పోప్ లియో XIV గారి సందేశం
సృష్టి సంరక్షణ కొరకు 10వ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం, 2025
శాంతి మరియు నిరీక్షణా బీజాలు (Seeds of Peace and Hope)
ప్రియ సహోదరీ సహోదరులారా,
మన
ప్రియతమ పోప్ ఫ్రాన్సిస్ ఎంపిక
చేసిన “ప్రపంచ సృష్టి సంరక్షణ ప్రార్థనా దినోత్సవం” యొక్క అంశం: “శాంతి మరియు
నిరీక్షణా బీజాలు”. ‘లౌదాతో సీ’ (Laudato Si') ఎన్సిక్లికల్
(Encyclical) పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రార్థనా
దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంశం ప్రస్తుత
జూబిలీ అంశం “నిరీక్షణ యాత్రికులు”కు చాలా సముచితంగా ఉంది.
దేవుని
రాజ్యాన్ని ప్రకటించేటప్పుడు, యేసు తరచుగా ‘విత్తనం’ రూపాన్ని ఉదాహరణగా ఉపయోగించారు. విత్తనం భూమిలో నాటబడి,
అదృశ్యమైనప్పటికీ, దానిలో దాగి ఉన్న జీవం చివరికి మొలకెత్తుతుంది.
ఇది ఊహించని చోట్ల కూడా నూతన
ఆరంభాల వాగ్దానాన్ని సూచిస్తుంది. తన శ్రమల సమయం
సమీపిస్తున్నప్పుడు, ఫలమివ్వడానికి నశించవలసిన గోధుమ గింజతో తనను తాను
పోల్చుకుంటూ (యోహాను 12:24) యేసు తనకే అన్వయించుకున్నారు. ఇది ఆయన త్యాగం
ద్వారా మానవాళికి లభించే నూతన జీవానికి మరియు నిరీక్షణకు ప్రతీక. ఈ భావనను మన
నిత్య జీవితంలో కూడా చూడవచ్చు. ఉదాహరణకు, మన రోడ్ల
పక్కన యాదృచ్ఛికంగా పడిన విత్తనాల నుండి మొలకెత్తే పువ్వులను గమనించండి! ఆ
పువ్వులు పెరిగే కొద్దీ, అవి బూడిద రంగు తారును అందంగా మారుస్తాయి,
చివరికి దాని కఠినమైన ఉపరితలాన్ని కూడా చీల్చుకొని బయటకు వస్తాయి. ఇది
ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా జీవం
మరియు అందం ఎలా మొలకెత్తుతుందో తెలియజేస్తుంది.
ఈ దృశ్యం నిరీక్షణ యొక్క శక్తికి మరియు జీవం యొక్క అద్భుతానికి స్పష్టమైన ఉదాహరణ.
క్రీస్తులో,
మనం కూడా విత్తనాలమే,
వాస్తవానికి, “శాంతి
మరియు నిరీక్షణ విత్తనాలమే”. ఈ భావన ప్రవక్త యెషయా చెప్పిన మాటల్లో మరింత స్పష్టంగా వ్యక్తమవుతుంది.
దేవుని ఆత్మ బీడు భూమిని తోటగా, విశ్రాంతి
మరియు ప్రశాంతత గల ప్రదేశంగా మార్చగలదని యెషయా తెలియజేశాడు. ఆయన మాటల్లోనే: “ప్రభువు
పైనుండి తన అనుగ్రహమును మన మీద కురియించును. ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును.
పొలములలో పంటలు పుష్కలముగా పండును. ఎడారిలో న్యాయము నెలకొనును. పంట పొలములలో నీతి
నిల్చును. నీతి వలన శాంతి కలుగును. నీతి వలన నిత్యము నమ్మకము, నిబ్బరము కలుగును. దేవుని
ప్రజలు చీకు చింత లేకుండ శాంతి సమాధానములతో జీవింతురు” (యెషయా 32:15-18). [ఈ
లేఖనం, దేవుని కృప మరియు మనలో నాటబడిన శాంతి, నిరీక్షణ
విత్తనాలు ఎంతటి పరివర్తనను తీసుకురాగలవో
తెలియజేస్తుంది. ఎండిన భూమిని పచ్చని తోటగా మార్చగలిగిన దైవశక్తి, మన జీవితాల్లోనూ, మనం నివసించే సమాజంలోనూ శాంతిని,
న్యాయాన్ని, సమృద్ధిని తీసుకురాగలదని ఇది సూచిస్తుంది. కేవలం ప్రార్థనలే కాకుండా,
మనం స్వయంగా ఆ శాంతికి, నిరీక్షణకు ప్రతీకలుగా మారినప్పుడు, అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి.]
