మరియమాత జన్మదినోత్సవం (8 సెప్టెంబరు)
మరియ – దేవుని తల్లి
ప్రియ సహోదరీ సహోదరులారా, ఈరోజు మనందరికీ శుభదినం!
పరమానందాన్ని కలిగించే రోజు. ఎందుకంటే, మన రక్షకుడు
యేసుక్రీస్తు తల్లి, పరిశుద్ధ మరియమాత జన్మదినోత్సవాన్ని మనం
ఈరోజు ఒక గొప్ప పండుగగా, వేడుకగా జరుపుకుంటున్నాము. ఈ పుణ్యదినం మన విశ్వాస
జీవితంలో, ప్రయాణంలో, ఎంతో ప్రాముఖ్యతను కలిగియుంది. కతోలిక క్రైస్తవులముగా మరియమాత జన్మదినోత్సవాన్ని ప్రత్యేకంగా మరియు ఘనముగా జరుపుకుంటాము, ఎందుకంటే, ఇది నిజంగానే “రక్షణ
యొక్క జననం”, “రక్షణకు నాంది”.
మరియమాతను గురించి పునీత అల్ఫోన్సస్ లిగోరి ఈవిధంగా అన్నారు: “పరలోక
వాక్కుకు తల్లిగా నుండుటకు ఆమె ఎన్నుకోబడింది. అందుకే ఆమె నిష్కళంకమాత.
గొప్పవరాలతో అభిషేకింపబడి జన్మించింది. పవిత్రతలో పునీతులను, దేవదూతలను మించింది. దేవుని తల్లిగా ఉండే అర్హతకై
ఉన్నతమైన దైవవరానుగ్రహాలతో నింపబడింది. అత్యంత అధికమైన పరమ పునీతగా జన్మించింది.
సృష్టిలోనే అంతకు ముందెన్నడూ కలిగించనంత సుందరంగా ఆమె ఆత్మను దేవుడు
తీర్చిదిద్దారు. ఇహపరలోక దృష్టిలో మనోహరమైన, అందమైన, ఆత్మకలిగి సంతోషపూరిత పాపగా ఆవిష్కరింపబడింది. ఆమె పరమ పావన దేవునికి
అత్యంత ప్రియమైనదై, పూర్ణవరాలతో నింపబడింది. మధురమైనట్టి ఆ
పసిపాపను చేరి మహానందంతో పరవశించి పోదాం. ఆమె ‘జన్మపాపరహితోద్భవి. నిష్కళంక హృదయ
మరియ నామధేయ. అదే ఆమె జన్మకు మన జన్మకు మధ్య తేడా.’’’
బైబులులో మరియమాత జనన ప్రస్తావన?
బైబిలులో, మరియమాత జన్మించిన వృత్తాంతం గురించి స్పష్టమైన ప్రస్తావన
లేదు. బైబిలులో లేనప్పటికీ, ఈ పండుగ మరియమాత
గొప్పతనాన్ని, ఆమె యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికలో పోషించిన
పాత్రను గుర్తు చేసుకునేందుకు ఒక గొప్ప సందర్భం. బైబులులో, యేసుక్రీస్తు పుట్టుకకు
సంబంధించిన శుభవార్తతో మరియ చరిత్ర ప్రారంభమవుతుంది. లూకా సువార్త 1:28లో గబ్రియేలు దూత మరియను చూసి, “అనుగ్రహ
పరిపూర్ణురాలా! నీకు శుభము. ప్రభువు నీతో ఉన్నారు” అని అనెను. ఈ వచనం మరియమ్మ
దేవుని దృష్టిలో ఎంతటి శ్రేష్ఠురాలైనదో తెలియజేస్తుంది. ఆ తర్వాత, మరియమ్మ విధేయతతో, “నేను ప్రభువు దాసురాలను. నీ మాట
చొప్పున నాకు జరుగు గాక!” అని చెప్పింది (లూకా 1:38). మరియ
కేవలం యేసు తల్లి మాత్రమే కాదు, ఆమె మనందరి విశ్వాసానికి,
విధేయతకు గొప్ప మాదిరి. మరియమ్మ తన జీవితంలో దేవుని చిత్తానికి
సంపూర్ణంగా లోబడింది. కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు కూడా,
ఆమె దేవునిపై తన నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోలేదు. మరియమ్మ జననం,
ముఖ్యముగా రక్షకుని తల్లిగా ఆమె బాధ్యతను నిర్వర్తించడానికి నిర్ణయించబడింది. ఆమె ఉనికి క్రీస్తు ఉనికితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఇది దైవ
ప్రణాళికలో, కృపలో భాగం. ఈవిధంగా, మరియ జననం, ఆమె దివ్యకుమారుని జననం వలె, రక్షణ చరిత్రకు కేంద్రబిందువుగా నిలిచింది.
