107వ ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2021

 జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ సందేశము
107వ ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2021
27 సెప్టెంబరు 2021

మనముఅనే సంస్కృతి వైపుకు...

ప్రియ సహోదరీ, సహోదరులారా!

అపోస్తోలిక ప్రబోధం మీరందరు సోదరులు” (Fratelli Tutti)లో, నా ఆలోచనలలో ఇంకా బలంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశము గురించి, అలాగే ఒక ఆశను గురించి చర్చించాను: ఈ ఆరోగ్య (కరోన) సంక్షోభం ముగిసిన తరువాత, తిరిగి మరల వినియోగదారువాదంలో, స్వీయసంరక్షణ (నేను బాగుంటే చాలు) యొక్క కొత్త పద్ధతులలో మునిగిపోతాము. దేవుని చిత్తమైతే, “వారు”, “అవిఅని కాకుండా, “మనముఅని ఆలోచిస్తాము (నం. 35).

ఈ కారణము చేతనే, ఈ సంవత్సరం, “ప్రపంచ శరణార్థుల దినోత్సవంసందర్భముగా, ఈ లోకములో మనము అందరము కలసి ఒకే ప్రయాణం చేస్తున్నాము అనే వాస్తవాన్ని స్పష్టముగా సూచించడానికి, “‘మనముఅనే సంస్కృతి వైపుకు...అనే అంశమునకు నా సందేశాన్ని అంకితం చేయాలని అనుకుంటున్నాను.

మనముగూర్చిన చరిత్ర:

పైన స్పష్టం చేయాలనుకున్న వాస్తవం దేవుని సృష్టి ప్రణాళికలో భాగమే: దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడుఅని వారితో అనెను” (ఆది. 1:27-28). దేవుడు మనలను స్త్రీ పురుషులనుగా సృష్టించెను; ఇరువురు భిన్నమైనను, వారిని పరిపూర్ణముగా సృష్టించెను (ఒకరు లేకుండా ఒకరు పరిపూర్ణము కారు), తద్వారా, సంతానోత్పత్తి చెంది, అధిక సంఖ్యలో మనముగా ఏర్పడాలని ఉద్దేశించ బడినది. దేవుడు మనలను తన పోలికలో, తన త్రిత్వైక ఉనికిలో, వైవిధ్యములో ఒకటిగా చేసెను.

ఎప్పుడైయితే, అవిధేయత వలన, దేవుని నుండి మనము మరలినామో, దేవుడు తన దయ వలన మనలను వ్యక్తిగతముగా కాకుండా, తన ప్రజగా, “మనముగా సఖ్యత మార్గమును దయచేయాలని అనుకున్నారు. ఎలాంటి మినహాయింపు లేకుండా, సర్వ మానవాళిని దేవుడు ఆలింగనం చేసుకోవాలనుకున్నారు: ఇక దేవుడు మానవులతోనే నివసించును! ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును” (దర్శన. 21:3).

ఈవిధముగా, రక్షణ చరిత్ర ఆరంభములోను, అంతములోను మనముఅనే సంస్కృతి కనిపిస్తున్నది. వారందరు ఒకరుగ ఐఖ్యమై ఉండునట్లు” (యోహాను. 17:21), మనకోసం మరణించి, ఉత్థానమైన క్రీస్తు పాస్కా పరమ రహస్య కేంద్రం ఇట్టిదియే. ప్రస్తుత కాలములో, దేవుడు తలపెట్టిన ఈ మనముఅనే సంస్కృతి ముక్కలై పోయినది, విచ్చిన్నమైనది, గాయపడినది, వికృతీకరించబడినది. ప్రస్తుతం గొప్ప మహమ్మారి సంక్షోభ సమయములో ఇది స్పష్టముగా కనిపిస్తున్నది. జాతీయవాదం, భవిష్యదృష్టి లేమి కారణముగా (మీరందరు సోదరులు”, నం. 11), తీవ్రమైన వ్యక్తివాదము వలన (నం. 105), లోకములోను, అలాగే శ్రీసభలోను, “మనముఅనే సంస్కృతి కనుమరుగై పోవుచున్నది. దీని తీవ్ర పర్యవసానమే మనము ఇతరుల పట్ల, విదేశీయులని, వలసదారులని, బడుగువారని, అస్తిత్వ పరిధులలో జీవించేవారని, మనం చూపిస్తున్న వైఖరి.

