పునీత కార్మిక యోసేపు గారి మహోత్సవము
“మీరు ఏ పని చేసినప్పటికిని దానిని చిత్తశుద్ధితో మనుష్యుల కొరకు
చేయుచున్న కార్యము వలెగాక, దేవుని కార్యముగా
భావించి చేయుడు. దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునను విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన
ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును
సేవించుచున్నారు” (కొలొస్సీ 3:23-24).
యోసేపుగారు, కన్య మరియమ్మ భర్త, యేసుకు సాకుడు తండ్రి. అతను దావీదు వంశస్థుడు. పాలస్తీనా, గలిలీయ ప్రాంతములోని నజరేతు నివాసి. శ్రామికుడు, ధార్మికుడు. దయగలవాడు, దైవచిత్తానికి విధేయుడు. అతను నీతిమంతుడు అని మత్త 1:19లో చదువుచున్నాము. నీతిమంతుడనగా చట్టాన్ని ప్రేమించి, గౌరవించే వ్యక్తి. దేవుని చిత్తాన్ని పాటించేవాడు. యోసేపు గొప్ప విశ్వాసి, ప్రార్ధనాపరుడు. మరియ యేసులను మిక్కిలిగా ప్రేమించాడు. పవిత్రాత్మ వలన గర్భము దాల్చిన మరియమ్మను భార్యగా చేకున్నాడు. యేసును కన్న కుమారునిలా చూసుకున్నాడు. వారి సంరక్షణకు, పోషణకు నిత్యము తపన పడ్డాడు, ఎంతగానో శ్రమించాడు.
యోసేపు వృత్తి వండ్రంగి. యూద సంస్కృతిలో చేతపని గౌరవ ప్రదముగా భావించ బడేది. ఆ వృత్తితోనే తిరు కుటుంబాన్ని పోషించాడు. తన చేతి పనిద్వారా, నుదుటి చెమట ద్వారా, తిరు కుటుంబానికి అండగా ఉన్నాడు. తన శారీరక శ్రమద్వారా, దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్తుడయ్యాడు. యోసేపు తన పనిని ఎంతగానో ఇష్టపడ్డాడు. ఎప్పుడుకూడా అలసటను చూపలేదు. ఒక విశ్వాసిగా, పనిని సద్గుణముగా, విలువైనదానిగా, గౌరవనీయమైనదిగా మార్చాడు. తన పనిలో ఎల్లప్పుడు సంతృప్తిని పొందాడు. ప్రతీ పని విలువైనదే. యోసేపు రెండురెట్లు పనిచేసాడు. వండ్రంగిగా, నిజాయితీగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించాడు. అలాగే యేసును పెంచడములో, మరియమ్మతో కలిసి పనిచేసాడు. ఈ ప్రపంచములో కుటుంబాన్ని పోషించడం, పిల్లలను పెంచడము రెండూ విలువైన పనులే! తండ్రిగా తన పాత్రను పరిపూర్ణముగా పోషించాడు.
యేసుకూడా, యోసేపునుండి వండ్రంగి పనిని నేర్చుకున్నారు. తన బహిరంగ ప్రేషితకార్య ప్రారంభము వరకు, యోసేపు పనిలో సహాయముగా ఉన్నారు. యేసు “వండ్రంగి కుమారుడు” అని మత్త 13:55లో, “యోసేపు కుమారుడు” అని లూకా 3:23; 4:32; యోహాను 1:45; 6:42లో పిలువ బడినాడు. యేసు “వండ్రంగి” గా మార్కు 6:3లో పిలువ బడినాడు.
పని అంటే కేవలం మేధోపరమైనదని గ్రీకులు భావించేవారు. శారీరక పనులన్నీ బానిసల చేత చేయించేవారు. సోక్రటీసు, అరిస్టాటిలు పనిని చిన్నచూపు చూసారు. అలాంటి దృక్పధాన్ని యేసు మార్చారు. పని చాలా పవిత్రమైనదని, గౌరవప్రదమైనదని, దేవునికి ప్రీతికరమైనదని యేసు ఈ లోకానికి తెలియ జేయుటకు అట్లు చేసాడు. యేసు దృక్పధాన్నే క్రైస్తవ లోకం, ముఖ్యముగా అనాధి [బెనడిక్టైన్] మఠవాసులు... ఇతరులు కొనసాగించారు.
