పాస్క పరమ రహస్యం - యేసు ఉత్థానం

 పాస్క పరమ రహస్యం - యేసు ఉత్థానం
"ఆయన పునరుత్థానుడయ్యెను"  - మార్కు 16:6

1. "మీరు వెళ్లి పేతురునకు చెప్పుడు..."
"నజరేయుడగు యేసు పునరుత్థానుడయ్యెను! మీరు వెళ్లి పేతురునకు, తక్కిన శిష్యులకు చెప్పుడు!" (మార్కు 16:1-7). ఆదివార వేకువజామున, యేసు సమాధి యొద్దకు వెళ్ళిన స్త్రీలతో [మగ్ధలా మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ] తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడిప్రక్కన కూర్చుండి యున్న ఒక యువకుడు [దేవదూత - మత్త 28:5; ఇరువురు పురుషులు లూకా 24:4] ఈ మాటలను చెప్పెను. ఇదొక శుభ సమాచారము! సంతోషకరమైన వార్త! స్త్రీలు ఆ శుభవార్తను పేతురునకు, ఆయన సోదరులకు చెప్పెను. ఆ తరువాత, ఈ శుభవార్తను, పేతురు లోకమంతటికి తెలియజేసెను. 

50 రోజుల తరువాత, పేతురు ఈ శుభసమాచారాన్ని "యూదయా జనులకు, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులకు", (అ.కా. 2:14), లోకమంతటికి చాటి చెప్పాడు: "నజరేయుడైన యేసును... దేవుడు సమాధి నుండి లేపేను. జరిగిన ఈ విషయమునకు, మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22, 32).

యేసు ఉత్థానం గురించి చాటిచెప్పాలంటే, దైవానుగ్రహం ఉండాలి: "పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు 'యేసే ప్రభువు' అని అంగీకరింప జాలడు" (1 కొరి 12:3). యేసు ఉత్థానం గురించి ప్రకటించాలంటే, వినయం, దైవ భీతి ఉండాలి. క్రీస్తు ఉత్థానం గురించి మనమందరం భయపడక, ధైర్యముగా ప్రకటించాలి: "విలపింపకుము. చూడుము! యూదాజాతి సింహము, దావీదు సంతతిలో శ్రేష్టుడు, గెలుపొందినాడు" (దర్శన 5:5). యేసు పునరుత్థానం గురించి చెప్పుటకు, మనకు మాటలు చాలవు! సిలువ ప్రబోధము నుండి, ఉత్థాన ప్రబోధం చేయడమంటే, ఎండిన నేలనుండి, సముద్ర తీరమునకు పరుగులు తీయడం లాంటిది! "మగ్ధలా మరియమ్మ సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి" (యోహాను 20:2), ఖాళీ సమాధి గురించి చెప్పగా, "పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తు చుండిరి" (20:3).

యేసు ఉత్థాన అనుభూతిని పొందిన మనం, కీర్తనకారునితో కలిసి, "నా ఆత్మమా! మేలుకొనుము! వీణ తంత్రీ వాద్యము మేల్కొనును గాక!నేను ఉషస్సును మేలుకొల్పెదను" (కీర్త 57:8) ఎలుగెత్తి పాడాలి. "భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చలించినను మనము భయపడ నక్కరలేదు. రండు, ప్రభువు కృత్యములను కనుడు. భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు" (కీర్త 46:2-3, 8).

దేవుడు చేసిన "మహాకార్యములు" అన్నియు, క్రీస్తు ఉత్థానములో పరిపూర్తి అయ్యాయి. ఉత్థాన క్రీస్తు, తలుపులు మూసి ఉన్నను, యేసు లోపలి వచ్చి శిష్యుల మధ్య నిలువ బడెను (యోహాను 20:19). మూసియున్న మన హృదయాలలోనికి, సంస్కృతిలోనికి, ఆయనను తిరస్కరించే నాస్తిక పాలనలోనికి, మూసియున్న మన స్నేహాలలోనికి, కుటుంబాలలోనికి, సంఘములోనికి... ఉత్థాన క్రీస్తు వచ్చును. ఏదీ మృత్యుంజయుడైన యేసును ప్రతిఘటించలేదు; మూసియున్న తలుపులున్నను, గోడల ఆవలినుండి ఆయన ప్రవేశించును. క్రీస్తు ఉత్థానం యుగాంతముల వరకు, ఆయన మరల తిరిగి వచ్చువరకు కొనసాగుతుంది.

"ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము" అని ప్రతీ దివ్యపూజా బలిలో మనం ప్రకటించు విశ్వాస రహస్యమును ఏదియు కూడా ఆపలేదు.

2. పాస్క పరమ రహస్యము
2.1. పాస్క అనగా ఏమి? "ఈ ఆచారమేమి?" (నిర్గమ 12:26). పాస్క జాగరణ ఏమి? పాస్క ఒక "జ్ఞాపకార్ధం."  పాత నిబంధన పాస్క పండుగను గూర్చి రెండు విధములైన వివరణలు ఇస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. 

ప్రాచీన వివరణ ప్రకారం, పాస్క అనగా "ప్రభువు దాటిపోవుట" అని అర్ధము. పాస్క అను పదానికి హీబ్రూ పదం 'పేసా', గ్రీకు పదం 'పాస్క'. "ఇది ప్రభువు పాస్క" (నిర్గమ 12:11, 27); అనగా, ఇది దేవుని కార్యం. ప్రభువు యిస్రాయేలీయుల ఇండ్ల మీదుగా "దాటి పోయెను". ఐగుప్తు దేశము నెల్ల నాశము చేసెను. ప్రభువు యిస్రాయేలీయుల ఇండ్లను దాటవేసెను, వదిలివేసెను లేదా రక్షించెను (నిర్గమ 12:25-27). కనుక, ఇది "దేవుని రక్షణాత్మకమైన పాస్క" దాటటం (theological or theocentric). "ఇది ప్రభువు పాస్క" ఎందుకన, దేవుడే కథానాయకుడు! దేవుని చొరవకు ప్రాధాన్యత ఇవ్వబడినది.

రెండవ వివరణ ప్రకారం, పాస్క అనగా, గొర్రెపిల్లను బలిగా సమర్పించుటనుండి, ఐగుప్తునుండి యిస్రాయేలీయుల నిర్గమనము వైపునకు దృష్టి మల్లినది. ఇది బానిసత్వమునుండి స్వతంత్రమునకు దాటిపోవుట (ద్వితీయ 16; నిర్గమ 13-15). ఈ వివరణ ప్రకారం, దేవుడుగాక, ప్రజలే దాటిపోయి రక్షింపబడుచున్నారు (anthropological or anthropocentric). అయితే, ఇది మొదటి దానికి ఎంతమాత్రము వ్యతిరేకం కాదు, ఎందుకన, రెండవ వివరణలో కూడా ప్రజలు దేవునిపై ఆధారపడుచున్నారు. యిస్రాయేలీయుల నిర్గమనము సినాయి కొండపై ఒడంబడికకు సంసిద్ధం చేయుచున్నది. కనుక, ఇది రాజకీయ విడుదలగాక, ఆధ్యాత్మికమైన (మతపరమైన) విముక్తి! దేవుని సేవించుటకు, యిస్రాయేలు జాతి విడుదల చేయబడినది. "దేవుని సేవించుటకు, నా ప్రజలను పోనిమ్ము" (నిర్గమ 4:23; 5:1).

ఈ రెండు వివరణలు కూడా పాత నిబంధన అంతటా కొనసాగుతాయి. యేసు కాలమున మాత్రము, పాలస్తీనా యూదులు, మొదటి వివరణకు ప్రాముఖ్యతనిచ్చారు. పాస్క పండుగను "దేవుడు దాటిపోవుట"ను జ్ఞాపకార్ధముగా కొనియాడేవారు. ఇది ఒక బలమైన ఆచారముగా, బలిగా పరిగణించబడింది. 14 నీసాను నెలన, దేవాలయములో గొర్రెపిల్లను అర్పించి, అదేరోజు రాత్రి, కుటుంబం అంతయు కాల్చిన గొర్రెపిల్లను పాస్క భోజన సమయములో భుజించేవారు. అయితే, పాలస్తీనా బయట స్థిరపడిన యూదులు మాత్రం (గ్రీకు-యూదులు లేదా డయాస్పోరా యూదులు), రెండవ వివరణకు ప్రాధాన్యతనిచ్చారు. వీరు యిస్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటుటను జ్ఞాపకార్ధముగా పాస్కను కొనియాడేవారు. ఇది బానిసత్వమునుండి, విముక్తికి సూచనగా ఉన్నది. ఐగుప్తు దాస్యమునుండి విడుదల పొందినందులకు జ్ఞాపకార్ధముగా కృతజ్ఞతగా కొనియాడేవారు. ఇది ఆత్మ శుద్దీకరణనను కూడా (పాపమునుండి-పవిత్రతకు, దుర్గుణమునుండి సద్గుణముకు) సూచిస్తుంది.