ఎదేమైనప్పటికిని, వాస్తవం ఏమిటంటే, మనమందరము ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాము. మనమందరం కలిసి పనిచేయుటకు పిలువబడి యున్నాము. తద్వారా, మనలను విడదీసే ఇక అడ్డుగోడలు ఉండవు, కాని, “ఇతరులుఅనేది గాక, “మనముఅనేది ఒక్కటే మానవాళిని కలుపుతుంది. అందువల్ల, ప్రపంచ శరణార్థుల దినోత్సవంసందర్భముగా, “మనముఅనే భావనతో మనం ముందుకు సాగిపోవడానికి, రెండు మనవులను, ఒకటి కతోలిక విశ్వాసులకు, రెండు మన ప్రపంచములోని ప్రతీ స్త్రీ, పురుషులకు నేను విజ్ఞప్తి చేయదలచు కున్నాను.

మరింత కతోలికత్వముగల శ్రీసభ:

కతోలిక శ్రీసభ సభ్యులందరికి ఈ మనవి చేయుచున్నాను. ఈ విజ్ఞప్తి, వారి కతోలికజీవితానికి విశ్వాసముగా ఉండుటకు వారిలో నిబద్ధతను కలిగిస్తుంది. పౌలు ఎఫెసు క్రైస్తవ సంఘానికి ఈ విధముగా గుర్తుచేసారు: శరీరము ఒకటే. ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలచినదియు ఒక నిరీక్షణకేగదా! ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము” (ఎఫెసీ. 4:4-5).

లోకాంతము వరకు సర్వదా మనతో ఉంటానని వాగ్దానం చేసిన (మత్త. 28:20), ప్రభువు చిత్తము ప్రకారము, ఆయన కృపను బట్టి, నిజముగానే, శ్రీసభ కతోలికత్వము, విశ్వజనీనము, ప్రతీ యుగములోను ఆలింగనము చేసుకోవాలి, వ్యక్తపరచ బడాలి. భిన్నత్వములో సహవాసమును నెలకొల్పుటకు, అందరూ ఒకేలా ఉండాలనిగాక, భిన్న బేదాభిప్రాయాలను ఏకం చేయుటకు, అందరినీ ఆలింగనం చేసుకొనుటకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయును. విదేశీయులను, వలసదారులను, శరణార్థులను ఎదుర్కొనడములోనుండి ఉద్భవించు పరస్పర సంస్కృతి సంభాషణలో, శ్రీసభ ఎదగడానికి, పరస్పరం ఒకరినొకరు సుసంపన్నం చేసుకోవడానికి మనకు గొప్ప అవకాశం ఉన్నది. జ్ఞానస్నానం పొందిన వారందరు, ఎక్కడ ఉన్నను, హక్కు ప్రకారం, స్థానిక శ్రీసభలో, విశ్వజనీన శ్రీసభలో సభ్యులు. ఒకే యింటిలో నివసించేటటువంటి వారు, ఒకే కుటుంబానికి చెందినవారు.

కతోలిక విశ్వాసులు, వారు ఉన్న సంఘ సహవాసములో కలిసి కట్టుగ పనిచేయుటకు, అందరిని కలుపుకొనిపోవు విధముగా ఉండు శ్రీసభను తయారు చేయుటకు, తద్వారా, యేసు క్రీస్తు తన అపోస్తలులకు అప్పగించిన ప్రేషిత కార్యమును కొనసాగించుటకు పిలువ బడినారు: పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు. మరణించిన వారిని జీవముతో లేపుడు. కుష్ఠ రోగులను శుద్ధులను గావింపుడు. దయ్యములను వెడల గొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు” (మత్త. 10:7-8).