మానవ శ్రమ యొక్క ప్రాముఖ్యతకు, పవిత్రతకు యోసేపు గొప్ప ఉదాహరణ మరియు ఆదర్శం! మానవ శ్రమకు ఆయన నిజమైన చిహ్నం! మానవులు తమ శ్రమ వలన, దేవుని సృజనాత్మక సృష్టి కార్యములో భాగస్తులగు చున్నారు. “దేవుడైన యావే నరుని ఏదెను తోటను సాగుచేయుటకు, కాచుటకు దానిలో ఉంచెను” అని ఆ.కాం. 2:15లో చదువుచున్నాము. కనుక, శ్రమించడం మానవ కర్తవ్యం అని, శ్రమించడం దైవప్రణాళికలో పాల్గొనడమేనని అర్ధమగు చున్నది. శ్రమద్వారా, మానవ కుటుంబాభివృద్ధికి, సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా, దేవుని సృష్టి పరిపూర్ణత సాధిస్తుంది. మన అనుదిన పని అర్పణ అయినప్పుడు, భూమి బలిపీఠం అవుతుంది. కనుక, దేవుని మహిమార్ధమై మనం శ్రమించాలి.
మే 1న ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’. శ్రీసభకు పాలక పునీతుడైన యోసేపు గౌరవార్ధమై,12వ భక్తినాధ జగద్గురువులు, నాస్తిక కమ్యూనిజం నేపధ్యములో, దానికి వ్యతిరేకముగా, శ్రమ పోషకునిగా, ప్రతీ కార్మికునికి పాలక పునీతునిగా యోసేపును గుర్తించి, ‘పునీత శ్రామిక యోసేపు పండుగ’ను, దైవార్చన పండుగగా, క్రీ.శ. 1955వ సం.లో స్థాపించారు.
ఈ పండుగ మనకు తెలియజేసే పరమార్ధము ఏమిటంటే, పని, వృత్తి గౌరవాన్ని పెంపొందించడానికి, మానవ శ్రమ యొక్క గౌరవం దేవుని పోలికలో సృజింపబడిన శ్రామికున్ని గౌరవించడములో ఉంటుందని, పాపానికి ఫలితము మానవ శ్రమ ఎంత మాత్రము కాదని, మరియు పని కేవలము ఉద్యోగము కాదని అది ఒక బాధ్యత అని, సేవ చేయడమని ఈ మహోత్సవం తెలియజేయుచున్నది. అలాగే, క్రైస్తవులు పనిపట్ల గౌరవాన్ని, అవగాహనను పెంచుకోవాలని తల్లి శ్రీసభ ఆశిస్తున్నది. ప్రతీ పనిలో, విలువను, గౌరవాన్ని, సంతోషాన్ని చూడగలగాలి. పని వినయాన్ని నేర్పుతుంది. పని పవిత్రతలో నడిపిస్తుంది.
మన జీవిత స్థితి ఏదైనా, దైవాంకిత జీవితమైనా, సాధారణ క్రైస్తవ జీవితమైనా, మన పని పవిత్రమైనది. దేవుడు మనకు అప్పగించిన పనిని వివేచించడము, మన వృత్తిని వివేచించడములో భాగమే. మన పనిద్వారా, దేవుని రాజ్యము, భూలోకమునకు వచ్చుటలో మన వంతు కృషిచేసిన వారమవుతాము.
యంత్రాంగం, కంప్యూటరు... మొ.గు. కారణాల వలన నిరుద్యోగం అధికమగుచున్నది. నిరుద్యోగం అభద్రతాభావాన్ని కలిగిస్తుంది. ఎంతోమందిని పేదవారిగా, నిరాశ్రయులుగా చేయుచున్నది. నేటి లోకము ఎలా ఉన్నదంటే, మనుష్యులను యంత్రాలుగా చూస్తున్న లోకం! కార్మికుల ఆత్మగౌరవాన్ని అణగద్రొక్కే లోకం! పనికన్న, వేతనాన్ని చూసే లోకం! కూర్చొని డబ్బు సంపాదించాలనే లోకం! ఈ పరిస్థితులలో, ప్రజల హక్కులను, ముఖ్యముగా కార్మికుల హక్కులను, వారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతీ ప్రభుత్వానికీ ఉన్నది! మనము కూడా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను పొందడానికి ప్రయత్నము చేయాలి.