కతోలిక సంప్రదాయం
కతోలిక సంప్రదాయం ప్రకారం, మరియమ్మను మనం
ప్రత్యేకంగా గౌరవిస్తాం. ఆమె దేవుని అనుగ్రహాన్ని పొందిన పరిశుద్ధురాలు. “క్రీస్తు
తల్లి”గా ఆమెకు ఉన్న ప్రత్యేక స్థానం అపారమైనది. ఆమెను కేవలం ఒక తల్లిగా కాకుండా,
మనందరికీ పరలోకపు తల్లిగానూ, క్రీస్తు శరీరమైన
సంఘానికి తల్లిగానూ భావిస్తాం. మరియమ్మ కేవలం భక్తికి ఒక ప్రతీక మాత్రమే కాదు,
ఆమె మన విశ్వాస ప్రయాణంలో మనకు తోడుగా ఉండే ఒక సహాయకురాలు కూడా. మనం
కష్టాలలో ఉన్నప్పుడు, ఆమె మధ్యవర్తిత్వం ద్వారా దేవుని దయను
పొందేందుకు ప్రార్థిస్తాం. కనుక, మరియమ్మ జన్మదినం మనందరికీ దేవుని గొప్ప కృపను,
ప్రేమను గుర్తుచేస్తుంది. ఆమె జీవితం దేవుని ప్రణాళికలో ఒక భాగం.
మరియమాత జన్మదిన వృత్తాంతం
బైబిలులో మరియమాత జన్మవృత్తాంతం గురించి ప్రస్తావన లేనప్పటికీ, రెండవ శతాభ్దానికి చెందిన “ప్రోటోఎవంజెలియం ఆఫ్
జేమ్స్” అనే గ్రంధం ఆ విషయాలను మనకు తెలియజేస్తుంది. ఈ గ్రంథం మరియ తల్లిదండ్రులైన
జ్వాకీము, అన్నా గురించి, వారి
ప్రార్థనలకు ప్రతిఫలంగా మరియ జన్మించడం గురించి వివరిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా
సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి, సారా (ఆది 21:2), ఎలిశబెతమ్మ (లూకా 1) వలె,
వృద్ధాప్యంలో సంతానాన్ని పొందారు. ఆ సంతానమే మరియమ్మ. ఈ గ్రంథంలోని కథనాలు కతోలిక,
ప్రాచీన తూర్పు సంప్రదాయాలలో మరియ జన్మదిన వేడుకలకు, ఆమె చరిత్రకు ఆధారం అయ్యాయి. అందుకే ఈ పండుగ కతోలిక సంప్రదాయంలో ఇంత
ప్రాధాన్యతను సంతరించుకుంది.
పునీత అగుస్తీనుగారు మరియమాత జన్మమును యేసు రక్షణ కార్యంతో ముడిపెట్టారు. మరియమాత జన్మము పట్ల భూలోకమంతా
ఆనందించాలని పేర్కొన్నారు. మరియమ్మ తోటలో పూసిన పుష్పం, ఆ పుష్పము నుండి లోయలోని అమూల్యమైన
లిల్లీ పుష్పం వికసించినది. ఆమె జన్మము ద్వారా, ఆది తల్లిదండ్రుల నుండి
వారసత్వముగా వచ్చిన స్వభావము మార్చబడినది. ఈ మాటలు మరియ జన్మ కేవలం ఒక సాధారణ
సంఘటన కాదని, అది మానవాళి పాప స్వభావాన్ని మార్చి,
నూతన జీవితానికి నాంది పలికిందని స్పష్టం
చేస్తాయి.
