తపస్కాలం: "హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు"
విభూతి బుధవారం: యోవేలు 2:12-18; 2 కొరి 5:20-6:2; మత్త 6:1-6, 16-18
మార్చి 2న, విభూతి బుధవార సాంగ్యముతో, ఈ సంవత్సర తపస్కాల ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. "హృదయ పరివర్తనము చెంది, సువార్తయందు విశ్వాసమును" బలపరచుకుంటూ, ప్రభువు చెంతకు తిరిగి రావడానికి, తల్లి శ్రీసభ మనకొసగిన గొప్ప అనుకూల కాలము. పశ్చాత్తాపానికి, మారుమనస్సుకు, ఆధ్యాత్మిక పునరుద్ధరణకు తపస్కాలమొక తీర్థయాత్ర. ఈ 40 రోజుల తపస్కాల ప్రయాణం, 40 సం.ల ఇస్రాయేలు ప్రజల ఎడారి ప్రయాణాన్ని జ్ఞప్తికి చేస్తుంది. ఆ ప్రయాణం ఇస్రాయేలు ప్రజలకు, గొప్ప పరీక్షా కాలము. వారు శుద్ధిపొందుటకు మరియు యావే ప్రభువునకు దగ్గరగుటకు అనుకూల కాలము. వారు యావే దైవసాన్నిహిత్యమును పొందు కాలము. అదేవిధముగా ఈ తపస్కాలం, యేసు తన బహిరంగ ప్రేషితకార్య ఆరంభమునకు ముందుగా 40 రోజులు ఎడారిలో శోధింపబడిన కాలమును (మత్త 4:1-11; మార్కు 1:12-13; లూకా 4:1-13) జ్ఞప్తికి చేయుచున్నది. యేసు, తండ్రి దేవుని సాన్నిహిత్యము కొరకు, నలువది రేయింబవళ్ళు ఉపవాసములతోను, ప్రార్ధనలతోను గడిపారు. ఈ ప్రయాణములో, యేసు సాతాను శోధనలను ఎదుర్కొని వాటిని జయించారు.
విభూతి బుధవారమున మొదటి పఠనమును యోవేలు ప్రవక్త గ్రంథమునుండి వింటున్నాము (2:12-18). 'మిడుతల దండు' వలన తెగుళ్ళు, కరువు సంభవించిన సందర్భమున, యోవేలు ప్రవక్త యూదాప్రజలను మారుమనస్సు, ప్రార్ధనకు ఆహ్వానించుచున్నాడు. పూర్ణహృదయముతో దేవుని చెంతకు మరలి రమ్మని ప్రజలను, యాజకులను పిలుచుచున్నాడు: "ప్రభువిట్లనుచున్నాడు: ఇప్పుడైనను మీరు పూర్ణహృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు. మీ గుండెలను ముక్కలు చేసికొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగిరండు. ఆయన కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమకలవాడు. తాను నిశ్చయించుకొన్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు" (యోవేలు 2:12-13). పశ్చాత్తాపము, మారుమనస్సు పొంది, దేవుని చెంతకు తిరిగి వచ్చిన యెడల, వారు మరల దేవుని దయను, విముక్తిని పొందెదరు.
విభూతి బుధవారమున, గురువు విభూతిని నుదిటిపై రాస్తూ, "హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" అని లేదా "నీవు మట్టినుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలసిపోవుదువు" అను మాటలను పలుకుతారు. "హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" అనునది యేసు ప్రేషిత కార్యములో కూడా ప్రజలకు బోధించిన ప్రధానమైన బోధన. "యోహాను చెరసాలలో బంధింప బడిన పిమ్మట యేసు గలిలీయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయపరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను" (మార్కు 1:14-15). ఇది దేవుని రాజ్యమును గూర్చిన సువార్త. సువార్తను విశ్వసించుట వలన, ప్రజలు తమ హృదయపరివర్తనమును వ్యక్తపరచవలెను.
