దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 8వ వారము - మంగళవారం
1 పేతురు 1:10-16; మార్కు 10:28-31
ధ్యానాంశము: నూరంతల ప్రతిఫలము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మొదటివారు అనేకులు కడపటి వారు అగుదురు. కడపటి వారు అనేకులు మొదటి వారు అగుదురు" (10:31).
ధ్యానము: ధనవంతుడైన యువకుడు, ధనాపేక్షవలన యేసును అనుసరించలేక వెళ్ళిపోయిన తరువాత (10:22), శిష్యులు, "అట్లయిన ఎవడు రక్షణ పొందగలడు?" (10:26) అని గుసగుసలాడు కొనిరి. పేతురు యేసుతో, "అట్లయిన ఇదిగో! అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి" (10:28) అని అనెను. అవును అది నిజమే! పేతురు మరియు ఇతర అపోస్తలులు, యేసు ఆ యువకునితో చెప్పిన విధముగా, సమస్తమును విడచి యేసును అనుసరించారు. కనుక, పేతురు ఉద్దేశం ఏమిటంటే, "మాకు ఏమి లభించును?" (మత్త 19:27) అని అడుగుచున్నాడు. అందుకు యేసు, "అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు...'సమస్తమును' త్యజించువారు... వాటిని సమృద్ధిగా పొందును... పరలోకములో శాశ్వత జీవమును పొందును" (10:29-30). కేవలము ధనమును మాత్రమేకాదు, బంధాలనుకూడా ప్రభువు కొరకు త్యాగం చేయాల్సి ఉంటుంది.
అయితే, ఈ త్యజింపుకు, త్యాగానికి, "ఈ లోకములోనే నూరంతలుగా ప్రతి ఫలమును పొందును." దీనికి చక్కటి ఉదాహరణ,అ.కా. 4:34-35 - "సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఎందుకన, పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి, వచ్చిన పైకమును, అపోస్తలుల పాదముల యొద్ద ఉంచు చుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగునట్లు పంచి పెట్టుచుండిరి." "పరులకు ఒసగుడు. మీకును ఒసగ బడును. కుదించి, అదిమి, పోర్లిపోవు నిండు కొలమానముతో ఒసగ బడును" (లూకా 6:38). దేవుని దీవెనలు నిండుగా, మెండుగా ఉంటాయి.
సమృద్ధిగా ప్రతిఫలముతో పాటు "అట్లే హింసలను అనుభవించును" (10:30) అని యేసు తెలియజేయు చున్నారు. క్రీస్తుకొరకు, ఆయన సువార్తకొరకు జీవించినపుడు, ఈ లోకమునుండి ఎన్నో ఇబ్బందులను, వేదనలను, హింసలను అనుభవించాల్సి ఉంటుంది. యేసు నిజాయితీగా, తనను అనుసరించేవారు సిలువను ఎత్తుకోవడానికి సిద్ధముగా ఉండాలని స్పష్టం చేయుచున్నారు. 'సిలువ మార్గం' తప్ప వేరే మార్గం లేదని అర్ధమగుచున్నది. క్రీస్తును అనుసరించే వారికి సిలువ అనివార్యం, తప్పనిసరి! సిలువ తరువాత ఉత్థానం ఉందనే ఆశతో మనం జీవించాలి. సిలువ మార్గం, తప్పక మనలను ఉత్థాన క్రీస్తు వెలుగులోనికి, శాశ్వత జీవములోనికి నడిపించును.
No comments:
Post a Comment