పరిశుద్ధ మరియ రాజ్ఞి మహోత్సవం (ఆగష్టు 22)
దాసిగా ప్రారంభమై రాణిగా కీర్తించబడిన మహోన్నత వ్యక్తిత్వం
“దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను: ఒక స్త్రీ సర్శనము ఇచ్చెను. సూర్యుడే
ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై పన్నెండు
నక్షత్రములు గల కిరీటము ఉండెను” – దర్శన 12:1
ప్రియ సహోదరీ సహోదరులారా! ప్రతి సంవత్సరం ఆగస్టు 22న కతోలిక క్రైస్తవ సంఘం పరిశుద్ధ మరియ రాజ్ఞి
మహోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ పండుగ, మరియమాత కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు
తల్లి మాత్రమే కాదు, ఆమె విశ్వానికి మరియు స్వర్గానికి రాణి
అని ప్రకటిస్తుంది. ఈ మహోత్సవం, మరియమాత “మోక్షారోహణం” (Assumption)
తర్వాత దేవుడు ఆమెను తన కుమారుడి ప్రక్కన ఉన్నతమైన స్థానంలో ఉంచారనే విశ్వాసంపై
ఆధారపడి ఉంది. ఈ మహోత్సవం, మరియ దేవుని మహిమలో పాలుపంచుకున్న తీరును, ఆమె ప్రేమ మనకు ఎలా ఆశ్రయంగా ఉందో గుర్తుకు చేస్తుంది. భూలోక జీవితాన్ని విశ్వాసముతో
ముగించిన మరియతల్లిని, త్రిత్వైక సర్వేశ్వరుడు, ఇహపరలోకాలకు రాజ్ఞిగా నియమించి,
కిరీటాన్ని ఉంచారు. అందుకే, శ్రీసభ ఆమెను రాజ్ఞిగా గౌరవిస్తూ, ఈ
మహోత్సవాన్ని ఏర్పాటు చేసింది.
బైబిల్ ఆధారాలు - మరియ రాజ్ఞిత్వం:
బైబుల్లో నేరుగా మరియమాతను ‘రాణి’ లేదా “రాజ్ఞి’ అని పిలవనప్పటికీ, ఆమె పాత్ర, ప్రాముఖ్యత ఈ విశ్వాసానికి బలమైన పునాదిని
ఇస్తాయి. పాత నిబంధనలో దావీదు వంశపు రాజులకు, రాజు తల్లికి మాత్రమే రాజమాత హోదా
ఉండేది. దావీదు వంశపు రాజులు తమ శత్రు
సైన్యాన్ని జయించినట్లు, దావీదు వంశంలో జన్మించిన క్రీస్తు
ప్రభువు సాతాను అహాన్ని అణచి, దాని సామ్రాజ్యాన్ని కూలద్రోశారు.
ఆదికాండము 3:15 ప్రకారం, స్త్రీ
సంతతి (క్రీస్తు) సాతాను తలని చిదక గొట్టాడు.
ఈ యుద్ధంలో క్రీస్తుతో మరియ సంపూర్ణంగా సహకరించి రాజమాతగా వ్యవహరించారు. అలాగే, మరియమాతను తరచుగా “కొత్త ఏవ” అని పిలుస్తాము.
మొదటి ఏవ దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపడం ద్వారా మానవాళికి పాపాన్ని తీసుకువచ్చింది.
కానీ మరియమాత “నేను ప్రభువు దాసురాలను” అని చెప్పడం ద్వారా దేవుని చిత్తానికి
సంపూర్ణంగా విధేయత చూపింది. ఈ విధేయత ద్వారా ఆమె రక్షకుడైన యేసును ఈ లోకానికి
తీసుకువచ్చింది. ఆమె ఈ “కొత్త ఏవ” పాత్ర, ఆమె
రాజ్ఞిత్వానికి ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఆమె మానవ జాతి రక్షణలో దేవుని
ప్రణాళికలో ఒక కీలకమైన భాగస్వామి అయింది.
1 రాజులు 2:19లో, “బెత్షెబ అదోనియా
కోరికను ఎరిగించుటకై సొలొమోను వద్దకు వెళ్ళెను. ఆమెను చూచి రాజు సింహాసనము దిగెను.