'పశ్చాత్తాపం' అనగా దైవరాజ్యమునకు సంబంధించిన సువార్తా విలువల ప్రకారం లేనివాటిని త్యజించి, దైవరాజ్యము ఆశించు వాటికొరకు జీవితాన్ని మలచుకొనుట. 'దేవుని పాలన'ను మన జీవితములో అంగీకరించడమే దైవరాజ్యము. ఆ దైవరాజ్యమే యేసు-వ్యక్తిలో మనమధ్య ప్రదర్శితమైనది. దైవరాజ్యము ప్రకారం జీవించడమనగా, దేవుని ఏకైక సుత్తుడైన యేసు జీవిత ఆదర్శములో మన జీవితాలను మలచుకోవడమే!
యేసు మనకు ఒసగు దైవరాజ్యమును అంగీకరించినపుడు, ఆయన మనలను దేవుని బిడ్డలనుగా చేయును. దాని కారణముగా, మనమందరమూ ఒకరికొకరం సోదరీ సోదరులమగుదము. ప్రేమతో, పశ్చాత్తాపముతో దేవుని చెంతకు మరలటం అనగా, తోటివారి చెంతకుకూడా ప్రేమగల సేవతో మరలటం. ఇదే దైవరాజ్య వ్యాప్తికై మనం ప్రేషితులుగా మారటం. ఈ ప్రేషితత్వములో ప్రభువుకువలె మనకుకూడా సిలువ అనివార్యము, తప్పనిసరి అవుతుంది! ఈ తపస్కాలములో ప్రభువు శ్రమల మార్గముద్వారా, ఆయనను అనుసరించుట వలన, ఆయనకు, ఆయన సువార్తకు విశ్వాసముగా ఉండుటకుగల శక్తిని మనం పొందెదము.
సాంప్రదాయకముగా తపస్కాలములో మన పశ్చాత్తాపాన్ని, ఉపవాసము, ప్రార్ధన, దానధర్మాలు అను పుణ్యక్రియల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాము. ఇవి యూదులు ఆచరించే భక్తి/పుణ్య క్రియలు. వీటిని యధార్ధముగా ఎలా పాటించాలో యేసు తన 'కొండమీద ప్రబోధము'లో వివరించారు (మత్త 6:1-18). ఈ భక్తి/పుణ్య క్రియలను ఇతరుల కొరకు, ఇతరులు చూడాలని పాటిస్తే, వాటికి ఎలాంటి విలువ ఉండదు అని యేసు బోధించారు. దైవసేవలో కపటం లేకుండా స్వచ్చమైన ఉద్దేశముతో మన భక్తిని, భక్తి/పుణ్య క్రియలను (ఉపవాసము, ప్రార్ధన, దానధర్మాలు) ఆచరించాలి. ఎప్పుడైతే, ఉపవాసము, ప్రార్ధన, దానధర్మాలు యధార్ధమైనవిగా ఉంటాయో, అప్పుడే అవి దేవుని చెంతకు మరియు తోటివారి చెంతకు మరలుటకు ప్రతీకలుగా ఉంటాయి.
నిజమైన ఉపవాసము అంటే ఏమిటో మనం యెషయ 58వ అధ్యాయములో చదవవచ్చు. ఆనాడు ప్రజలు ఉపవాసము ఉండేవారు. కాని, ఉపవాస దినమున వారి లాభమును వారు చూచుకొనేవారు. పని వారిని పీడించేవారు. ఉపవాసము ఉండునపుడు, బూడిదమీద, గోనెమీద పరుండెదరు కాని, వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనేవారు. ఇతరులను అవమానించేవారు. దుష్టవాక్కులు పలుకేవారు. విశ్రాంతి దినమున వ్యాపారములు చేసేవారు. కాని, ప్రభువునకు ఇష్టపడు ఉపవాసమిది: "మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీద కెత్తిన కాడిని తొలగింపుడు. పీడితులను విడిపింపుడు. వారినెట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు" (58:6-7).
విశ్వాసమును పోషించుటకు, దేవుని చెంతకు మరలుటకు, దైవరాజ్య బాటలో నడచుటకు మరియు దేవుని బిడ్డలుగా తోటి సోదరీసోదరులుగా మన జీవిత నాణ్యతను పెంపొందించుటకు ఈ తపస్కాలము మనలను ఆహ్వానించుచున్నది.
ఇతర ప్రసంగము కొరకు: ఇక్కడ క్లిక్ చేయండి
మరియు
No comments:
Post a Comment