అనేక కారణముల వలనగాని పనిని కోల్పోయిన వారిని, పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని, పునీత శ్రామిక యోసేపు మధ్యస్థ ప్రార్ధన వేడుదలలో ఉంచుదాం. యోసేపు తప్పక ఓదార్పును, మద్దతును, మార్గదర్శకమును అందించగలరు. మనము కూడా పనిని బట్టిగాక వ్యక్తులను గౌరవించాలి. ప్రతీ పని విలువైనదే అని గుర్తించాలి!
నేటి సమాజానికి పునీత కార్మిక యోసేపు గారి సందేశం:
శ్రమ యొక్క విలువ: యోసేపు గారు ఒక సాధారణ కార్మికుడు. తన చేతులతో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. శ్రమను గౌరవించడం, కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన జీవితం మనకు తెలియజేస్తుంది. ప్రతి పనిలోనూ నిజాయితీ, అంకితభావం ఉండాలని ఆయన జీవితం బోధిస్తున్నది. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి పని పవిత్రమైనదే అని ఈరోజు మనం గుర్తించాలి. ఈ సృష్టిలో ఎవ్వరూ తక్కువ కాదు. ఎవ్వరూ ఎక్కువ కాదు. అందరూ సమానులే. ఏ వృత్తి ఎక్కువ కాదు. ఏ వృత్తి తక్కువ కాదు అనే స్వచ్ఛమైన భావనను ప్రజలందరూ గ్రహించాలి.
కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యత: యోసేపు గారు మరియమ్మ గారికి ప్రేమగల భర్తగా, యేసు ప్రభువుకు సాకుడు తండ్రిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. కుటుంబ బంధాల యొక్క పవిత్రతను, ప్రేమ, సహనం, బాధ్యతతో కూడిన కుటుంబ జీవితాన్ని గడపడం ఎంత ముఖ్యమో ఆయన జీవితము ద్వారా తెలుస్తున్నది. నేటి సమాజములో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న సమయములో ఇది మనకు గొప్ప మార్గదర్శకం.
నిశ్శబ్ద సేవ: యోసేపు గారు ఎక్కువగా మాట్లాడకుండా నిశ్శబ్దముగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన నిశ్శబ్ద సేవ, విధేయత, విశ్వాసము మనకు స్ఫూర్తినిస్తాయి. మనం చేసే ప్రతి పనిని గొప్పగా చెప్పుకోకుండా, ఫలితము గురించి ఆందోళన చెందకుండా నిస్వార్థముగా పనిచేయాలని ఆయన జీవితము మనకు నేర్పుతున్నది.
విశ్వాసం మరియు విధేయత: యోసేపు గారి జీవితం విశ్వాసానికి, దేవుని చిత్తానికి విధేయతకు నిదర్శనము. కష్ట సమయాల్లో కూడా ఆయన తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మన జీవితములో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లలో దేవునిపై విశ్వాసం ఉంచడము, ఆయన చిత్తానికి లోబడి ఉండటము మనకు ధైర్యాన్నిస్తున్నది.
పేదలు మరియు అణగారిన వారి పట్ల ప్రేమ: యేసు ప్రభువును పెంచే బాధ్యతను స్వీకరించిన యోసేపు గారు, పేదల పట్ల, అణగారిన వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను చూపించారు. సమాజములో వెనుకబడిన వారికి సహాయం చేయడము, వారి బాధలను పంచుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన జీవితము మనకు గుర్తు చేస్తున్నది.
శ్రద్ధగా పనిచేయాలి మరియు నిజాయితీని పాటించాలి: తాము చేసే ప్రతి పనిలో శ్రద్ధ, నిజాయితీ కలిగి యుండాలి. తమ వృత్తిని దైవ పిలుపుగా భావించి, కష్టపడి పనిచేయాలి. అవినీతికి ఎంతమాత్రము కూడా చోటు ఇవ్వకూడదు.
కుటుంబ విలువలను కాపాడాలి: ప్రేమ, సహనం, క్షమాపణతో కూడిన క్రైస్తవ కుటుంబాలను నెలకొల్పాలి. పిల్లలకు విశ్వాసం, మంచి నడవడికను నేర్పించాలి.
