ఆగమనకాల
నాలుగవ ఆదివారము
మీకా 5:1-4;
హెబ్రీ 10:5-10; లూకా 1:39-45
ఓ
ఆకాశములారా! మేఘములారా! మాకు రక్షకుని స్వర్గమునుండి పంపుడు. ఓ భూతలమా! తెరచుకొని
రక్షకుని పంపుము.
ఈ రోజు నాలుగవ ఆగమన ఆదివారము. ఈ వారముతో క్రిస్మస్ పండుగకు మన ఆయత్తం ముగుస్తుంది. మన ప్రార్ధనలన్నీ కూడా "ఇమ్మానుయేలు" (దేవుడు మనతో ఉన్నాడు) అను అంశముపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన మనలో, మన శ్రమలో, జీవితములో ఒకరిగా, మనతో లోకాంత్యము వరకు ఉండటానికి, ఆయన (దైవ) స్వభావాన్ని మనతో పంచుకొనడానికి ఆశించియున్నాడు. ఈనాటి పఠనాలు క్రిస్మస్ పండుగకు మనలను మరింత దగ్గరగా తీసుకొని వస్తున్నాయి. మూడు పఠనాలు, మూడు కోణాలలో ఈ పరమ రహస్యాన్ని మనకు అర్ధమయ్యేలా విశదపరుస్తున్నాయి. దేవుడు తన ప్రణాళికను, ఆయన ఎన్నుకున్న వ్యక్తులద్వారా నెరవేర్చడం వలన, సమస్తము ఆయనకు సాధ్యమే అన్న సత్యాన్ని మనం చూస్తున్నాము. ప్రభుని రాక, ముందుగానే సమస్త లోకానికి తెలియజేయడమైనది.
మొదటి
పఠనము: మీకా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు రాబోవు గొప్ప
రాజు గూర్చి ప్రవచిస్తున్నారు. బెత్లెహేమునుండి ఇశ్రాయేలు పాలకుడు ఉద్భవించును.
అతని వంశము పురాతన కాలమునకు చెందినది. దేవుని ప్రభావముతో తన మందలను పాలించును.
లోకములో నరులెల్లరు అతని ప్రాభవమును అంగీకరింతురు. అయితే, ఆ రాజు
ఎప్పుడు వచ్చునో పరలోక తండ్రి మాత్రమే ఎరిగియున్నాడు. రక్షకుడు వచ్చినప్పుడు,
సమస్త లోకానికి శాంతిని ఒసగును. దైవ ప్రజలు పాప బానిసత్వమునుండి
విడుదలై స్వతంత్రులుగా జీవించెదరు.
రెండవ
పఠనము: యేసుక్రీస్తు మనలో ఒకరిగా వచ్చిన ఆ పరమ
రహస్యాన్ని, క్రీస్తు తనను తానుగా అర్పించిన బలి, ఆయన
విధేయత వలన మాత్రమే సంపూర్ణముగా అర్ధము చేసుకోవచ్చని రెండవ పఠనము తెలియ జేస్తుంది.
యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమీ ఆశించక తండ్రి చిత్తాన్ని నేరవేర్చ ఆశించాడు. దేవుడు
జంతు బలులను, అర్పణలను కోరలేదు. దహన బలులకు, పాప
పరిహారార్ధమయిన అర్పణలను ఇష్టపడలేదు. పాత బలులను అన్నింటిని తొలగించి వాటి
స్థానమున దేవుడు క్రీస్తు బలిని ఏర్పాటు చేసాడు (హెబ్రీ 10:5-6,10). ఈ
పరిశుద్ధ కార్యానికి క్రీస్తు తననుతాను త్యజించి, తండ్రి
దేవుని చిత్తానికి విధేయుడై, మన పాపపరిహారార్ధమై తననుతాను బలిగా
అర్పించుకొనుటకు ఈ లోకములో జన్మించియున్నాడు. ఆయన జన్మము మనకు జీవమును, శాంతిని,
సమాధానమును, స్వతంత్రమును ఒసగుచున్నది. మన జీవితము వెలుగులో
ప్రకాశింపబడుచున్నది. క్రీస్తు బలిద్వారా మనలను ఆయనలో ఐక్యము చేసి పవిత్రులనుగా
చేసియున్నాడు.
సువిశేష
పఠనము: మరియమ్మ ఎలిశబెతమ్మను దర్శించిన సంఘటనను
తెలియజేస్తుంది. యేసు జనన సూచనను దూత ప్రకటించిన కొద్దిసమయములోనే, మరియమ్మ
ఎలిశబెతమ్మను సందర్శించినది. గబ్రియేలు దూతే ఈ సందర్శనను సూచించినది. “నీ బంధువు
ఎలిశబెతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది గదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది
ఆరవ మాసము” (లూకా 1:36). ఆ విషయము గ్రహించిన మరియమ్మ, యూదా
సీమలో పర్వత ప్రాంతమునగల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై వెళ్ళినది. మరియమ్మ
పవిత్రాత్మ శక్తివలన అప్పుడే గర్భము ధరించినది. దైవకుమారున్ని ఈ లోకానికి
స్వాగతించడానికి ముందుగానే సిద్ధపడినది. దేవుడు తనకు అప్పగించిన పవిత్రమైన
భాద్యతను ఆమె గుర్తించినది. తన ద్వారానే లోకరక్షకుడు ఈ లోకానికి రావలసియున్నదని
గుర్తించి, దేవుని చిత్తాన్ని అంగీకరించినది. మరియమ్మ,
జెకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిశబెతమ్మకు వందన వచనము పలికినది.
పవిత్రాత్మతో నింపబడి వందన వచనములను పలికినది. దైవకుమారుడిని, లోకరక్షకుడిని
గర్భము ధరించినప్పటికిని, మరియమ్మ తనే స్వయముగా ఎలిశబెతమ్మను
సందర్శించినది. యేసు, ఈ లోకానికి సేవింపబడుటకుగాక, సేవచేయడానికి
వస్తున్నాడన్న విషయం స్పష్టముగా తెలుస్తుంది. సేవద్వారా ఈ లోకం ఆయనను ప్రభువుగా
గుర్తిస్తుంది. ప్రభువు సన్నిధిలో, వందన వచనములు ఎలిశబెతమ్మ
చెవినపడగానే, ఆమె గర్భమందలి శిశువు (బప్తిస్మ యోహాను) గంతులు
వేసెను.
క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు, మనలో
సంతోషము, ఆనందము తప్పక ఉంటాయి. క్రీస్తు మన హృదయములో
నున్నప్పుడు, జన్మించినప్పుడు, మన
హృదయాలు, మనస్సులు ఆనందముతో గంతులు వేస్తాయి. ప్రభువు మనతో
ఉంటే, మనకు ఆశీర్వాదము, శాంతి
సమాధానాలు ఉంటాయి. పవిత్రాత్మ వరముతో, ఎలిశబెతమ్మ
గర్భములోనున్న శిశువు గంతులు వేయడమేగాక, ఎలిశబెతమ్మ
కూడా ఎలుగెత్తి ఇలా పలికింది: “స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భ
ఫలము ఆశీర్వదింప బడెను.” మరియమ్మ జీవితములో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను,
ధన్యతను పొందినది. దీనికి ముఖ్య కారణం, “ప్రభువు
పల్కిన వాక్కులు నేరవేరునని మరియమ్మ విశ్వసించినది” (లూకా 1:45). మరియద్వారా
ఈ లోకానికి వచ్చు ఆ శిశువు ‘యేసు’ అను పేరు పొందును. మహనీయుడై, మహోన్నతుని
కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు, తండ్రియగు
దావీదు సింహాసనమును పొందును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన
రాజ్యమునకు అంతమే ఉండదు (లూకా 1:31-33).
ప్రభువు పలుకులు తప్పక నెరవేరుతాయని
విశ్వసించుదాం. ఆ విశ్వాసము వలననే దేవుడు మనలనుకూడా ఆశీర్వదిస్తాడు. మరియమ్మ తన
జీవితాంతము దేవునికి విశ్వాసపాత్రురాలుగా జీవించినది. ఆమె విశ్వాసము వలననే,
దేవుని ప్రణాళికకు, చిత్తానికి "నీ మాట
చొప్పున నాకు జరుగునుగాక" అని చెప్ప గలిగినది.మన అనుదిన జీవితములో, ప్రభువు
మనలో తన ఉనికిని గ్రహించుటకు అనేక ఆనవాళ్ళను ఇస్తూ ఉంటాడు. అనేక సంఘటనలద్వారా,
వ్యక్తులద్వారా, తన ఉనికిని చాటుతూ ఉంటాడు. జ్ఞానస్నానములోను,
భద్రమైన అభ్యంగనమున పొందిన పవిత్రాత్మ, మనం
విశ్వాస కన్నులతో చూచునట్లు సహాయం చేయును. దైవరాజ్యమును స్వీకరించుటకు
సిద్ధపడునట్లు చేయును.
క్రిస్మస్ దినమున, పభువును
స్వీకరించుటకు ఆయత్త పడుదాం!
ఆద్యంత రహితులైన ఓ సర్వేశ్వరా! మా
మనసులను మీ కృపతో నింపుడు. ఈ విధమున మీ దూత సందేశముద్వారా,
మీ కుమారుని మనుష్యావతార వార్తనందుకొనిన మాకు ఆయన సిలువ పాటుల ఫలితమున
ఆయన పునరుత్థాన మహిమలో చేరు భాగ్యము లభించునుగాక!
No comments:
Post a Comment