కానుక మాత మహోత్సవం: “మనమే దేవునికి జీవముగల కానుకలం” Nov 21


కానుక మాత మహోత్సవం: “మనమే దేవునికి జీవముగల కానుకలం”
జెకర్యా 2:10-13; మత్త 12:46-50

పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమేన్.

క్రీస్తునాధుని యందు మిక్కిలి ప్రియ సహోదరీ సహోదరులారా! మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరియు మన పరలోకపు తల్లియైన కానుక మాత పేరిట శుభాకాంక్షలు.

మూడు సంవత్సరాల ప్రాయంలో, దేవాలయంలో కానుకగా సమర్పించబడిన మరియమ్మను “కానుక మాత”గా లేదా మరియమాత సమర్పణ పండుగగా కొనియాడుచున్నాము. పశ్చిమ దేశ క్రైస్తవులు 43వ సంవత్సరం నుండే ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. తూర్పు క్రైస్తవ దేశాలలో 6వ శతాబ్దములో ప్రారంభమైంది.

ఈ రోజు మనం కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ‘కానుక మాత’ పండుగను కొనియాడు తున్నాము. ‘కానుక’ అనే మాటకు ఎంతో లోతైన అర్థం ఉంది. కానుక అంటే ‘బహుమానం’ లేదా ‘సమర్పణ’ అని అర్ధం. ఈ పండుగ కేవలం చారిత్రక సంఘటనను గుర్తుచేసుకోవడమే కాక, దేవునికి మన జీవితాలను పూర్తిగా అర్పించుకోవాలని పిలుపునిస్తుంది. నేడు ప్రత్యేకంగా, మరియతల్లి సంపూర్ణ దైవాంకిత జీవితాన్ని, వారి పరిశుద్ధ జీవితం గూర్చి ధ్యానిస్తూ ఉంటాం. మరియమ్మ తన జీవితాన్ని దేవునికి అర్పించడం ద్వారా, ఆమె దేవుని అద్భుత ప్రణాళికలో కీలక పాత్ర పోషించింది. ఆమె సంపూర్ణ సమర్పణ మనందరికీ మొదటి ఆదర్శం.

ఈ పండుగ నాడు, మరియతల్లి జీవితం నుండి మనం మూడు ముఖ్యమైన పాఠాలను నేర్చుకుందాం.

1. మరియతల్లి - దేవుడు మనకిచ్చిన అమూల్యమైన కానుక

ప్రియ మిత్రులారా, దేవుడు మానవాళిని ఎంతగానో ప్రేమించాడు. ఆ అంతులేని అనంతమైన ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనమే మన మరియ తల్లి. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు. సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుని తన గర్భంలో మోసిన పవిత్ర దేవాలయం. జన్మపాపము సోకని నిష్కళంక మాత.

ఆమె నామములోనే గొప్పతనం ఉంది. ‘మరియ’ అనగా ‘ప్రియమైన, ఉన్నతమైన, ఘనతవహించిన, స్తుతీయమైన’ అని అర్ధం. ఆ పేరుకు తగ్గట్టుగానే, ఆమె దేవునికి అత్యంత ప్రియమైన వరపుత్రికగా, సకల జనులచేత స్తుతింపబడే తల్లిగా నిలిచింది. జన్మపాపము సోకని నిష్కళంక మాత.

మరియమ్మఆమె తల్లిదండ్రులు, జ్వాకీము అనగా ‘దేవుడు సిద్ధపరుస్తాడు’ అని అర్ధం మరియు అన్నమ్మ అనగా ‘దైవకృప’ అని అర్ధం. జ్వాకీము, అన్నమ్మ గార్లు, లేకలేక పుట్టిన తమ బిడ్డను చూసి మురిసిపోవడమే కాక, తమ దగ్గరే ఉంచుకోకుండా, వారు దేవునికి వాగ్దానం చేసిన విధంగానే, దేవాలయానికి ‘కానుకగా’సమర్పించారు. అదే సంప్రదాయాన్ని మనం ఈనాడు గుర్తుచేసుకుంటున్నాం.

