తపస్కాలము, విభూతి పండుగ


తపస్కాలము, విభూతి పండుగ
యోవేలు 2:12-18; 2 కొరి 5:20-6:2; మత్త 6:1-6, 16-18


ఈరోజు కతోలిక శ్రీసభ విభూతి బుధవారంను కొనియాడు చున్నాము. నేటితో 40రోజుల తపస్కాల ప్రాయశ్చిత్తమును ప్రారంభిస్తున్నాము. ఈ ప్రాయశ్చిత్తం క్రీస్తు ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడుటకు సంసిద్ధ పడటం. ఈవిధముగా, తపస్కాలము విభూతి పండుగతో ప్రారంభమవుతుంది. తపస్కాలము, ఉత్థాన మహోత్సవమునకు 40 రోజుల ఆయత్తము. ఈ 40 రోజులు ప్రత్యేకముగా ప్రార్ధన, ఉపవాసము, దానధర్మాలు అను పుణ్య క్రియలు చేస్తూ ఉంటాము. బైబులులో 40కి ప్రత్యేక స్థానం ఉన్నది. యేసు క్రీస్తు 40 రోజుల పాటు ఎడారిలో ఉపవాస ప్రార్ధనలతో సాతాను శోధనలను జయించాడు అని సువార్తలలో చదువుచున్నాము. ఆది కాండము 7:4 ప్రకారం, నోవా కాలములో నలువది పగళ్ళు, నలువది రాత్రులు వాన కురిసెను. మోషే కొండయెక్కి నలువది పగళ్ళు, నలువది రాత్రులుండెను (నిర్గమ 24:18). ఏలియా ప్రవక్త హోరేబు పర్వతం చేరుటకు పట్టిన రోజు నలుబది (1 రాజు. 19:81). “నలువది దినములు ముగియగానే నీనెవె నాశనమగునని ప్రభువు యోనాతో పలికెను (యోనా 3:4). యేసు మరణించిన పిదప, నలువది దినముల పాటు తాను స్వయముగా శిష్యులకు కనిపించెను (అ.కా. 1:3). ఈ విధముగా, నలుబది రోజుకు ఒక ప్రత్యేకత ఏర్పడినది. ఈ నలుబది దినాల కాల పరిమితి ఒక ప్రత్యేక ఉద్దేశ్యముతో ఏర్పాటు చేయబడినది. ఇది హృదయ పరిశీలన చేసుకొని, పరివర్తన చెందే కాలం. ఇది ప్రాయశ్చిత్త కాలం, శుద్ధీకరణ కాలం. దేవుని కృప వలన శరీరేఛ్చను, సాతాను క్రియను జయించి, దేవుని సన్నిధికి తిరిగి వచ్చు కాలం. దేవుడు మనకు ఇచ్చిన కృపా కాలమే ఈ తపస్సు కాలం.

ప్రియ సహోదరీ సహోదరులారా! “ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము” అని నేటి రెండవ పఠనములో ( 2 కొరి 6:2) పునీత పౌలుగారు చెబుతూ మనలను తపస్కాలము లోనికి ప్రవేశించడానికి ప్రోత్సహిస్తున్నారు. నేడు మన శిరస్సులను వంచి, విభూతిని నుదిటిపై స్వీకరించి, మన హృదయాలను క్రీస్తు వెలుగుతో నింపుకుందాం. ఈ తపస్కాలములో యేసు ప్రభువుతో కలిసి ఎడారిలో ప్రయాణము చేస్తూ ఆయన జీవితము, త్యాగము, మరణము, సమాధి, ఉత్థానముల గురించి ధ్యానిస్తూ ఉంటాము. తపస్కాలము, క్రైస్తవ జీవిత పరమ రహస్యాన్ని (ప్రేమ) ధ్యానించుటకు గొప్ప అవకాశము. దైవవాక్కు, దివ్యసంస్కారముల సహాయముతో, మన విశ్వాస యాత్రను పునర్మించుటకు చక్కటి అవకాశం.