ప్రవక్త
పలికిన ఈ మాటలు “సృష్టి కాలం” (Season of
Creation) తోడుగా నిలుస్తాయి. ఇది సెప్టెంబర్
1 నుండి అక్టోబర్ 4, 2025 వరకు జరుపుకోబడే ఒక
ఎక్యూమెనికల్ (సర్వమత) కార్యక్రమం. ఈ “దేవుని స్పర్శ” (Laudato Si’, 84) మన
ప్రపంచానికి స్పష్టంగా కనిపించాలంటే, ప్రార్థనతో పాటు పట్టుదల మరియు ఆచరణాత్మక
చర్యలు ఎంతగానో అవసరమని ఈ మాటలు మనకు గుర్తుచేస్తాయి. న్యాయం,
చట్టబద్ధతకు పూర్తి విరుద్ధంగా ఉన్న ఎడారి విధ్వంసాన్ని ప్రవక్త
వివరిస్తున్నారు. మన భూమి వివిధ ప్రాంతాల్లో తీవ్రంగా ధ్వంసమవుతున్న ప్రస్తుత
పరిస్థితులలో ఆయన సందేశం అత్యంత సమయానుకూలమైనది. అన్యాయం,
అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన, ప్రజల హక్కుల ఉల్లంఘన, తీవ్రమైన
అసమానతలు, వాటికి ఆజ్యం పోసే అత్యాశ వంటివి
అడవుల నరికివేతకు, కాలుష్యానికి, జీవవైవిధ్య
నష్టానికి కారణమవుతున్నాయి. మానవ కార్యకలాపాల వల్ల సంభవించే వాతావరణ మార్పుల
ద్వారా కలిగే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు తీవ్రతలోనూ, సంఖ్యలోనూ
పెరుగుతున్నాయి (Laudato Deum, 5 చూడండి). ఇక సాయుధ
పోరాటాల వల్ల కలిగే మానవ, పర్యావరణ విధ్వంసం యొక్క
మధ్యస్థ, దీర్ఘకాలిక ప్రభావాల గురించి ప్రత్యేకంగా
చెప్పాల్సిన అవసరం లేదు. [ఈ పరిస్థితుల్లో, మనం ‘శాంతి మరియు నిరీక్షణ విత్తనాలు’గా మారి,
మన పరిసరాలను, పర్యావరణాన్ని సంరక్షించడానికి క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన
ఆవశ్యకత ఎంతైనా ఉంది.]
ప్రకృతి
విధ్వంసం అందరినీ ఒకే విధంగా ప్రభావితం చేయదని మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం. న్యాయం, శాంతి
కాలరాయబడినప్పుడు, ఎక్కువగా నష్టపోయేది పేదలు, అట్టడుగు
వర్గాలవారు, మరియు సమాజం నుండి వెలివేయబడినవారే. ఈ
విషయంలో గిరిజన వర్గాల కష్టాలు అత్యంత స్పష్టమైన నిదర్శనం.
[వారు తరచుగా ప్రకృతితో మమేకమై జీవిస్తారు, వారి
జీవనోపాధి మరియు సంస్కృతి సహజ వనరులపై ఆధారపడి ఉంటాయి. అడవుల నరికివేత, కాలుష్యం,
మరియు వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రకృతి వైపరీత్యాలు వారి జీవితాలను
తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వారి సంప్రదాయ భూములు లాక్కోబడతాయి, వారి
నీటి వనరులు కలుషితమవుతాయి, మరియు వారి జీవనోపాధి మార్గాలు ధ్వంసమవుతాయి. ఈ
పరిణామాలు వారిని మరింత పేదరికంలోకి నెట్టివేసి, వారి
హక్కులను కాలరాస్తాయి. ఈ అసమానతను గుర్తించడం ద్వారానే మనం మరింత న్యాయబద్ధమైన
మరియు సమానమైన ప్రపంచాన్ని నిర్మించగలం. ప్రకృతి సంరక్షణ అనేది కేవలం పర్యావరణ
సమస్య మాత్రమే కాదు, అది ఒక సామాజిక
న్యాయ సమస్య కూడా.]
ఇది
మాత్రమే కాదు, ప్రకృతి కూడా కొన్నిసార్లు బేరసారాల వస్తువుగా,
ఆర్థిక లేదా రాజకీయ ప్రయోజనాల కోసం అమ్ముడుపోయే సరుకుగా మారిపోతోంది.