తల్లికి నమస్కారం చేసి మరల ఆసనము మీద కూర్చుండెను. రాజుకు కుడిప్రక్క బెత్షెబకు
మరియొక ఆసనము వేయగా ఆమె దానిపై కూర్చుండెను” అని చదువుచున్నాము. క్రీస్తుకు ప్రతిరూపంగా ఉన్న సొలొమోను రాజు, తన తల్లి అయిన రాజమాత కోరికలను మన్నించి, ఆమెను తన ప్రక్కనే సింహాసనంపై కూర్చోబెట్టాడు. అలాంటప్పుడు, రాజులకు రాజు అయిన మన ప్రభువు యేసు తన తల్లితో ఎంత గొప్పగా
వ్యవహరిస్తారో మనం ఊహించుకోవచ్చు! మరియతల్లి రాజ్ఞిగా, రాణిగా మన విన్నపాలను రాజాధిరాజు అయిన తన కుమారుడు
క్రీస్తుకు తెలియ జేస్తుంది.
కీర్తనల గ్రంథం 45:9లో రాజు కుడి ప్రక్కన ఉన్న రాణి గురించి చెప్పబడింది. ఈ కీర్తనను యేసు క్రీస్తుకు మరియు ఆయన తల్లి మరియమ్మకు కూడా
వర్తింపజేస్తారు. ఇందులో రాజు యేసు క్రీస్తును సూచిస్తాడు, మరియు ఆయన కుడి వైపున ఉన్న రాణి మరియమ్మను సూచిస్తుంది. క్రీస్తు
రాజుల రాజుగా పరిపాలిస్తున్నప్పుడు, ఆయన పక్కనే
రాణిగా మరియమ్మ నిలిచిందని ఈ వచనం సూచిస్తుంది. ఇది మరియమ్మ యొక్క పట్టాభిషేకం (Queenship
of Mary) మరియు ఆమెకు దేవుని రాజ్యంలో ఉన్న ఉన్నతమైన
స్థానాన్ని ధృవీకరిస్తుంది. మరియమ్మ తన కుమారుడైన యేసు దగ్గర మనందరి పక్షాన
మధ్యవర్తిత్వం (intercession) వహించగల శక్తిని, అధికారాన్ని కలిగి ఉంటుందని కూడా ఈ వచనం సూచిస్తుంది.
నూతన నిబంధనలో, యేసు జనన సూచన సందర్భముగా, “ఆయన మహనీయుడై, మహోన్నతుని
కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు
ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” (లూకా
1:32-33), అని దూత పలికిన మాటలు, మరియ యొక్క
రాణిత్వాన్ని గురించి తెలియ జేస్తున్నాయి. అలాగే,
మరియతల్లి ఎలిజబేతమ్మను సందర్శించినప్పుడు, ఎలిజబేతమ్మ
ఆనందంతో ఆమెను “నా ప్రభువు తల్లి”
అని సంబోధించింది. ఈ వాక్యం ద్వారా ఎలిజబేతమ్మ,
రక్షకుడు మరియు రాజైన క్రీస్తు తల్లి అయిన మరియ రాజమాత అని సాక్ష్యం ఇచ్చారు (లూకా 1:43).
దర్శన గ్రంథం 12:1లో, “దివియందు ఒక గొప్ప
సంకేతము గోచరించెను: ఒక స్త్రీ సర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు
ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై పన్నెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను”
అని చదువుచున్నాము. ఈ స్త్రీ మరియమాతను సూచిస్తుంది. పన్నెండు నక్షత్రాల కిరీటం ఆమె
రాచరికపు అంతస్తుకు గుర్తు. కనుక, ఈ వాక్యం, నజరేతు మరియ రాణి అని స్పష్టంగా తెలియ
జేస్తుంది.
మరియ జీవితం: వినయం నుండి రాజ్ఞిత్వం వరకు:
మరియమాత జీవితం వినయం, విధేయత మరియు
విశ్వాసానికి గొప్ప నిదర్శనం. గాబ్రియేలు దూత ఆమెకు ప్రభువు తల్లి కాబోతున్నావని
చెప్పినప్పుడు, ఆమె “నేను ప్రభువు దాసురాలను; నీ మాట ప్రకారం నాకు జరుగుగాక!” అని పలికింది (లూకా 1:38). ఈ నిగర్వమైన అంగీకారమే ఆమెను మానవాళి చరిత్రలో ఒక అత్యున్నత స్థానానికి
చేర్చింది. కష్టాలు మరియు సవాళ్ళు ఎదురైనా, సిలువ చెంత
నిలబడి కుమారుడి బాధను చూసినప్పుడు కూడా, ఆమె దేవునిపై తన
నమ్మకాన్ని కోల్పోలేదు.