తపస్కాలము, పశ్చాత్తాపము, మారుమనస్సు పొందు సమయము. మారుమనస్సు అనగా, మన ఆలోచనలు, కార్యాలు దైవచిత్తముతో ఏకమై ఉండటము. దేవునికి, ఆయన చిత్తానికి మన జీవితములో మొదటి స్థానాన్ని ఇవ్వటం. దానికోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సంసిద్ద పడటము. అందుకే నేటి మొదటి పఠనముద్వారా ప్రభువు మనతో ఇలా అంటున్నారు, “ఇప్పుడైనను మీరు పూర్ణహృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు” (యోవేలు 2:12)

మనము స్వార్ధముతో అన్నీ మన స్వాధీనములో ఉండాలని కోరుకుంటాం. ఇతరులపై అధికారాన్ని చేలాయించాలని చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలను మరచి, లోకాశాలకు లోనై జీవిస్తూ ఉంటాం. పేరు ప్రతిష్టలకోసం, ధనంకోసం, పలుకుబడికోసం, అధికారంకోసం జీవిస్తూ ఉంటాం. స్వార్ధముతో, మోహపు తలంపులతో, అన్యాయపు ఆలోచనలతో, ఇతరులను భ్రష్టుపరచాలనే ఉద్దేశముతో జీవిస్తూ ఉంటాము. వీటన్నింటితో దేవునికి, ఇతరులకు చివరికి మనలకు మనం ఏమివ్వ గలుగుతున్నాం? వీటితో మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం? దైవకుమారుడైన క్రీస్తు వీటన్నింటి నుండి మనలను విముక్తులను చేయుటకు, మనమధ్యలోనికి వచ్చాడు. మనలో సహోదర భావాన్ని పెంపొందించుటకు, అందరు కలసి మెలసి జీవించునటుల చేయుటకు, మనలో ప్రేమను నింపుటకు ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. విభేదాలు లేకుండా, అందరూ సమానులే అన్న భావన మనలో కలుగ జేస్తున్నాడు. మరియు దేవుడు అందరికీ తండ్రీ అని నేర్పిస్తున్నాడు. “మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి, మేలు చేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము” (హెబ్రీ 10:24). దీనికి తపస్కాలము ఓ మంచి దారియే కదా!

తపస్కాలములో, ఒకరికి ఒకరము సహాయ పడుదాం. తోటివారి పట్ల బాధ్యత కలిగి జీవించుదాం. ముందుగా, మన హృదయాలను యేసు వైపునకు త్రిప్పాలి. “దేవునిచే పంపబడిన యేసును చూడుడు” (హెబ్రీ 3:1). ప్రభువు నుండి పొందే శక్తితో, తోటివారిని చూడగలం. వారి పట్ల బాధ్యతగా ఉండగలం. జక్కయ్య అన్యాయముగా తోటివారిని మోసం చేస్తూ ధనం కూడబెడుతూ జీవించేవాడు. కాని, ప్రభువును చూసిన తర్వాత తన జీవితములో మార్పు కలిగింది. మారుమనస్సు పొందాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డాడు. అన్యాయముగా మోసం చేసిన తోటివారికి వారి ధనాన్ని తిరిగి ఎక్కువగా ఇచ్చేసాడు. తన జీవితములో, మొట్ట మొదటి సారిగా, సంతోషమును, ఆనందమును అనుభవించాడు. తను కూడా దేవుని కుమారుడనే అని గుర్తించాడు. దేవున్ని చూసి, మారుమనస్సు పొందిన హృదయం దేవునితో, తనతో, ఇతరులతో సఖ్యతలో, సహవాసములో జీవించును. “ఎవరికిని ఏమియును బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అన్యోన్యము ప్రేమించుకొనుటయే” (రోమీ 13:8). తోటివారిపై తీర్పు చేయక, వారిని భ్రష్టుచేయక, పరస్పర ప్రేమ కలిగి జీవించుదాం. “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగ జేయు విషయములనే ఆసక్తితో అనుసరించుదము” (రోమీ 14:19).

తపస్కాలము, ప్రాయశ్చిత్తము, ధ్యానము, ఉపవాసముతో కూడినటువంటిది. ఈ తపస్కాలములో, మన జీవితములో మార్పు కోసం ఆశిద్దాం. దానికై కృషి చేద్దాం. విభూతి పండుగ రోజున, మనం స్వీకరించే విభూతి దేవునిపై మన సంపూర్ణ అధారతను, దేవుని దయ, క్షమను సూచిస్తుంది. ‘సిలువ మార్గము’ పవిత్రాత్మచే ఏర్పాటు చేయబడిన గొప్ప మార్గము. దీనిద్వారా, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ, ఆయన శ్రమలలో భాగస్తులమవుతున్నాము.

