వేదవ్యాపక ఆదివారము 2025
పునీత మార్కుగారు వ్రాసిన సువార్త 16:15-16, యేసు తన శిష్యులతో ఇట్లనెను, “మీరు ప్రపంచమందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు
రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును.”
ప్రియ సహోదరీ సహోదరులారా! శ్రీసభ అక్టోబరు 19న ప్రపంచ వేదవ్యాపక ఆదివారమును లేదా మిషన్ సండేను జరుపుకుంటుంది.
‘వేద-వ్యాపకం’ అంటే
"జ్ఞానాన్ని/వేదాన్ని ముఖ్యంగా దైవజ్ఞానాన్ని సువార్తను విశ్వమంతట వ్యాపింప జేయడం’
అని అర్థం. ఇది ఒకరోజు చేసే కార్యం కాదు. మన జీవిత లక్ష్యం!
సువార్తా వ్యాప్తి, ప్రతి ఒక్కరి బాధ్యత! సువార్త వ్యాప్తి అనేది
కేవలం సేవకుల బాధ్యత అనగా గురువుల, ఉపదేశకుల బాధ్యత మాత్రమే కాదు. సువార్త
వ్యాప్తి ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. పేతురు, యోహానులు పలికిన
మాటలను గుర్తుచేసుకుందాం, అ.కా. 4:20 – “మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి,
చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము”. ఎట్టి పరిస్థితులలోనైన
సువార్తను ప్రకటించాలనే వారి తపనను మనం చూడవచ్చు! కనుక, సువార్తను వ్యాపింప జేయడంలో
మనలో ప్రతి ఒక్కరమూ భాగస్వాములం కావాలి. ఈ పరిశుద్ధ కార్యంలో పాల్గొనడంద్వారా,
సహాయ సహకారాలు అందించడం ద్వారా, దేవుడు మనకు అప్పగించిన
బాధ్యతను నెరవేర్చినవారం అవుతాం. దేవునియందు విశ్వాసంతో, మనం
క్రీస్తుకు సాక్షులుగా జీవించినవారం అవుతాం. క్రీస్తుప్రభువును విశ్వసించి,
జ్ఞానస్నానము తీసుకొని, సత్ప్రసాదమును
స్వీకరించి, క్రీస్తు సాక్షులుగా జీవించేలా ప్రార్థిస్తూ,
మన వంతు కృషి చేద్దాం. ప్రతి ఒక్కరమూ వ్యక్తిగతంగా సువార్తా
వ్యాప్తిలో పాలుపంచు కోవాలి. దేవుని ప్రేమ, క్షమాపణ, దయ కలిగి జీవించాలి. ఎందుకంటే, సువార్త వ్యాప్తి అనేది దయ, సేవ మరియు
పునరుద్ధరణ కార్యం.
సువార్త వ్యాప్తి మన విశ్వాసానికి కొత్త ఉత్తేజాన్నిస్తుంది అని
పునీత రెండవ జాన్ పాల్ గారు చెప్పియున్నారు. సువార్త ప్రకటించడం ద్వారా మన సొంత
విశ్వాసం బలపడుతుంది. కనుక, ముందుగా, దేవుని సందేశాన్ని విశ్వాసంతో
స్వీకరిద్దాం. పరమ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తును మనకోసం ఈ లోకానికి
పంపి, మనవలె సామాన్య మానవునిగా
జీవింపజేసి, మన పాపముల కొరకై ఆయన ప్రాణాన్ని సిలువపై బలియాగముగా
అర్పించారు. ఆయన మన యెడల చూపిన అపారమైన ప్రేమ, దయ, క్షమాపణ, కనికరాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. క్రీస్తు
ప్రభువు ఇచ్చిన “మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు” అన్న
ఈ సందేశాన్ని, మనమందరం విశ్వాసంతో స్వీకరించాలి. ఈ బాధ్యతతో సువార్తా వ్యాప్తి
పనిలో ఆనందంగా పనిచేస్తూ, నిజ దేవుడు ఎవరో తెలియని వారందరికీ
సువార్తను ప్రకటిద్దాం. సువార్తను ఎప్పుడూ సంతోషంతో మరియు
ఆనందంతో ప్రకటించుదాం.
