17 వ సామాన్య ఆదివారము, YEAR B

 17 వ సామాన్య ఆదివారము, YEAR B
2 రాజు. 4:42-44; ఎఫెసీ. 4:1-6; యోహాను. 6:1-15
నీ(దానమే) ప్రధానం

క్రీస్తు నాధుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరీ, సహోదరులారా! ఈనాడు మనమంతా కూడా సామాన్య 17వ ఆదివారం లోనికి అడుగిడి యున్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు... క్రీస్తులో దాగియున్న దైవశక్తిని గురించి, దీనుల పట్ల, పేదసాదల పట్ల ప్రభువు చూపిన ప్రేమానురాగాలను గురించి, అదేవిధముగా క్రైస్తవులు అలవరచుకోవాల్సిన సుగుణాలను గురించి భోదిస్తూ ఉన్నాయి. వీటి గురించి క్లుప్తంగా ధ్యానిద్దాం.

మొదటి పఠనము (2రాజులు 4:42-44): ఈనాటి మొదటి పఠనములో, దైవజనుడైన ఎలీషా ప్రవక్తద్వారా దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతాన్ని గురించి మనమంతా ధ్యానిస్తూ ఉన్నాం. ఆ అద్భుతం ఏమనగా కేవలం ఇరవై రొట్టెలను, వందమందికి సరిపడా తృప్తిగా తినేవిధంగా చేయటం... ఈ అద్భుతంకూడా క్రీస్తు నాధుడు చేసిన అద్భుతం లాంటిదే! అయితే ఈ అద్భుతం క్రీస్తుప్రభుకన్న సుమారు ఎనిమిది వందల ముప్పై సంవత్సరాల పూర్వమే ఎలీషా ద్వారా జరిగింది (2 రాజు. 4:38).

ఎలీషా కాలంలో ఇశ్రాయేలు దేశంలో బహుగా కరువు ఏర్పడిందని వాక్యం సెలవిస్తున్నది (4:38). పైగా గత కొన్ని రోజుల నుండి ఎలీషా, ప్రవక్తల సమాజమునకు దైవవిషయాలను బోధిస్తూ ఉన్నారు. బాల్షాలిషా అనే గ్రామము నుండి ఒక వ్యక్తి ప్రధమ ఫలం అర్పణ తెచ్చారు. ప్రధమ ఫలం దేవునిది కాబట్టి, అలాగే వారి గ్రామము ప్రక్కనే ప్రవక్త ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ఇరువది రొట్టెలను, ధాన్యపు వెన్నులను తీసికొని వచ్చి ఎలీషాకు కానుకగా ఇచ్చారు. పైగా అది కరువు ప్రాంతమని, ఎలీషా, ప్రవక్తల సమాజమునకు దైవవిషయాలను బోధిస్తున్నారని చెప్పుకున్నాం. ఖచ్చితంగా శిష్యులు గత కొన్ని రోజులనుండి ఆకలితో ఉండి ఉండవచ్చును అని వాక్యం ద్వారా తెలుస్తున్నది. ఎలీషా ప్రవక్త శిష్యుల ఆకలిని గుర్తించి జాలిపడి సేవకుడు సమర్పించిన ఆ ఇరవై రొట్టెలను దైవశక్తితో అద్భుతరీతిగా వంద మందికి పంచిపెట్టారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, “శిష్యులు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకను కొన్ని మిగులును” (4:43) అని వాక్యం సెలవిస్తున్నది. ఇది దేవుడు చేయించిన గొప్ప అద్భుతం.

ప్రవక్తలలో శ్రేష్టుడైన  ఏలియా శిష్యుడు ఎలీషా వంద మందికి ఇరవై  రొట్టెలను పంచి  పెట్టగా, దైవ కుమారుడైన క్రీస్తు ప్రభువు ఐదువేల మందికి ఐదు రొట్టెలను, రెండు చేపలను సమృద్ధిగా పంచిపెట్టారు. ఈనాటి మొదటి పఠనము మనకు క్రీస్తు భగవనుడు మహోన్నతుడని, ప్రవక్తలందరికంటే గొప్పవాడనీ  తెలియపరుస్తున్నది.

