18 వ సామాన్య ఆదివారము, Year C

18 వ సామాన్య ఆదివారము, Year C 
ఉప. 1:2, 2:21-23; కొలొస్సీ. 3:1-5, 9-11; లూకా. 12:13-21
పరలోక సంపదలు

నేడు 18వ సామాన్య ఆదివారము. మన దేవుడు వ్యక్తిగతముగా మనలనందరినీ, ఎల్లప్పుడూ తన కాపుదలలో ఉంచుతాడు. మనలను ఎన్నటికి విడనాడనివాడు మన దేవుడు. మనమే ఆయనను విడిచిపెట్టే అవకాశం ఉంది కాని, దేవుడు మనలను ఎన్నటికి విడనాడడు. ఆయన మన తండ్రి. తన బిడ్డల అవసరాలను తీరుస్తూ, వారి భవిష్యత్తుకు ప్రణాలికలను చేస్తూ ఉంటాడు.

ఈనాటి పఠనాలు, మన జీవితములో ముఖ్యమైన ప్రధానాంశాలను, ధ్యేయాలుగా కలిగి యుండాలని, దేవునియందు మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచాలని భోదిస్తున్నాయి. సువిశేష పఠనము (లూకా 12:13-21), ఆత్యాశతో ఇహలోక సంపదలను కలిగియుండటము వలన, జీవితము పరిపూర్ణము కాదని తెలియజేస్తుంది. సంపదలు సంతోషాన్ని ఇచ్చిననూ, శాశ్వతమైన ఆనందాన్ని మనకు ఇవ్వలేవు. మన ఆత్మకు ఆనందాన్ని ఇవ్వలేవు. ధనికుడు తన నమ్మకాన్ని, దేవునిపైకాక, తనపైనే ఉంచాడు. తన భవిష్యత్తును తనే రూపొందించుకోగలడని అనుకొన్నాడు. తనకున్న సంపదలు తన జీవిత విజయానికి సూచనలుగా భావించాడు.

రెండవ పఠనము (కొలొస్సీ 3:1-5, 9-11)లో పౌలుగారు, "పరలోక మందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనముపైన అధిష్టించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువులమీద గాక, ఆచట పరలోకము నందుగల వస్తువులపైన లగ్నము చేయుడు" (1-2) అని స్పష్టం చేయుచున్నారు. పరలోక మందలి వస్తువులు అనగా - దైవరాజ్య విలువలు, సువార్తా విలువలు కలిగిన జీవితం. ఇవే మనలను ఎల్లకాలం జీవించులా చేయును. ప్రేమ (సేవ) అను గొప్ప సుగుణం కలిగి జీవించాలి (1 కొరి 13:4-7). 
- ఆలోచన పరులుగా జీవించాలి
- సత్ప్రవర్తన కలిగి జీవించాలి
- నైతిక విలువలు కలిగి జీవించాలి: వ్యభిచారం అనైతికం అని మనందరికీ తెలుసు; అయినను భర్తలు, భార్యలను, భార్యలు భర్తలను మోసం చేస్తూ జీవిస్తారు!
- సత్యమునే పలుక వలెను: అసత్యమాడుట, అబద్ధాలాడుట తప్పు అని మనందరికీ తెలుసు. తప్పును కప్పిపుచ్చుటకు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము?
- పవిత్రముగా జీవించాలి: మనసులలో దురుద్దేశాలు, అసూయ, లైంగిక ఆలోచనలు ఉండరాదు.
- దురాశ ఉండకూడదు: దురాశ కలిగినవారు స్వార్ధముతో జీవిస్తారు. ఎవరినీ పట్టించు కొనరు. 
డబ్బుపై వ్యామోహం ఉండరాదు. భౌతిక వస్తువులకు అతిప్రాముఖ్యత ఇవ్వరాదు. అవినీతి ఉండరాదు. "ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగ ఉంచుకొనుడు. ఉన్నదానితో తృప్తిచెందుడు" (హెబ్రీ 13:5). ధనం దుష్టత్వంతో సమానం. మాదకద్రవ్యాల మాదిరిగానే డబ్బుకు బానిసలమై బ్రతుకుచున్నాం! ఈ బానిసత్వమునుండి మనం విడుదల పొందాలి. ధనం కోసం, ఆస్తులకోసం కన్న తల్లిదండ్రులను కడతేరుస్తున్న రోజులు! స్వంత కుటుంబాలను, బంధువులను నిరాకరిస్తున్న రోజులు! దేవుడు మనకు ఎంత డబ్బు ఇస్తే అంతగా దాతృత్వం కలిగి జీవించాలి. వాటిని ఇచ్చిన దేవుడు, తిరిగి తీసుకోవడం ఆయనకు ఎంత సమయం పట్టదని గుర్తుంచుకో!
డబ్బుతో మంచం కొనవచ్చు కానీ నిద్రను కొనలేము;
డబ్బుతో పుస్తకాలు కొనుక్కోవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు;
డబ్బుతో ఆహారాన్ని కొనుక్కోవచ్చు కానీ ఆకలి కాదు;
డబ్బుతో ఇల్లు కొనుక్కోవచ్చు కానీ కుటుంబాన్ని (గృహం) కాదు;
డబ్బుతో మందులు కొనవచ్చు కానీ ఆరోగ్యం కాదు;
డబ్బుతో సహచరులను కొనుగోలు చేయవచ్చు కానీ నిజమైన స్నేహితులను కాదు;
డబ్బుతో పెళ్లి చేసుకొనవచ్చు కానీ ప్రేమను కొనలేము;
డబ్బుతో ఏదైనా కొనవచ్చు కానీ పరలోక రాజ్యాన్ని కొనలేము;
- చెడు తలంపులు తలవరాదు. ప్రతీకారం తీర్చుకోవాలి అన్న ఆలోచన సరికాదు;
డబ్బు, సంపదలు కలిగియుండుట మంచివే! అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి! మన మనుగడకు అవి ఎంతో సహాయం చేస్తాయి! అయితే, అతిగా వాటికోసం ఆరాట పడటం, ఆశపడటం మాత్రం దయ్యముతో సమానము! ఉపదేశకుడు (మొదటి పఠనం) చెప్పినట్లుగా, అంతయు వ్యర్ధమే! కాని దేవునితో కూడిన జీవితం ఎప్పటికీ వ్యర్ధము కాదు!

ప్రతీ వ్యక్తి తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, ఉద్దేశాన్ని ఏర్పరచుకోవాలి. విశ్వాసులుగా, మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని, మన సంపదలు, ఆస్తులపైగాక, తండ్రి దేవునిపై ఉంచాలి. సంపదలు వస్తాయి, పోతాయి కాని, మన ఆత్మను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మన సంపదలను, ఇహలోకములోగాక, పరలోకములో కూడబెట్టుకోవాలి. అప్పుడే మన ఆత్మలను కాపాడుకోగలము. 

ఈనాడు మనలను నాశనము చేస్తున్నవి, మన అత్యాశ, స్వార్ధము. వీనిని శాశ్వతముగా మనలనుండి తీసివేసినప్పుడే, నిజమైన సంపదలు, రక్షణ  - దేవునిలోను, క్రీస్తు భోదనలలోను ఉన్నాయని గుర్తించగలము.

1 comment:

  1. మధురమైన జీవిత సత్యాలను చాలా చక్కగా వివరించి జీవితమంటే పరలోక భాగ్యమని దాని సాధించాలంటే మనం ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేసిన తండ్రి మీకు వందనాలు ఆమెన్

    ReplyDelete