ప్రవక్తయైన జెకర్యా చెప్పిన మాటలను మనం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే, “సీయోను కుమార్తె, సంతోషంతో కేకలు పెట్టు!” (జెకర్యా 2:10). మరియమ్మ దేవాలయంలోకి ప్రవేశించడం ఆ సీయోను కుమార్తె రాకడను ప్రతిధ్వనించింది. ఆమె రాకడ దేవుని మహిమను, ప్రణాళికను సూచించింది:

ఆమె రాకడతో, దేవుడు తన పరలోక నివాసము నుండి కదలివచ్చు సమయం ఆసన్నమైందని సంకేతం ఇచ్చాడు. దేవుడు ఒక నూతనమైన, ఊహించని రీతిలో మానవాళి మధ్య తనను తాను ప్రకటించుకోవడానికి సిద్ధమయ్యాడు.

దైవ కుమారుడు, మన మానవ స్వభావాన్ని మరియమ్మ గర్భంలో ధరించడానికి సిద్ధమయ్యాడు. వాక్యము శరీరధారియై, మన మధ్య నివసించుటకు ఆమె ఒక మార్గాన్ని సుగమం చేసింది.

దేవుని దయతో కూడిన ఈ ప్రణాళికలో, మరియమ్మ సాధారణ స్త్రీగా కాకుండా, ప్రత్యేకింపబడిన కుమార్తెగా దేవాలయంలో అడుగుపెట్టింది. ఆ పాపరహితమైన, పరిశుద్ధమైన మరియమ్మ, తనంతట తానే ఒక దేవాలయంగా మారింది. ఆమె పాపము లేని నివాస స్థలమైంది. సైన్యముల కర్తయైన ప్రభువు కొరకు సిద్ధం చేయబడిన ఒక జీవముగల గుడారం అయింది. ఆ పవిత్ర దేవాలయం నుండే క్రీస్తు ఈ లోకంలోకి అడుగుపెట్టారు.

మరియమ్మ తల్లిదండ్రుల విశ్వాసాన్ని, త్యాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారి ద్వారా లోక రక్షణ కొరకు ఒక కృపను సిద్ధపరిచాడు. ఆవిధంగానే వారు మరియమ్మను దేవునికి కానుకగా సమర్పించారు. వీరి విశ్వాసం గొప్పది. వారు దేవునికి చేసిన వాగ్దానం మేరకు, మూడు సంవత్సరాల ప్రాయంలోనే బాల మరియమ్మను దేవాలయానికి కానుకగా సమర్పించారు.

ప్రియ సహోదరులారా, ఆనాడు వారు చేసిన ఆ త్యాగం, వారు సమర్పించిన ఆ కానుకఈనాడు మనందరికీ తల్లిగా మారింది. దేవుడు ఆమెను మనకు తల్లిగా అనుగ్రహించారు. అది మనం పొందుకున్న గొప్ప వరప్రసాదం. కాబట్టి, ఆ తల్లిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుదాం.

2. సంపూర్ణ సమర్పణే నిజమైన కానుక

ప్రియ దేవుని బిడ్డలారా!, మన తల్లి మరియమ్మ జీవితాన్ని ఒక్కసారి తరచి చూస్తే, ఆమె జీవితమంతా ఒక నిరంతర ప్రార్థనలా, దేవునికి అర్పించిన ధూపంలా కనిపిస్తుంది. చిన్నవయసులోనే, యెరూషలేము దేవాలయములో ‘కానుక’గా సమర్పింప బడిన మరియమ్మ, దైవాంకితగా ఎదుగుతూ, జీవించింది. అక్కడ దేవుని సేవలో, పరిచర్యలో తరించింది. ఒకవైపు, లేఖనాలను చదువుతూ, విద్యను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకుంది. భక్తి, ప్రార్ధన, మర్యాద మూర్తీభవించిన దైవనివాసిగా జీవించింది. మరొకవైపు భక్తి, ప్రార్థన, వినయం అనే ఆభరణాలను ధరించి, సాక్షాత్తు దైవనివాసిగా జీవించింది. ఈవిధంగా, మరియతల్లి అన్ని విధాల పూర్ణ ఆశీర్వాదితులు. దైవ ప్రేమలోనూ, సాటివారికి సేవ చేయడంలోనూ ఆమె ఒక పరిపూర్ణమైన "కానుక"గా మారిపోయిన కారణజన్మురాలు.