సేవకుల పట్ల, సువార్త బోధకుల పట్ల, గౌరవం మరియు సహకారం చూపాలి. సువార్తా
పరిచర్య అనేది దేవుని ఇష్టానుసారంగా జరుగుతుంది. దేవుడు నియమించిన సువార్తికులు, సేవకులు, గురువులు, ఉపదేశకులు, మఠవాసులు మొదలైనవారు అభిషిక్తులైన వ్యక్తులు.
వీరు సువార్త పరిచర్యకై తమను తాము అర్పించుకున్నారు. వీరు తరచుగా కష్టాలు, తిరస్కారములు, అపనిందలు ఎదుర్కొంటారు, కొందరు హతసాక్షులవుతున్నారు, హింసింపబడుతున్నారు. “విశ్వాసం కొరకు చనిపోవడం కొందరికి బహుమానం, విశ్వాసంతో జీవించడం అందరికీ పిలుపు” అని పునీత రెండవ జాన్ పాల్ గారు
అన్నారు.
“సువార్తికులు, గురువులు, మఠవాసులు తమ కుటుంబాన్ని, సుఖాలను వదులుకుని,
తమ జీవితాలను ప్రభువు చేతుల్లో ఆయుధాలుగా అర్పించుకున్నారు. వారు
మనకు కేవలం బోధకులు మాత్రమే కాదు, విశ్వాస వీరులు.” అందుకే మనం ఈ సేవకుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. వారిని ఆదరించి
ప్రేమించాలి. సువార్తా పరిచర్య సాగించడానికి అవసరమైన సహాయ సహకారాలను మన వంతుగా వారికి
అందించాలి. మన వంతుగా వారికి పరిస్థితులకు అనుగుణంగా, అవసరాన్ని బట్టి, ఆర్థిక
సహాయము అందించడం ధన్యతగా భావించాలి. వారి ప్రార్థనల ద్వారా మనం ఆశీర్వాదాలు పొందగలము,
స్వస్థతను పొందగలము. అయితే, నిజమైన బోధను,
సువార్త పరిచర్యను, దేవుని నడిపింపులో ఉన్న బోధకులను, పరిశుద్ధాత్మ నడిపింపు
ద్వారా మనం గ్రహించగలగాలి.
సువార్తా వ్యాప్తి అంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి, మన గుప్పెళ్ళను విప్పి, సహాయం
చేసే హృదయాన్ని కలిగి ఉండాలి. అటువంటి వారికి దేవుని
ఆశీర్వాదాలు తప్పక అందుతాయి. ప్రపంచ వేదవ్యాపక ఆదివారం రోజున తల్లి
శ్రీసభ ద్వారా మిషనరీలకు, అనగా దూర ప్రాంతాలలో
పనిచేస్తున్న క్రీస్తు సువార్త సేవకులకు ఆర్థిక సహాయం అందించడానికి పిలుపు
నిస్తుంది. ఈ రోజు మనం ఇచ్చే ప్రతి చిన్న విరాళం కూడా, దేవుని
రాజ్యాన్ని విస్తరించడంలో ఎంతగానో
సహాయపడుతుందని గుర్తుంచుకుందాం!