విభూతి పండుగ: “నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలసి పోవుదువు” (ఆ.కాం.3:19). విభూతిని వాడే ఆచారం, పాతనిబంధన కాలము నుండియే ఉన్నది. విభూతి దు:ఖమును, మరణమును, ప్రాయశ్చిత్తమునకు చిహ్నం. అహష్వేరోషు రాజు యూదులను కుట్రపన్ని చంపడానికి రాజ శాసనమును చేసాడని విని, మొర్దేకయి “సంతాపముతో బట్టలు చించు కొనెను. గోనే తాల్చి తలమీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చెను” (ఎస్తేరు 4:1). యోబు తాను పలికిన పలుకులకు సిగ్గుపడి “దుమ్ము బూడిద పైని చల్లుకొని పశ్చాత్తాప పడెను” (యోబు 42:6). ఇజ్రాయేలు ప్రజల బాబిలోను బానిసత్వమును గూర్చి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలికాడు, “నేను ప్రభువునకు భక్తితో ప్రార్ధన చేయుచు అతనికి మనవి చేసికొని ఉపవాసముండి గోనే తాల్చి బూడిదలో కూర్చుంటిని” (దానియేలు 9:3). యేసు ప్రభువు కూడా, విభూతిని గూర్చి సూచించాడు, “మీయందు చేయబడిన అద్భుత కార్యములు, తూరు సీదోను పట్టణములలో జరిగియుండినచో, ఆ పుర జనులెపుడో గోనెపట్టలు కప్పుకొని, బూడిద పూసికొని హృదయ పరివర్తనము పొందియుండెడివారే” (మత్త 11:21).

శ్రీసభ ఈ ఆచారాన్ని తపస్కాల ఆరంభానికి, ప్రాయశ్చిత్తానికి గురుతుగా తీసుకొని యున్నది. తపస్కాలములో మన మరణము గూర్చి తలంచి, పాపాలకు దు:ఖపడుతూ ఉంటాము. గురువు విభూతిని ఆశీర్వదించి విశ్వాసుల నుదిటిపై శిలువ గురుతు వేస్తూ, “ఓ మానవుడా! నీవు ధూళినుండి పుట్టితివనియు, తిరుగ ధూళిగ మారిపోవుదవనియు స్మరించుకొనుము” లేక “పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొనుము” అని చెప్పును.

విభూతి యొక్క తాత్పర్యం ‘పశ్చాత్తాప పడి పాపాలకు ప్రాయశ్చిత్త పడటము’. మన రక్షణార్ధమై శ్రమలను పొంది, మరణించి ఉత్థానుడయిన ప్రభువునకు మన హృదయాలను అర్పించి మారుమనస్సు పొందటము. మన జ్ఞానస్నాన వాగ్దానాలను తిరిగి చేయడం. క్రీస్తులో పాత జీవితమునకు మరణించి, నూతన జీవితమునకు ఉత్థానమవడము. భూలోకములోనే, దైవరాజ్యమును జీవించుటకు ప్రయాసపడి, పరలోకములో దాని పరిపూర్ణతకై ఎదురు చూడటము. ‘పశ్చాత్తాపం’ అనగా దైవరాజ్యమునకు సంబంధించిన సువార్తా విలువల ప్రకారం లేనివాటిని త్యజించి, దైవరాజ్యము ఆశించు వాటికొరకు జీవితాన్ని మలచుకొనుట. నీనెవె వాసులు గోనె పట్టలు, బూడిదతో పశ్చాత్తాప పడిన విధముగా, మనము కూడా విభూతిని మన నుదిటిపై ధరించి మన పాపాలకోసం, చెడు జీవితముకోసం పశ్చాత్తాప పడుచున్నాము. ఈ లోక జీవితము శాశ్వతము కాదని గుర్తుకు చేసుకొంటున్నాము.

విభూతి యొక్క పరమార్ధం: పశ్చాత్తాపం మరియు వినయం: విభూతిని నుదుటిపై ధరించడం అనేది పాపాలకు పశ్చాత్తాపం చెందడానికి, వినయంగా ఉండటానికి గుర్తు. ఇది మనిషి మర్త్యుడని, దేవుని దయపై ఆధారపడతాడని గుర్తు చేస్తుంది. మారుమనస్సు: విభూతి మారుమనస్సు పొందడానికి, దేవునికి దగ్గరవ్వడానికి ఒక చిహ్నం. ఇది చెడు మార్గాలను విడిచిపెట్టి, దేవుని మార్గంలో నడవడానికి ఒక పిలుపు. త్యాగం: తపస్కాలములో ఉపవాసం, ప్రార్థనల ద్వారా త్యాగం చేస్తాము. విభూతిని ధరించడం ఆ త్యాగానికి గుర్తుగా నిలుస్తుంది. ఈస్టర్ కు సన్నాహాలు: తపస్కాలం ఈస్టర్ పండుగకు సన్నాహాలు చేయడానికి ఒక సమయం. విభూతిని ధరించడం ఈస్టర్ పండుగలో క్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకోవడానికి ఒక మార్గం. విభూతి జీవితంలోని క్షణికత్వాన్ని, మరణాన్ని సూచిస్తుంది. కతోలిక విశ్వాసంలో విభూతి ఒక ముఖ్యమైన చిహ్నం.