నిస్వార్థ సేవలో నిమగ్నం కావాలి: తమ సమయాన్ని, శక్తిని, వనరులను ఇతరుల కోసం, ముఖ్యముగా పేదలు మరియు కష్టాల్లో ఉన్నవారి కోసము వెచ్చించాలి.
విశ్వాసాన్ని ప్రకటించాలి: తమ జీవితము ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియజేయాలి. మాటలతో పాటు చేతలతో కూడా సువార్తను ప్రకటించాలి.
న్యాయము మరియు శాంతి కోసం పోరాడాలి: సమాజములో నెలకొన్న అన్యాయాలు, వివక్షతలపై గళమెత్తాలి. శాంతి, సమానత్వము కోసము కృషి చేయాలి.
ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే,
కార్మికుల హక్కులను పరిరక్షించాలి: కార్మికులకు సరైన వేతనాలు, పని పరిస్థితులు, భద్రత కల్పించాలి. వారి శ్రమను గౌరవించాలి.
ఉపాధి అవకాశాలు కల్పించాలి: ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన ఉపాధి పొందే అవకాశమును కల్పించాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి.
కుటుంబాలకు మద్దతు ఇవ్వాలి: బలమైన కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలి. పిల్లల సంరక్షణ, విద్య కోసము తగిన చర్యలు తీసుకోవాలి.
పేదరికము నిర్మూలించాలి: పేదరికములో ఉన్నవారికి సహాయము అందించాలి. వారికి జీవనోపాధి కల్పించే పథకాలను అమలు చేయాలి.
సామాజిక న్యాయం మరియు సమానత్వం కల్పించాలి: సమాజంలో వివక్షత లేకుండా చూడాలి. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. బలహీన వర్గాలకు ప్రత్యేక సహాయము అందించాలి. అన్ని వృత్తులు సమాజాభివృద్ధికి దోహదం చేసేవే. సమాజ నిర్మాణానికి పనికి వచ్చేవే. వృత్తిపనివారిని గౌరవించి, వారికి ఇవ్వవలసిన వేతనము గౌరవముగా అందజేసి కష్టించి పనిచేసే వారు అందరూ మనుషులే. బానిసలు కాదు. పనికిరాని వారు కాదు. సృష్టిలో అందరూ... అన్నీ ఉపయోగకరమే. విలువతో కూడినవారే. విలువతో కూడినవే అనే స్వభావమును మనస్తత్వమును కలిగి యుండాలి.
పునీత కార్మిక యోసేపు గారి జీవితం మనందరికీ ఒక గొప్ప ప్రేరణ. ఆయన చూపిన మార్గములో నడుస్తూ, శ్రమను గౌరవిస్తూ, కుటుంబ విలువలను కాపాడుతూ, నిస్వార్థంగా సేవ చేస్తూ, విశ్వాసంలో ముందుకు సాగుదాం. ప్రభుత్వాలు కూడా ఈ ఆదర్శాలను స్వీకరించి, కార్మికుల సంక్షేమానికి, సామాజిక న్యాయానికి కృషి చేయాలని ఆశిద్దాం.
ప్రార్ధన:
పునీత యోసేపుగారా! మీరు చేసినట్లుగా, సహనం, పట్టుదలతో పనిచేయడం మాకు నేర్పించండి. మా విశ్వాస కన్నులను తెరవండి, తద్వారా మేము పనిలోనున్న గౌరవాన్ని గుర్తించగలము మరియు దేవుని సృష్టికార్యములో, క్రీస్తు విమోచన కార్యములో భాగస్తుల మగుదము. పని ఆహ్లాదకరముగా ఉన్నప్పుడు, దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు, పని భారముగా ఉన్నప్పుడు, దేవునికి అర్పించునట్లు మాకు సహాయము చేయండి.
“కర్షక కార్మికులు ఎవరెవరైతే వారి శ్రమను నమ్ముకొని వారి శ్రమకు అంకితమై జీవిస్తున్నారో! అట్టి వారి శ్రమను వృధా కాకుండా వారు గౌరవమును పొందుకొనే విధముగా ఆశీర్వదించండి ప్రభూ!”
- యేసు దేవా మీరు మానవ లోకంలో కన్య మరియ గర్భమున పవిత్రాత్మ ప్రభావముచే జన్మించారు.