సువార్తా పరిచర్య అనేది దేవుని ఇష్టప్రకారముగా జరుగుతుంది. సువార్త
పరి చర్య చేసేవారిని, దేవుడు నియమించిన
వ్యక్తులుగా మనం భావించి, గౌరవించి, వారిని
ఆదరించి, ప్రేమించి, సువార్తా పరిచర్య
జరపడానికి మన వంతు, సువార్తా వ్యాప్తికై, కావలసిన సహాయమును, సేవలను అందించగలగాలి. స్వయముగా,
దేవుని పరలోక రాజ్య పరిచర్యలో, సకల మానవాళీ, నిజ దేవున్ని
తెలుసుకొని, పరలోక రాజ్యమున ప్రవేశము పొందుకొనుటకై, పని చేయు సేవకుల యెడల, మనము గౌరవభావమును కలిగి
ఉండాలి. ప్రతి వ్యక్తి సహాయ సహకారములను, సేవలో అభిశక్తులకు
అందించాలి. ఆ విధముగా దేవుని పరిచర్య చేసే వారికి, దేవుని
వాక్కును బోధించే వారికి, భోజనమును పెట్టుట ధన్యతగా
భావించాలి. దేవుని ఆజ్ఞచే అధికారం ఇచ్చిన అభిషిక్తులైన సేవకులను, మన గృహములకు ఆహ్వానించి, వారు ఒసగు శాంతి
సమాధానములను, దేవుని ఆత్మచే, వారు
ప్రార్థించే ప్రార్థన ద్వారా, మనము, ఆశీర్వాదములు
పొందుకోవాలి.
దేవుని సేవకులు మన బాధలను ఆలకించి, వారు చేయు ప్రార్థన ద్వారా, మనకు స్వస్థతలను
దయచేయగలరు. మన వద్దకు, అనగా మన గ్రామమున ఉన్న దేవాలయమునకు
వచ్చి, దేవుని సువార్త బోధకులు పరిచర్య చేస్తున్నారంటే,
దేవుని రాజ్య విస్తరణకు, దేవుని ప్రణాళికను
నెరవేర్చుటకు, దేవుని కార్యము ఉంది. దేవుడు మన గ్రామమునకు,
మన యొద్దకు పంపిన ఆయన శిష్యులను మనము, గౌరవించి,
ఆదరించి, ప్రేమించి, వారి
బోధనలను ఆలకించి, దేవుని రాజ్యమున మనము ప్రవేశించడానికి,
దేవుని వాక్కును మనము అనుసరించి, దేవుని
సాక్షులమై దేవుని యందు విశ్వాసముతో జీవించగలగాలి.
సువార్తా పరిచర్య రక్షణ మరియు నిత్య జీవంనకు నడిపిస్తుంది. సువార్తా
పరిచర్య లేకపోతే, నిజ దేవుడు ఎవరో,
సత్యం ఏమిటో సర్వమానవాళికి తెలియదు. అందుకే సువార్తికులు చాలా
ప్రధానం. దేవుని యందు విశ్వాసము కలిగించి, రక్షణను ఇచ్చేదే సువార్త వ్యాప్తి. మన జీవితం ఈ లోకంతో మాత్రమే
ముగిసిపోదు. మన మరణానంతరం దేవుని రాజ్యమైన పరలోక రాజ్యంలో నిత్యజీవం ఉంటుంది. ఈ
సత్యాన్ని మనం చాటాలి. క్రీస్తు ప్రభువు మొదటిసారిగా పదనొకండుగురు శిష్యులను
ప్రపంచమంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు అని, తన శిష్యులను సువార్తికులుగా పంపించడానికి ప్రధాన కారణం, సృష్టిలో మానవులలో, ఏ ఒక్కరూ నశించి పోకుండా,
నిజ దేవున్ని గూర్చి తెలియజేయటానికి, వారిని
లోకములోనికి పంపించారు.
ప్రియ సహోదరీ సహోదరులారా! సువార్త వ్యాప్తి అంటే కేవలం సేవకులకు సహాయం
చేయడం మాత్రమే కాదు, మనం రోజువారీ జీవితంలో
ఎలా పాలుపంచుకోవచ్చో స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం:
వ్యక్తిగత సాక్ష్యం: సువార్తను
మన మాటల ద్వారానే కాదు, మన జీవన విధానం ద్వారా
కూడా చాటాలి. క్రీస్తు మనలో జీవిస్తున్నారని మన ప్రవర్తన, ప్రేమ,
నిజాయితీ ద్వారా ఇతరులు గుర్తించాలి. వ్యక్తిగత సాక్ష్యానికి గొప్ప
ఉదాహరణ సమరయ స్త్రీ! కేవలం ఒక్క సంభాషణ ద్వారా తన గ్రామం మొత్తానికి క్రీస్తును
పరిచయం చేసింది. ఇది!