మన రోజుల్లో, పక్షపాతముగాని, భయముగాని లేకుండా, ప్రతీ అస్తిత్వ అంచులుగల వీధులలోనికి వెళ్లి, మత మార్పిడి చేయకుండా, గాయాలను నయం చేయడానికి, దారి తప్పిన వారిని వెదకడానికి, అందరిని ఆలింగనం చేసుకొని, తన శిబిరాన్ని విస్తృతం చేయడానికి శ్రీసభ పిలువబడు చున్నది. అస్తిత్వములో నివసించే వారిలో అనేకమంది వలసదారులను, శరణార్థులను, దేశాలనుండి పారిపోయినవారిని చూస్తాము. వీరికి ప్రభువు తన ప్రేమను పంచాలని, తన రక్షణను బోధించాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం వలసదారుల ప్రవాహం మన ప్రేషిత సేవలో భాగం కావాలి. క్రీస్తును గురించి, సువార్తను గురించి ప్రకటించడానికి, సేవాభావముతో, ఇతర మతాలను గౌరవిస్తూనే, క్రైస్తవ విశ్వాసానికి సాక్ష్యమిచ్చుటకు ఇదొక గొప్ప అవకాశం. ఇతర మతాలకు, ఇతర క్రైస్తవ సంఘాలకు చెందిన వలసదారులను, శరణార్థులను ఎదుర్కోవడం, క్రైస్తవ, పరస్పర విస్తృతమైన, సుసంపన్నమైన సంభాషణకు సారవంతమైన నేలలాంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది” (శరణార్థులను ఆదరించు జాతీయ సంస్థాధిపతులనుద్దేశించి చేసిన సంబోధనం, 22 సెప్టెంబరు 2017).

మరింత కలుపుగోలుతనంగల ప్రపంచం:

మానవ కుటుంబాన్ని పునర్నిర్మించుటకు, న్యాయం, శాంతిగల భవిష్యత్తును నిర్మించుటకు, ఎవరుకూడా వెనుకబడి ఉండకుండా భరోసా ఇవ్వడానికి, “మనముఅనే సంస్కృతి వైపుకు కలిసి కట్టుగా ప్రయాణం చేయడానికి, ప్రతీ స్త్రీ పురుషులకు ఈ రెండవ విజ్ఞప్తిని చేయుచున్నాను.

మన సమాజాలు భిన్నత్వము, సంస్కృతులు కలగలిపి సుసంపన్నమైన రంగులభవిష్యత్తును కలిగి యుంటాయి. పర్యవసానముగా, మనం ఇప్పుడు సామరస్యముగా, శాంతితో కలిసి జీవించడం నేర్చుకోవాలి. అపోస్తలుల కార్యములులోని ఒక సన్నివేశం నన్నెప్పుడు తాకుతుంది. పెంతకోస్తు దినమున, శ్రీసభ జ్ఞానస్నానం పొందగా, పవిత్రాత్మ దిగి వచ్చిన వెంటనే, యెరూషలేములోని ప్రజలు రక్షణను గూర్చిన ప్రకటనను వినియున్నారు: మనము... పార్తియ, మాదియా, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపీలియ, ఐగుప్తు, సిరేనె దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూద మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము, దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా, మన సొంత భాషలలో వినుచున్నాము” (అ.కా. 2:9-11).

ఇది నూతన యెరూషలేమునకు ఆదర్శం (యెషయ 60; దర్శన. 21:3). అచ్చట ప్రజలందరు, దేవుని మంచితనమును, సృష్టి అద్భుతాలను కొనియాడుతూ, శాంతి, సామరస్యములతో ఐఖ్యమై జీవించెదరు. అయితే, ఈ ఆదర్శమును సాధించడానికి, మనలను వేరుచేసే అడ్డుగోడలను విచ్ఛిన్నం

చేయడానికి మనం అన్ని ప్రయత్నాలు చేయాలి. మన పరస్పర లోతైన సంబంధాన్ని అంగీకరిస్తూ, వివిధ సంస్కృతుల కలయికను పెంపొందించుటకు వంతెనలను నిర్మించుదాం. నేటి వలస ఉద్యమాలు మన భయాలను అధిగమించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ప్రతీ వ్యక్తి భిన్నత్వము వలన మనం సుసంపన్నులమవుదాం. అప్పుడు, మనం ఆశిస్తే, సరిహద్దులను ఇతరులను కలుసుకొను, “మనముఅను అద్భుత భావనగల ప్రత్యేక ప్రదేశాలుగా మార్చవచ్చు.