2.2. క్రైస్తవులకు 'పాస్క' అనగా ఏమి? క్రైస్తవులు ఎప్పుడు ఈ పండుగను కొనియాడటం ప్రారంభించారు? యేసు మరణాంతరం, ఆధిమ క్రైస్తవ సంఘం, "దేవాలయమునకు వెళ్లి" కొన్ని సంవత్సరాలపాటు, యూదులతో కలిసి, పాస్క పండుగను కొనియాడారు. ఒక నిర్దిష్ట సమయంలో, క్రైస్తవులు పాస్క పండుగను, ఐగుప్తునుండి యిస్రాయేలీయుల నిర్గమన సంఘటనల జ్ఞాపకార్ధముగాకాక, కొన్ని సంవత్సరాలక్రితం, ఒక పాస్క పండుగ రోజున యెరూషలేములో జరిగిన సంఘటనల జ్ఞాపకార్థముగా కొనియాడటం ప్రారంభించారు. క్రైస్తవ పాస్క "ఆత్మలోను, సత్యములోను" కొనియాడబడినది. పౌలు మాటలలో ఇలా చదువుచున్నాము: "కాబట్టి ద్వేషము, దౌష్ట్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక, నిజాయితి, సత్యము అనువానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసికొందము" (1 కొరి 5:8).

ఈ మార్పు ఎలా సంభవించినది? ఒక యూదుల పాస్క పండుగ రోజున, క్రీస్తు యెరూషలేములో మరణించారు (మరల ఉత్థానమయ్యారు). యోహాను సువార్తీకుని ప్రకారం, యూదులు పాస్క గొర్రెపిల్లలను దేవాలయములో బలిగా అర్పించు సమయముననే, యేసు మరణం కూడా సంభవించడం యాధృచ్చికమే! ఇంకో విధముగా చెప్పాలంటే, క్రీస్తు బలి (మరణం), పాత నిబంధన పాస్క  అంచనాలన్నింటిని నేరవేర్చినట్లుగా, నిశ్చయముగ పరిపూర్తి చేసినట్లుగా ఉన్నది. 

కనుక, శ్రీసభ పాస్క పండుగను ఇశ్రాయేలు ప్రజల నుండి, తీసికొనిను, నూతన అర్ధాన్ని చేకూర్చింది. మొదటిగా, ఇది "క్రీస్తు పాస్క". ఇది క్రీస్తు శ్రమలను సూచిస్తుంది. ఎందుకన, గ్రీకు భాషలో 'పాస్క' అనగా 'శ్రమలు పొందుట' అని అర్ధము. "మృత్యువు నాశనం చేయబడినది. విజయం సంపూర్ణమైనది" (1 కొరి 15:54). "క్రీస్తు శ్రమలే మన ఉత్థానం" అని ఇగ్నేషియస్ అంతియోకియా అన్నారు (The Passion of Christ). రెండవదిగా, శ్రీసభ వ్యక్తిగత) ప్రయాణం ఈ లోకములో ఒక నిర్గమనము వంటిది. నిజమైన పాస్క ముందున్నది. అది పరలోకమున పరిపూర్తియగును (The Passage of humanity). 