రెండవ పఠనము (ఎఫెసీ 4:1-6): దేవుని బిడ్డలుగా, ఆయన వారసత్వంగా, ఆయన ఆలయంగా, క్రీస్తు శరీరంగా ఉండేందుకు దేవుడు మనందరినీ పిలిచారు. ఈ పిలుపుకు తగిన రీతిలో మనమంతా జీవించాలని ఈనాటి రెండవ పఠనము ద్వారా పునీత పౌలు మహర్షి మనలను ప్రోత్సహిస్తున్నారు.

ప్రేమ, దయ, శాంతి, సాధుశీలత, సేవ, ధాతృత్వం మొదలగు గుణాలు క్రైస్తవులు కలిగి ఉండాలని, క్రీస్తుతో, క్రీస్తులో ఐక్యంగా జీవించాలని పునీత పౌలు మహర్షి బోధిస్తూ ఉన్నారు. ఒకసారి మనమంతా ఆత్మపరిశీలన చేసుకుందాం! మనం నిజ క్రైస్తవులవలె జీవిస్తున్నామా లేక నామకార్థ క్రైస్తవులవలె జీవిస్తున్నామా?

మనం దేవుని బిడ్డల్లాగా క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తననుతానే బలిగా అప్పగించుకున్నారు. అలాంటి ప్రేమనే మనము కలిగి ఉండాలి. ఈ లోకం చాలా చిన్నది. ఈ జీవితం శాశ్వతమైనది కాదు. మనందరికీ ఒక గమ్యం ఉంది అదే పరలోకం. పరలోక జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే పునీత పౌలు మహర్షి చెబుతున్నట్లు పిలుపుకు తగిన రీతిలో మనమంతా జీవించాలి.

సువిశేష పఠనము (యోహాను. 6:1-15): ఈనాటి సువిశేషము క్రీస్తు భగవనుడు 5 రొట్టెలు 2 చేపలను అద్భుత రీతిగా 5 వేల మందికి పంచిన సంఘటనను మనకు బోధిస్తూ ఉన్నది. క్రీస్తు మరణించి సజీవంగా తిరిగి లేచిన సంఘటనను మినహాయిస్తే, నాలుగు సువార్తల్లోనూ రాసి ఉన్న అద్భుత కార్యం ఇదొక్కటే. దీన్నిబట్టి ఈ అద్భుతానికి ఉన్న గొప్ప అంతరార్థం, ప్రాముఖ్యత అర్థం అవుతున్నాయి.

పునీత యోహాను సువిశేషమును చూసినట్లయితే, ఈ అద్భుతాన్నిగూర్చి అయన చాలా లోతుగా వివరించారు. ఈ యొక్క అద్భుతాన్ని పొందుపరచటంలో పాస్కా మహోత్సవానికి కూడా యోహాను గారు ప్రాధాన్యమిస్తూ ఉన్నారు.

పాస్కా పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది పాపాలను పరిహరించే దివ్య గొర్రెపిల్ల. మనందరికీ శారీరకంగా ఆహారాన్ని సమకూర్చిన క్రీస్తు ప్రభువు త్వరలో తననుతాను ఒక బలి గొర్రెపిల్లగా అర్పించి మనకు పాపములనుండి విముక్తిని ఒసగి తన శరీరమును రక్తమును మనకు ఇచ్చి తానే జీవాహారము, నిత్యజీవము అనే సత్యాన్ని పునీత యోహాను తెలియజేస్తూ  ఉన్నారు. క్రీస్తు చేసిన మొదటి అద్భుతాన్ని యోహాను తన సువార్తలో పొందుపరిచారు (యోహాను. 2:1-12). క్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. యోహాను భావాల ప్రకారం, ఈ ద్రాక్షరసం క్రీస్తు పవిత్ర రక్తమునకు సూచికగా ఉన్నది. అదే విధముగా,  క్రీస్తు 5 రొట్టెలను , రెండు చేపలను 5 వేల మందికి పంచిన అద్భుతం క్రీస్తు కడరాత్రి భోజన సమయంనందు స్థాపించబోతున్న “దివ్యసత్ర్పసాదము”నకు, దివ్యబలిపూజకు సూచికగా ఉన్నది.