ఆమె రాణిగా గౌరవించబడటానికి కారణం
ఆమెకున్న అధికారమో, సంపదో కాదు. ఆమె తన
కుమారుడైన యేసుకు సంపూర్ణంగా సహకరించడం, మరియు మానవ జాతి
రక్షణలో కీలక పాత్ర పోషించడం. ఆమె సింహాసనం కేవలం దైవిక అనుగ్రహానికి, ప్రేమకు మరియు వినయానికి చిహ్నం.
పండుగ చరిత్ర - ప్రాచీన విశ్వాసం:
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన
క్రీస్తు తల్లిగా, మరియమాతను కథోలిక విశ్వాసులు ప్రాచీన కాలం నుంచే రాజ్ఞిగా
గౌరవించటం ఆనాదిగా వస్తున్న విశ్వాసం. 4వ శతాబ్దములో, పునీత ఎఫ్రేము మరియతల్లిని ‘రాణి’
అని సంబోధించారు. ఈ సంబోధనలు అప్పటినుండి శ్రీసభలో కొనసాగుచున్నవి. కథోలిక
వేదపండితులు, మత పెద్దలు, మరెందరో
పునీతులు మరియతల్లిని రాణిగా సంబోధించడం కొనసాగించారు. 7వ శతాబ్దములో, పునీత
ఇల్డెఫోన్సస్ మరియతల్లిని గూర్చి “నేను క్రీస్తు
దాసున్ని గనుక మరియ దాసున్ని, మరియ దేవుని దాసురాలు గనుక నా రాజ్ఞి.
నేను మరియ రాజ్ఞిని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసుకుంటాను” అని
పేర్కొన్నారు. 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు, మరియమాత
గౌరవార్థం ‘పరిశుద్ధ రాణి వందనం’, ‘పరలోక రాణి వందనం’,
‘మోక్షరాజ్ఞి వందనం’ అని సంబోధించినట్లు శ్రీసభ సాంప్రదాయంద్వారా, పితరుల బోధనలద్వారా మనకు తెలుయు చున్నది.
1954 (Marian Year) అక్టోబర్ 11న, 12వ పయస్ పోపుగారు, Ad
Caeli Reginam (The Queen of Heaven) అనగా “పరలోక రాణి” అను తన విశ్వలేఖ ద్వారా,
‘పరిశుద్ధ మరియ రాజ్ఞి పండుగను’ దైవార్చన పండుగగా స్థాపించారు. 12వ పయస్ పోపుగారు మరియ మాతకు “రాణి” అనే బిరుదు ఆమోదయోగ్య మైనదని
పేర్కొన్నారు. ఆరంభములో ఈ పండుగను మే 31న జరిపేవారు. అయితే, 1969బ సంవత్సరములో, 6వ పాల్ పోపుగారు, ఈ తేదీని ఆగస్టు 22కి మార్చారు. ప్రస్తుతం, ఈ పండుగను మరియ
మోక్షారోహణం పండుగ తర్వాత ఎనిమిదవ రోజున ఆగస్టు 22న జరుపుకుంటున్నాము.