పునీత అంబ్రోసు, పాస్క అనగా 'దుర్గుణమునుండి సద్గుణమునకు, పాపమునుండి కృపకు ప్రజలు దాటుట' (ఫిలో,ఒరిజెన్) అని అన్నారు. కాని జేరోము, ప్రజలుగాక, 'దేవుడు దాటిపోవుట' అని అన్నారు. తన ప్రజలను రక్షించుటకు ప్రభువు దాటిపోయెను. అంబ్రోసియాస్టర్, పాస్క అనగా దాటిపోవుట కాదు, బలి అని అన్నారు. క్రీస్తుబలి మనలను రక్షణకు నడిపించినది. 

ఈ రెండు వివరణల నేపధ్యములో, పునీత అగుస్తీను వారు యోహాను సువార్తను ఆధారముగా చేసుకొని, పాస్క గురించి ఈవిధముగా చెప్పారు: లతీనులో పాస్క అనగా 'దాటిపోవుట' (transitus) అని అర్ధము. "అది పాస్క పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను" (యోహాను 13:1). ఇక్కడ 'దాటిపోవుట' అనే అర్ధములో చెప్పబడినది. ఎక్కడనుండి ఎక్కడికి? "ఈ లోకమునుండి తండ్రి యొద్దకు". కనుక పాస్క అనగా, 'యేసు ఈ లోకమునుండి, తండ్రి యొద్దకు వెళ్ళుట' అని అర్ధము (Christocentric). 

అయితే, 'యేసు ఈ లోకమునుండి, తండ్రి యొద్దకు వెళ్ళుట' ఆయన శ్రమలతో, ఉత్థానముతో ముడిపడి యున్నది. యేసు తన శ్రమల ద్వారా ఉత్థాన మహిమను పొందుచున్నారు. ఈ అర్ధాన్ని స్పష్టముగా యోహాను 12:23-26లో చూడవచ్చు. "తన శ్రమల ద్వారా, ప్రభువు మరణమునుండి జీవమునకు దాటారు" (అగుస్తీను). కనుక, శ్రమలు (Passion), దాటుట (Passing) రెండు వేరువేరు గాక, కలిసే అర్ధాన్ని యిస్తాయి. క్రైస్తవ పాస్క అనగా 'శ్రమల ద్వారా దాటుట' (transitus per passionem) అని అర్ధము. ఎమ్మావు మార్గములో, ఉత్థాన క్రీస్తు శిష్యులతో పలికిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం: "క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా?". పౌలు మాటలు ఆలకించుదాం: "మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలను అనుభవింప వలెను" (అ.కా. 14:22). "నిజమైన పాస్క ఏమనగా, శ్రమలు మరియు ఉత్థానము" (అగుస్తీను). 

క్రీస్తులో దైవ-మానవ స్వభావాలు ఒకటే గనుక, ఇద్దరు దేవుడు మరియు ప్రజలు దాటడం కనుమరుగై పోయింది. క్రీస్తులో ధాత, ముక్తిపొందువారు కలుసుకున్నారు. కృప మరియు స్వతంత్రము ఆళింగనం చేసుకున్నాయి. ఇదియే "నూతన, శాశ్వత నిబంధనం". 

అయితే ఒక ప్రశ్న! కేవలం క్రీస్తు మాత్రమే ఈ లోకమునుండి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నారా? మరి మన సంగతి ఏమిటి? క్రీస్తుతో మనం కూడా అనుసరిస్తాము (అగుస్తీను). "మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగించ బడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులముగ ఒనర్చుటకు గాను ఆయన లేవనెత్త బడెను" (రోమీ 4:25) అని పౌలు స్పష్టం చేసియున్నారు. క్రీస్తు శిరస్సు, మనం ఆయన శరీరము. కనుక, క్రీస్తుతో మనముకూడా తండ్రి యొద్దకు వెళ్ళెదము. క్రీస్తు పాస్క (దాటిపోవుట) వలన, తన శరీరమైన శ్రీసభ జనించినది.