కేవలం
బోధించడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను
కార్యాల ద్వారా చూపడం. పేదలకు, రోగులకు, ఒంటరివారికి సేవ చేయడం ద్వారా సువార్తను ఆచరించడం. “మీ మంచి క్రియలను చూసి,
పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరచాలి” అని మత్తయి
5:16లో చదువుచున్నాం. కనుక, మాటల కంటే ముందు మన క్రియల ద్వారా క్రీస్తును
ప్రకటించుదాం. సువార్త వ్యాప్తి అంటే ఎప్పుడూ పెద్ద ప్రసంగాలు ఇవ్వడం కాదు. అది
చిన్న చిన్న క్రియల ద్వారా కూడా సువార్త వ్యాప్తి చేయవచ్చు! మన చుట్టూ ఉన్న వారి
దృష్టిలో, నిత్యం మన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను
ప్రతిబింబించాలి. ఉదాహరణకు, మీరు పనిచేసే ఆఫీసులో, బస్సులో
లేదా మీ పొరుగువారితో - మీ నిజాయితీ,
ఓర్పు, మరియు క్షమించే
గుణం ఇతరులను కదిలించే విధంగా ఉండాలి. క్రియల ద్వారా
క్రీస్తు ప్రేమను చూపించవచ్చని, సువార్త వ్యాప్తి చేయ వచ్చని పునీత మదర్ థెరిస్సా
గారి జీవితం మనందరికీ చక్కటి ఉదాహరణ మరియు ఆదర్శం! పునీత పౌలుగారి సువార్తా జీవితం
కూడా మనదరికి గొప్ప స్ఫూర్తి, ఆదర్శం. సువార్త వ్యాప్తి కోసం ఆయన చూపిన ధైర్యం,
సమర్పణ మరియు సహనం అసాధారణం.
అన్యజనులకు సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించే క్రమంలో ఎన్నో దుర్భరమైన
కష్టాలను అనుభవించాడు. వీటన్నింటిని, పౌలుగారు ధైర్యంగా, ఆనందంగా భరించారు.
“వెళ్లండి,
లోకానికి అగ్నిని రాజేయండి” అని పునీత
ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు అన్నారు. కనుక, మన సాక్ష్యం ఉత్సాహంతో ఈ లోకంలో మార్పు
తీసుకురావాలనే మన పిలుపును గ్రహించాలి. అయితే, మనలో కొందరు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోవచ్చు. ఈ రోజు
నేను ఎక్కడ ఉన్నాను? నా కుటుంబాన్ని, నా
ఆఫీసును, నా ఇరుగుపొరుగువారిని నా 'ప్రపంచంగా'
నేను భావిస్తున్నానా? నా ప్రస్తుత స్థలంలో నేను క్రీస్తు ప్రేమను ఎలా
ప్రకటించగలను? అని ఆత్మపరిశీలన చేసుకుందాం!
ప్రార్థన: మన ఇంటిని, పని చేసే స్థలాన్ని, స్నేహితుల
సమూహాన్ని సువార్త వ్యాప్తి కోసం ప్రార్థనా కేంద్రాలుగా మారుద్దాం. మిషన్ లేదా
ప్రేషితం అంటే మన చుట్టూనే, వేరే దేశాలకు వెళ్లడం మాత్రమే మిషన్ కాదు, మన కుటుంబంలో, మన పని ప్రదేశంలో, మన సమాజంలో సువార్తను జీవించడం. మనం ఎక్కడ ఉన్నా, అక్కడే
క్రీస్తును ప్రతిబింబించాలి. “మనం అలసిపోకుండా
ప్రార్థన చేయాలి, ఎందుకంటే మానవజాతి రక్షణ అనేది భౌతిక
విజయం మీద ఆధారపడదు... కేవలం యేసుక్రీస్తుపై మాత్రమే ఆధారపడుతుంది” అని పునీత
ఫ్రాన్సిస్ జేవియర్ అన్నారు. మిషనరీలకు ప్రార్థన, దైవశక్తి ఎంతో అవసరం కనుక వారి కొరకు నిత్యం ప్రార్ధన చేద్దాం!