మరియ రాజ్ఞి – అర్థం:
16వ బెనెడిక్ట్ పోపుగారు, మరియమ్మ పట్టాభిషేకం అనేది “ధనానికి, అధికారానికి” సంబంధించినది కాదు, అది “ప్రేమతో కూడిన సేవ” అని అన్నారు. ‘పట్టాభిషేకం’ అనే పదం ఈ లోకంలో ధనం, అధికారం,
ఉన్నత స్థానం వంటివాటితో ముడిపడి ఉంటుంది. తమ
శక్తిని ప్రదర్శించడానికి, ప్రజలపై తమ అధికారాన్ని చాటడానికి
పట్టాభిషేకాలను జరుపుకుంటారు. అయితే, మరియమ్మ
పట్టాభిషేకం దీనికి పూర్తి భిన్నమైనది. “ధనానికి, అధికారానికి” సంబంధించినది కాదు: మరియమ్మకు లభించిన రాణిత్వం ఈ లోకపు
సంపదలు, అధికారాలు, లేదా భౌతికమైన హోదా నుండి వచ్చింది కాదు. ఆమె రాజుల రాజు అయిన యేసు
క్రీస్తుకు తల్లిగా, తన వినయం, విధేయత, మరియు ప్రేమ ద్వారా ఈ ఉన్నత స్థానాన్ని
పొందింది. క్రీస్తు రాజ్యంలో అధికారం అంటే ప్రేమతో కూడిన సేవ మాత్రమే! “ప్రేమతో కూడిన సేవ”: మరియమ్మకు లభించిన రాణిత్వం ఆమె అందించిన ప్రేమపూర్వక సేవకు
ప్రతిఫలం. ఆమె దేవుని చిత్తానికి తనను తాను పూర్తిగా అప్పగించుకుంది, “నేను ప్రభువు దాసురాలిని; నీ మాట చొప్పున
నాకు జరుగుగాక” అని చెప్పింది. ఆమె దేవునికి, మరియు మానవాళికి సేవ చేయడంలో తన జీవితాన్ని గడిపింది. ఆమె ఈ సేవను
ప్రేమతో, నిస్వార్థంగా చేసింది. అందుకే ఆమెకు
లభించిన పట్టాభిషేకం కేవలం ఆమె అధికారాన్ని సూచించదు, అది ఆమె చేసిన ప్రేమపూర్వక సేవకు దేవుడు ఇచ్చిన గొప్ప ప్రతిఫలంగా
ఉంటుంది. ఆమె రాణిగా ఉన్నప్పటికీ, మనందరి కోసం దేవుని దగ్గర
మధ్యవర్తిత్వం వహిస్తూ సేవ చేస్తూనే ఉంటుంది. కనుక, క్రైస్తవ జీవితంలో నిజమైన
గొప్పతనం అనేది అధికారం, ధనం ద్వారా రాదు. అది ప్రేమతో, వినయంతో, ఇతరులకు చేసే సేవ ద్వారా మాత్రమే
సాధ్యమవుతుంది. మరియమ్మ జీవితం దీనికి ఒక గొప్ప ఉదాహరణ.
ప్రభువు కూడా, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు” అని పలికి
యున్నారు (యో 18:36). అలాగే, “మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు
రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను” అని
అన్నారు (మత్త 20:28). కనుక, మరియమాత రాజ్ఞిత్వం భూలోక రాజుల రాజ్ఞిత్వం వంటిది
కాదు. ఆమె సింహాసనం అధికారం, సంపద, లేక దండనల పైన ఆధారపడలేదు. అది ప్రేమ, కనికరం, మరియు సేవపై ఆధారపడి ఉంది. ఆమె తన
కుమారునితో కలిసి పాలించడం అంటే మనల్ని ఏలడం కాదు, కాని, మనకోసం మధ్యవర్తిత్వం చేయడం, మన బాధలను ఆయనకు
తెలియ జేయడం. అందువల్ల, మనం మరియమ్మను రాణిగా గౌరవించడం అంటే,
ఆమె ద్వారా దేవుని ప్రేమను, దైవిక కరుణను అందుకోవడానికి
ప్రయత్నించడం.
మరియ రాజ్ఞి – ఉద్దేశం:
క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారు ఆయన రాజ్యపాలనలో పాలుపంచు కుంటారని
మత్తయి 19:28లో వాగ్దానం చేయబడింది. ఈ వాగ్దానం
మరియమాత విషయంలో నెరవేరింది. అంటే, దేవుని రాజ్యంలో పాలకులుగా, న్యాయమూర్తులుగా అధికారం పొందుతారు. ప్రభువును అనుసరించడంలో శ్రమలకు
గురైనవారు ప్రభువు పాలనలో భాగస్తులు అవుతారు అని లూకా 22:28-30లో
ప్రభువు పలికి యున్నారు. ప్రభువు కోసం మరణించినవారు ఆయనతో
రాజ్యపాలన చేస్తారు అని 2 తిమో 2:11-12లో చదువు చున్నాము.
మరియతల్లి తన జీవితమంతా దేవుని చిత్తానికి విధేయంగా జీవించారు.
క్రీస్తును సిలువ మరణం వరకు అనుసరించి, రాచరికానికి
కావాల్సిన అర్హతలన్నిటినీ సాధించారు. అయితే, ఆమె రాచరికం సొంత శక్తితో పొందింది కాదు; అది రాజైన క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడి ఉంది. ఆమె దీనత్వాన్ని
బట్టి దేవుడు ఆమెలో గొప్ప కార్యాలు చేసి, ఆమెను మహిమ పరిచారు.