మరియమ్మ నిష్కళంకగా, అనగా ఆదిపాపం లేకుండా జన్మించినది. మరియమ్మ
“అనుగ్రహ పరిపూర్ణురాలుగా” (లూకా 1:28) జన్మించినది. దేవుడు ఆమెకు ఒసగిన ఈ కృపను
తన జీవితాంతం పాపం చేయకుండా పరిపూర్ణంగా సహకరించుకుంటూ జీవించింది.
శ్రీసభలో మరియమాత జన్మదిన పండుగ
మరియమాతకు సంబంధించిన పండుగలలో, అత్యంత పురాతన పండుగలలో ఒకటి మరియమాత
జన్మదినోత్సవం. డిసెంబరు 8న అమలోద్భవిమాత పండుగను జరుపుకుంటాము. 9 నెలల తరువాత
అనగా సెప్టెంబరు 8న మరియమాత జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాము. శ్రీసభ దైవార్చనా కాలములో కేవలం మూడు జన్మదినోత్సవాలను మాత్రమే
పండుగలుగా కొనియాడుతాం: 1. యేసుక్రీస్తు జన్మదినం (క్రిస్మస్, 25 డిసెంబరు), 2. బప్తిస్త యోహాను జన్మదినం (24 జూన్)
మరియు 3. మరియమాత జన్మదినం (8 సెప్టెంబరు). బైబులులో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ
ముగ్గురి జన్మదినాలను మాత్రమే ప్రత్యేకంగా పండుగలుగా జరుపుకుంటాము. ఈ పండుగలను శ్రీసభ ఆరంభ సంవత్సరాలనుండే కొనియాడుతున్నట్లుగా
తెలుస్తోంది.
పునీత ఆండ్రూ ఆఫ్ క్రేట్, మరియమాత జన్మదినోత్సవం గురించి చాలా అందంగా
వర్ణించారు. మరియమాత జన్మదినోత్సవంను లోక సృష్టికర్తయైన దేవుడు తన ఆలయాన్ని నిర్మించిన
రోజుగా వర్ణించారు. అనగా, మరియమాతయే
ఆ దేవుని ఆలయం, నూతన నిబంధన మందసం, లోకములో
అవతరించిన దేవునికి మొదటి నివాస స్థలం, పవిత్ర గుడారము. ఆమె ఆత్మ స్వచ్ఛంగా, నిష్కళంకంగా మరియు పవిత్రంగా జన్మించింది. ఈ మాటలు మరియ దేవుని
నివాసంగా, క్రీస్తుకు పుట్టినిల్లుగా ఎంత గొప్ప
పాత్ర పోషించిందో తెలియజేస్తాయి.
మరియమ్మ దేవునికి ప్రియమైన కుమార్తె. ఈలోకంలో పునీత జ్వాకీము అన్నమ్మ
సంతానంగా ఆవిర్భవించి, దేవుని ఏర్పాటు చొప్పున
మానవ రక్షణ ప్రణాళికలో పరిశుద్ధ భాగస్వామి అయ్యింది. మరియమ్మ రెండవ ఏవ. పవిత్ర
గొర్రెపిల్లను ప్రసవింపబోవు మహా మంచి తల్లి. దైవరక్షణలో తొలిమెట్టు. సాతాను
ప్రారబ్దానికి ఆఖరి మెట్టు. ఈ రెండవ ఏవ గురించి
పరిశుద్ధ గ్రంథము, ఆది. 3:15, యెషయ 7:14లో దేవుని వాక్కుగా తెలుపబడింది. యెరూషలేము పవిత్ర నగరమందు జన్మించినది.
నాలుగవ శతాబ్దంలోనే యెరూషలేములో పునీత అన్నమ్మగారి దేవాలయంలో, మరియ జన్మదినోత్సవాన్ని తొలిసారిగా కొనియాడినట్లు
తెలుస్తుంది. ఆ స్ఫూర్తితోనే రోమునగరములో మరియమ్మ జనన వార్షికోత్సవాన్ని ఆచరించడం
ఆరభించింది. ఈ పండుగ రోములో 8వ శతాబ్దంలో పోప్ సెర్గియస్ I (+ 8 సెప్టెంబర్ 701) కాలంలో జరుపుకోవడం ప్రారంభమైంది. క్రీస్తుయేసు ద్వారా లోకరక్షణ ప్రణాళికలో ‘‘మరియమాత జననం’’ ఒక ముఖ్య
ఘట్టంగా దేవుడు ఏర్పరచినట్లు అర్ధమగుచున్నది. పూర్వవేద అంత్యానికి, నూతనవేద ఆరంభానికి మధ్యస్థ వేదాంత రేఖ ఆ జగజ్జనని జన్మదినం.
6వ పోప్ పాల్, తన లేఖలో (Marialis Cultus) ఇలా పేర్కొన్నారు: “మరియ జన్మదినం రెండు నిబంధనల (పాత,
క్రొత్త) సంగమానికి కేంద్రంగా ఉంది. ఆమె జననం
నిరీక్షణ, వాగ్దానాల దశను ముగించి, యేసుక్రీస్తులో కృప, రక్షణల శకాన్ని ప్రారంభించింది.” పోప్
బెనెడిక్ట్ XVI ఇలా అన్నారు: “మరియ తల్లిగా తన ప్రత్యేక బాధ్యతను నెరవేర్చడానికి జన్మించింది. ఆమె
ఉనికి క్రీస్తు ఉనికితో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. ఈ విధంగా, మరియ జన్మ, రక్షణ చరిత్రకు కేంద్రబిందువుగా
నిలుస్తుంది.”
శ్రీసభ సత్యోపదేశంలో ఇలా చదువుచున్నాము, పాత నిబంధన కాలంలో అనేకమంది
మహిళల జీవితాలు మరియ బాధ్యతకు మార్గం సిద్ధం చేశాయి.
ఆరంభంలో ఏవమ్మ, అవిధేయత చూపినప్పటికీ, దుష్టునిపై
విజయం సాధించే సంతానం గురించి, మరియు జీవముగలవారందరికీ తల్లి అవుతుందని వాగ్దానం
పొందింది. ఆ వాగ్దానం కారణంగానే, సారా తన వృద్ధాప్యంలో కూడా ఒక కుమారుడిని గర్భం
ధరించింది. మానవ అంచనాలకు భిన్నంగా, దేవుడు తన వాగ్దానాలపై నమ్మకంగా ఉంటారని
చూపించడానికి బలహీనులుగా, నిస్సహాయులుగా భావించబడిన వారిని ఎంచుకున్నారు.
సమూయేలు తల్లి అయిన హన్నా, దెబోరా, రూతు, యూదితు,
ఎస్తేరు వంటి అనేకమంది మహిళలు దీనికి ఉదాహరణ. అలాగే, మరియమాత “ప్రభువు నుండి
రక్షణను నమ్మకంతో ఆశించి, పొందే నిరాడంబరులు, దీనులలో
ప్రత్యేకంగా నిలుస్తుంది.” సుదీర్ఘ
నిరీక్షణ తర్వాత, ఆమెలో కాలం పరిపూర్ణం అయింది. ఆమె సీయోను కుమార్తెల్లో ప్రశంసనీయం. రక్షణకు సంబంధించిన ప్రణాళికను ఆమె సుస్థిరం చేసింది (నం. 489).
మరియ – మనందరి తల్లి
సిలువపై వ్రేలాడుతూ మృత్యు ముఖంలోనున్న యేసు ప్రభువు రక్త సిక్తమైన తన
దేహంతో ఒక ప్రక్క లోకపు పాపాన్ని మరోప్రక్క దేవుని కారుణ్యాన్ని భరిస్తూ మానవ
దౌర్భల్యానికి, దేవుని వాత్సల్యానికి మధ్యన నలిగిపోతున్న
తరుణంలో సిలువచెంత శోకమూర్తుల్లా నిలబడిన ఆయన తల్లి మరియ, ఆయన
శిష్యుడు యోహాను ఆయనకు అంతిమ ఓదార్పుగా మిగిలారు. ఆ మహా భయంకరమైన క్షణంలో తండ్రి
తనకు అప్పగించిన లోకకార్యాన్ని సంపూర్ణం కావించేముందు క్రీస్తుప్రభువు తన తల్లి
మరియ మాతను మనందరికి తల్లిగా ఒసగారు (యోహాను 19:26-27). ప్రభువు
తల్లితో, ‘‘స్త్రీ, ఇదిగో నీ కుమారుడు’’
తరువాత శిష్యునితో, ‘‘ఇదిగో నీ తల్లి’’
అని పలికారు. ఇలా మరణావస్థలో ప్రభువు పలికిన మాటలు తన తల్లిపట్ల
తనకుగల ప్రేమాభిమానములను వ్యక్తం చేయటమేగాక, ప్రధానంగా
మరియతల్లికి అప్పగింపబడనున్న రక్షణ ప్రణాళికను వెల్లడిస్తున్నాయి.
ప్రభువు తన తల్లిని మన తల్లిగా అప్పగించి అనంతరం, అంతయు పరిపూర్తియైనదని గ్రహించి, ‘‘అంతయు సమాప్తమైనది’’ (యోహాను 19:28) అని పలికి ప్రాణం విడిచారు. ఇలా మరియమాతను లోకమాతగా ప్రకటించడం, లోకరక్షణ బాధ్యతను మరియతల్లికి అప్పగించి వెళ్ళడం, రక్షణ
ప్రణాళికలో భాగమే అని ప్రభువు పరోక్షంగా తెలియజేస్తున్నారు.
సృష్టి ఆరంభంలోనే ఎప్పుడైతే ఆది తల్లిదండ్రులు దేవుని మాటకు
వ్యతిరేకంగా పాపము చేశారో అప్పుడే దేవుడు మరియతల్లిని రక్షణ ప్రణాళికలో భాగంగా
ఎన్నుకోవడం జరిగింది. అందుకే ‘‘నీకును స్త్రీకిని,
నీ సంతతికిని, స్త్రీ సంతతికిని తీరని వైరము
కలుగును’’ (ఆ.కాం. 3:15) అని దేవుడు
పలికాడు. రక్షణ ప్రణాళికలో ఆ మరియతల్లి పాత్ర లేకపోతే, అనాడు
తండ్రి దేవుడు ‘నీకును స్త్రీకిని అనకుండా స్త్రీ సంతతికి,
నీ సంతతికి’ అని పలికే వాడు కదా! దేవుడు
ఆవిధంగా పలకడంలో పరమార్ధం రక్షణ ప్రణాళికలో మరియతల్లి సైతానుతో పోరాడుతుందని
అర్ధం. అనగా మరియతల్లి ఎన్నిక అప్పుడే జరిగింది.
అందుకే, ఎన్నోసంవత్సరాలుగా
బిడ్డలు లేక బాధపడుతున్న అన్నమ్మ, జ్వాకీములకు పవిత్రాత్మ
వరము వలన జన్మించింది కన్య మరియతల్లి. ఆ పుణ్యదంపతుల ప్రేమానురాగాలతో పెరుగుతూ మంచి
నడవడికను, క్రమశిక్షణను, వినయ విధేయత
అను సుగుణాలను అవరచుకున్నది. ముఖ్యంగా తన ప్రార్ధనా జీవితంద్వారా చిన్నతనంనుండే
దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించింది. ప్రభువు కార్యాన్ని నిర్వర్తించడానికి
సిద్ధపడినది. ఎప్పుడైతే గబ్రియేలు దూత వచ్చి తండ్రి దేవుని సందేశాన్ని
మరియతల్లికి తెలియజేసిందో, ‘‘నేను ప్రభువు దాసిరాలను,
నీ మాట చొప్పున నాకు జరుగునుగాక’’ (లూకా 1:38)
అని తండ్రి మాటను విధేయించింది.
తల్లిలేని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవన యాత్రను కొనసాగించడం
ప్రభువునకు ఇష్టంలేదు. కనుకనే, మనలను ఆ తల్లి చెంతకు
నడిపించి మన రక్షణ భారాన్ని ఆ తల్లికి అప్పగించారు. ఆ తల్లి నిత్యం మనతో ఉంటూ మన
అనుదిన జీవనంలో పాలుపంచుకొంటూ మనలను దేవుని ప్రేమతో నింపుతూ ఆ ప్రభుని దరికి
చేరుస్తుంది. కనుక, మనం మన కన్నతల్లి పట్ల ఏవిధంగా ప్రేమ
చూపించి మనకు కావసిన అవసరాలను అడుగుటకు వెనకాడమో, అంతకంటే
ఎక్కువ ప్రేమను మరియతల్లి పట్ల చూపుతూ మనకు కావలసిన అవసరాలను ఆ తల్లితో
విన్నవించుకొంటూ ఆ తల్లిని అంటి పెట్టుకొని జీవిద్దాం.
ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ రోజు మరియమాత జన్మదినాన్ని
జరుపుకుంటున్న మనం ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆమెలాగే, మనం కూడా దేవుని చిత్తానికి లొంగి, మన జీవితాలను ఆయన సేవకు అంకితం చేయాలి. విధేయత: దేవుని మాటలకు
విధేయత చూపాలి. మరియలాగా, "నీ మాట చొప్పున నాకు
జరుగుగాక" అని మనం కూడా చెప్పగలగాలి. నమ్మకం: కష్టాలు వచ్చినప్పుడు,
దేవునిపై మన నమ్మకాన్ని కోల్పోకూడదు. మరియ తన కుమారుడి మరణాన్ని
చూసినప్పుడు కూడా, ఆమె దేవుని ప్రణాళికపై విశ్వాసం ఉంచింది. సేవ:
మన చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారికి సేవ
చేయాలి. మరియ తన బంధువైన ఎలిజబెత్కు చేసిన సహాయం మనకు గొప్ప మాదిరి.
మనం ఈరోజు పరిశుద్ధ మరియమాత జన్మదినాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఆమె మన జీవితాలకు, మన కుటుంబాలకు
ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం. ఆమె మధ్యవర్తిత్వం ద్వారా మనం దేవుని
కృపను, దీవెనలను పొందేలా సహాయం చేయమని వేడుకుందాం.
ప్రార్థన:
ప్రియమైన తల్లి మరియమాతా, నీ గర్భధారణ నిష్కళంకమైనది, నీ జన్మం మహిమాన్వితమైనది. నీవు పాపం లేకుండా గర్భం ధరించబడ్డావు, పాపం లేకుండా జన్మించావు, మరియు నీ జీవితమంతా పాప రహితంగా ఉన్నావు. పరలోకంలో నీవు దేవుని సౌందర్యాన్ని, తేజస్సును ప్రసరిస్తున్నావు, అలా నిరంతరం చేస్తూనే ఉంటావు. దయచేసి మా కోసం ప్రార్థించు, నీ అనేక సద్గుణాలను మేము మరింత సంపూర్ణంగా అనుకరించేలా, తద్వారా నీ దివ్యకుమారునికి ఈ లోకంలో ఒక తగిన సాధనంగా ఉండేలా చేయండి. తల్లి మరియమాత, మా కోసం ప్రార్థించు.
Thank you father👌👌
ReplyDelete