ఈ అద్భుతము ద్వారా క్రీస్తు మనందరికీ ఇస్తున్న సందేశం: గలిలియ సరస్సు అవతలి తీరంలో ఉన్న క్రీస్తుప్రభువు బోధనలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్లారు. అది భోజన విరామ సమయం. శిష్యులు అక్కడికి వచ్చిన ప్రజలను ఇంటికి పంపెయ్యమని ప్రభువును శిష్యులు కోరారు. దానికి క్రీస్తు సమ్మతించలేదు. ఆకలి కడుపులతో తన బిడ్డలను పంపడం ఆయనకు ఇష్టం లేదు. తన దగ్గరికి ప్రేమగా వచ్చినవారి ఆకలి తీర్చడం ఆయన ఒక బాధ్యతగా భావించారు. వాళ్లందరికీ భోజనం పెట్టాలని సంకల్పించారు. శిష్యులకు ఆశ్చర్యం కలిగింది! అంతపెద్ద జనసమూహానికి భోజనం అసాధ్యంగా భావించారు.

‘‘జన సమూహంలో ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూడండి’’ అన్నారు ప్రభువు. శిష్యులు అందరినీ వెళ్లి అడిగారు. ఒక చిన్న పిల్లవాడు తన తల్లి కట్టి ఇచ్చిన ఆహారపు (చిన్న) మూటను వారికి ఇచ్చాడు. అందులో ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి. వెంటనే ప్రభువు పరలోకం వైపు కన్నులెత్తి చూచి, తండ్రిని ప్రార్థించారు. రొట్టెలను, చేపలను విరిచి శిష్యులకు ఇచ్చారు. అలా ఆయన విరిచి ఇచ్చిన ఆహార పదార్థాలు అక్కడున్న ఐదువేల మంది అన్నార్తుల ఆకలి తీర్చాయి. ఇది ఒక గొప్ప అద్భుతం!

చిన్న బాలుడు ఎంతో ప్రేమతో ప్రభువుకు సమర్పించిన ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు అద్భుత రీతిగా 5000 మంది తిన్నారు (యూదా మత ఆచారాలలో మహిళలకు, చిన్నారులకు అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పురుషాధిపత్యం ఎక్కువగా ఉండేది. జనాభా లెక్కలలో కూడా స్త్రీలను, పిల్లలను నమోదు చేసేవారు కాదు. కతోలిక వేద పండితుల అంచనా ప్రకారం క్రీస్తు సుమారు 12 వేల మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని సమకూర్చారని తెలుస్తున్నది). ఈ ప్రపంచంలో ఎందరో ఆకలి చావులతో మరణిస్తున్నారు. మన విచారణలలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఒక పూట తింటూ మరో పూట పస్తులు ఉంటున్నాయి. మనం మనకి ఉన్న దానిలో ఇటువంటి వారికి సహాయం చేయాలి. మనం చేసే చిన్న సహాయమైనా, ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. ప్రభువు ఆహారం అడగ్గానే తన కోసం తెచ్చుకున్న ఐదు రొట్టెలు, రెండు చేపలను సంకోచం లేకుండా దానమిచ్చిన ఆ పసివాడి హృదయంలా మనందరి మనసులూ నిస్వార్థంగా ఉండాలంటారు క్రీస్తు. ఆకలితో మన ముందు నిల్చున్న వారిని మనం దయతో చూడాలి. వారి ఆకలి తీర్చాలి. ఐదు రొట్టెలు, రెండు చేపల అద్భుతం వెనుక దాగి ఉన్న లోతైన ఆంతర్యం ఇదియే!

కాబట్టి, ప్రియ సహోదరి సహోదరులారా! మనకున్న సమస్తాన్ని అనగా ప్రతి వస్తువును, ప్రేమను, జాలిని మొదలగునవి అన్నింటినీ మన తోటి సహోదరులతో పంచుకున్నట్లయితే మన జీవితాలలో కూడా అద్భుతాలను చవి చూడగలము. మంచి అర్పిత హృదయాన్ని కలిగి జీవించుదాం. దేవుని దీవెనలను నిండుగా మెండుగా పొందుకుందాం. ఆమెన్.

జోసెఫ్ అవినాష్ సావియో
యువ కతోలిక రచయిత, పెదవడ్లపూడి విచారణ
గుంటూరు మేత్రాసనం

1 comment: