"ప్రభువునందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను! ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు."
[ఆనంద ఆదివారము, Gaudete Sunday]
సంతోషం / ఆనందం / పరమానందము
ఆ సంతోషమునే ధ్యేయముగా, లక్ష్యముగా చేసుకోవాలని ఈనాటి పఠనాలు ప్రభోదిస్తున్నాయి: మారు మనస్సు, మరోమార్గం, మంచిమార్గం, మంచిజీవితం అని ఎడారిలో బోధిస్తున్న యోహాను సందేశమును వినుటకు వచ్చినవారు, యోహాను సందేశమునకు స్పందించి, ఆ సంతోష జీవితమును పొందుటకు "మేము ఏమి చేయవలెనను" అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నను ఈనాటి ధ్యానంశముగా చేసుకొని, ఈ ప్రశ్నకు సమాధానమును సువార్తలోను, మొదటి రెండు పఠనాలలోనూ చూద్దాం!
సంతోషమునకు కారణములెన్నో ఉన్నాయి (ఉంటాయి). ఏదైనా పొందినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, ప్రేమగా చూసే వారి చెంత ఉన్నప్పుడు, మనలను అర్ధం చేసుకొనే వారున్నప్పుడు... ఇలా ఎన్నో!
మొదటి పఠనములో, జెఫన్యా ప్రవక్త ఇస్రాయేలీయులతో "ఆనందించండి, హర్షద్వానము చేయండి, నిండు హృదయముతో సంతసించండి." అని ఆనంద గీతాన్ని పలుకుచున్నాడు. ఎందుకనగా, మీకు విధించబడిన తీర్పు, శిక్ష తొలగించబడినవి. మీ శత్రువును ప్రభువు చెల్లాచెదరు చేసెను. అన్నటికంటే ముఖ్యముగా "ప్రభువు మీ మధ్యనే ఉన్నారు." ప్రభువు మీ చెంతనే ఉన్నారు, ప్రభువు మీతో ఉన్నారు. అందుకే భయపడకుడి. దైవభయం (భీతి) తప్ప మీలో ఏ భయం ఉండకూడదు. నిర్భయముగా ఉండండి. మీ చేతులను వ్రేలాడ నీయకుము, (చేతులను వ్రేలాడనీయడం అనగా శక్తి లేక, బలము లేక, పోరాడక, చేస్తున్న పనిని వదిలి వేయడం). నీలో సత్తువ సన్నగిల్లినను, నీలో(తో) ఉన్న ప్రభువు నీచేత మంచి కార్యములు జరిగిస్తాడు. నీ సంతోషమును నీ ద్వారా ఇతరులకు సంతోషమును కలుగ జేస్తారు. చితికిన, నలిగిన, విరిగిన నీ పైనే (నా పైనే) ప్రభువు అండగా ఉండి సంతోషమును కలుగ జేస్తారు. దైవప్రజలు దేవున్ని ఎడబాసి అన్య దేవుళ్ళను కొలుస్తున్నారు. అలాంటి సందర్భములో, వారి జీవితములో గొప్ప మార్పు సంభవించబోతున్నదని తెలియజేయు చున్నాడు. వారిలో ఓ గొప్ప ఆశను నింపుచున్నాడు. ఆ ఆశ కొరకే మనం మెస్సయ్య అయిన క్రీస్తు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాము.
అందుకే ఇశ్రాయేలు జనమా, యేరూషలేము నగరమా, సియోను కుమారీ! సంతసించండి. సంతోషముగా ఉండటానికి ఆయన కీర్తనలు పాడండి. ఆయన మీ(నా)తో, మీ(నా)లో ఉన్నారని గుర్తించండి. ఆయన రాజుగా, అధిపతిగా, నాయకుడిగా ముందుండి మన(నా)తో ఉండి నడిపిస్తున్నాడని తెలుసుకోండి. ఎవరులేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషముగా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలదా?
రెండవ పఠనములో, పునీత పౌలు ఇదే సంతోషాన్ని ధృఢపరుస్తున్నారు. అనుభవపూర్వకముగా ఆయన మనకిస్తున్న సందేశమిది. క్రీస్తు సందేశమును భోధించినందుకు, ఖైదీగా ఉండి, శిక్ష (మరణ శిక్ష) విధించబడి, ఆ శిక్ష అమలుకొరకు ఎదురు చూస్తున్న పౌలు వ్రాసిన సందేశమిది. ఆయనలో విచారం లేదు, దు:ఖం లేదు, ఆతురత అంతకంటే లేదు. ఎందుకంటే, ఈ సమయములోనే ప్రభువు యొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను ఆయన అనుభవించారు. ఆ అనుభవముతో చెప్పిన (వ్రాసిన) సందేశమే. "ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడును ఆనందించండి" (ఫిలిప్పీ 4:4). ఎందుకంటే, ప్రభువుకు సాధ్యము కానిది ఏదీలేదు (చూ. లూకా 1:37, యిర్మి. 32:27). ఆయన ఆధీనములో లేని పరిస్థితి ఏదీలేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ధైర్యముగా ఎదుర్కొనండి. విచారించకండి. అది మిమ్ము, మీనుండి, దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి, కృతజ్ఞతతో కూడిన ప్రార్ధనతో దేవునికి దగ్గరగా రండు. ఆయన మీ (నీ)తో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానం, దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను భద్రముగా ఉంచుతుంది. ఇంతకంటే, ఇంకా ఏమి కావాలి సంతోషముగా ఉండటానికి? పౌలు ప్రభువు రెండవ రాకడ గురించి ఎదురుచూసే సందర్భమున, ప్రభువు రాకతో కలుగు సంపూర్ణ ఆనందము (పరమానందము), సమాధానము గురించి చెప్పుచున్నారు.
సువిశేష పఠనములో, "మేము ఏమి చేయవలయును?", "మా కర్తవ్యము ఏమి?" (లూకా 3:10,12,14) అని అడిగిన వారికి సంతోషము గురించి బాప్తిస్మ యోహాను తనదైన శైలిలో జనులకు, సుంకరులకు, రక్షక భటులకు తెలియజేయు చున్నాడు: సామాన్య జనులు దుస్తులను, భోజన పదార్ధములను ఏమీ లేనివారితో పంచుకోవాలి; సుంకరులు నిర్ణయింప బడిన పన్నుకంటే అధికముగా ఏమియు తీసికొనవలదు (చదువుము మత్త. 16:26; 1 తిమో 6;10); రక్షకభటులు బలాత్కారముగా గాని, అన్యాయారోపణ వలన గాని, ఎవ్వరిని కొల్లగొట్ట వలదు. వేతనముతో సంతృప్తి పడుడు.
వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహానుగారు చెప్పడంలేదు. దానిని నిజాయితీగా చేయమని చెబుతున్నాడు. ఇప్పటి వరకు వీరు ఎంత ఎక్కువ ఇతరులనుండి పొందితే అంత ఎక్కువ సంతోషం తమ స్వంతమవుతుందని అనుకొన్నారు. దానికి భిన్నముగా యోహానుగారు నిజమైన సంతోషం 'ఇవ్వడములో' ఉన్నదని బోధిస్తున్నారు. ఇప్పటి వరకు పొందాలని (ఎక్కువ పొందాలని) తమ వారినుండి దూరమయ్యారు. ఇకనుండి ఇస్తూ, తమకున్న దానిని ఇతరులతో పంచుకొంటూ సంతోషాన్ని పొందండని, దేవుని ప్రత్యక్షతను (సన్నిధిని) అవసరం ఉన్న ప్రతీ సోదరిలోను, సోదరునిలోను గుర్తించి, అనుభవించండని పిలుపునిస్తున్నాడు. అలాగే, నిజమైన సంతోషమును ఒసగు మెస్సయ్య రాక కొరకు ప్రజలను సంసిద్ధం చేయుచున్నాడు (పశ్చాత్తాపం, మారుమనస్సు, హృదయ పరివర్తన, జీవితశైలిలో మార్పు, జీవితములో పునరుద్ధరణ, జ్ఞానస్నానం).
మనం ఏమిచేద్ధాము? మనకు సాధ్యమయ్యే చిన్నచిన్న విషయాలనే, చాలా సాధారణమైన విషయాలనే చేయాలని యోహాను చెప్పారు. వాటిని హృదయపూర్వకముగా, చిత్తశుద్ధితో చేయాలి. మన బాధ్యతలను సక్రమముగా, సరిగా నిర్వహించుదాం. సోదరప్రేమతో జీవిద్దాం (చదువుము అ.కా. 2:36-39).
త్రిలోక అధినేతవైన ఓ సర్వేశ్వరా! ఈ ప్రజలు రక్షకుని రాకకై ఉత్సాహముతో వేచియుండుట మీరు కాంచుచున్నారు. అట్టి ఘన రక్షణానందమును చేరుకొనను, ఆ ఉత్సవములను ఎల్లప్పుడు గొప్ప వేడుకతో చేసికొనను, మాకు మీ కృపను ప్రసాదింపుడు.
Excellent sermon. Thank YOU for sharing with us. Continue your social media evangilization.
ReplyDelete