మనమందరము కూడా జ్ఞానస్నానం, దివ్యసప్రసాదం
స్వీకరించి, దేవునియందు భక్తి విశ్వాసములతో, దేవుని సాక్షులుగా జీవిస్తూ రక్షింపబడదాం. ప్రతి దినం ఆ దేవునికి ఈ విధంగా
ప్రార్థించుకుందాం ముఖ్యంగా సుదూర ప్రాంతాలలో లేదా సువార్త వినని మరుగున పడిన
జాతుల మధ్య పనిచేస్తున్న మిషనరీల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి, వారికి తోడ్పాటు అందించాలి. లోకంలో సువార్తను ప్రకటించే మిషనరీలందరి కోసం మనం ప్రార్థించాలి.
వారికీ ధైర్యాన్ని, శక్తిని, రక్షణను, సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వమని
దేవుణ్ణి వేడుకోవాలి. కేవలం ప్రార్థించడమే కాదు, సువార్త సేవలో మనం భాగస్వాములు కావాలి. మనకున్న ధన సహాయం, సమయాన్ని, ప్రతిభను సేవ కోసం అంకితం చేయాలి.
ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమను పంచడానికి మనం కృషి చేయాలి.
సువార్త వ్యాప్తిని కేవలం మానవ ప్రయత్నంగా కాకుండా, దైవిక ప్రేరేపిత కార్యంగా స్పష్టం చేయాలి. ప్రపంచమంతటా
తిరిగి సువార్తను ప్రకటించే ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రభువు పరిశుద్ధాత్మ
ద్వారా మనకు అనుగ్రహిస్తారు. సువార్తను బోధించే శక్తి మన సొంత జ్ఞానం కాదు,
అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. సువార్త
ఫలించడానికి, ప్రజల హృదయాలు మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ
నడిపింపు కోసం నిరంతరం ప్రార్థించాలి.
అనేకులైన అన్యులు నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుండా
నశించిపోతున్నారు. ఆ విధంగా జరుగకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువును విశ్వసించి, అనుసరించి, చివరకు నిత్యజీవంలో
ప్రవేశించులాగున ఆ దేవున్ని వేడుకుందాం. మన వంతు మనం సువార్తా వ్యాప్తికై పనిచేసి,
కొన్ని ఆత్మలను రక్షించుదాం. దేవుని ప్రేరణ, ఆత్మ
నడిపింపు మనకు తోడై యుండులాగున ప్రార్థించుకుందాం.
“ఈ రోజు నుండి, నేను
క్రీస్తును నా మాటలలో మరియు నా చేతలలో ప్రతిబింబిస్తాను”
అని గట్టిగా కోరుకుందాం!
ప్రియమైన సహోదరీ సహోదరులారా! ఈ ప్రపంచ వేదవ్యాపక ఆదివారం రోజున
మనం కేవలం మాటలు చెప్పడం కాదు, నిర్ణయం తీసుకుందాం!
1. ప్రార్థన
ద్వారా: నిత్యం మిషనరీల కొరకు, సువార్త
ప్రకటించ బడని ప్రాంతాల ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం!
త్యాగం ద్వారా: వేదవ్యాపక
ఆదివారం సందర్భంగా మన వంతు ఆర్థిక
సహాయాన్ని వారికి అందించి, వారి
సేవలో భాగస్వాములమవుదాం!
3. జీవితం
ద్వారా: క్రీస్తును కేవలం ఆదివారం మాత్రమే కాదు, సోమవారం
నుండి శనివారం వరకు మన ప్రతి క్రియలో, ప్రతి మాటలో సాక్షులుగా జీవిద్దాం!
కనుక, పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా అన్నట్లు, 'వెళ్లండి, లోకానికి అగ్నిని రాజేయండి! అన్న మాటలకు, మన జీవితాలే సువార్త కావాలని కోరుకుందాం!
No comments:
Post a Comment