ప్రభువు మనకు అప్పగించిన కృపానుగ్రహములను చక్కగా ఉపయోగించుకొని, అతని సృష్టిని భద్రపరచుటకు, దానిని మరింత అందముగా చేయుటకు, ప్రపంచములోని ప్రతీ స్త్రీ, పురుషులను నేను ఆహ్వానిస్తున్నాను. గొప్ప వంశస్థుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని రావలయునని దూరదేశమునకు వెళ్ళెను. అతడు తన పదిమంది సేవకులను పిలిచి తలకొక నాణెమును ఇచ్చి, ‘నేను తిరిగి వచ్చు వరకు ఈ ధనముతో వ్యాపారము చేసికొనుడుఅని చెప్పెను” (లూకా. 19:12-13). మన కార్యాల గురించి కూడా ప్రభువు మనలను ప్రశ్నిస్తారు. మన అందరి నివాసమునకు సరియైన సంరక్షణను నిశ్చయ పరచుటకు, మనం తప్పనిసరిగ మనముగ మారాలి. ఈ లోకములో ఏ మంచి జరిగినను, అది ప్రస్తుత, భవిష్యత్తు తరాలవారికి మంచి చేయబడుతుందని దృఢముగా నమ్మాలి. స్థిరమైన, సమతుల్య, సమగ్రమైన అభివృద్ధి కొరకు కృషి చేస్తూనే, బాధలనుభవిస్తున్న మన సోదరులను పట్టించుకొనుటకు, వ్యక్తిగత, సామూహిక నిబద్ధతను కలిగి యుండాలి. స్థానికులని, విదేశీయులని, నివాసితులని, అతిధులని వ్యత్యాసం చూపని నిబద్ధత మనం కలిగి యుండాలి. ఎందుకంటే, ఇది ఉమ్మడిగా కలిగియుండే నిధి. దీని సంరక్షణ, ప్రయోజనాలను నుండి ఎవరుకూడా మినహాయింప బడకూడదు.

కల ప్రారంభం:

మెస్సయ్య కాలం ఆత్మతో ప్రేరేపింప బడిన కలలు, దర్శనములతో ఉండబోవునని యోవేలు ప్రవక్త ప్రవచించి యున్నాడు: నేను నా ఆత్మనెల్లరిపై కుమ్మరింతును. మీ పుత్రులు, పుత్రికలు నా సందేశమును చెప్పుదురు. మీ ముదుసలులు కలలు కందురు. మీ యువకులు దర్శనములు గాంతురు” (యోవే. 2:28). భయము లేకుండా, ఒకే మానవ కుటుంబముగా, ఒకే ప్రయాణములోని సహచరులుగా మనందరి గృహమైన ఈ నేల బిడ్డలముగా, సహోదరీ, సహోదరులుగా, మనము కలసి కలలు కనుటకు పిలువబడి యున్నాము (మీరందరు సోదరులు”, నం. 8).

ప్రార్ధన:

పవిత్రులు, ప్రియమైన తండ్రీ!
మీ కుమారుడు యేసు,
పరలోకములో గొప్ప ఆనందము ఉన్నదని,
తప్పిపోయిన వారు దొరుకుదురని,
తిరస్కరింప బడినవారు, విస్మరింప బడినవారు
మనముఅను భావనలోనికి
సేకరింప బడుదురని బోధించారు.
యేసు అనుచరులందరికీ,
మంచి మనస్సుగల ప్రజలందరికీ,
భూలోకములో మీ చిత్తము నెరవేర్చు అనుగ్రహమును
దయచేయుమని వేడుకుంటున్నాము.
ప్రవాసములో నున్న వారిని
మనముఅను సంఘములోనికి, శ్రీసభలోనికి ఆకర్షించుటకు
ప్రతీ స్వాగత క్రియను, వారి దరి చేరు ప్రతీ చర్యను ఆశీర్వదించండి,
తద్వారా, ఈ లోకమును నీవు సృష్టించిన ఉద్దేశముగా,
మన అందరి సహోదరీ సహోదరుల గృహముగా మారునుగాక. ఆమెన్.


రోము, పునీత జాన్ లాతరన్, 3 మే 2021
అపోస్తలులైన పునీత ఫిలిప్పు, చిన్న యాకోబుల మహోత్సవం

No comments:

Post a Comment