తపస్కాలములో తపోదీక్ష
దీక్ష నియమాలు, ప్రారంభ ప్రార్ధన, విరమణ ప్రార్ధన
దీక్షా కాలములో పాటించాల్సిన నియమాలు
ప్రారంభము: విభూతి బుధవారమునాడు సాయంత్రం సిలువ మార్గము తరువాతగాని, తపస్సుకాల మొదటి ఆదివార పూజానంతరంగాని దీక్ష ప్రారంభమగును. దీనిని ప్రారంభించువారు గురువుల చేతినుండి దీక్ష జపమాలను స్వీకరించ వలయును.
విరమణ: పరిశుద్ధ శుక్రవారం నాడు గురువు ఆశీర్వాదము పొంది విరమించ వలయును.
👉 స్త్రీ పురుషులందరూ ఈ దీక్షను పాటించ వచ్చును
👉 దీక్షకు గుర్తుగా తెల్ల కండువ / తెల్ల దుస్తులు ధరించుట
👉 జపమాలను ధరించుట
👉 ప్రతిరోజు దివ్యపూజలో పాల్గొనుట
👉 బైబులు పఠనం, ధ్యానం
👉 ప్రతిరోజు సాయంత్రం జపమాలను జపించుట
👉 పది ఆజ్ఞలను, తిరుసభ కట్టడలను తు.చ. తప్పక ఆచరించుట
👉 వారమునకు ఒకసారి పాపసంకీర్తనం చేయుట
👉 దగ్గరలో జరుగు ప్రార్థనా కార్యక్రమములో పాల్గొనుట
👉 చలన చిత్రములు, వినోద ప్రదర్శనలు చూడకుండుట
👉 జూదము, ధూమపానము, మద్యపానము వదలివేయుట
👉 శాఖాహారమును మాత్రమే భుజించుట
👉 రోజుకు కనీసము ఒక పుణ్య క్రియను చేయుట
👉 ప్రతిరోజు ఒక్కప్రొద్దు ఆచరించుట
👉 ఒక్కప్రొద్దు భాగమును గుడికిగాని, లేదా పేదలకుగాని దానము చేయుట
👉 దీక్ష సమయములో కనీసం ఒక పుణ్యక్షేత్రమును సందర్శించుట
👉 దీక్ష విరమించే రోజు మనలో ఉన్న దుర్గుణాలను శాశ్వతముగా విడనాడెదనని ప్రతిజ్ఞ చేయుట
దీక్ష ప్రారంభ ప్రార్ధన
గురువు: పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున
అందరు: ఆమెన్
గురువు: దయామయుడవైన దేవా! ఈ దీక్షాపరులను కరుణించండి. వీరు నియమాలకు బద్ధులై చివరి వరకు ఆచరించునట్లు చేయండి.
అందరు: దయామయుడవైన దేవా! మాపై దయచూపండి.
గురువు: దయామయుడవైన దేవా! నీవు హృదయ శుద్ధిని కోరే దేవుడవు. మారుమనస్సుకై తపిస్తు వీరు చేసే ఈ దీక్షను పవిత్రీకరించండి.
అందరు: దయామయుడవైన దేవా! మాపై దయచూపండి.
గురువు: దయామయుడవైన దేవా! వీరి కుటుంబాల ప్రార్ధనను ఆలకించండి. ఈ దీక్షా కాలములో చేసే ప్రతి పుణ్య క్రియ వీరి కుటుంబ సభ్యులందరికి కవచముగా మార్చండి.
అందరు: దయామయుడవైన దేవా! మాపై దయచూపండి.
గురువు: దయామయుడవైన దేవా! పూజా ప్రార్ధనలు, జాగరణ, ధ్యానాలు, ఉపవాస దీక్షలు నిర్వహించుటకు చిత్తశుద్ధిని ప్రసాదించండి. పరిశుద్ధాత్మ వరములను, ఫలములను అనుగ్రహించండి.
అందరు: దయామయుడవైన దేవా! మాపై దయచూపండి.