ప్రార్ధన, ఉపవాసము, దానధర్మములు: ప్రార్ధన, ఉపవాసము మరియు దానధర్మములు తపస్కాలములో ముఖ్యమైన మూడు స్తంభాల వంటివి. మన ప్రాయశ్చిత్తమునకు, పశ్చత్తాపమునకు, జ్ఞానస్నాన వాగ్దానములకు విశ్వాస జీవితాన్ని పునర్మించుటకు ఎంతగానో తోడ్పడతాయి. సాంప్రదాయకముగా తపస్కాలములో మన పశ్చాత్తాపాన్ని, ఉపవాసము, ప్రార్ధన, దానధర్మాలు అను పుణ్యక్రియల ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాము. ఇవి యూదులు ఆచరించే భక్తి లేదా పుణ్య క్రియలు. వీటిని యధార్ధముగా ఎలా పాటించాలో యేసు తన 'కొండమీద ప్రబోధము'లో వివరించారు (మత్త 6:1-18). ఈ భక్తి లేదా పుణ్య క్రియలను ఇతరుల కొరకు, ఇతరులు చూడాలని పాటిస్తే, వాటికి ఎలాంటి విలువ ఉండదు అని యేసు బోధించారు. దైవసేవలో కపటం లేకుండా స్వచ్చమైన ఉద్దేశముతో మన భక్తిని, భక్తి/పుణ్య క్రియలను (ఉపవాసము, ప్రార్ధన, దానధర్మాలు) ఆచరించాలి. ఎప్పుడైతే, ఉపవాసము, ప్రార్ధన, దానధర్మాలు యధార్ధమైనవిగా ఉంటాయో, అప్పుడే అవి దేవుని చెంతకు మరియు తోటివారి చెంతకు మరలుటకు ప్రతీకలుగా ఉంటాయి.

ప్రార్ధన: తపస్కాలములో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో గడపాలి. అది ప్రభువునకు మనలను దగ్గరగా చేస్తుంది. మన జ్ఞానస్నాన ప్రమాణాలను జీవించుటకు కావలసిన శక్తి కోసం ప్రార్ధన చేయాలి. ఉత్థాన పండుగ దినమున జ్ఞానస్నానము పొందు వారి కొరకు ప్రార్ధన చేయాలి. పాపసంకీర్తనము చేయు వారి కొరకు ప్రార్ధన చేయాలి.

ఉపవాసము: ఉపవాసము పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలం ఇంద్రియనిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమేగాక, ప్రార్ధన చేయుటకు సహాయ పడును. శారీరక ఆకలి, మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఏమిటో యెష 58:6-7లో స్పష్టం చేయబడింది, “నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు. పీడితులను విడిపింపుడు. వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు. బట్టలు లేనివారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు”. మన ఉపవాసము వలన, మన సమాజములో, ఎంతోమంది పేదరికము వలన రోజూ ఉపవాసము ఉంటున్నారని గుర్తించుదాం. సమానత్వము కొరకు, అందరూ క్షేమముగా ఉండటానికి కృషి చేద్దాం.

దాన ధర్మములు: దాన ధర్మాలు తోటివారి పట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన వరములకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అవసరములో నున్నవారికి సహాయం చేయాలి, దాన ధర్మములు చేస్తూనే, మన సమాజములో నీతి, న్యాయ స్థాపనకు కృషి చేయాలి.

సిలువ మార్గము: తపస్కాలములో 'సిలువ మార్గము'నకు ప్రత్యేక స్థానము ఉన్నది. తపస్కాలములో మనం ముఖ్యముగా క్రీస్తు శ్రమలను, మరణము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము. సిలువ మార్గము ద్వారా, క్రీస్తు శ్రమలలో మనమూ పాలు పంచుకొనాలి. సిలువ మార్గము, క్రీస్తు శ్రమలను పొందిన విధముగా, దేవునకు విశ్వాస పాత్రులుగా ఉండాలంటే, మనము కూడా శ్రమలను పొందాలని గుర్తు చేస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment