19వ సామాన్య ఆదివారము, YEAR C
సొ. జ్ఞాన. 18: 6-9;
హెబ్రీ. 11:1-2, 8-19; లూకా. 12:32-48
ప్రభువు రాకడ - మన సంసిద్ధత
ఉపోద్ఘాతం: మన జీవితం ఒక ప్రయాణం. మన గమ్యం ఎటువైపో మనకు తెలియదు, అయినా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఈ ప్రయాణం చివరన, క్రీస్తును కలుసుకుంటామనేది వాస్తవం, ఖచ్చితం! మనలను కలుసుకొనుటకు, తన రాజ్యములోనికి మనలను ఆహ్వానించుటకు ప్రభువు సిద్ధముగా ఉంటారు. అది ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు, కనుక ఎల్లప్పుడు జాగరూకులమై, సంసిద్దులమై జీవించాలి. సంసిద్ధత యనగా, ప్రతీక్షణం క్రీస్తు కొరకే జీవించడం! అలా జీవిస్తే, ఏ క్షణములోనైనా ప్రభువును కలుసుకొనుటకు సిద్ధపడినవారమవుతాము. ఈ సంసిద్ధత మనం రోజు కలుసుకొను వారిపట్ల మన సేవా జేవితముపై కూడా ఆధారపడి యుంటుంది. "ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి" (మత్త 25:40) అని ప్రభువు చెప్పియున్నారు. కనుక, ప్రతీరోజు మనకు అప్పగించబడిన బాధ్యతలను నెరవేర్చాలి. ఇతరులతో సఖ్యతతో, శాంతితో జీవించాలి. తద్వారా, ప్రభువు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలి. అలాగే, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఉన్నను, ప్రభువు జీవితానికి, ఆయన ప్రేషిత కార్యానికి కట్టుబడి జీవించాలి. విశ్వసనీయత కలిగి జీవించాలి.విశ్వసనీయత అనగా నిబద్ధత కలిగి జీవించడం.
ప్రసంగం: సృష్టి
ఆరంభమునుండి దేవుడు మానవునికి ఎన్నో వాగ్దానాలను, ఒప్పందాలను చేస్తూ, వాటిని కార్యరూపణ
దాల్చుతూ ఉన్నారు. ఆ దేవుని వాగ్దానాలను దృఢముగా విశ్వసించాలి అనేది ఈనాటి పఠనాల భోదాంశం.
ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశములో ఫరోరాజు బానిసత్వములో ఉన్నప్పుడు, దేవునిపట్ల, దేవుని వాగ్దానాలపట్ల వారి విశ్వాసమే వారిని మోషే నాయకత్వములో స్వాతంత్రాన్ని పొందగలిగేలా
చేసింది. తద్వారా వారు వాగ్దత్త భూమికి నడిపించబడినారు.
రెండవ
పఠనములో పౌలుగారు విశ్వసించుటయన, "మనము నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా
ఉండుట; మనము చూడజాలని విషయములనుగూర్చి నిశ్చయముగా ఉండుట" అని నిర్వచించాడు. అబ్రహాము,
ఇస్సాకు, యాకోబుల విశ్వాసమును మనకు గుర్తుకు చేస్తున్నారు. స్వదేశమును విడచి, దేవుడు
వాగ్దానము చేసిన శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరియున్నారు.
"విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై యుండుట అసాధ్యము" (హెబ్రీ. 11:6).
"పూర్వాకాలపు మనుజులు, తమ విశ్వాసము చేతనే, దేవుని ఆమోదము పొందిరి. కంటికి కనిపింపని
వానినుండి, కంటికి కనిపించునట్లుగా, దేవుని వాక్కుచేత ప్రపంచము సృజింపబడినదని, విశ్వాసము
వలన మనకు అర్ధమగుచున్నది" (హెబ్రీ. 11:2-3).
సువిశేష
పఠనములో, తన రాజ్యములో శాశ్వత ఆనందమును ఒసగు దేవుడు వాగ్దానమందు విశ్వసించవలెనని యేసు
తన శిష్యులను కోరుచున్నారు. అయితే, దానికొరకు ఎల్లప్పుడూ సిద్దముగా ఉండాలి. ఎందుకన,
మనుష్యకుమారుడు ఏ ఘడియలో వచ్చునో ఎవరికినీ తెలియదు. యజమాని-సేవకుని ఉపమానము ద్వారా,
మనము ఎల్లప్పుడూ ప్రేమాజ్ఞకు విధేయులై, ఇతరులకు విధేయతాపూర్వకమైన సేవలనందిస్తూ, దేవుని
చిత్తమును నెరవేర్చవలయునని గుర్తుచేయుచున్నారు. యజమాని-దొంగ ఉపమానముద్వారా,
మనం, ఎల్లప్పుడూ జాగరూకులై ఉండాలని, తద్వారా, దొంగ (సాతాను, శోధనలు) దైవానుగ్రహమైన
మన సంపదను దోచుకోలేడు అని బోధిస్తూ ఉన్నారు.
ప్రభువును
చవిచూచుటకు మనము ఎల్లప్పుడూ జాగరూకులై ఉండాలి. జాగరూకులై ఉండుటకు మనము నిత్యమూ ప్రార్ధన
చేయాలి. ప్రార్ధనలో దేవున్ని ఆలకించాలి. దేవుని "మెల్లని స్వరమును" (1 రాజు.
19:12) ప్రార్ధనలో వినగలగాలి. ఆ మెల్లని స్వరమును వినాలంటే, ప్రతీ రోజు మన ప్రార్ధన
సమయాన్ని ప్రశాంతతో గడపాలి. ఈ ప్రశాంత వేళలోనే దేవుని స్వరమైన ప్రేమను, స్నేహాన్ని,
శాంతిని వినుటకు మన వీనులను ట్యూన్ చేసుకోవచ్చు. "వినుము! నేను ద్వారము వద్ద నిలిచి
తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో
భుజింతును. అతడును నాతో భుజింతును" (దర్శన. 3:20).
క్రీస్తు
రాకకై మనం ఎల్లప్పుడూ ఎదురు చూడవలయును. క్రీస్తు రాకకై ఎదురు చూడటమనగా, దేవుని రాజ్యము
కొరకు పనిచేయడమే. అనగా, ఇతరులకు సేవచేయడముద్వారా, పేదరికాన్ని పోరాడటముద్వారా, మనలను
విభజించే ద్వేషాన్ని తొలగించడముద్వారా, శాంతిని వ్యక్తుల మధ్య, దేశాల మధ్య స్థాపించడముద్వారా,
ఇతరులను గౌరవించే సమాజాన్ని నిర్మించుట వలన దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే!
చేసిన
వాగ్దానాలను అక్షరాల నెరవేర్చువారు మన తండ్రి దేవుడు. ఆయనయందు, ఆయన వాగ్దానాలయందు దృఢమైన
విశ్వాసాన్ని కలిగి ఉందాము. ఆ విశ్వాసము ప్రతీక్షణం అధికమధికమవ్వాలంటే, మన జీవితములో
ప్రశాంత క్షణాలతో కూడిన ప్రార్ధన ఎంతో అవసరము. ప్రార్ధనలో దేవుని స్వరమును వినుటద్వారా,
ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటయే, ఆయనలో జీవించడం.
ఆయన రాజ్యము కొరకు జీవించడము. విశ్వాసులుగా, దేవుడు వాగ్దానము చేసిన శాశ్వత ఆనందాన్ని
పొందాలంటే, ఇలాంటి జీవితము అవసరమని తెలుసుకొందాం!
No comments:
Post a Comment