అయితే, ఆమె సమర్పణ కేవలం బాల్యానికే పరిమితం కాలేదు. మరియమ్మ కేవలం దేవాలయంలో సమర్పించబడటమే కాదు, ఆతరువాత కూడా, తన జీవితాంతం దేవుని చిత్తానికి తలవంచింది. ముఖ్యంగా దైవదూత గాబ్రియేలు ఆమెకు దేవుని సందేశాన్ని వినిపించినప్పుడు, ఆమె పలికిన మాటలు చరిత్రనే మార్చివేశాయి: “ఇదిగో ప్రభువు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగును గాక” (లూకా 1:38) అని పలికినప్పుడు, ఆమె తన చిత్తాన్ని, తన జీవితాన్ని, తన భవిష్యత్తును దేవునికి ‘కానుకగా’ అర్పించింది. ఈ ఒక్క మాటతో ఆమె తన సొంత ఇష్టాన్ని, తన కలలను, తన భవిష్యత్తును, చివరకు తన ప్రాణాన్ని కూడా దేవుని పాదాల చెంత కానుకగాపెట్టింది. దేవుని ప్రణాళిక కోసం తనను తాను సంపూర్ణంగా అర్పించుకుంది.

ప్రియ స్నేహితులారా, మనం గుడిలో వేసే డబ్బులు లేదా వస్తువులు మాత్రమే కానుకలు కాదు. దేవుడు కోరుకునేది మన హృదయాన్ని. దేవుడు కోరుకునేది మన జేబులో ఉన్నది కాదు, మన గుండెలో ఉన్నది. ఆయన ఆశించేది మన హృదయాన్ని! మరియమ్మ వలె, ప్రభూ! నా జీవితం నీది, నీ ఇష్టప్రకారం నన్ను వినియోగించుకో” అని చెప్పగలగడమే నిజమైన భక్తి. దేవుని చిత్తానికి "సరే" అని చెప్పడమే మనం ఆయనకు ఇవ్వగలిగిన అత్యుత్తమమైన కానుక. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, "పరిశుద్ధమును, దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగాముగా మీ శరీరములను దేవునకు సమర్పింపు కొనుడు." (రోమా 12:1). ఇదే మన జీవితంలో మరియమ్మ వలె చూపవలసిన సమర్పణ. “దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” (లూకా 11:28). ఇదే మన జీవితంలో మరియమ్మ వలె చూపవలసిన సమర్పణ.

3. మనమే ఒక సజీవ కానుక కావాలి

ఈ రోజు మనం ఎంతో ఆనందంగా, కానుక మాత ఉత్సవాన్ని కొనియాడుచున్నాం. మనం ఆమెకు ఏమి ఇవ్వగలము? పూలు వాడిపోతాయి, కొవ్వొత్తులు కరిగిపోతాయి, డబ్బు ఖర్చయిపోతుంది. కానీ, దేవునికి ఇష్టమైన కానుక ఒకటి ఉంది. అదే ‘పవిత్రమైన జీవితం’. ఈ రోజు కానుక మాత మనల్ని కోరుతున్నది ఒక్కటే, ‘నా బిడ్డలారా, మీ కుటుంబాల్లోని పగలు, ప్రతీకారాలు, ద్వేషాలను విడిచిపెట్టి, క్షమాగుణాన్ని, ప్రేమను కానుకగా ఇవ్వండి. మీలోని గర్వాన్ని, అహంకారాన్ని విడిచి, సాత్ మనిషిలో దేవున్ని చూస్తూ తగ్గింపు స్వభావాన్ని కానుకగా ఇవ్వండి. పాపాన్ని విడిచి, కన్నీటితో కూడిన పశ్చాత్తాపాన్ని కానుకగా ఇవ్వండి’. ప్రియ మిత్రులారా, వాడిపోయే పూలను కాదు, వాడిపోని మన మంచి మనసును తల్లికి కానుకగా ఇద్దాం. కరిగిపోయే కొవ్వొత్తిని కాదు, ఇతరుల కోసం కరిగే సేవా గుణాన్ని కానుకగా ఇద్దాం. అప్పుడే మనం జరుపుకునే ఈ పండుగకు నిజమైన అర్థం, పరమార్థం చేకూరుతుంది. మనమే దేవునికి నచ్చే ఒక సజీవ కానుకగా మారుదాం.