కనుక, మనమందరము ఇప్పటికే క్రీస్తుతో తండ్రి యొద్దకు దాటబడినాము: "మీ జీవితము క్రీస్తుతోపాటు దేవుని యందు గుప్తమై ఉన్నది" (కొలొస్సీ 3:3) అని పౌలు స్పష్టం చేసియున్నాడు. నిరీక్షణలో, జ్ఞానస్నానములో మనం క్రీస్తుతో ఇప్పటికే దాటాము, కాని, క్రీస్తు జీవితాన్ని ముఖ్యముగా ఆయన ప్రేమను అనుసరిస్తూ, మన అనుదిన జీవిత వాస్తవాలలో ఇంకా దాటవలసి యున్నది. మనం దేవున్ని, మన పొరుగువారిని ప్రేమిస్తున్నప్పుడు, మన పాపాల క్షమాపణ మరియు నిత్యజీవం యొక్క నిరీక్షణ కోసం మనం కలిగి యున్న విశ్వాసం ద్వారా, మరణం నుండి జీవానికి దాటగలము (అగుస్తీను).

మనం లోకమునుండి తండ్రి యొద్దకు దాటిపోవాలి. ఆయన అనంతమైనవారు. శాశ్వితుడు. మన శిరస్సు అయిన క్రీస్తు కార్యాల ద్వారా, మనం ఈలోకమునుండి తండ్రి యొద్దకు దాటి, ఆయనను ముఖాముఖిగా గాంచెదము గాక!

3. క్రీస్తు ఉత్థానం - పాస్క పరమ రహస్యము
క్రీస్తు ఉత్థానం చారత్రక సంఘటన. ఇదొక అపూర్వమైన, పునరావృతం కాని సంఘటన. ఈ అద్భుతమైన సంఘటనను, ప్రతీరోజు దివ్యసంస్కారమైన దివ్యపూజాబలిలో జ్ఞాపకార్ధముగా కొనియాడుచున్నాము. క్రీస్తు ఉత్థానం క్రైస్తవుల విశ్వాసము. క్రీస్తు శ్రమలు, ఉత్థానం పాస్క పరమ రహస్యమును ఏర్పరచు చున్నాయి. అయితే, రెండు వేరువేరు సంఘటనలు కాదు. ఒకే సంఘటన - మరణమునుండి జీవమునకు.... 

క్రీస్తు నిజముగా ఉత్థానమైనారా? "ప్రభువు వాస్తవముగ (ontos - నిజముగానే) సజీవుడై లేచెను. "వాస్తవమును గ్రహించుటకు ఈ గ్రంథమును వ్రాయుచున్నాను" (1:4) అని లూకా సువార్తీకుడు తెలుపుచున్నారు. క్రీస్తు శ్రమలు, మరణం తరువాత, శిష్యులలో నున్న వెలుగు మాయమయింది. ఆయనను వారు దేవుని కుమారుడని విశ్వసించారు. ప్రవక్తలందరికంటే గొప్పవాడని విశ్వసించారు. కాని ఇప్పుడు వారికి ఏమి చేయాలో తోచలేదు. వారి మనసులలోని భావాలను లూకా ఇలా తెలిపాడు: "అయితే ఆయనయే యిస్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి మూడు రోజులాయెను" (24:21). అంతా అయిపోయిందని వారు భావించారు.

పేతురు క్రీస్తు ఉత్థానం గూర్చి చెబుతూ, "విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది. కాని అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింప బడిన రాయియే మూలరాయి ఆయెను" (1 పేతు 2:7) అని తెలిపెను. పేతురు పవిత్రాత్మతో పూరితుడై, "యేసు క్రీస్తు నందు తప్ప వేరోకని యందు రక్షణ లభింపదు. ఏలయన, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరోకనికి ఇవ్వబడలేదు" (అ.కా. 4:12) అని నాయకులకు, పెద్దలకు సమాధానమిచ్చెను. భయముతో పారిపోయిన శిష్యులు, విశ్వాసం సన్నగిల్లిన శిష్యులు, ఆ తరువాత ధైర్యముగా "యేసు ఉత్థానమాయెను" అని ప్రకటించారు. యేసు పేరిట సంఘములను స్థాపించారు. యేసు కొరకు, హింసలను భరించుటకు, ప్రాణములను సైతము త్యాగము చేయుటకు సిద్ధపడ్డారు. 