దేవునిపట్ల మరియ చూపిన సంపూర్ణ విశ్వాస, విధేయతల వలన
దేవుడు ఆమెను ఇహపరలోకాలకు రాజ్ఞిగా నియమించారు.
రాణిగా, మరియమ్మ మనకోసం దేవునితో మధ్యవర్తిత్వం
వహించడమే కాకుండా, తన కుమారుని ప్రతినిధిగా కూడా
వ్యవహరిస్తుంది. స్వర్గ, భూలోకాల రాణి అయిన ఆమెకు పరలోక
సింహాసనం నుండి దేవుని కృపను అనుగ్రహించే గొప్ప బాధ్యత అప్పగించబడింది. ఆమె ఆ
కృపకు మూలం కాకపోయినప్పటికీ, ఆ క్రుపను మనకు అందించే సాధనంగా
నియమించ బడింది. ప్రేమగల తల్లిగా, భువిపై ఉన్న తన బిడ్డలకు దేవుని కృపను
ధారాళంగా పంచడం కంటే ఆమెకు మించిన సంతోషం మరొకటి లేదు. ఆమె తన బిడ్డలందరినీ
పరలోకంలో తన దివ్య కుమారునితో ఐక్యం చేయాలని ఆకాంక్షిస్తుంది.
మనకు పరలోకంలో కేవలం తల్లి మాత్రమే కాదు, రాణి కూడా ఉంది. మరియమ్మ దేవుని తల్లి, రాణి అయినందున, మనం చిన్న బిడ్డలవలె విశ్వాసంతో ఆమె
వద్దకు వెళ్లాలి. ఒక చిన్న పిల్లాడు తనకు అవసరం వచ్చినప్పుడు, తన తల్లి ప్రేమను, సంరక్షణను, శ్రద్ధను ఏమాత్రం సందేహించకుండా దగ్గరికి ఎలా పరుగెత్తుతాడో, మనం కూడా అలాగే మరియ వద్దకు పరుగెత్తాలి. ఆమె మనకు రక్షకురాలు,
ఆశ్రయం, నిరీక్షణ మరియు మధురమైన ఆనందం. ఆమె వాత్సల్యం పరిపూర్ణమైనది, ఆమె మాతృప్రేమకు సాటిలేదు.
భక్తి భావం:
మరియ ఇహపరలోకాలకు రాజ్ఞి అని మనం సంపూర్ణంగా విశ్వసించి, ఆమెను
సేవించాలి. మన జపాలు, భక్తి క్రియలు, పుణ్యకార్యాలు
ఆ రాజ్ఞికి కానుకలుగా సమర్పించాలి. 12వ శతాబ్దంలో భక్తుడు బెర్నార్డ్ ఆఫ్ క్లైర్వాక్స్, మరియతల్లిని ఉద్దేశించి, “తల్లీ!
నీ శరణుజొచ్చి, నీ సహాయమడిగి, నీ
వేడుకోలును కోరుకున్న వారిలో నిరాశ చెందినవాడు ఒక్కడు లేడు” అని
సవాలు చేశాడు. పునీత బెర్నార్డ్ యొక్క ఈ మాటలు,
మరియమ్మ యొక్క శక్తివంతమైన మధ్యవర్తిత్వం (Intercession)
మరియు మాతృప్రేమకు గొప్ప నిదర్శనం. ఈ వాక్యం మనకు
ధైర్యాన్ని, ఆశను కలిగిస్తుంది. “శరణుజొచ్చుట” అంటే సంపూర్ణంగా ఆమెకు మనల్ని మనం అప్పగించుకోవడం. క్రైస్తవ చరిత్రలో,
మరియమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించినవారు ఎవరూ
నిరాశ చెందలేదు. కనుక, నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతూ,
తల్లిచాటు బిడ్డలుగా భక్తివంతమైన జీవితాన్ని
జీవించాలి. క్రీస్తు మార్గంలో నడవాలి.
ముగింపు:
ఈ పరిశుద్ధ మరియ రాజ్ఞి మహోత్సవం సందర్భంగా, మనందరి హృదయాలు భక్తితో నిండిపోవాలి. మరియమాత కేవలం స్వర్గానికి
రాజ్ఞి మాత్రమే కాదు, ఆమె మన జీవితాలకూ రాణి. ఆమె మనకు ఒక
తల్లిగా, మార్గదర్శకురాలిగా, మరియు ఆశ్రయంగా ఉన్నారు. ఆమె ప్రార్థనలు మనకు అండగా ఉంటాయని
విశ్వసించి, మన కష్టసుఖాలను ఆమెకు అప్పగించుకుందాం.