- మీకు సాకుడు తండ్రిగా యోసేపుగారు తన వృత్తి ఐన వడ్రంగి వృత్తిని గౌరవించి, కుటుంబ పోషణకు ఆయన వృత్తిని ఆధారంగా చేసుకొని, యేసు దేవా మిమ్మునూ... మీ తల్లి మరియమ్మనూ పోషించారు.
- పరలోక తండ్రి దేవుడు అప్పగించిన ప్రణాళికను మీ సాకుడు తండ్రి ఐన యోసేపుగారు ప్రేమతో... బాధ్యతతో... ఇష్టతతో... సమర్థవంతంగా చిత్తశుద్ధితో నెరవేర్చారు.
- కర్షక కార్మికులందరికీ, మీ సాకుడు తండ్రియైన పునీత జోజప్ప గారి ఆశీస్సులు ఉండాలని మీకు ప్రార్థిస్తున్నాను.
- శ్రమించి పనిచేసే వారందరికీ! శక్తి సామర్థ్యాలను మీ మహిమ కోసం సమకూర్చారు. మీరు మాకు దయచేసిన మీ జ్ఞానమును, మీరు మాకు ఒసగిన శక్తిని, సామర్థ్యములను, చిత్తశుద్ధితో నెరవేర్చి.... కష్టించి పనిచేసి, మీకు మహిమ కరముగా జీవించే కృపను మాలో ప్రతి ఒక్కరికీ దయచేయండి దేవా. మానవులమైన మేమందరమూ కష్టించి పనిచేసేవారమే! మీరిచ్చిన జ్ఞానమును, మీరిచ్చిన సామర్థ్యమును, కొందరు వినియోగించుకొనక, బద్దకించేవారమూ మాలో ఉన్నాము. అట్టి వారిని కూడా మీరు తట్టి, వారి శక్తిసామర్ధ్యాలను వారి జ్ఞానమును వారి వినియోగించుకొనే చిత్తశుద్ధిని బద్ధకించే వారందరికీ దయచేయండి. ఎవరు ఈ సృష్టిలో సోమరిగా జీవించుకుడా, అందరూ కష్టపడి, మీరిచ్చిన జ్ఞానముతో మీరిచ్చిన సామర్థ్యంతో మీరిచ్చిన నైపుణ్యములతో కష్టించి శ్రమించే మనస్తత్వమును ప్రతి ఒక్కరికీ దయచేసి, మీ ఆశీర్వాదములతో మేమందరము మా జీవనములు కొనసాగించుకొనులాగున, మాలో ప్రతి ఒక్కరినీ మీ అనుసరణలో నడిపించండి దేవా. అయ్యో నేను చేసే పని తక్కువ. హీనము అని, మాలో ఏ ఒక్కరూ... భావించకుండా దేవుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను నెరవేర్చాలి అనే అంకితస్వభావమును మా అందరికీ దయచేయండి ప్రభూ...
- పాపమునకు దారి తీసే పరిస్థితులను, పాప వృత్తుల యందు జీవించే వారిని, దేవా మీ దయగల ప్రేమతో, అట్టివారు పాపములో... పాపము చేయుచూ జీవించకుండా! వారికి కూడా పవిత్రమైన జీవితములను ప్రసాధించండి. వారికి హృదయ పరివర్తనను కలుగజేసి.... వారి పాపమును కడిగి వేయండి. నీతిని, న్యాయమును, పవిత్రతను కలిగిన జీవితములను మీయందు విశ్వాసముతో మీపై ఆధారపడి జీవించేలాగున వారి జీవితములను దిద్ది ఆశీర్వదించండి.
నా ఈ ప్రార్ధనను... మీ సన్నిధికి చేర్చుకొనండి. ప్రతి వ్యక్తీ కష్టించి పనిచేసే చిత్తశుద్ధి కలిగిన హృదయములను ప్రతి ఒక్కరికీ దయచేయండి. సోమరితనము మాలో ఉన్నట్లయితే సోమరితనమును మాలోనుండి తీసిపారవేసి కాల్చివేయండి. యేసు దైవమా. ఆమెన్.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పునీత కార్మిక యోసేపు గారి మహోత్సవ శుభాకాంక్షలు!
Dear loving and Affectionate Rev. Fr. Praveen Ofm Cap., excellent message. very inspiring and motivating everyone... Thanks a lot for sharing this beautiful reflection...
ReplyDelete