ప్రార్ధించుదము: పరలోక తండ్రీ! మోషేను కొండపైకి పిలిచి ధర్మశాస్త్రమును ఇస్తూ, ప్రజలకు బోధించమని ఆజ్ఞాపించావు. నలువది పగళ్ళు, నలువది రాత్రులు నీ సన్నిధిలో గడపి ధన్యుడయ్యాడు. ఏలియా ప్రవక్తను బలపరచి నలువది నాళ్ళు నడిపించి హోరేబు కొండకు చేర పిలిచావు. నీనేవే పౌరులు నలువది దినములు చేసిన ఉపవాసములను, త్యాగక్రియలను గుర్తించి వారిని మన్నించి దీవించావు. ప్రభూ! నీవు వీరియందు ప్రారంభించిన ఈ మంచి కార్యము కొనసాగించి, పరిపూర్తి చేయుటకు కావలసిన మీ అనుగ్రహమును దయచేయండి. ఈ నలువది రోజుల తపస్సు కాలములో వీరు తీసుకున్న దీక్షా ప్రమాణాలను నిర్వర్తించి, పరిపూర్తి చేయ, ఆశీర్వదించమని మా నాధుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
అందరు: ఆమెన్
దీక్ష విరమణ ప్రార్ధన
అందరు: ఆమెన్
దైవవాక్కు పఠనము: నిర్గమ 34:27-28 - ప్రభువు మోషేతో, "నా మాటలను వ్రాయుము. ఈ మాటలద్వారా నేను నీతో, యిస్రాయేలీయులతో నిబంధన చేసికొనుచున్నాను" అనెను. మోషే ప్రభువుతో నలువది పగళ్ళు నలువది రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములేవి ముట్టుకొన లేదు. అతడు పలకమీద నిబంధన వాక్యములు, అనగా పది ఆజ్ఞలను వ్రాసెను.
విశ్వాసుల ప్రార్ధన
అందరు: కనికరముగల యేసు ప్రభువా! మమ్ము కరుణించండి
గురువు: కనికరముగల యేసు ప్రభువా! నలువది రోజులుగా ఈ దీక్షలో వీరిని నడిపించినందులకు కృతజ్ఞతలు. దీని ఫలితమున కూడ వీరు అనుభవించు లాగున చేయండి
గురువు: కనికరముగల యేసు ప్రభువా! ఈ దీక్షా కాలములో వీరు నిర్ణయించుకొని ఆచరించిన సద్గుణాలతో తదుపరి జీవితం కొనసాగునట్లు వీరికి ధైర్య స్థైర్యములను ప్రసాదించండి.
అందరు: కనికరముగల యేసు ప్రభువా! మమ్ము కరుణించండి
గురువు: కనికరముగల యేసు ప్రభువా! వీరు పొందిన నీ కృపను వ్యర్ధపరచు కోకుండునట్లును చేయండి. ఈ రక్షణ ఫలాన్ని కలకాలము నిలుపుకొని దృఢపరచండి.
ప్రార్ధించుదము: కనికరముగల యేసు ప్రభువా! నలువది రాత్రింబవళ్ళు కటోర తపస్సు చేసి సైతాను కుయుక్తులను కూలదోసి విజయం సాధించావు. తదనంతరం గలిలీయకు వెళ్లి ప్రబోధను ప్రారంభించావు. నలువది రోజులు దీక్ష గావించి, ముగించు సమయాన ఈ బిడ్డలు పొందిన అనుభూతి, ఆనందము, చేపట్టిన సత్క్రియలు, తీసుకున్న నిర్ణయాలు కొనసాగునట్లు చేయండి. వ్యక్తిగత అభివృద్ధియే కాకుండా కుటుంబం, సంఘాభివృద్ధికి కూడా కృషి చేయునట్లు, మాటలద్వారా, క్రియలద్వారా, ఆదర్శ జీవితంద్వారా క్రైస్తవ బిడ్డలుగా జీవించునట్లు ఆశీర్వదించమని మీ పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొను చున్నాము.
No comments:
Post a Comment