ప్రియ సహోదరీ సహోదరులారా, కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, ఆ కొరతను గమనించిన తల్లి మరియమ్మే. ఆ కొరతను, ఆ అవమానాన్ని ఎవరూ అడగకముందే గమనించిన తల్లి మరియమ్మే. తన కుమారుడైన యేసు దగ్గరకు వెళ్లి, ఆ కొరతను వివరించింది. అప్పుడు యేసు ప్రభువు మొదటి అద్భుతాన్ని చేశారు. నేడు మన జీవితంలో ఎన్నో కొరతలు, కష్టాలు ఉన్నాయి. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏ కొరత ఉందో మరియ తల్లికి తెలుసు. సంతోషం అనే ద్రాక్షారసం అయిపోయిందా? ఆరోగ్యం క్షీణించిందా? ఆర్థిక ఇబ్బందులా?

భయపడకండి. మన సమస్య ఎంత పెద్దదైనా, మన కష్టం ఎంత లోతైనదైనా భయపడవద్దు! కానుక మాత పాదాల చెంత మన కష్టాలను పెడదాం! మరియమ్మ మన ప్రార్థనలను స్వీకరించి, తన కుమారుడైన యేసుక్రీస్తుకు వాటిని ‘కానుకగా’ సమర్పించి, మనకు అద్భుతాలను దయచేస్తుంది. మరియమ్మ ఒక అద్భుతమైన మధ్యవర్తి. ఆమె మన ప్రార్థనలను, కన్నీటిని ప్రేమతో స్వీకరించి, తన కుమారుడైన యేసుక్రీస్తుకు వాటిని కానుకగా సమర్పిస్తుంది. అప్పుడు యేసు ప్రభువు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలను దయచేస్తారు.

మరియతల్లి తన జీవితాన్ని దేవునికి సంపూర్ణ కానుకగా ఎలా అర్పించిందో, ఆ ఆదర్శాన్ని మనం కూడా అనుసరిద్దాం. ఈ పండుగ రోజు నుండి మన జీవితాలను దేవునికి ప్రీతికరమైన, పవిత్రమైన కానుకలుగా మార్చుకుందాం. ఈరోజు, మరియ మాత సమర్పణ పండుగ సందర్భంగా, మన జీవితాల్లోని ప్రతి భాగాన్నిమన మనసును, మన సమయాన్ని, మన తలంపులను, మన కష్టాలనుదేవునికి సంపూర్ణ కానుకగా అర్పించుకుందాం. మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా, మన సమర్పణ దేవునికి ప్రీతికరంగా మారి, మనమందరం దైవకృపతో నిండిపోవుదుము గాక!

ప్రార్థన చేసుకుందాం:

ఓ కానుక మాతా! వరప్రసాద నిలయమా! నీవు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న విధముగా, మేము కూడా మా జీవితాలను దేవునికి అర్పించుకునేలా మాకు సహాయం చేయండి. మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కష్టసుఖాలను, మా ఆశలను, భయాలను అన్నింటినీ, నీ పాదాల చెంత కానుకగా పెడుతున్నాము. మాకు ధైర్యాన్ని, దీవెనను దయచేయండి. యేసు ప్రభువు బాటలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తల్లీ. ఆమేన్.

No comments:

Post a Comment