3.1. పౌలు సాక్ష్యం
క్రీస్తు పునరుత్థానమును గూర్చిన ప్రారంభ సాక్ష్యం పునీత పౌలు 1 కొరి 15:3-8లో చూడవచ్చు:
"నేను పొందిన దానిని మీకు మొదట అందించితిని. పవిత గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి, మూడ దినమున సజీవముగ లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి పండ్రెండు మంది అపోస్తలులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు.ఆపైన యాకోబునకు తదుపరి అపోస్తలుల కందరికిని ఆయన కనబడెను. ఆకాలమందు జన్మించినట్లున్న వాడనైనను, చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను."

పౌలు ఈ వాక్యాలను క్రీ.శ. 56 లేదా 57లో వ్రాసారు. ఈ సాక్ష్యాన్ని పౌలు ఇతరులనుండి స్వీకరించాడని చెప్పాడు. బహుశా, పౌలు తన పరివర్తన తరువాత పొందినట్లయితే, ఈ సాక్ష్యాన్ని మనం క్రీ.శ. 35 నాటిదని చెప్పవచ్చు. నిజానికి చాలా ప్రాచీన సాక్ష్యము. ఈ సాక్ష్యములో ఉన్న రెండు ప్రాథమిక వాస్తవాలు: "యేసు సజీవముగ లేవనేత్తబడెను" మరియు "ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను."

"యేసు సజీవముగ లేవనేత్తబడెను" (గ్రీకు: egegertai) అనగా "తిరిగి జీవం పోసుకున్నారు", "మరల లేచారు", "పునరుత్థానం చెందారు", "పునర్జీవం పొందారు". ఆయన పునర్జీవం లాజరువలె మరల మరణించుట వంటిది కాదు.

"ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను" (ophthe) అనగా తననుతానుగా ఇతరులకు కనిపించారు; "మేము మా కన్నులార చూచినా దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము" (అ.కా.4:20) అని పేతురు, యోహానులు బదులు పలికిరి.

3.2. సువార్తలు - క్రీస్తు ఉత్థానం
యేసు లేవనెత్తబడెను మరియు దర్శనమిచ్చెను. అయితే సువార్తలలో 'ఖాళీ సమాధి' గురించిన అంశం జోడించబడినది. ఖాళీ సమాధిని బట్టియే, యోహాను సువార్తీకుడు యేసు ఉత్థానమునకు ప్రత్యక్ష సాక్ష్యముగా వ్యక్తపరచాడు (యోహాను 20:3f.): నార వస్త్రములు అచట పడియుండుట, తలకు కట్టిన తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక, విడిగ చుట్టి ఉండుట.... అలాగే, ఉత్థాన క్రీస్తు దర్శనాలు ఆయన ఉత్థానమునకు సాక్ష్యాలు.

4. క్రీస్తు ఉత్థానం- విశ్వాసం
క్రీస్తు ఉత్థానమును విశ్వాసముతో అర్ధము చేసుకోవాలి. చారిత్రక సంఘటనలు (ఖాళీ సమాధి) వారి విశ్వాసాన్ని బలపరచాయి, కనుక విశ్వాసం ప్రధానం. "క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్త బడెను" (1 కొరి 15:20) అని పౌలు చెప్పారు. అలాగే, "క్రీస్తే లేవనెత్త బడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే" (1 కొరి 15:14). "మన ప్రభువగు యేసును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన యందు మనకు విశ్వాసమున్నది" (రోమీ 4:24).

పెంతకోస్తు అనంతరం, పేతురు యెరూషలేము ప్రజలకు, "ఇస్రాయేలు ప్రజలారా! ఈ మాటల నాలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా, దేవుడు మీకు రూడి ఒనర్చెను... యేసును మీరు న్యాయ రహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపేను. మేము అందరము సాక్షులము" (అ.కా. 2:22-32) అని బోధించెను.

పౌలు ఏతెన్సులో, 'దేవుడు మృతులలో నుండి లేపుట ద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరచెను" (అ.కా. 17:31) అని ప్రచారం చేసెను. "మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో, నీవు రక్షింప బడుదువు" (రోమీ 10:9).

ఉత్థానము వలన, యేసు "ప్రాణ దాతయగు ఆత్మ"గా మారెను (1 కొరి 15:45).

No comments:

Post a Comment