ఆమె సింహాసనంపై కూర్చోవడం ఆమెకున్న అధికారం వల్ల కాదు, అది ఆమె చూపిన అపారమైన ప్రేమ,
దైవిక సహనం,
మరియు సంపూర్ణ వినయానికి గుర్తు. ఆమె తన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించుకోవడం ద్వారా,
వినయం మరియు విధేయత ఎలా అత్యున్నత గౌరవాన్ని
పొందుతాయో ప్రపంచానికి చూపించారు. ఆమె జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని
ఇస్తుంది. మనం కూడా దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకుంటే, ఆయన మనల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు.
మరియ రాజ్ఞిని మనం గౌరవించడం అంటే, ఆమె ద్వారా దైవిక కరుణ, అనుగ్రహం,
మరియు ప్రేమను అందుకోవాలని ఆశించడం. ఆమె మనందరి
తల్లి, మరియు మన ప్రతి ప్రార్థనను తన ప్రియ
కుమారుడైన యేసు దగ్గరకు తీసుకు వెళుతుంది. ఆమె మనకు “కృపారసముగల
మాత” మరియు “మోక్ష
ద్వారం”. ఆమె మనకు శాశ్వత
జీవితానికి దారి చూపిస్తుంది. ఈ పండుగ రోజున, మనం మరియమాతను మన జీవితానికి రాణిగా స్వీకరించి, ఆమెను అనుసరించడానికి ప్రతిజ్ఞ పూనుదాం.
పునీత జాన్ వియాన్నీగారు ఇలా అన్నారు, “పరలోకపు రాణికి సేవ చేయడం అంటే ఇప్పటికే అక్కడ పరిపాలించడం; ఆమె ఆజ్ఞల కింద జీవించడం అంటే పరిపాలన చేయడం కంటే గొప్పది” అని. పునీత
జాన్ వియాన్నీగారు చెప్పిన ఈ మాటల సారాంశం ఏమిటంటే, మనం మరియమ్మకు సేవ చేయడం ద్వారా పరలోకపు జీవితాన్ని ఈ భూమిపైనే
అనుభవించవచ్చు. మరియమ్మకు సేవ చేయడం అంటే కేవలం ఆజ్ఞలు పాటించడం మాత్రమే కాదు. ఆమె
ఆత్మకు దగ్గరగా జీవించడం, ఆమె లక్షణాలైన వినయం, స్వచ్ఛత మరియు ప్రేమను అనుసరించడం. ఈ సుగుణాలు మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు,
మనం దేవుని రాజ్యంలో భాగం అవుతాము. ఈ సేవ మనలను
దైవత్వానికి చేరువ చేస్తుంది. తద్వారా, మనం పరలోక
రాజ్యంలో నిలిచే గొప్ప గౌరవాన్ని పొందుతాము. సాధారణంగా పరిపాలన చేయడం అంటే అధికారం,
శక్తి, మరియు నియంత్రణ
కలిగి ఉండటం. కానీ జాన్ వియాన్నీగారు ఈ లోకపు పరిపాలన కంటే మరియమ్మ ఆజ్ఞల కింద
జీవించడం గొప్పదని చెప్పారు. ఆజ్ఞలు అంటే ప్రేమ, సేవ, మరియు త్యాగం. ఈ ఆజ్ఞలు మనల్ని దేవుని
చిత్తానికి అనుగుణంగా నడిపిస్తాయి. మనలోని అహంకారాన్ని తగ్గించి, దేవునిపై పూర్తిగా ఆధారపడేలా చేస్తుంది. ఈవిధంగా జీవించడం వలన మనకు
లభించే ఆధ్యాత్మిక శాంతి, సంతృప్తి, మరియు నిత్యజీవం, ఈ లోకంలోని ఏ పరిపాలన కూడా ఇవ్వలేనివి.
మరియమాత, మా రాజ్ఞీ, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.
Glory to the God 🙏
ReplyDeleteమంచి వివరణ ఇచ్చారు ఫాదర్ గారు 🙏🙏
ReplyDelete