ఫలితంగా, దేవుని సృష్టి ముఖ్యమైన వనరుల నియంత్రణ కోసం ఒక
యుద్ధభూమిగా రూపాంతరం చెందుతుంది. దీన్ని మనం వ్యవసాయ ప్రాంతాలలో [లాభాపేక్షతో
కేవలం ఒకే రకమైన పంటలను పండించడం, రసాయనాలను విపరీతంగా వాడటం వల్ల భూసారం
దెబ్బతింటోంది], ల్యాండ్మైన్లతో నిండిన అడవులలో, [యుద్ధాలు
లేదా సంఘర్షణల వల్ల అడవులు నాశనమవుతున్నాయి, ఇక్కడ
జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది], “కాల్చివేసిన
భూమి” (scorched earth) విధానాలలో, [సైనిక
వ్యూహాలలో భాగంగా భూమిని, దాని వనరులను పూర్తిగా నాశనం చేయడం], నీటి వనరులపై తలెత్తే సంఘర్షణలలో [నదులు, సరస్సులు
వంటి నీటి వనరుల నియంత్రణ కోసం దేశాల మధ్య లేదా ప్రాంతాల మధ్య ఘర్షణలు], మరియు
ముడి పదార్థాల అసమాన పంపిణీలో [సహజ వనరులు అధికంగా ఉన్న పేద దేశాల నుండి సంపన్న
దేశాలు వాటిని తక్కువ ధరకు దోచుకోవడం] చూస్తున్నాము. ఇవన్నీ పేద దేశాలను మరింతగా
దెబ్బతీసి, సామాజిక స్థిరత్వాన్నే నాశనం
చేస్తున్నాయి. [ఈ పరిణామాలన్నీ పేద
దేశాలను మరింతగా దెబ్బతీసి, సామాజిక స్థిరత్వాన్నే నాశనం చేస్తున్నాయి.
ప్రకృతిని కేవలం వినియోగ వస్తువుగా చూడటం మానేసి, దానిని
గౌరవించి, సంరక్షించాల్సిన ఆవశ్యకతను ఇది నొక్కి చెబుతుంది.
ప్రకృతితో సామరస్యంగా జీవించడం ద్వారానే నిజమైన శాంతి మరియు సుస్థిరత
సాధ్యమవుతాయి.]
ప్రకృతికి
జరిగిన ఈ గాయాలన్నీ పాపం యొక్క పర్యవసానమే. దేవుడు
తన స్వరూపంలో సృష్టించిన స్త్రీపురుషులకు భూమిని అప్పగించినప్పుడు (ఆది 1:24-29
చూడండి) ఆయన ఉద్దేశ్యం ఇది కాదు. “సృష్టిపై నియంతృత్వం” చెలాయించడానికి బైబులు మనకు ఎలాంటి సమర్థననూ
ఇవ్వదు (Laudato Si', 200). దీనికి విరుద్ధంగా, “బైబులు
గ్రంథాలను వాటి సందర్భంలో, సరైన వ్యాఖ్యానంతో చదవాలి. అవి ప్రపంచమనే తోటను ‘సాగుచేయాలి,
కాపాడుకోవాలి’ (ఆది 2:15 చూడండి) అని మనకు చెబుతున్నాయి. ‘సాగుచేయడం’ అంటే దున్నడం లేదా పని చేయడం, అయితే ‘కాపాడుకోవడం’ అంటే సంరక్షించడం, రక్షించడం,
పర్యవేక్షించడం మరియు భద్రపరచడం. ఇది మానవులకు మరియు ప్రకృతికి మధ్య పరస్పర బాధ్యతాయుత సంబంధాన్ని సూచిస్తుంది” (Laudato Si', 67). [మనం
ప్రకృతిని కేవలం వాడుకోవడానికి మాత్రమే కాకుండా, దానిని
జాగ్రత్తగా చూసుకోవడానికి, భవిష్యత్ తరాలకు అందించడానికి బాధ్యత వహించాలి.
మన చర్యల ద్వారా ప్రకృతికి కలిగే నష్టాన్ని తగ్గించి, దానిని
పునరుద్ధరించడం మనందరి నైతిక బాధ్యత.]
ప్రవక్తలు
సూచనప్రాయంగా ప్రకటించిన పర్యావరణ
న్యాయం ఇకపై కేవలం ఒక ఊహాజనిత భావనగానో, లేదా చేరుకోలేని
లక్ష్యంగానో పరిగణించబడదు. ఇది కేవలం పర్యావరణాన్ని రక్షించడం కంటే ఎంతో ప్రాముఖ్యత కలిగిన తక్షణ అవసరం. ఎందుకంటే
ఇది సామాజిక, ఆర్థిక మరియు మానవ న్యాయానికి సంబంధించిన
విషయం. విశ్వాసులకు ఇది విశ్వాసం నుండి పుట్టిన ఒక కర్తవ్యం కూడా.
సమస్తము సృష్టించబడిన, విమోచించబడిన యేసుక్రీస్తు
రూపాన్ని విశ్వం ప్రతిబింబిస్తుంది. వాతావరణ మార్పులు, అటవీ
నిర్మూలన, కాలుష్యం వంటి వినాశకరమైన ప్రభావాలను మనలో అత్యంత బలహీనమైన సహోదరీ సహోదరులే మొదట
అనుభవిస్తున్న ఈ ప్రపంచంలో, సృష్టి సంరక్షణ అనేది మన విశ్వాసానికి,
మానవత్వానికి నిజమైన మార్గముగా మారుతుంది.
“దేవుని
సృష్టిని సంరక్షించే బాధ్యతను నిర్వర్తించడం సద్గుణ జీవితానికి అత్యంత ఆవశ్యకం;
ఇది మన క్రైస్తవ అనుభవంలో ఐచ్ఛికమైన లేదా ద్వితీయ శ్రేణి అంశం కాదు”
(Laudato Si’, 217). [సృష్టి సంరక్షణ అనేది మన విశ్వాస జీవితంలో
అంతర్భాగం. ఇప్పుడు కేవలం సంభాషణలు, చర్చలు కాదు, ఆచరణాత్మక
చర్యలతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది.] ప్రేమతో,
పట్టుదలతో కృషి చేయడం ద్వారా, మనం అనేక న్యాయ
బీజాలను నాటవచ్చు. దీనివల్ల శాంతి వృద్ధి చెందడానికి, ఆశలు
చిగురించడానికి తోడ్పడగలం. ఈ మొక్క మొదటి ఫలాలను ఇవ్వడానికి సంవత్సరాలు పట్టవచ్చు.
ఆ సంవత్సరాలు నిరంతరాయంగా సాగే, విశ్వసనీయమైన,
సహకారంతో కూడిన, ప్రేమతో నిండిన ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆ ప్రేమ ప్రభువు యొక్క ఆత్మబలిదాన ప్రేమను ప్రతిబింబిస్తే ఇది మరింత సాధ్యమవుతుంది.
శ్రీసభ
చేపట్టిన కార్యక్రమాలలో, సృష్టి సంరక్షణ కృషిలో నాటిన విత్తనాలలో ఒకటి బోర్గో లౌదాతో సీ (Borgo Laudato Si’) ప్రాజెక్ట్.
దీనిని పోప్ ఫ్రాన్సిస్ కాస్టెల్
గండోల్ఫోలో మనకు బహుకరించారు. ఇది న్యాయం, శాంతి
ఫలాలను అందించే ఒక విత్తనం లాంటిది. అంతేకాకుండా, ఇది సమగ్ర పర్యావరణ విద్యకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్.
‘లౌదాతో సీ’ ఎన్సిక్లికల్ సూత్రాలను అనుసరించి ప్రజలు ఎలా జీవించవచ్చు,
పని చేయవచ్చు, మరియు సమాజాన్ని ఎలా నిర్మించుకోవచ్చు అనేదానికి
ఇది ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. బోర్గో లౌదాతో సీ ప్రాజెక్ట్, పర్యావరణ
స్పృహను పెంపొందించడం ద్వారా, భవిష్యత్ తరాలకు సుస్థిరమైన మరియు
సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడానికి ఒక ఆశాదీపంగా నిలుస్తోంది.
సర్వశక్తిమంతుడైన
దేవుడు మనకు సమృద్ధిగా తన “ఉన్నత స్థలం నుండి ఆత్మను” (యెషయా 32:15) పంపాలని
నేను ప్రార్థిస్తున్నాను. తద్వారా
మనం నాటిన ఈ విత్తనాలు, మరియు వీటిలాంటి ఇతర విత్తనాలు కూడా శాంతి మరియు ఆశల సమృద్ధియైన పంటను అందిస్తాయి.
‘లౌదాతో
సీ’ ఎన్సిక్లికల్ గత పదేళ్లుగా కతోలిక శ్రీసభకు,
మరియు మంచి మనసున్న ఎంతోమందికి నిజంగా ఒక మార్గదర్శకంగా
నిలిచింది. ఇది మనల్ని మరింతగా ప్రేరేపించాలి,
అలాగే సమగ్ర పర్యావరణ శాస్త్రం (integral
ecology) సరైన మార్గంగా విస్తృతంగా ఆమోదించబడాలి. ఈ విధంగా, ఆశల
విత్తనాలు గుణించబడతాయి. మన గొప్ప, తరగని
ఆశ అయిన పునరుత్థానుడైన క్రీస్తు కృపచే అవి 'సాగుచేయబడి, కాపాడబడతాయి'.
ఆయన నామంలో, మీ అందరికీ నా ఆశీర్వాదాలు.
వాటికన్, 30 జూన్ 2025
ప్రధమ వేదసాక్షుల స్మరణ
మూలము:
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.