స్వస్థతను, దైవకృపానుగ్రహములను పొందుదాం. “ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును” (కీర్తన. 118:1) అని కీర్తనాకారుడితో కలిసి స్తుతించుదాం!

1 comment: